Sakshi Editorial
-
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్‌కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్‌కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్‌కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్‌కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్‌లో ‘ఇండోపాకాం’, యూరప్‌లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్‌ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్‌ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్‌ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్‌పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
సారం లేని సారా కథలు
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ‘సాక్షి’ బయటపెట్టింది. అదేరోజు ఉషోదయాన ‘ఈనాడు’ మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్‌కు ఈడీ నోటీసులిస్తుందట! విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ‘ఈనాడు’ సహా యెల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంలో సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో!చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయడం యెల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసిపెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నది. మద్యం కేసు పేరుతో యెల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే, రాసినదాన్నే పలుమార్లు మార్చి మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికీ, జబ్బ పుష్టికీ పాఠకులు అచ్చెరువొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రమావస్థలో ఏది కుంభకోణమో, ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండవచ్చు. కానీ, ఇంగితజ్ఞానం అనేదాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుకలేకపోవడం వారి బలహీనత.పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ‘ఉదయం’ను దెబ్బతీయడానికి ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ‘ఉదయం’ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ‘ఉదయం’ పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్యనిషేధాన్ని అమలు చేశారు. నాడు ‘ఈనాడు’ సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్‌కు మద్యనిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ‘ఈనాడు’ రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసిపారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతట వారు తాగడం మానేస్తే తప్ప మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధివృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు.ఆనాడు మొదలైన బాబు – యెల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులూ నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి యెల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్టులను మనం స్పష్టంగా చూడవచ్చు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, ఫలితంగా 20 వేల కోట్లకు పైగా సిండికేట్ దండుకున్నదనీ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలావరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కనపెట్టి కామన్సెన్స్ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి.అంతకుముందు ఆరు డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వనివాళ్ల పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1,300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కార్ పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేట్ వ్యాపారులకు నాలుగేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా లబ్ధి జరిగింది. ఈ వ్యవహారంలో పాలకులు అవినీతికి పాల్పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. అందువల్లనే కాగ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాన్ని నమోదు చేశారని సమాచారం. స్పష్టమైన ఆధారం కనుకనే సీఐడీ కేసు నమోదు చేసింది.3,400 లైసెన్స్డ్ లిక్కర్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. చేతులు తడపకుండానే ఇంతటి భారీ వెసులుబాటు సాధ్యం అవుతుందా? ప్రతి షాపు పరిధిలో అదనంగా పది నుంచి పదిహేను వరకు బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం మొత్తంగా 43 వేల బెల్టు షాపులు అవతరించాయి. ఒక్కో బెల్టు షాపును ప్రాంతాన్ని బట్టి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పాడుకున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకుగాను ఒక్కో బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ మీద అదనంగా 20 రూపాయలకు పైగా వసూలు చేశారు. విచ్చలవిడిగా మద్యాన్ని ప్రవహింపజేసి ఎమ్ఆర్పీ మీద అదనపు దోపిడీతో జనాన్ని పీడించిన ఈ విధానంలో తెలుగుదేశం పార్టీ సిండికేట్ ముఠాలు 20 వేల కోట్లకు పైగా దిగమింగాయని వైసీపీ ఆరోపించింది.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విచ్చలవిడి మద్యం ప్రవాహానికి కళ్లెం వేసే మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అధిక లాభాపేక్షతో విచ్చలవిడి అమ్మకాలకూ, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేట్ వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ద క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3 వేలకు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్ అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగిపారేసే దాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్లింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసింది.ఇప్పుడు లాజికల్‌గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడున్నది? కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకూ, పర్మిట్ రూమ్లకూ, బెల్ట్ షాపులకూ అనుమతిలిచ్చిన ప్రైవేట్ వ్యాపార విధానంలో లంచాలు వస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలు వస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి జరిగేలా చూసింది. బేసిక్ రేటును పెంచకుండా తమ లాభాలకు కళ్లెం వేసినందుకు డిస్టిలరీలు జగన్ సర్కార్‌కు లంచాలు ముట్టజెప్పాయని అనుకోవాలా? ఇక్కడే యెల్లో మీడియా క్రియేటివిటీ విశృంఖల విహారం చేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ హెడ్‌క్వార్టర్‌లో తయారైన స్క్రిప్టునే దర్యాప్తు కోసం నియమించిన సిట్ లీక్ చేస్తుంది, యెల్లో మీడియా అచ్చేస్తున్నదని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ ఆరోపణలను విశ్వసించకుండా ఉండేందుకు తగిన కారణం కనిపించడం లేదు. ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసినందువల్లనే వేలకోట్ల ధనం చేతులు మారిందని ‘సిట్’ పలుకుతున్నది. యెల్లో మీడియా కోరస్ పాడుతున్నది. జగన్ సర్కార్ జమానాలో వచ్చిన కొత్త డిస్టిలరీ లేదు. కొత్త మద్యం బ్రాండ్ కూడా లేదు. అన్నీ కూడా చంద్రబాబు సర్కార్ వారసత్వమే. బాబు పాత జమానాలో 20 డిస్టిలరీలు వుంటే అందులో కేవలం ఐదు డిస్టలరీలకే బేవరేజెస్ కార్పొరేషన్ 50 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిందని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వల్ల జగన్ హయాంలో వేల కోట్లు చేతులు మారాయన్న కథనం నిజమైతే చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే ఎక్కువ మొత్తమే కైంకర్యం అయి వుండాలి కదా! యెల్లో మీడియాకు ఈ లాజిక్‌తో పనేముంది?డిస్టిలరీలకు మద్యం ఆర్డర్లు ఇచ్చే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ వాళ్లు బెదిరించి, హింసించి తాము కోరుకున్న వారి పేర్లు చెప్పించి, ఆ పేర్లన్నింటినీ అభియోగపత్రంలోకి ఎక్కించారన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఎమ్‌ఓలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయరెడ్డి, సీఎమ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప, ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన బంధువు అనివాశ్రెడ్డి, లోక్‌సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి వగైరా సుమారు యాభై మంది మరే పని లేకుండా మద్యం వ్యాపారంలో మునిగితేలారని సిట్ నమ్మమంటున్నది.ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. ఛార్జిషీట్లో పేర్కొన్నవారు, పేర్కొనని మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులున్నాయట! అంతేకాకుండా, కొన్ని వందల కోట్లతో దుబాయ్‌లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట! మరికొన్ని వందల కోట్లో, వేల కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట! అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని వేల కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో, చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విషప్రచారపు జోరును పెంచిందని అనుకోవలసి వస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మయన్మార్‌తో చెలిమి
