ఉద్యోగం పోతే జీవితం ఎలా మారుతుందో ఇదే నిదర్శనం | Laid Off At 56, Former Insurance Employee Turns Porter Delivery Partner, Viral LinkedIn Post Sparks Debate | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోతే జీవితం ఎలా మారుతుందో ఇదే నిదర్శనం

Jul 8 2026 9:43 PM | Updated on Jul 9 2026 10:28 AM

 Laid off after 14 years 56 year old Noida man story

ఉద్యోగాల కోతల ప్రభావం అన్ని రంగాల ఉద్యోగులపైనా పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసిన ఉద్యోగి కూడా ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. వయసు పెరిగితే ఉద్యోగం దొరకడం కష్టమే. ఎంతో అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగాలు రావడం లేదు. చాలా మంది కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత పోర్టర్, స్విగ్గీ, జొమాటో, ఉబెర్ లాంటి గిగ్ పనులపై ఆధారపడుతున్నారు.

ఇటువంటి విషయాన్నే సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ కిరణ్ వర్మ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ భావోద్వేగ చర్చకు దారితీసింది. ఉద్యోగాల కోతలు, వయసు పైబడిన ఉద్యోగులు, భారతదేశ గిగ్ ఎకానమీ వాస్తవాలపై చర్చ మొదలైంది. 56 ఏళ్ల పోర్టర్ డెలివరీ భాగస్వామిని కలిసిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత గిగ్ పని చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

లాభాపేక్ష లేని కార్యక్రమం చేంజ్ విత్ వన్ మీల్‌లో చీఫ్ సర్వింగ్ ఆఫీసర్‌గా ఉన్న వర్మ.. నోయిడాలో నగరంలోనే అత్యవసర లేఖ పంపేందుకు పోర్టర్ డెలివరీ బుక్ చేసినట్టు చెప్పారు. ఇందుకు కేవలం రూ.40 ఖర్చయిందని వెల్లడించారు.  

వర్మ లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రకారం.. వయసు పైబడిన డెలివరీ రైడర్ కవర్ తీసుకునేందుకు వచ్చారు. వర్మ మొదటి అంతస్తులో ఉండటం, పూర్తిగా సిద్ధంగా లేకపోవడం వల్ల పైకి రావాలని కోరారు. రైడర్ కొంత ఇబ్బందిగా మెట్లు ఎక్కారు. చిరునవ్వుతో ప్యాకెట్ తీసుకున్నారు.

"ఆజ్ కామ్ హీ నహీ థా, వెయిట్ కర్ రహా థా కామ్ కే లియే" (ఈ రోజు పని లేదు. పని కోసం ఎదురు చూస్తున్నాను) అని రైడర్ చెప్పినట్టు వర్మ వెల్లడించారు. ఆయన మాట్లాడే తీరు, దుస్తులు చూసి తిరిగి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినట్టు తెలిపారు.

ఇన్సూరెన్స్ ఉద్యోగి నుంచి గిగ్ వర్కర్‌గా
మాట్లాడిన సమయంలో తన పేరు 56 ఏళ్ల మనోజ్ అని రైడర్ పరిచయం చేసుకున్నట్టు వర్మ తెలిపారు. నోయిడాకు చెందిన మనోజ్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 14 ఏళ్లు పని చేసి 2023లో ఉద్యోగాల కోతల సమయంలో ఉద్యోగం కోల్పోయినట్టు చెప్పారు. వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా మరో ఉద్యోగం దొరకలేదని మనోజ్ చెప్పినట్టు వర్మ వెల్లడించారు. ఉద్యోగం పోయిన విషయం గురించి అడగగా మనోజ్ చెప్పిన పోలిక చాలామందిని ఆలోచింపజేసిందని పోస్ట్ తెలిపింది.

ఈ మాటల్లో అనుభవం ఉన్న ఉద్యోగులను కరివేపాకుతో పోల్చారు. ‘‘వంట చేసేటప్పుడు అవసరం అవుతారు. తినే సమయంలో ముందుగా పక్కన పెట్టేస్తారు’’ అన్న భావన వ్యక్తమైంది.

కృతజ్ఞతగా పారితోషికం
మనోజ్‌తో కొన్ని నిమిషాలు మాట్లాడానని, తన జీవిత అనుభవాలు, సూచనలు తనపై గాఢమైన ముద్ర వేసాయని వర్మ చెప్పారు. వెళ్లే ముందు డెలివరీ ఛార్జీ కంటే ఎక్కువ డబ్బు కృతజ్ఞతగా ఇచ్చినట్టు తెలిపారు.

"జీవితం కఠినంగా ఉంటుంది. నిజ జీవిత పరిస్థితులు ఇంకా కఠినంగా ఉంటాయి. మనలో పని చేయాలనే ఆసక్తి, సామర్థ్యం ఉన్నా... సమాజం లేదా ఉద్యోగ మార్కెట్ మనకు అవకాశం ఇవ్వకపోవడం, మన విలువను గుర్తించకపోవడం అత్యంత బాధాకరం" అని ఆయన రాశారు. తన బాల్కనీ నుంచి రైడర్ వెళ్లడాన్ని, తెలిసిన వ్యక్తికి వీడ్కోలు చెబుతున్నట్టుగా చూస్తూ నిలిచిపోయానని పేర్కొన్నారు.

స్పందించిన పోర్టర్
ఈ పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వైరల్ అయింది. ఉద్యోగులు, నియామక నిపుణులు, స్టార్టప్ వర్గాల సభ్యులు స్పందించారు. లాజిస్టిక్స్, నగర పరిధిలో డెలివరీ సేవలు అందించే పోర్టర్ కూడా స్పందించింది. "హృదయాన్ని తాకిన ఈ పోస్ట్ పంచుకున్నందుకు, మా బృందం చూపించిన కృషిని అభినందించినందుకు ధన్యవాదాలు" అని తెలిపింది. అయితే రైడర్ వ్యక్తిగత పరిస్థితులపై స్పందించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement