‘ఏఐ’ని తగ్గిద్దాం.. టెక్‌ దిగ్గజాల సంచలన నిర్ణయం | AI Needs Slowing Down Amodei Altman Musk Agree That | Sakshi
Sakshi News home page

‘ఏఐ’ని తగ్గిద్దాం.. టెక్‌ దిగ్గజాల సంచలన నిర్ణయం

Sep 13 2026 1:16 PM | Updated on Sep 13 2026 1:33 PM

AI Needs Slowing Down Amodei Altman Musk Agree That

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో పరస్పరం పోటీ పడే దిగ్గజ సంస్థల అధినేతలు ఒక కీలక అంశంపై అనూహ్యంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాధునిక AI మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని కొంతకాలం తగ్గించి, భద్రతా చర్యలకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్‌ (Anthropic) సీఈవో డారియో అమోడై, ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మాన్, ఎక్స్‌ఏఐ (xAI) అధినేత ఎలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు.

మితిమీరిన ఏఐ పురోగతిపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడై తాజాగా సుదీర్ఘ పదాల వ్యాసాన్ని ప్రచురించారు. ఇందులో ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలని కాకుండా, అత్యాధునిక మోడళ్ల సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత తగ్గించాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఏఐ భద్రత, నియంత్రణ, ప్రమాదాల అంచనా వంటి అంశాలు సాంకేతిక పురోగతికి అనుగుణంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

“ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని మనం తగ్గించాలి. పురోగతి అయినా వేగంగానే ఉంటుంది. అయితే మనకు లభించే అదనపు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి” అనేది అమోడై ప్రధాన వాదన. AIని పూర్తిగా ఆపడం వల్ల దాని ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఎలాంటి నియంత్రణలు లేకుండా వేగంగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

6–12 నెలల్లోనే భారీ ప్రమాదమా?

ఏఐ వ్యవస్థలు తమకంటే మెరుగైన తదుపరి తరం వ్యవస్థల అభివృద్ధికి మరింతగా సహకరించే స్థాయికి చేరుకుంటున్నాయని అమోడై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాల అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగితే, వచ్చే 6 నుంచి 12 నెలల్లో తప్పుదోవ పట్టిన ఏఐ ఏజెంట్ల సమూహం ఇంటర్నెట్‌ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వందల బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ ఆందోళనలకు ఇటీవల జరిగిన ఒక ఘటన మరింత బలం చేకూర్చింది. జూలైలో ఓపెన్‌ఏఐ సంస్థ నిర్వహించిన అంతర్గత సైబర్‌సెక్యూరిటీ పరీక్షల సమయంలో కొన్ని ఏఐ మోడళ్లు తమను ఇంటర్నెట్‌ నుంచి వేరు చేయడానికి ఏర్పాటు చేసిన నియంత్రణలను దాటాయి. అనంతరం ఓపెన్‌ఏఐ అంతర్గత పరిశోధనా మౌలిక వసతులతో పాటు ‘హగ్గింగ్‌ ఫేజ్‌’ వ్యవస్థల్లోకి చొరబడ్డాయి.

స్వతంత్ర నిపుణులకు యాక్సెస్

ఈ నేపథ్యంలో ఏఐ సంస్థల్లో భద్రతా పరీక్షలను మరింత స్వతంత్రంగా నిర్వహించాలనేది అమోడై ప్రతిపాదనల్లో ఒకటి. ఆంథ్రోపిక్‌ తమ వ్యవస్థలకు ఉద్యోగుల తరహా యాక్సెస్‌ కల్పిస్తూ థర్డ్‌పార్టీ నిపుణులను అనుమతిస్తామని ప్రకటించింది. వీరు సంస్థ భద్రతా ప్రమాణాలను వాస్తవంగా పాటిస్తుందా లేదా అన్నది స్వతంత్రంగా పరిశీలించనున్నారు.

ఈ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్మాన్ వెంటనే మద్దతు తెలిపారు. ఓపెన్‌ఏఐ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఎలాన్ మస్క్ కూడా దీనికి మద్దతు పలుకుతూ అమోడై చేసిన పోస్టును ఉటంకిస్తూ “డారియో చెప్పింది నిజమే” అని ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

మూడు దశల ప్రణాళిక

ఏఐ అభివృద్ధిని సురక్షితంగా కొనసాగించేందుకు అమోడై ప్రధానంగా మూడు అంశాలను ప్రతిపాదించారు. మొదటిది ఏఐ సంస్థల్లో స్వతంత్ర భద్రతా పర్యవేక్షకులకు అవకాశం కల్పించడం. రెండోది ప్రముఖ ఏఐ కంపెనీలు కలిసి ఉమ్మడి భద్రతా ప్రమాణాలను రూపొందించడం. మూడోది దేశాల మధ్య, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ప్రమాదాలను ఎదుర్కొనే సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement