రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు | Tatkal Ticket Rules From Aug 1st 2026, Railways Introduced Token System To Make Booking Easier And More Transparent | Sakshi
Sakshi News home page

రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Jul 29 2026 1:40 PM | Updated on Jul 29 2026 2:51 PM

Tatkal Ticket Rules From Aug 1 Railway Token System Introduced Long Queues

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రోజూ కనిపించే తోపులాటలు, దళారుల ఆధిపత్యానికి తెరదించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 1, 2026 నుంచి తత్కాల్ టికెట్ల జారీ విధానంలో విప్లవాత్మకమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెడుతున్నారు. ప్రాథమికంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (కోటా డివిజన్) పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ క్యూలైన్లలో నిలబడే పద్ధతి పూర్తిగా మారనుంది.

టోకెన్ల కేటాయింపు వేళలు ఇవే..

కొత్త నిబంధనల ప్రకారం కౌంటర్ వద్ద నేరుగా గుమిగూడేందుకు అనుమతించరు. ముందుగా టోకెన్లు పొందిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఏసీ తరగతుల వారికి ఉదయం 8:30-9:00 గంటల మధ్య టోకెన్లు పంపిణీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు గరిష్ఠంగా 10 టోకెన్లు మాత్రమే ఇస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 10:00 గంటలు). నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30-10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు 15 టోకెన్లు కేటాయిస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 11:00 గంటలు)

కేటగిరీ ఏ, బీ ప్రాధాన్యతలు

దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. కేటగిరీ ఏ..(తొలి ప్రాధాన్యం) తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ వర్గంలోకి వస్తారు. వీరు తమ అసలు గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి. కేటగిరీ ‘బీ’ కింద ఇతర ప్రయాణికులకు ఇస్తారు. ‘ఏ’ కేటగిరీ ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాతే వీరికి అవకాశం కల్పిస్తారు. వీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.

పారదర్శకత, భద్రతకే ప్రాధాన్యం

జారీ చేసిన టోకెన్లపై ప్రయాణికుడి పేరు, వివరాలు స్పష్టంగా ముద్రిస్తారు. ఇవి ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. టోకెన్ ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరంతరం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హాల్‌లో వేచి ఉండవచ్చు. అటు ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ ఆథెంటికేషన్‌ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ సులభతరం చేయడం, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ కీలక మార్పులు చేపట్టింది.

ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement