జింబాబ్వేదే వన్డే సిరీస్‌ | Zimbabwe beat Bangladesh by 13 runs in second ODI | Sakshi
Sakshi News home page

జింబాబ్వేదే వన్డే సిరీస్‌

Jul 10 2026 2:00 AM | Updated on Jul 10 2026 2:00 AM

Zimbabwe beat Bangladesh by 13 runs in second ODI

బెన్‌ కరన్‌ అజేయ సెంచరీ

13 పరుగులతో బంగ్లాదేశ్‌ ఓటమి

హరారే: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించిన జింబాబ్వే జట్టు... వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ కరన్‌ (135 బంతుల్లో 111 నాటౌట్‌; 9 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

బ్రాడ్‌ ఇవాన్స్‌ (38 బంతుల్లో 58 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... సికందర్‌ రజా (33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తస్కీన్‌ అహ్మద్, మెహదీ హసన్‌ మిరాజ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 48.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్‌ హృదయ్‌ (90 బంతుల్లో 60; 5 ఫోర్లు), తన్జీద్‌ హసన్‌ (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో పోరాడారు. 

గత మ్యాచ్‌లో 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిన బంగ్లాదేశ్‌... ఈ సారి 235 పరుగుల ఛేదనలో 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్‌ 3 వికెట్లు పడగొట్టగా... ముజరబాని, బ్రాడ్‌ ఇవాన్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శనివారం ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే జరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement