పురుగులను అరికట్టే జిగురు అట్టలు | Sagubadi: How Sticky Traps Work: Protection Against Sucking Pests ... | Sakshi
Sakshi News home page

పురుగులను అరికట్టే జిగురు అట్టలు

Sep 11 2026 12:47 PM | Updated on Sep 11 2026 1:06 PM

Sagubadi: How Sticky Traps Work: Protection Against Sucking Pests ...

సేంద్రియ మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల్లో మొక్కలను ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులను నివారించటానికి పసుపు, బ్లూ (నీలం) రంగు జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రసాయన రహితమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 

1. ప్రకాశవంతమైన రంగులను చూసి పురుగులు ఆకర్షించబడి, అట్టలకు ఉన్న జిగురుకు అతుక్కుని చనిపోతాయి.

2. తెల్లదోమ వంటి పురుగులు వైరస్‌ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని ఈ అట్టల ద్వారా నివారించడం వల్ల మొక్కలకు వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు.

3. తోటలో ఏ రకమైన పురుగులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవి తోడ్పడతాయి.

4. క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది. 

5. పసుపు రంగు జిగురు అట్టలు: ఇవి ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ (అఫిడ్స్‌), లీఫ్‌ మైనర్స్, వివిధ రకాల ఈగలను ఆకర్షిస్తాయి. టమాట, వంగ, బెండ లాంటి కూరగాయలు , పండ్ల తోటలు, మిరప పంటల్లో ఇవి బాగా పనిచేస్తాయి.

6. బ్లూ/నీలం రంగు జిగురు అట్టలు ముఖ్యంగా తామర పురుగులు (థ్రిప్స్‌), నల్ల తామర (బ్లాక్‌ థ్రిప్స్‌) పురుగులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. మిరప వంటి పంటల్లో తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఇవి చాలా కీలకం.

7. మొక్కల ఎత్తును బట్టి అట్టలను కర్రలకు కట్టి భూమికి లేదా కుండీకి కొంత ఎత్తులో అమర్చాలి. మిద్దె తోటల్లో అవసరాన్ని బట్టి 4–5 అట్టలు సరిపోతాయి. 

8. మిద్దె లేదా పెరటి తోటల్లో పండు ఈగ సమస్యను నివారించడానికి ఫెరోమోన్‌ ట్రాప్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి మగ పండు ఈగలను ఆకర్షించి చంపడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గిస్తాయి.

9. పండు ఈగలు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. పసుపు రంగు అట్టలపై జిగురు పూసి తోటలో అక్కడక్కడ ఉంచడం వల్ల అవి వాటికి అతుక్కుపోతాయి.

10. పాత ప్లాస్టిక్‌ బాటిల్‌ తీసుకుని, దానికి చిన్న రంధ్రాలు చేయాలి. అందులో పండిన అరటిపండు ముక్కలు, కొంచెం బెల్లం నీళ్లు లేదా వెనిగర్‌ వేసి తోటలో వేలాడదీయడం ద్వారా ఈగలను ఆకర్షించవచ్చు. 

11. పండ్లు బాగా పక్వానికి రాకముందే కోయాలి. పండ్లు మరీ పండిపోతే పండు ఈగలను త్వరగా ఆకర్షిస్తాయి.

12. చెట్టు కింద రాలిపోయిన లేదా కుళ్ళిన పండ్లను వెంటనే తీసివేయాలి. ఇవి పండు ఈగలు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలు. 

13. సన్నని మెష్‌ ఉన్న నెట్‌లను మొక్కలకు కప్పడం ద్వారా ఈగలు పండ్ల దగ్గరకు వెళ్లకుండా నిరోధించవచ్చు.

14. కాయలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటికి కాగితపు సంచులు లేదా సన్నని బట్ట సంచులను కట్టడం ద్వారా రక్షణ కల్పించవచ్చు. 

15. లీటరు నీటిలో 5 ఎం.ఎల్‌. వేప నూనె, కొద్దిగా కుంకుడు రసం కలిపి మొక్కలపై క్రమం తప్పకుండా పిచికారీ చేయడం వల్ల పండు ఈగలు రాకుండా ఉంటాయి.

16. వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్‌ చేసి ఆ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా ఈగలను నివారించవచ్చు.

కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా 
మిద్దె తోటల బృందం
మొబైల్‌: 94906 02366 

(చదవండి: చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement