కొత్త బంగారంగా రాగి.. పెట్టుబడిదారుల చూపంతా దీనిపైనే! | Is Copper A New Gold? Experts Unveil This Strategy to Make Money | Sakshi
Sakshi News home page

కొత్త బంగారంగా రాగి.. పెట్టుబడిదారుల చూపంతా దీనిపైనే!

Sep 12 2026 7:41 PM | Updated on Sep 12 2026 8:00 PM

Is Copper A New Gold? Experts Unveil This Strategy to Make Money

విలువైన లోహాలు అంటే.. ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారం, వెండి మాత్రమే. పెట్టుబడిదారులు కూడా చాలాకాలంగా వీటినే సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. రాగి ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. కొందరు దీనిని కూడా కొత్త బంగారంగా అభివర్ణిస్తున్నారు.

గత ఏడాది బంగారం ధర దాదాపు 70 శాతం, వెండి ధర ఏకంగా 150 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో అల్యూమినియం, పల్లాడియం, ప్లాటినమ్‌తో పాటు రాగి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

భారీగా పెరిగిన రాగి ధరలు
లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో రాగి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఒక దశలో మెట్రిక్ టన్ను రాగి ధర 14,737 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14 లక్షలకు సమానం. తవ్వకం, శుద్ధి సామర్థ్యాలకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు మధ్య అంతరం పెరుగుతుండటంతో.. రాగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రాగి ధరలు పెరగడానికి అమెరికా సుంకాల ప్రభావం కూడా ఒక ముఖ్యమైన కారణం. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉందన్న వార్తలతో కొనుగోలుదారులు ముందుగానే పెద్ద మొత్తంలో రాగిని కొనుగోలు చేస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలో అమెరికా సుమారు 8.85 లక్షల టన్నుల రాగిని దిగుమతి చేసుకుంది. దీంతో ప్రపంచంలోని రాగి నిల్వల్లో గణనీయమైన భాగం అమెరికాకు తరలిపోయింది. ఫలితంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గాయి. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.

ప్రధాన కారణాలు
మార్కెట్‌లో రాగికి చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే డిమాండుకు తగిన సరఫరా లేదు. ప్రపంచంలో ఉన్న పాత రాగి గనులు తమ ఉత్పత్తిని పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రధాన రాగి ఉత్పత్తి దేశాల్లో కూడా ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి.

రాగికి డిమాండ్ పెరగడానికి మరో ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లు భారీగా నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్లలో విద్యుత్ వ్యవస్థలు, కేబుల్స్, నెట్‌వర్క్ పరికరాలు వంటి వాటిలో రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల విస్తరణ కూడా రాగికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అంటే.. భవిష్యత్తులో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు పెరిగే కొద్దీ రాగి అవసరం కూడా పెరిగే అవకాశం ఉంది.

భారీ డిమాండ్
ఈ ఏడాది ఇప్పటి వరకు రాగి ధరలు సుమారు 16 శాతం పెరిగాయి. ముఖ్యంగా.. ఇటీవల నమోదైన రికార్డు ధరలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కూడా మించిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రోకరేజీలు 2026లో రాగి ధరలు టన్నుకు 11,000-12,000 డాలర్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేసినప్పటికీ, మార్కెట్ ధరలు ఇప్పటికే ఆ స్థాయిని దాటిపోయాయి. దీంతో రాగి మార్కెట్‌పై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement