పాకిస్తాన్‌లో పెరుగుతున్న అసంతృప్తి, యువతలో ఆగ్రహం, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా అంతర్గత వ్యవహారాల మంత్రే.. నిరాశకు గురైన యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారికి ఉందని హెచ్చరించడం ఆసక్తికర పరిణామంగా మారింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని పాలనా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి మార్పులు అవసరమని అన్నారు. ‘ఇప్పుడు మనం జీవిస్తున్న వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విధానంతో సమస్యలను పరిష్కరించలేం. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
బొద్దింకలైనా సరే.. ఏకమైతే శక్తే!
దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన నక్వీ.. వారికి ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం ముఖ్యమని అన్నారు. ‘ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఓ వ్యాఖ్య మాత్రం సంచలనంగా మారింది. ‘ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు’ అని అన్నారు. నక్వీ నేరుగా ఏ నిరసనను ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్‌లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్‌లోనూ యువతలో పెరుగుతున్న నిరాశ, నిరుద్యోగం, అవకాశాల కొరత ఒక పెద్ద ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను మార్చకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు. ‘రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయనని పలుమార్లు చెప్పారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో మార్పులు లేకపోతే అది కేవలం సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు.
భారీ అప్పులు, బలహీన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం, నిరుద్యోగం, ప్రతిభ ఆధారిత అవకాశాల కొరత వంటి సమస్యలు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయని నక్వీ పేర్కొన్నారు. వీటికి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత సంస్కరణలే అవసరమని అన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో పాలక వర్గాల్లోనే చర్చకు వస్తుండటం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతోంది.


