న్యూఢిల్లీ: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గాయపడిన పోలీసుల కుటుంబాలు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధిత సిబ్బంది కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమవాళ్లపై జరిగిన దాడులకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. జంతర్ మంతర్ ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబ సభ్యులు.. అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు విద్యార్థులపై పోలీసుల చర్యల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.
నా తండ్రిని ఈడ్చుకెళ్లి కొట్టారు..
ఢిల్లీ పోలీస్ ఏఎస్‌ఐ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా పనిచేశారని, అనంతరం ఢిల్లీ పోలీస్‌లో చేరారని తెలిపారు.
#WATCH | Delhi | Daughter of a Delhi Police SI (Sub-Inspector) who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "...Before joining the police, my father served as a Marine Commando in the Indian Navy. He dedicated 15 years of his life to the… pic.twitter.com/aevnbcdNyQ
— ANI (@ANI) July 31, 2026
“జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్ల దగ్గర విధుల్లో ఉన్న సమయంలో ఓ గుంపు ఆయనను ఈడ్చుకెళ్లింది. దాదాపు మూక దాడికి గురయ్యారు. స్పృహ కోల్పోయి ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో నాలుగు గంటలు ఉన్నారు” అని ఆమె తెలిపారు. “రాత్రి 10 గంటలకు సహచర పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం మా కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని బాధ” అని చెప్పారు. తన తండ్రి తలకు నాలుగు కుట్లు పడ్డాయని, అయినప్పటికీ “ఇవి విధిలో భాగమే” అంటూ కుటుంబాన్ని ధైర్యం చెప్పారని ఆమె పేర్కొన్నారు.
‘సోషల్ మీడియాలో మమ్మల్ని నేరస్థులుగా చూపిస్తున్నారు’
పోలీసులపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో నా తండ్రినే నేరస్థుడిగా చూపిస్తున్నారు. కానీ దాడికి గురైన మా కుటుంబానికి కూడా న్యాయం కావాలి. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి” అని ఏఎస్‌ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీసుల కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.
‘రాళ్ల దాడిలో నా భర్త హెల్మెట్ పగిలిపోయింది’
మరో ఏఎస్‌ఐ భార్య సీమ మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త జులై 20న జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నారని చెప్పారు. ఆందోళనకారుల సంఖ్య పెరిగిందని, కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని భర్త తనకు చెప్పారని తెలిపారు.
VIDEO | Wife of a Delhi Police ACP who sustained injuries during the clash between police and CJP protesters in Delhi on July 20, says, "When he returned home late on the night of July 20 with injuries, it was an extremely painful and traumatic moment for me and my two-year-old… pic.twitter.com/l6YllUXHS3
— Press Trust of India (@PTI_News) July 31, 2026
“ఆందోళనకారులు పూల కుండీలు, చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. నా భర్త ధరించిన హెల్మెట్ రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదేమో” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు’
మరో ఏఎస్‌ఐ కుమారుడు లక్ష్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో రాళ్ల దాడికి గురయ్యారని ఆరోపించారు. “తలపై రాయి తగలడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఆన్‌లైన్‌లో చూస్తే పోలీసులపై మాత్రమే విమర్శలు కనిపిస్తున్నాయి. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.
#WATCH | Delhi | A family member of a Delhi Police official who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "This was not a student protest; rather, there were mischievous elements who tried to sabotage and discredit the students' protest and… pic.twitter.com/qfyP8CawD4
— ANI (@ANI) July 31, 2026
రెండు వాదనలు.. వీడియోలు వైరల్
జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసుల కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఆందోళన సమయంలో పోలీసులు కూడా దాడులకు గురయ్యారా? లేక బలప్రయోగం అంశం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విద్యార్థులు, పోలీసులు ఇద్దరి వాదనలు పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


