ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీకి చెందిన కీలక పదవులకు రాజీనామా చేశారు. తనతో ముడిపడిన ఏ అంశం కూడా.. అవినీతిపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, తన మాజీ ఓఎస్డీ, సన్నిహితుడు జీనా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను రావత్ ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. జీనా సౌమ్యుడు, కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొంటూనే.. గ్రామీణాభివృద్ధి అధికారుల నియామకంలో ఓఎంఆర్ షీట్లతో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటపడితే తాను చేసేదేమీ లేదన్నారు. అయితే ప్రస్తుత ఆరోపణలను తాను నమ్మడం లేదని స్పష్టం చేశారు.
ఇక, నియామక పరీక్షల్లో అక్రమాలు అంటే యువత భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని రావత్ వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ హయాంలో నియామక వ్యవస్థను బలోపేతం చేశామని, మూడేళ్లలో 42 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ప్రక్రియలో తనవైపు నుంచి తెలిసో తెలియకో తప్పులు జరిగి ఉంటే ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఎవరి వద్ద ఉన్నా సీబీఐ, ఈడీ లేదా రాష్ట్ర పోలీసులకు అందించాలని రావత్ కోరారు. తాను తప్పు చేసి ఉంటే చట్టం తనను శిక్షించాలని, ప్రజా బాధ్యతల్లో ఉన్నవారు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటాన్ని తన కారణంగా బలహీనపరచకూడదనే ఉద్దేశంతోనే ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది 2027లో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