అనుచిత కారణాలవల్ల తరచు వార్తల్లో ఉండే మయన్మార్ నుంచి ఆ దేశాధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ అయిదు రోజుల పర్యటన కోసం శనివారం మన దేశం వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన బృందంలో కేబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కొన్ని దశాబ్దాలక్రితం ఇలాంటి పర్యటన ఊహించలేం. ఎందుకంటే ఆ దేశం నిరంతరం సైన్యం పడగనీడలో మనుగడ సాగిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను సైన్యం బతకనీయదు. 2020లో తిరుగులేని మెజారిటీతో వరసగా రెండోసారి ఎన్నికైన ప్రజా స్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్డీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఏడాదిలోపే సైనిక దళాలు హస్తగతం చేసుకున్నాయి. మన పొరుగును మనం ఎంచుకోలేం. అక్కడ ఎలాంటి ప్రభుత్వాలుండాలో ఆశించటం కూడా అసాధ్యం. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మన ప్రయోజనాలు తప్ప వేరే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, అందుకోసం అక్కడి పాలకులపై ‘నైతిక ఒత్తిడి’ తీసుకురావాలనుకోవటం వృథా ప్రయాసగా, అనవసర చాదస్తంగా భావించే ధోరణి అలుముకుంది. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకొనే చైనా దశాబ్దాల క్రితమే ఈ సూత్రాన్ని నమ్మి మయన్మార్‌ను అక్కున చేర్చుకుని అన్నివిధాలా లాభపడింది.వాస్తవానికి మయన్మార్‌తో మన దేశానికి సన్నిహిత సంబంధాలుండేవి. 1951లో ఆ దేశంతో స్నేహ ఒప్పందం కుదిరింది. 1955లో మనతోపాటు అలీనోద్యమ అంకు రార్పణకు తోడ్పడిన దేశాల్లో మయన్మార్ ఒకటి. కానీ 1958లో సైనిక పాలకుల ఆగమనం తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మనమే కాదు... దాదాపు ప్రపంచ దేశాలన్నీ దానితో ‘దౌత్యపరమైన అంటరానితనాన్ని’ పాటించటం మొదలెట్టాయి. 1988లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని సైనిక పాలకులు అణిచేయటాన్ని నిరసిస్తూ సూకీకి భారత్ మద్దతు ప్రకటించింది. 1992లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. కానీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో మళ్లీ దాంతో సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి మాండలేలోని భారత కాన్సులేట్‌ను పునఃప్రారంభించింది. తిరిగి మళ్లీ 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకొచ్చేవరకూ ఇరు దేశాల సంబంధాలూ అంతంత మాత్రమే. 2017లో మోదీ మయన్మార్‌ను సందర్శించారు.మన దేశానికి మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవునా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ (520 కి.మీ.), నాగాలాండ్ (215 కి.మీ.), మిజోరం (510 కి.మీ.), మణిపూర్ (398 కి.మీ.)ఉన్నాయి. 2021లో తిరిగి సైనిక పాలకులు అధికారం చేజిక్కించుకున్నాక మన దేశం గతంలో మాదిరి మయ న్మార్ను ఏకాకిని చేయాలనుకోలేదు. నిరంతరం సంబంధ బాంధవ్యాల్లో ఉంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అది దోహదపడుతుందనీ, దాంతోపాటు సరిహద్దు భద్రత విషయంలో మన ప్రయోజనాలు నెరవేరుతాయనీ భావించింది. దానికితోడు మయ న్మార్ను దూరం చేసుకుంటే అది చైనాకు దగ్గరకావటం మినహా సాధించేదేమీ ఉండదని కూడా అనుకుంది. అందుకే కావొచ్చు... సైనిక చీఫ్ పదవి వదులుకుని, దేశాధ్యక్షుడైన రెండు నెలల్లోనే తన తొలి విదేశీ పర్యటనకు మిన్ మన దేశాన్ని ఎంచుకున్నారు. నిరుడు డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య జరిపిన ఎన్నికల్లో మిన్ భారీ ఓట్లతో విజయం సాధించారు. దాదాపు అన్ని విపక్షాలనూ ఎన్నికల్లో పాల్గొననీయకపోవటంవల్ల ఇది సాధ్యమైంది. ఆ సంగతలావుంచి మయన్మార్‌తో కుదిరిన ఒప్పందాలు మన దేశానికి వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా మేలుచేసేవే. అంతర్జాతీయ కరెన్సీ బదులు మన రూపాయి, మయన్మార్ క్యాట్‌లలో లావాదేవీలు జరుపుకోవాలనీ... ఇంధనం, మైనింగ్, ఆగ్రో ప్రోసెసింగ్ రంగాల్లో సహకరించుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. అలాగే నౌకా శ్రయ నిర్మాణంలో మయన్మార్‌కు తోడ్పడేందుకు అవగాహన కుదిరింది. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపే సంస్థలకు ఆశ్రయం లభించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ హామీ ఇచ్చింది. వర్తమానంలో ఇరుగు పొరుగుమధ్య సర్దుబాట్లు తప్ప ‘అనవసర’ చాదస్తాలు ఉండబోవని ఈ పర్యటన నిరూపించింది. -
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
అన్నిచోట్లా అడుగడుగునా కనబడే అవినీతి, నిర్లక్ష్యం దేశాన్నేలే ఉన్నతాధికార వ్యవస్థలు కొలువుదీరిన ఢిల్లీలో కూడా నిక్షేపంగా కొనసాగుతున్నాయని మూడురోజుల వ్యవధిలో జరిగిన రెండు విషాద ఘటనలు రుజువు చేశాయి. శనివారం రాత్రి అయిదంతస్తుల భవంతి కూలి పోటీ పరీక్షలకు కోచింగ్ కోసం వచ్చిన అయిదుగురు విద్యార్థులతోపాటు మరో మహిళ మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. ఇది మరువకముందే బుధవారం వేకువజామున దక్షిణ ఢిల్లీలో ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 21 మంది చనిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందటానికి వచ్చే విదేశీయులు ఈ హోటల్లో బస చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు ఉదంతాలూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పనితీరుకు అద్దం పడతాయి. దేశంలో దాదాపు అన్నిచోట్లా నియమోల్లంఘనలు కనబడుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోని అధికార యంత్రాంగాలకూ కొదవ లేదు. కానీ ఢిల్లీలోనూ ఇదే స్థితి! పైగా ఇలాంటి ఉదంతాలు ఆ నగరానికి కొత్తగాదు. 2024లో ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మంటల్లో చిక్కుకుని ఏడుగురు నవజాత శిశువులు కన్నుమూశారు. అదే ఏడాది ఒక సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ మహానగరంలో కాలం చెల్లిన భవంతులు కూలడం, ఏడాదికి ఒకటో రెండో అగ్నిప్రమాదాలు రివాజుగా మారడం... అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించకపోవటం దిగ్భ్రాంతికరం.ఎంసీడీ అధికారులు గుణపాఠం నేర్వకపోవడం సరే... ఢిల్లీ ప్రభుత్వం లేదా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిస్సహాయంగా మిగలటం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రి రేఖా శర్మకు ఈ సమస్యలన్నీ తెలియవనుకోలేం. ఆమె మూడు దఫాలు కార్పొరేటర్‌గా పని చేశారు. 2023లో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జవాబిస్తూ రాజధాని నగరంలో నియమాలు ఉల్లంఘించిన భవంతులు 55,000 వరకూ ఉన్నాయని తెలియజేసింది. ఆ జాబితాలోని ఎందరిపై చర్య తీసుకున్నారో, ఆ భవంతుల్ని ఏం చేశారో ఎవరికీ తెలియదు. శనివారం ప్రమాదం జరిగిన అయిదంతస్తుల భవనం కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిందే. కేవలం మూడంతస్తులకు అనుమతి ఉంటే, మరో రెండంతస్తులు వేయటమే కాక, తాజాగా మరో అంతస్తు నిర్మాణానికి పనులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బలహీనమైన పునాదులపై నాసిరకంగా నిర్మించిన ఆ భవంతిపై అదనపు భారం పడటంతో కూలిపోయిందని చెబుతున్నారు. అలాంటి భవంతి నివాసయోగ్యమైనదేనని ఎంసీడీలో ధ్రువీకరించిందెవరో తేలాలి. బంగారు భవిష్యత్తును ఆశించి రకరకాల కోచింగ్‌ల కోసమని యువత వస్తుంది. చవగ్గా లభిస్తుందన్న కారణంతో అనేకులు ఇలాంటి భవంతుల్ని ఆశ్రయిస్తారు. కిక్కిరిసిన జనావాసాలున్నచోట మంచినీరు, డ్రెయినేజి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా ఎంతో కష్టమవుతాయి. అయినా అధికార యంత్రాంగాలు మౌనంగా ఉండిపోతున్నాయి. బుధవారం మంటల్లో చిక్కుకున్న హోటల్ల్లో రాకపోకలకు కేవలం ఒకే మార్గం ఉందని చెబుతున్నారు. ఆరు గదులకే అనుమతి ఉన్న హోటల్ ఏకంగా అయిదంతస్తుల్లో ఇరవై గదులు నిర్మించింది. దీనికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేదంటున్నారు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే ప్రభుత్వ విధానాలు లేకపోగా, అక్రమ కట్టడాలు, కాలనీలు వెలుస్తాయి. అవి క్రమబద్ధమవుతాయి. అల్పాదాయ వర్గాలు ఏ సదుపాయాలూ లేని అలాంటి నాసిరకం భవంతుల్లో ఉండక తప్పడంలేదు. ఢిల్లీలో ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం దాదాపు 60 శాతంమేర ఉంటుందని ఒక అంచనా. 2014లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1,799 కాలనీలను క్రమబద్ధం చేశారు. అటుతర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కాలనీలను, నిర్మాణాలనూ అనుమతించ బోమన్నారు. కానీ ఈ పుష్కరకాలంలో అలాంటి మరిన్ని వందల కాలనీలు, వాణిజ్య, నివాస భవంతులు ఉనికిలోకొచ్చాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఎంసీడీ తనిఖీలు సాగుతుంటాయి. అవన్నీ మొక్కుబడి వ్యవహారాలేనని ఈ ప్రమాదాలు రుజువు చేస్తు న్నాయి. భూకంప జోన్–4లో ఉన్న ఢిల్లీలో ఇకనైనా పాలకులు మేల్కొంటారా? నిర్మాణ రంగ ఇంజినీర్లతో, నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారా? -
