మూడేళ్లుగా భారత్‌ను వెన్నాడుతున్న ఒక నీలాపనింద తొలగిపోయింది. కెనడాలో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ చేతుల్లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జార్ ఉదంతంలో మన ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని నిగ్గుదేలినట్టు బుధవారం అమెరికా, కెనడా ప్రకటించాయి. భారత అధికారుల కనుసన్నల్లోనే నిజ్జార్ హత్య జరిగిందంటూ కెనడా పార్లమెంటులో 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దాంతోపాటు ఇరుదేశాలూ దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించు కున్నాయి. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని మన ప్రభుత్వం కొట్టిపారేసింది. చివరకు అదే రుజువైంది. కెనడాలో సిక్కు ఓట్లు పొందటం కోసం ఖలిస్తానీవాదుల్ని సంతోషపరచటానికే ట్రూడో భారత్‌పై ఆరోపణ చేశారని అప్పట్లో మన ప్రభుత్వం విమర్శించింది.
అయితే భారత్ కేంద్రంగా ఖండాంతరాల్లో మూడు నేరస్త ముఠాలు పనిచేస్తున్నాయని, ఇవి తమ దేశంలోనూ, కెనడాలోనూ, యూరప్‌లోనూ హత్యలకూ, బెదిరింపులకూ, మాదకద్రవ్యాల వ్యాప్తికీ కారణమవుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించటం మన పోలీసు, నిఘా వ్యవస్థల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నేరాల సూత్రధారుల్లో ఒకడైన లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. మరొక వ్యక్తి జగ్గూ భగవాన్‌పురియా అస్సాం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ జైళ్లనుంచే చెరో ముఠాకూ నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ కార్యకలాపాలు నడుపుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
మరో వ్యక్తి రవిందర్‌సింగ్ ధండ్సా కెనడాలోనూ... బిష్ణోయ్ ముఠాలోని సతీందర్‌సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో గోల్డీ బ్రార్‌ను పట్టిస్తే 50,000 డాలర్లిస్తామని ఎఫ్‌బీఐ చెప్పడం గమనించదగ్గది. మొత్తంగా 37 మంది నిందితుల్లో 24 మందిని అమెరికా, కెనడా, యూరప్‌లు ఉమ్మడిగా సాగించిన ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో అరెస్టు చేశారు. వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ప్రపంచీకరణ తర్వాత ఇతరత్రా అభివృద్ధి మాటేమోగానీ... నేర ముఠాల కార్యకలా పాలు ఊహాతీతంగా విస్తరించాయి. ఖండాంతరాలకు వ్యాపించాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ఏలుబడిలో నక్సలైట్లను అరికట్టే పేరిట నయీం చేసిన అకృత్యా లకు అంతులేదు. అతగాడు తెలంగాణ ఉద్యమకారులనూ, మేధావులనూ బెదిరించటంతో ఊరుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరమై ఎదిగిన బెల్లి లలిత అనే యువ గాయని ప్రాణాలు తీశాడు. అనేకమందిని కిడ్నాప్ చేశాడు. వందల ఎకరాల భూముల్ని కబ్జా చేశాడు. కొన్నాళ్ళు జైలు నుంచే కార్యకలాపాలు నడిపాడు. పంజాబ్‌లో పరిస్థితి భిన్నమైనది.
అక్కడ హరితవిప్లవ కాలం నుంచీ పోగుపడిన సంపదకు ప్రపంచీకరణ అనంతర పరిణామాలు తోడుకావటంతో అక్రమ వసూళ్ల దందా, సామాజిక మాధ్య మాల్లో ప్రముఖులుగా మారి, విదేశాల్లో సైతం ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగిన గ్రామీణ యువ కళాకారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవటం పెరిగింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకుల్ని సంపాదించి, విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన యువ వాగ్గేయకారుడు సిద్ధూ మూసేవాలను గోల్డీ బ్రార్ ముఠా కాల్చిచంపింది. బిష్ణోయ్ అభీష్టానికి భిన్నంగా ఒక కబడ్డీ జట్టును ప్రోత్సహించటం ఈ హత్యకు కారణం!
ఇప్పుడు జైళ్లలోవున్న లారెన్స్, భగవాన్‌పురియాలతోపాటు ఒక పంజాబీ అమెరికన్ కుటుంబాన్ని హత్య కేసులో ఇరికిస్తామని బెదిరించి, 4 లక్షల డాలర్లు (3.81 కోట్లు) డిమాండ్ చేసిన పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గురిందర్ సింగ్ నాగ్రాను కూడా అప్పగించాలని అమెరికా కోరుతోంది. భగవాన్‌పురియా ముఠా చేసే పలు నేరాలకు గురిందర్ సహకరిస్తున్నాడన్నది ఎఫ్‌బీఐ ఆరోపణ.
ఇవిగాక అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉద్యమకారుడు గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడన్న అభియోగాలతో ఎన్నారై నిఖిల్ గుప్తా అమెరికా జైల్లో ఉన్నాడు. వికాస్ యాదవ్ అనే భారతీయ అధికారి ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరి గిందని అమెరికా ఆరోపించింది. దేశాన్ని అప్రదిష్టపాలుచేసే ఇలాంటి వారిపట్ల కఠినంగా ఉండాలి. వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. ఎల్లకాలమూ చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటం సాధ్యంకాదని తాజా పరిణామాలు తెలియ జెబుతున్నాయి.


