ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో జరిగిన విషాద ఘటన ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తాజ్ మహల్ సందర్శన ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో ‘ఆగ్రా చౌపటి’ వద్ద సరదాగా జిప్‌లైన్ రైడ్ ఎక్కిన 16 ఏళ్ల కునాల్ అగర్వాల్, కళ్లెదుటే మృత్యుఒడిలోకి చేరాడు. రైడ్ ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే పుల్లీ లాక్ తెగిపోవడంతో, కునాల్ 45 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అది చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
సరదాగా మొదలై విషాదంలో..
ఫిరోజాబాద్‌కు చెందిన అగర్వాల్ కుటుంబం ఆదివారం విహారయాత్ర కోసం ఆగ్రా వచ్చారు. తాజ్ మహల్ సందర్శన అనంతరం, సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ‘ఆగ్రా చౌపటి’కి చేరుకున్నారు. కునాల్ అగర్వాల్ (16) పట్టుబట్టడంతో, రూ. 400 పెట్టి అతనికి జిప్‌లైన్ టికెట్ కొనిచ్చారు. తల్లిదండ్రులు, తమ్ముడు కింద ఉండి చూస్తుండగానే, కునాల్ రైడ్ ప్రారంభించాడు. అయితే, రైడ్ మొదలైన కొన్ని అడుగుల దూరంలోనే పుల్లీ లాక్ విఫలం కావడంతో, అతను కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
నిర్లక్ష్యానికి బలి
ఈ ఘటనపై కునాల్ తండ్రి పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం వల్లే తాను కొడుకును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. రైడ్ చేస్తున్న సమయంలో కునాల్‌కి హెల్మెట్ లేకపోవడం, కింద ఎలాంటి రక్షణ వలలు లేదా కుషనింగ్ ఏర్పాటు చేయకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కేవలం లాభాపేక్షతో భద్రతను గాలికి వదిలేయడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చట్టపరమైన చర్యలు
ఘటనపై సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు, బిఎన్‌ఎస్ సెక్షన్ 105 కింద యజమాని, మేనేజర్‌పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సంతోష్ కుమార్ దుబే (58), అభిషేక్ (27) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరికరాల లోపాలపై సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆగ్రా డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు.
ఇది కూడా చదవండి: రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం!


