బంగ్లాదేశ్ షేక్ హసీనా బిగ్‌ షాక్‌ | No More Hasina Coverage Bangladesh Issues Strict Media Directive | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ షేక్ హసీనా బిగ్‌ షాక్‌

Jul 12 2026 1:43 PM | Updated on Jul 12 2026 1:49 PM

No More Hasina Coverage Bangladesh Issues Strict Media Directive

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్‌ తగిలింది. హాసీనాకు సంబంధించిన వార్తల ప్రసారంపై బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హసీనా చేసిన ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు లేదా ఆమెకు సంబంధించిన ఇతర వ్యాఖ్యలను ప్రచురించవద్దని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నదని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ సమాచార, ప్రసార శాఖ సలహాదారు డాక్టర్ జాహెద్ ఉర్ రహ్మాన్ మాట్లాడుతూ.. కొందరు మీడియా సంస్థలు కోర్టు నిషేధాన్ని పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు. అందువల్ల అన్ని మీడియా సంస్థలు న్యాయస్థానం ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కాగా, ఇటీవల షేక్ హసీనా వార్తా సంస్థ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కొన్ని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ప్రభుత్వం మీడియాకు తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. 2024లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి దేశం విడిచిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆమె భారత్‌లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్‌లో పలు కేసులు నమోదై ఉండగా, ఆమెను "పరారీలో ఉన్న మాజీ ప్రధాని"గా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇటీవల హసీనా ఈ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం మాత్రం ఇది కోర్టు ఆదేశాల అమలులో భాగమేనని చెబుతుండగా, విమర్శకులు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement