ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా తాజాగా శనివారం (సెప్టెంబరు 12) జపాన్ సముద్రం వైపు గుర్తుతెలియని క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ముగిసిన మరుసటి రోజే ఈ ప్రయోగం జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయోగాన్ని గుర్తించారు. అది సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించింది. కొరియన్లు తూర్పు సముద్రంగా పిలిచే ప్రాంతం వైపు దూసుకెళ్లినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) వెల్లడించింది.
ప్రయోగం అనంతరం దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశం నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర కొరియాను కోరింది. ఇలాంటి చర్యలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘన అని పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఐదు రోజుల పాటు నిర్వహించిన ‘ఫ్రీడం ఎడ్జ్’ సంయుక్త సముద్ర విన్యాసాలు శుక్రవారం ముగిశాయి. దక్షిణ కొరియా తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ విన్యాసాలు జరిగాయి. వీటిని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది.
తమ దేశంతో పాటు ప్రాంతీయ దేశాలకు ఇవి ముప్పుగా అభివర్ణించింది. అధికారం పరంగా బలమైన ప్రతిచర్యలు తీసుకునే సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా రక్షణ మంత్రి కిమ్ సాంగ్ గి హెచ్చరించారు. అమెరికా పసిఫిక్ కమాండ్ స్పందిస్తూ.. ప్రయోగం గురించి తమకు సమాచారం ఉందని తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం అమెరికా సిబ్బంది, భూభాగం, మిత్రదేశాలకు తక్షణ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే మిత్రదేశాలతో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?


