కన్నతల్లినే బలి చేసిన కూతురు.. అమ్మ ప్రాణం తీసిన అత్యాశ! | Daughter Allegedly Hires Contract Killers To Murder Mother For Govt Job And Property In Rajasthan, More Details Inside | Sakshi
Sakshi News home page

కన్నతల్లినే బలి చేసిన కూతురు.. అమ్మ ప్రాణం తీసిన అత్యాశ!

Jul 9 2026 12:08 PM | Updated on Jul 9 2026 12:58 PM

Jaipur woman contract killers to murder mother for government job

జైపూర్‌: కన్నతల్లి ప్రేమ, అనుబంధాలను పక్కన పెట్టి ఆస్తి, ఉద్యోగం కోసం ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. తన తల్లి మరణిస్తే వచ్చే ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి ప్రయోజనాలను పొందాలనే ఆశతో కూతురు ఏకంగా తల్లి హత్యకు కుట్ర చేసింది. 23 ఏళ్ల కూతురే కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించింది. రోడ్డు ప్రమాదంలా కనిపించిన మహిళ మృతి కేసు వెనుక ఊహించని కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు నీరజ్ శర్మ (45) గత ఏడాది తన భర్త మరణించిన తర్వాత కారుణ్య నియామకం కింద కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా ఉద్యోగంలో చేరారు. అయితే ఆ ఉద్యోగం తనకే రావాలని ఆమె కుమార్తె ఆయుషి శర్మ (23) ఆశించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కుటుంబ ఆస్తి విషయంలో కూడా తల్లి, కూతురు మధ్య గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలో ఆయుషి తన మామ, బంధువులతో కలిసి తల్లిని హత్య చేయాలని పథకం వేసిందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం రూ.7 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించినట్లు విచారణలో బయటపడింది. మొదట తల్లి కదలికలను ఒక నెలకు పైగా గమనించిన నిందితులు, సరైన అవకాశం కోసం వేచి చూశారని పోలీసులు తెలిపారు. జూలై 3న నీరజ్ శర్మ తన కుమారుడిని కోచింగ్ సెంటర్‌లో దింపి ఇంటికి తిరిగి వస్తుండగా, గంటకు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన స్కార్పియో ఎస్‌యూవీ ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాల్లోకి ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తొలుత ఇది హిట్ అండ్ రన్ ప్రమాదంగా కనిపించినా, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.

దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ముందుగా థార్ వాహనంతో బాధితురాలి కదలికలను గమనించారని, చివరకు స్కార్పియోతో ఢీకొట్టి ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం స్కార్పియోను వదిలేసి, మోటార్‌ సైకిల్‌పై పరారైనట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆయుషి శర్మతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కుట్రలో కీలక పాత్ర పోషించిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హత్య వెనుక పూర్తి కుట్ర, ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది, ఇందులో ఎంతమంది పాల్గొన్నారు, కాంట్రాక్ట్ కిల్లర్లతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement