నో చెప్పడమూ  అవసరమే! | Explanation of Good girl syndrome from psychology | Sakshi
Sakshi News home page

నో చెప్పడమూ  అవసరమే!

Sep 11 2026 6:45 AM | Updated on Sep 11 2026 6:45 AM

Explanation of Good girl syndrome from psychology

గుడ్‌ గర్ల్‌ సిండ్రోమ్‌

మంచితనం, మర్యాద, బాధ్యతగా ఉండటం తప్పేమీ కాదు. కానీ ఇతరులను సంతోషపెట్టడం కోసం ప్రతిసారీ  తమ అవసరాలను, అభిప్రాయాలను, భావాలను  పక్కన పెట్టడం అలవాటుగా మారడం..  అందరికీ నచ్చాలనే కోరికల వల్ల ఏర్పడే ఒక ప్రవర్తనా ధోరణినే ‘గుడ్‌ గర్ల్‌ సిండ్రోమ్‌’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.

‘సాధారణంగా చాలా మంది అమ్మాయిలు ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలలో పెరిగిన అమ్మాయిల్లో ఈ సిండ్రోమ్‌ కనిపిస్తుంది. అలాగని, ఇది వైద్యపరమైన వ్యాధి కాదు. మన చుట్టూ ఉన్న సామాజిక అంశాలు, పెంపకం, ఎదుటివారు చెప్పింది వినకపోతే తమని తిరస్కరిస్తారేమో అనే భయంతో బతుకును భారంగా మార్చుకుంటున్నారు వారు ఉన్నారు. ఈ కండిషన్‌ పెళ్లయ్యి, వైవాహిక జీవితం మొదలుపెట్టాక కూడా కొనసాగుతుంటుంది’ అని వివరిస్తున్నారు సైకాలజిస్ట్‌ డా.జ్యోతిరాజ.  

‘నో’ చెప్పలేకపోవడం
‘నాకు కుదరదు’ అని చెప్పాల్సిన సందర్భంలో కూడా ‘సరే, చేస్తాను’ అంటూ పనులను ఒప్పుకుంటారు. ఇష్టం లేకపోయినా ఇతరుల కోసం పనులు చేయడం, అలసిపోయినా సహాయం చేయడం, అన్యాయం జరిగినా గొడవ వద్దని మౌనం వహించడం.. ఇలా ప్రతిసారీ ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ పోతే, ఒక దశలో ‘నాకు నిజంగా ఏం కావాలి?’ అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్యకు కుటుంబ వాతావరణం, సామాజిక అంచనాలు, గత అనుభవాలు .. వంటి అనేక అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి.

అందరూ మెచ్చుకోవాలనే కోరిక
కుటుంబంలో బంధుమిత్రులలో ఆమె చాలా మంచిది’, ‘ఎవరినీ బాధపెట్టదు’, ‘ఏ పని చెప్పినా చేస్తుంది’ ... ఇలాంటి మాటలు ఆనందాన్నిస్తాయి. కానీ క్రమంగా ఇతరుల ప్రశంసలకు తలొగ్గి, బతుకు భారంగా అనిపించినప్పుడు సమస్య మొదలవుతుంది. పనులు సరిగా చేయలేకపోతే ఎవరైనా తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే బాధపడిపోతారు. తాను తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు. అందరూ తన గురించి మంచిగానే అనుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ ధోరణులన్నీ గుడ్‌ గర్ల్‌ సిండ్రోమ్‌ లక్షణాలే.

అసంతృప్తి జీవనం
ఎప్పుడూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల మానసికంగా అలసిపోవచ్చు. తన భావాలను వ్యక్తపరచడం కష్టమవుతుంది. కోపం, అసంతృప్తి లోపలే పేరుకుపోవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల అభి్ర΄ాయాలపై ఎక్కువ ఆధారపడవచ్చు. సంబంధాల్లో తన హద్దులను కా΄ాడుకోవడం కష్టమవుతుంది. కొన్నిసార్లు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే వ్యక్తి లోపల మాత్రం ‘నా కోసం ఎప్పుడు జీవిస్తాను?’ అనే యుద్ధం చేస్తుండవచ్చు.

మార్పు అవసరం..
→ ముందుగా తమని తాము ప్రశ్నించుకోవాలి. ‘నేను ఈ పనిని నిజంగా చేయాలనుకుంటున్నానా, లేక ఎదుటివారు బాధపడకూడదని చేస్తున్నానా’ ఈ ప్రశ్న చాలా విషయాలను స్పష్టంగా చూపిస్తుంది. తర్వాత చిన్న విషయాల్లో ‘నో’ చెప్పడం మొదలుపెట్టవచ్చు. 
→ ప్రతిసారీ మనం తీసుకున్న నిర్ణయానికి ఎదుటివారు ఒప్పుకోవాలని, వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని గ్రహించాలి.
→ మంచి అమ్మాయిగా కనిపించాలంటే తమని తామే కోల్పోవడం కాదని తెలుసుకోవాలి.
ఇతరులను గౌరవించాలి. ప్రేమించాలి. అవసరమైనప్పుడు సహాయం చేయాలి. అదే సమయంలో మీ అభి్ర΄ాయాన్ని ముందుగా మీరు గౌరవించుకోవాలి. మీ సమయం విలువైనదిగా భావించాలి. నచ్చకపోతే ‘వద్దు’ అని చెప్పడం అంటే మీ జీవితాన్ని ఎంచుకునే హక్కు మీకూ ఉందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరికీ నచ్చే అమ్మాయిగా ఉండటం కంటే, తనకు తాను నచ్చే వ్యక్తిగా మారడం చాలా ముఖ్యం. 
 

మనల్ని మనం కోల్పోకూడదు..
చెప్పినవి వినకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. కోపం వస్తుందేమో.. అనే ఆలోచనలు వెంటాడుతుంటాయి. కానీ ‘నో’ చెప్పడం అంటే ఎదుటివారిని తిరస్కరించడం కాదు. మనకు ఉన్న పరిమితిని స్పష్టంగా చెప్పడం. అన్నింటినీ అంగీకరించి మోయలేనంత భారంతో రోజులను గడపనక్కర్లేదు. ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం మంచిదే. కుటుంబాన్ని చూసుకోవడం, స్నేహితులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు తోడుగా నిలబడటం గొప్ప విషయం. కానీ ఇతరుల కోసం మన ఆనందాన్ని పూర్తిగా త్యాగం చేయడం మంచితనం కాదు. విశ్రాంతి కావాలనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. నచ్చని విషయాన్ని నచ్చలేదని చెప్పాలి. మన జీవితానికి మనమే నిర్ణయాలు తీసుకోవడం స్వార్థం కాదని గ్రహించాలి.
– డా.జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

 – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement