యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం.. వేసవి సెలవులు కలిసి రావడంతో శ్రీనృసింహుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు.
దీంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.
భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది.
శ్రీస్వామి వారిని 50 వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.


