డిజిటల్ డేటా పరిరక్షణలో ముందున్న సవాళ్లు!
భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆమూలాగ్రం మార్చేసి కోట్లాది మంది దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇప్పుడు ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అదే.. వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యత. దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం అమలు దశలోకి వచ్చిన నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేమెంట్ యాప్‌లు, భాగస్వామ్య బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబరు 4 నాటికి యూజర్ల మొబైల్ నంబర్లను పూర్తిస్థాయిలో ప్రదర్శించకుండా మాస్కింగ్ చేయాలి (కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించాలి). అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న ఫోన్ నంబర్ ఆధారిత యూపీఐ ఐడీలకు స్వస్తి చెప్పి యూజర్ నేమ్ ఆధారిత వర్చువల్ పేమెంట్ అడ్రెస్(వీపీఏ)లను కొత్త వినియోగదారులకు డిఫాల్ట్‌గా కేటాయించాలని ఆదేశించింది.
స్త్రీల భద్రత.. సత్వర నివారణ చర్యలు
చిల్లర వర్తకులకు లేదా అపరిచితులకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు వినియోగదారుల (ముఖ్యంగా మహిళల) ఫోన్ నంబర్లు బహిర్గతమై, వేధింపులు, సైబర్ బెదిరింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్‌పీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యూఆర్ కోడ్ లావాదేవీలలోనూ, పీర్2పీర్ బదిలీల్లోనూ వ్యక్తిగత నంబర్ ప్రదర్శన ఆగిపోయి ప్రాథమిక స్థాయి ప్రైవసీ రక్షణ లభిస్తుంది.
ఇది ఒక భాగం మాత్రమే!
ఫోన్ నంబర్లను దాచడం అనేది డిజిటల్ గోప్యత అనే పెద్ద సమస్యలో ఒక చిన్న పరిష్కారం మాత్రమేనని రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నంబర్ దాచినా చెల్లింపు నిర్ధారణ స్క్రీన్‌పై ఖాతాదారుడి పూర్తి పేరు, బ్యాంక్ వివరాలు కనిపించడం వల్ల వ్యక్తిగత గుర్తింపును సులభంగా కనుగొనే అవకాశం ఇంకా మిగిలే ఉంది.
థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌లు వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన, లొకేషన్, లావాదేవీల నమూనాలను ఎంతవరకు సేకరిస్తున్నాయి? ఆ డేటాను ప్రకటనల సంస్థలకు ఎలా విక్రయిస్తున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
సెప్టెంబరు 4 కల్లా బ్యాంకింగ్ సిస్టమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, కోట్ల మంది వినియోగదారులకు కొత్త వీపీఏ పద్ధతులపై అవగాహన కల్పించాల్సి ఉంది.
వేగం, సౌలభ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టించిన యూపీఐ ఇప్పుడు విశ్వసనీయత, డేటా ప్రైవసీ అనే పరీక్షను ఎదుర్కొంటోంది. కేవలం నంబర్లు దాచడానికే పరిమితం కాకుండా డేటా మినిమైజేషన్ (అవసరమైనంత డేటా మాత్రమే సేకరించడం) సూత్రాన్ని వర్తింపజేస్తూ సమగ్ర సైబర్ భద్రతా చట్రాన్ని నిర్మించినప్పుడే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నిజమైన రక్షణ లభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు


