నేడు బెల్జియంతో క్వార్టర్ ఫైనల్
లాస్ ఏంజెలిస్: గత మూడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన 2010 విశ్వవిజేత స్పెయిన్ తాజా ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా కొనసాగుతోంది. అంతేకాకుండా క్వార్టర్ ఫైనల్ చేరుకున్న క్రమంలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఒకే ఒక జట్టు స్పెయిన్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు మరో కీలకపోరుకు స్పెయిన్ సిద్ధమైంది. బెల్జియం జట్టుతో క్వార్టర్ ఫైనల్ పోరులో స్పెయిన్ తలపడనుంది. 2010లో ఏకైకసారి ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్... ఆ తర్వాత నిరాశపరిచింది.
2014లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. 2018లో, 2022లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఈసారి మాత్రం నిలకడగా రాణిస్తూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. మికెల్ ఒయర్‌జబాల్ నాలుగు గోల్స్‌తో స్పెయిన్ తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా... అలెక్స్ బేనా, మికెల్ మెరీనో, పెడ్రో పోరో, లామినె యామల్ ఒక్కో గోల్ చేశారు. వీరందరూ సమష్టిగా రాణించడంపై స్పెయిన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరోవైపు నాలుగోసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బెల్జియం జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. గ్రూప్ దశలో ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న బెల్జియం... నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 3–2తో సెనెగల్ జట్టుపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో అమెరికా జట్టుపై గెలిచింది. లుకాకు, చార్లెస్ కెటెలెర్, యురీ టిలెమాన్స్, ట్రొసార్డ్, కెవిన్ డిబ్రున్, సేల్‌మికర్స్, హాన్స్ వానాకెన్ బెల్జియం విజయాల్లో కీలకపాత్ర పోషించారు.


