గంభీర్ (PC: BCCI)
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంజూ గురించి నాకు క్లారిటీ ఉంది
ముఖ్యంగా సంజూ శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్‌కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్‌కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.
సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
కుండబద్దలు కొట్టిన గంభీర్
ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.
అందుకే ఓడిపోతున్నాం
ఇక విదేశీ గడ్డ మీద పిచ్‌లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు.
కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక.


