లార్డ్స్‌లో లేడీస్‌ టెస్టు | Team India will face England at Lords | Sakshi
Sakshi News home page

లార్డ్స్‌లో లేడీస్‌ టెస్టు

Jul 10 2026 1:48 AM | Updated on Jul 10 2026 1:51 AM

Team India will face England at Lords

చారిత్రక మైదానంలో కొత్త చరిత్ర

మహిళల క్రికెట్‌ జట్ల మధ్య తొలి టెస్టుకు రంగం సిద్ధం

నేటి నుంచి ఇంగ్లండ్‌తో భారత్‌ పోరు

లండన్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే వైదొలిగిన భారత క్రికెట్‌ జట్టు... ఇప్పుడు చారిత్రక టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. ‘క్రికెట్‌ మక్కా’గా పిలిచే లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది. 142 ఏళ్ల చరిత్రగల ఈ మైదానంలో జరగనున్న మహిళల తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. 1787లో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) స్థాపించగా... అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అది పురుషులకే పరిమితమైంది. 

1986లో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీని లార్డ్స్‌ పెవిలియన్‌లోకి అనుమతించకపోవడం అప్పట్లో పెద్ద వివాదాన్ని రేపింది. అలాంటి చోట ఇప్పుడు మహిళల టెస్టు మ్యాచ్‌ జరగనుండటం విశేషం. టి20 వరల్డ్‌కప్‌లో ఆకట్టుకోలేక పోయినప్పటికీ... సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి. 1995 తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన ఏ టెస్టులోనూ భారత్‌ ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల్లో మూడింట టీమిండియా గెలుపొందింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మతో భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. వీరంతా సమష్టిగా సత్తాచాటితో భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై పేసర్ల ప్రభావం ఎక్కువ కాగా... రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, నందని శర్మ ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తికరం. ప్రతీక రావత్‌ గాయపడటంతో ఆమె స్థానంలో... ప్రియా పూనియాను ఎంపిక చేశారు. మరి యస్తిక భాటియా, ప్రియా పునియా, రిచా ఘోష్‌లలో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. 

ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి టెస్టు అరంగేట్రం చేయనుంది. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ క్రికెటర్‌ అయినా లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌ ఆడాలని కలలు కంటారు. ఇప్పుడు మన మహిళల జట్టుకు అలాంటి అవకాశం దక్కింది. ఈ క్షణాలను ఆస్వాదించాలి’ అని భారత మహిళల జట్టు కోచ్‌ అమోల్‌ మజుందార్‌ అన్నాడు. 

» ఇంగ్లండ్‌ జట్టు కొత్త కెప్టెన్ నాట్‌ సివర్‌ బ్రంట్‌ సారథ్యంలో బరిలోకి దిగనుండగా.. ఐదుగురు ఇంగ్లండ్‌ ప్లేయర్లు ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనున్నారు.  

» మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన ఇంగ్లండ్‌ సీనియర్‌ ప్లేయర్‌ టామీ బ్యూమాంట్‌ ఈ మ్యాచ్‌ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనుంది.  

» పురుషుల విభాగంలో టెస్టు మ్యాచ్‌ ఐదు రోజులపాటు జరుగుతుంది. అదే మహిళల విభాగంలో టెస్టు మ్యాచ్‌ నాలుగు రోజులే నిర్వహిస్తున్నారు. అయితే ఐదు రోజులవి రెండు టెస్టులు జరిగాయి. ఒక రోజు కనీసం 100 ఓవర్లు వేయాలి. ఫాలోఆన్‌ ఇన్నింగ్స్‌ ఆడించేందుకు ఆధిక్యం 150 పరుగులకు పైగా ఉండాలి.  

» మెల్‌బోర్న్‌లో జరిగిన మహిళల యాషెస్‌ సిరీస్‌ టెస్టుకు 35 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఇప్పుడు ఆ సంఖ్యను మించి అభిమానులు మైదానానికి పోటెత్తనున్నారు.  

టి20 ప్రపంచకప్‌ బాధను మర్చిపోవడానికి ఇదో చక్కటి అవకాశం. వరల్డ్‌కప్‌లో మేము ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం చాలా బాధించింది. కానీ లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలబడతామనే నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌ ఆడాలనేది కల అయితే అందులో లార్డ్స్‌లో ఆడాలనేది అత్యున్నతమైంది. 

ఇప్పటి వరకు ఇక్కడ మహిళల టెస్టు మ్యాచ్‌ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయా. అలాంటి చారిత్రక సందర్భంలో భాగస్వామి కానుండటం గర్వంగా ఉంది. టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణి ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయబోతోంది. తను కీలకమైన బౌలర్‌. జట్టుకు అవసరమైన ప్రతిసారీ శ్రీచరణి వికెట్లు తీస్తోంది.   –హర్మన్‌ప్రీత్‌ కౌర్, భారత కెప్టెన్ 

15 ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన మొత్తం టెస్టులు. భారత జట్టు 3 టెస్టుల్లో గెలుపొందగా... ఒక టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. మిగతా 11 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఇంగ్లండ్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. రెండింటిలో భారత్‌ నెగ్గగా... మిగతా ఏడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement