ఉమ్మడి పౌర ప్రవర్తన | Sakshi Editorial On Uniform Civil Code | Sakshi
Sakshi News home page

ఉమ్మడి పౌర ప్రవర్తన

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

Sakshi Editorial On Uniform Civil Code

‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ; ఎంత తొందరలే హరి పూజకు, పొద్దుపొడవకముందె పూలిమ్మనీ’– అంటూ ఆశ్చర్యపోతారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఓ సినీగీతంలో! నిజమే, పూలిమ్మని రెమ్మరెమ్మనూ ఎవరు శాసించారు, ఏ చట్టం కొట్టి చెప్పింది? సృష్టిలోని సకలజీవులూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉమ్మడిగా సుఖజీవనం సాగించడానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లలో ఒకటి కదా అది! పట్టిచూస్తే తప్ప అర్థం కాని, మన అవగాహనకు అందని ప్రకృతి విశాల ప్రణాళికలో అది భాగం కదా! బుర్రలేదనుకునే పక్షీ, పశువూ, చెట్టూ, పుట్టా, రాయీ, రప్పా సైతం ప్రాకృతిక న్యాయంలో భాగమైనప్పుడు బుర్ర ఉందనుకునే మనిషి ఎందుకు కాడు?! సంస్కృతీ, నాగరికతా మార్గంలో వేల సంవత్సరాల ప్రస్థానం తర్వాత, ఇప్పటికైనా అయ్యాడా? అందులో ప్రకృతి ప్రణాళికకు పెడగా పడిన అడుగులెన్ని!

జీవం మనిషిగా ఎదిగిన మొదట్లో చట్టాలు లేవు; మనుగడలో భాగంగా సాటి మనిషితో జతకట్టాడు, గుంపుగా ఎదిగాడు, అనేక గుంపులతో కలసి సామరస్యంగా సహజీవనం చేసే స్థాయికి చేరాడు. తన అస్తిత్వంలో ఎక్కువకాలం అలిఖిత శాసనాలే మనిషిని నడిపించాయి; మంచీ, మర్యాదా మప్పాయి; నీతీ, రీతీ నేర్పాయి; సభ్యత, శుభ్రత అలవరచాయి. అయినా ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అవినీతి, అసభ్యత, అక్రమాల అధఃపాతాళపు లోతులు చూస్తూనే ఉన్నాడు. ప్రకృతిమార్గం నుంచి తప్పుకుని సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రావీణ్యం విర్రవీగడమే అందుకు కారణమా?! 

మానవ జనావాసాలు గుంపు దశనుంచి నగరాలుగా ఎదిగే క్రమంలో లిఖిత శాసనాలు వచ్చాయి. అయిదువేల సంవత్సరాల క్రితం ప్రాచీన సుమేరు నాగరికతా కాలంలో తెచ్చిన ‘ఉర్‌–నమ్ము’ అనే శిక్షాస్మృతిని తొలి స్మృతిగా చెబుతారు. ఆ తర్వాత క్రీ.పూ. 1750లో, బాబిలోనియా పాలకుడు హమ్మురాబి పేరిట శిక్షాస్మృతి వచ్చింది. ఆ తర్వాత క్రీ.పూ. 451లో ‘లా ఆఫ్‌ ట్వెల్వ్‌ టేబుల్స్‌’ పేరిట రోమన్‌ చట్టాలు వచ్చాయి. వాటిని క్రోడీకరిస్తూ క్రీ.శ. 529లో జెస్టీనియన్‌ శిక్షాస్మృతిని తెచ్చారు. ఆధునిక పౌరచట్టాలనూ, వ్యవస్థలనూ అదే ప్రభావితం చేసిందంటారు. మన దగ్గర క్రీ.పూ. 400లో అర్థశాస్త్రం, ఆ తర్వాత మనుçస్మృతితో సహా వివిధ స్మృతులు వచ్చి మానవ ప్రవర్తనను కట్టడి చేయడానికి ప్రయత్నించాయి. 

కులమతవర్గ భేదాలను దాటుకుంటూ ప్రజాస్వామ్యం దిశగా అడుగువేస్తున్న వర్తమానంలో ఈ ప్రాచీన స్మృతులు మంచి–చెడుల కలబోతగా కనిపించ డంలో ఆశ్చర్యం లేదు. క్రీస్తుశక ప్రారంభంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ‘ధర్మస్తంభా’ల పేరిట దేశమంతటా స్థాపించిన లిఖిత శిలాస్తంభాలు జంతుబలుల నిషేధంతో సహా ఆయా విధినిషేధాలను శాసిస్తూనే; సత్కార్యాలను, దయను, దాతృత్వాన్ని, సత్యనిష్ఠను, పరిశుద్ధతను బోధించాయి; క్రౌర్యాన్ని, కోపాన్ని, గర్వాన్ని విడిచిపెట్టమనీ; అన్ని మతా లను, పంథాలను గౌరవించమనీ చెప్పాయి. 

మనిషి ప్రవర్తనను చట్టాలూ, శిక్షలతోనే కాదు; తగిన హితబోధతో మానసిక పరివర్తన ద్వారా కూడా కట్టడి చేసే ప్రయత్నం ముందునుంచీ జమిలిగా సాగింది. ప్రభుత్వాలు చట్టాలు, శిక్షలతో చేయబోయిందే – వేదాలూ, కావ్యేతిహాసాలు సహా ప్రపంచ వాఙ్మయమంతా హితబోధతో చేయబోయింది. అందుకే ప్రత్యేకించి కావ్యాలను కాంతాసమ్మితాలన్నారు. ‘భగవంతుడు ఆకలిచావును విధించలేదు, తిండి ఉన్నవాడు కూడా చావక తప్పదు; తనకున్నదాన్ని ఇతరులతో పంచుకునేవాడు ఎప్పటికీ అణ గారడు; దాతృత్వం లేనివాడు ఒంటరి అయిపోతా’డంటుంది ఋగ్వేదం. దయ, ధర్మం లేని కొంప కొంపే కాదంటుంది. 

విజ్ఞతా, వినయాలే తప్ప అహంకారం, ధిక్కారం పని చేయవని మహాభారతంలోని యక్షప్రశ్నల ఘట్టం చెబుతుంది. ఒక యక్షుడికి చెందిన చెరువులో నీళ్ళు తాగబోయి, అతని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నిరాకరించి, ధిక్కరించి తన నలుగురు సోదరులూ స్పృహ కోల్పోయినప్పుడు ధర్మరాజు వినమ్రంగా జవాబు చెప్పి సోదరులను బతికించుకుంటాడు. కనుక చట్టాలకూ, హితబోధకూ మధ్య సమతూకం తప్పనిసరి. ఏది ఎక్కువైనా సత్ప్రవర్తన గల్లంతవుతుంది. చట్టాలే సర్వస్వ మనుకుంటే వాటి ఉల్లంఘనా సర్వసామాన్యమవుతుంది. ఉమ్మడి పౌరస్మృతులతో పాటు హితమార్గంలో ఉమ్మడి పౌర ప్రవర్తనను తీర్చిదిద్దడమూ అంతే అవసరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement