ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే.. బీజేపీ బ్యాన్‌ ? | If Indira Gandhi were alive she would have banned the BJP Ashok Gehlot | Sakshi
Sakshi News home page

ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే.. బీజేపీ పరిస్థితి ?

Jun 15 2026 12:50 PM | Updated on Jun 15 2026 3:09 PM

If Indira Gandhi were alive she would have banned the BJP Ashok Gehlot

జైపూర్‌: రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గనుక ప్రస్తుతం బ్రతికి ఉంటే బీజేపీని దేశంలో బ్యాన్‌ చేసేదన్నారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది.

జైపూర్‌లో ఓ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన అశోక్‌ గెహ్లాత్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ "ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు గత 50 ఏళ్లుగా నేను చూడలేదు. ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు ఈ రోజు జీవించి ఉంటే, ఆమె బీజేపీ లాంటి పార్టీని నిషేధించి ఉండేవారు. నేటి వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉందని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. దేశం ఇప్పటికీ మేల్కొనకపోతే, భవిష్యత్తులో ఈ దేశ ప్రజలే  ఈ మతవివక్ష మూలంగా ఏర్పడే పర్యవసానాలను అనుభవిస్తారు." అని ఆయన అన్నారు.

దేశంలోనే అత్యధిక చట్టసభల స్థానాలు కలిగిఉన్న ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు కనీసం సీట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీరు సెక్యులర్ పార్టీ అని దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఐదు సీట్లు ఇచ్చి ఉండవచ్చు. కానీ మీది మతతత్వ పార్టీ అని 'మేము పూర్తిగా హిందుత్వ పార్టీ' అని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే  కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించడమే ఆలోచనగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చారన్నారు. మీరు కేవలం హిందుత్వ ఎజెండాతోనే పార్టీని నడుపుతారా? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? అని ఆయన బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.

కాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇది హిందువుల పట్ల, హిందుత్వ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషాన్ని మాత్రమే చూపిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు."కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందుత్వను ద్వేషిస్తుంది. దీనికి నిదర్శనం  అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలేనని తెలిపింది. హిందుత్వం అంటే మతం కాదు అది  ఒక జీవన విధానమని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం చెప్పింది. మరి ఇందిరా గాంధీ దానిని ఎందుకు నిషేధిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement