కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు, బంగారం బయటపడటం రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేపింది. బీర్భూమ్ జిల్లాలోని దేవ్‌చా గ్రామానికి చెందిన మినార్ మొండల్ ఇంటిపై రాష్ట్ర పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా, 35 సంచుల్లో దాచిపెట్టిన రూ.28 కోట్లకు పైగా నగదు, సుమారు రూ.21.5 కోట్ల విలువైన 15 కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. నగదును లెక్కించేందుకు ఐదు కౌంటింగ్ మెషీన్లను వినియోగించినప్పటికీ అవి వరుసగా పనిచేయకపోవడంతో అధికారులు మరోసారి యంత్రాలను మార్చాల్సి వచ్చింది.
మినార్ మొండల్ గతంలో నార్త్ బెంగాల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. ఉద్యోగం మానేసిన తర్వాత తన బామ్మర్ది, స్టోన్ వ్యాపారి తులు మొండల్ అలియాస్ మొహమ్మద్ నజీబుద్దీన్‌తో కలిసి రాతి వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. తులు మొండల్‌కు స్టోన్ ట్రేడింగ్‌తో పాటు ఇసుక మాఫియాతోనూ సంబంధాలు ఉన్నాయని గతంలోనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల ప్రాథమిక విచారణలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం.. తులు మొండల్‌కు చెందినవేనని, అతని అక్రమ వ్యాపారాల ద్వారా సమకూరినవేనని మినార్ మొండల్ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వాంగ్మూలాన్ని పోలీసులు స్వతంత్రంగా ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం మినార్ మొండల్, అతని కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, తులు మొండల్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
TMC backed stone smuggler Tulu Mondal (Md Nizabuddin) is found storing 15 kgs of Gold and 5.5 crs cash. pic.twitter.com/uarKbhmWgH
— Avinash K S🇮🇳 (@AvinashKS14) July 29, 2026
ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మూడు జిల్లాల్లోని ఆరు స్టోన్ క్రషింగ్ క్లస్టర్ల నుంచి బయలుదేరే ట్రక్కుల వద్ద టోల్ రుసుములు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉండగా, వాటిని అక్రమంగా మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక టోల్ గేట్ నిర్వహణ బాధ్యతలు తులు మొండల్ నుంచి మినార్ మొండల్‌కు వెళ్లిన తర్వాత వసూళ్లు అసాధారణంగా పెరిగాయని దర్యాప్తులో గుర్తించారు. గతంలో నెలకు రూ.35–40 లక్షలుగా ఉన్న వసూళ్లు ఇటీవల ఏకంగా రూ.83 కోట్లకు చేరినా, ప్రభుత్వ ఖజానాలో మాత్రం రూ.5 కోట్లలోపే జమ కావడంతో ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. ఆ సమాచారంతోనే మినార్ ఇంటిపై దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ దాడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంధు అధికారి స్పందిస్తూ.. అవినీతిపై తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా కొనసాగనున్నట్లు వెల్లడించారు.
మినార్ మొండల్‌కు చెందిన విలాసవంత రెండంతస్తుల భవంతిలో నగదు పోగుబడిందని తెలియగానే పోలీసులు సోదాలుచేసి అక్కడి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోటి వంద గ్రాముల బరువైన మొత్తంగా రూ.21.5 కోట్ల విలువైన 15 కేజీల బంగారు బిస్కెట్లను పోలీసులు గుర్తించారు. సంచుల కొద్దీ కరెన్సీ కట్టలను లెక్కించేందుకు ఐదు లెక్కింపు మెషీన్లను రప్పించి వాటిని లెక్కబెడుతున్నారు. లెక్కింపు కొనసాగుతోందని, ఇప్పటికే కరెన్సీ విలువ రూ.28 కోట్లు దాటిపోయిందని దాడులు చేసిన బృందంలోని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనతో తులు మొండల్ కుటుంబం గతంలో నిర్వహించిన విలాసవంతమైన వివాహం మళ్లీ చర్చనీయాంశమైంది. 2024లో ఆయన కుమార్తె వివాహానికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు భారీగా నగదు, బంగారం స్వాధీనం కావడంతో ఆ ఖర్చుల మూలాలపైనా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ నగదు స్వాధీనం ఘటనతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతల పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తుండగా, అసలు సూత్రధారులు ఎవరు? ఈ అక్రమ ఆర్థిక వ్యవహారాల వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత పెద్దది? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


