ఇంగ్లండ్ చేతిలో మూడో టీ20లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ వ్యాఖ్యలు
125 పరుగుల భారీ ఓటమి అంగీకారయోగ్యం కాదు
పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోవడమే మ్యాచ్‌ను దెబ్బతీసింది
బౌలర్ల అమలు, బ్యాటర్ల ప్రణాళిక రెండూ విఫలమయ్యాయి
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్
టీ20 చరిత్రలో భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు.. అత్యంత భారీ ఓటమి
నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. ఇలాంటి ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశాడు.
అతడి మాటల్లో.. "ఈ ప్రదర్శనను వర్ణించడానికి 'అత్యంత దారుణం' అనే పదం తప్ప మరోటి కనిపించడం లేదు. ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం అసలు అంగీకారయోగ్యం కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇది 200 పరుగులు చేసే పిచ్ కాదని నా అభిప్రాయం. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.
బౌలింగ్‌లో కూడా జట్టు ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయింంది. జట్టు సమావేశాల్లో ఎంత ప్రణాళిక రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఈ వికెట్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ మేము వాటిని తగినంతగా వేయలేదు.
అలాగే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. మొత్తంగా మా అమలు చాలా పేలవంగా సాగింది" అని అన్నాడు.
అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. "గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. మేం చాలా పేలవమైన క్రికెట్ ఆడాం. అయినా ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ జట్టుకు ఊపు తీసుకొచ్చేందుకు ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలనే దానిపై ఆలోచించాలి" అని తెలిపాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జోస్ బట్లర్ 36, సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే జూలై 9న బ్రిస్టల్‌లో జరిగే నాలుగో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అయ్యర్ నాయకత్వంలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ పరాజయం పాలైంది.


