ఇటీవలి కాలంలో బెంగళూరు పేరు చెబితే ఐటీతో పాటు ట్రాఫిక్ కూడా గుర్తొస్తోంది. దేశ ఐటీ రాజధానిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం.. ఇప్పుడు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, ఖరీదైన ఇళ్లు, మౌలిక వసతులపై ఒత్తిడితో సతమతమవుతోంది. బెంగళూరు ఎంత వేగంగా ఎదిగిందో.. దాని సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇక నగరంపై మరింత భారం మోపితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో.. కర్ణాటక ప్రభుత్వం కొత్త దారిని ఎంచుకుంటోంది. బెంగళూరును మాత్రమే విస్తరించడం కాకుండా.. రాష్ట్రంలోని మరో ఆరు నగరాలను కూడా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం డీకే శివకుమార్ సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.
కర్ణాటక అభివృద్ధి అంటే బెంగళూరు.. బెంగళూరు అంటే ఐటీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు. దశాబ్దాలుగా ఈ సమీకరణమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచింది. కానీ అదే విజయంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. సుమారు 1.25 కోట్ల జనాభా, 1.15 కోట్లకు పైగా వాహనాలు నగరం ఎదుర్కొంటున్న భారాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఉద్యోగాలు బెంగళూరులోనే కేంద్రీకృతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్, నివాస వ్యయం, ప్రజా రవాణా, మౌలిక వసతులపై ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది.
ఈ సమస్యకు డీకేఎస్ ప్రభుత్వం చూపిస్తున్న పరిష్కారం.. బెంగళూరును తగ్గించడం కాదు.. బెంగళూరు వెలుపల అవకాశాలను పెంచడం. ఇటీవల 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ ఇదే దిశలో తన ఆలోచనను స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కథ కేవలం రాజధాని చుట్టూనే తిరగకూడదని పేర్కొంటూ.. ‘బియాండ్ బెంగళూరు’ వ్యూహానికి మరింత ఊపు ఇచ్చారు. ఈ ప్రణాళికలో మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి, తుమకూరు, కలబురగి, శివమొగ్గ కీలకంగా మారనున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఐటీ, తయారీ, ఏఐ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి.. అక్కడే ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మైసూరుపై భారీ ఆశలు
బెంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరును కర్ణాటకలో రెండో ప్రధాన ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విద్య, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుని మరిన్ని కంపెనీలను ఆకర్షించాలన్నది ప్రణాళిక. 2030 నాటికి మైసూరు నుంచి 10 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆదాయం, కనీసం 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
మంగళూరుకు మరో గుర్తింపు
తీర ప్రాంతానికి కీలక నగరమైన మంగళూరుకు పోర్టు, విద్య, వైద్యం, బ్యాంకింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉంది. దీనికి టెక్నాలజీ, డేటా సెంటర్లు, డిజిటల్ ఎకానమీని జోడించి కొత్త పెట్టుబడులను తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే తీర ప్రాంత యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించాలన్నమాట.
ఉత్తర కర్ణాటకకు టెక్నాలజీ బూస్ట్
హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి ప్రాంతాన్ని ఇంజినీరింగ్, తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ సంబంధిత రంగాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న స్టార్టప్ వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి ఉత్తర కర్ణాటకలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించాలన్నది లక్ష్యం. తూమకూరు, దొడ్డబళ్లాపురంను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చూస్తుండగా.. చారిత్రకంగా వెనుకబడిన కల్యాణ కర్ణాటక ప్రాంతంలో టెక్నాలజీ, పరిశ్రమల పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టారు. కలబురగి, బెలగావి, హుబ్బళ్లి-ధార్వాడ్, మంగళూరు, మైసూరులో ఐదు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ల ప్రతిపాదన కూడా ఉంది.
అయితే ఇక్కడే అసలు సవాల్ ఉంది. ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఒక ఎత్తయితే.. అవి వాస్తవంగా ఏర్పాటై ఉద్యోగాలు కల్పించడం మరో ఎత్తు. గత ‘బియాండ్ బెంగళూరు’ కార్యక్రమంలో 2021-22 నుంచి 2024-25 మధ్య మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్ క్లస్టర్లలో దాదాపు 5,600 ఉద్యోగాలే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు దీనితో పోలిస్తే చాలా పెద్దవి. బెంగళూరు కర్ణాటకకు కిరీటం అయితే.. ఆ కిరీటం భారాన్ని మోయడానికి మరిన్ని నగరాలను సిద్ధం చేయాలన్నదే డీకేఎస్ సర్కార్ కొత్త వ్యూహం.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ సీఎం రాజీనామా