లెక్కల్లో దాగుడుమూతలు
గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మూడు రోజుల క్రితం విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) చూస్తే మన దేశం ఏయే రంగాల్లో మెరుగుపడింది, ఇంకెన్ని రంగాల్లో సవరించుకోవాల్సిన అవసరముంది అనే విషయాలు తెలుస్తాయి. 1992–93లో విడుదల చేసిన తొలి సర్వేనుంచీ చూస్తే తాజాగా విడుదలైన సర్వే ఆరోది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే మాతా–శిశు ఆరోగ్యం, బాలల పౌష్టికాహారం, ఆరోగ్య బీమా వగైరాల్లో మన దేశం ముందడుగు వేసిందని చాటుతోంది. ఇది సమగ్రమైనదనీ, అత్యుత్తమ నాణ్యతతో కూడిన గణాంకాలు రాబట్టడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామనీ ఆ నివేదిక వివరిస్తోంది. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించి తీరాల్సిన వాటిగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ఎంత చేరువలో ఉన్నాం... ఎంత దూరంలో ఉన్నాం అనేది తెలుసుకోవటం, తగువిధంగా సవరించుకోవటం ఈ గణాంకాల ఉద్దేశం. గత నివేదికతో పోలిస్తే ఆసుపత్రుల్లో శిశుజననాల శాతం పెరిగిందనీ(88.6 శాతం నుంచి 90.6 శాతానికి), ప్రసవానికి ముందు ఆరోగ్య పరిరక్షణ 95.9 శాతానికి చేరుకుందనీ, సంతాన సాఫల్యత రేటు స్థిరంగా 2.0 దగ్గరుందనీ, పౌష్టికాహారలోపం తగ్గిందనీ, ఏడాది–రెండేళ్లమధ్య వయసుండే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల శాతం 87.1 శాతానికి చేరుకుందనీ నివేదిక వివరిస్తోంది. అసలు తొలి ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికకూ, తాజా నివేదికకూ చూస్తే స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం 40 శాతం ప్రసవాలు మాత్రమే ఆసుపత్రుల్లో జరిగేవి. అవి ఇప్పుడు 90 శాతానికి పెరగటం చిన్న విషయమేం కాదు. అయితే గణాంకాలు ఏం చెబుతున్నాయన్నది కాదు... ఏం చెప్పటం లేదన్నది ముఖ్యమని నిపుణులంటారు. ఆ కోణంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక నిరాశపరుస్తుంది. గత నివేదికకూ, ఇప్పటికీ చూసినా ఎన్నో అంశాల దాటవేత తెలుస్తుంది. గత నివేదికకు మొత్తం 131 సూచీలుంటే ఇప్పుడవి 101కి తగ్గాయి. అంటే అనేక అంశాలను ఈ సర్వే పూర్తిగా విస్మరించిందన్నమాట! శిశువులు, పిల్లల మరణాల రేటైనా, కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలైనా, హెచ్ఐవిపై అవగాహన కల్పించటమైనా ఇందులో కనబడవు. అవి సర్వే చేయదగ్గ అంశాలు కాదనిపించటంలోని సహేతుకత ఏమిటో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకే తెలియాలి. ఒకవేళ వేరే గణాంకాల కోసం విడిగా సర్వే చేసివుంటే ఆ సంగతి చెప్పాలి. 2015–16 సంవత్సరంలో విడుదలైన నాలుగో నివేదికలో వంటగ్యాస్ వినియోగం 43.8 శాతం మేర ఉంటే ఆ తదుపరి సర్వే నాటికి అది 58.6 శాతానికి పెరిగిందని వెల్లడైంది. అటు తర్వాత కేంద్రం కోట్ల సంఖ్యలో అదనపు కనెక్షన్లు మంజూరు చేసింది. దాని ప్రభావం ఎలా ఉందో చూద్దామంటే ఇప్పుడది మాయం! స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్య 10 కోట్లకు చేరుకుందని 2019లో ప్రకటించి, దాన్ని కీలకమైన ఘట్టంగా చెప్పారు. తీరా తాజా నివేదిక ప్రస్తుత స్థితి ఎలా వుందో, అటుతర్వాత మెరుగుపడిందో లేదో చెప్పకుంటే ఎలా? ఇక పిల్లల్లో, మహిళల్లో రక్తహీనత ఎలా వుందన్న ప్రశ్న కూడా ఎగిరిపోయింది. గత సర్వేలో ఈ అంశానికి సంబంధించి ఏడు సూచీలున్నాయి. అయితే ఈ నివేదికలో నేరుగా నగదు బదిలీ, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక లావాదేవీలు వగైరా అంశాలున్నాయి. మంచిదే. అంత మాత్రాన ఇతర సూచీలు తొలగించటం సరికాదు. మనం చెప్పుకోవటానికైతే జీడీపీపరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో ఉన్నాం. కానీ మౌలికంగా మనది అల్పాదాయ వర్గాలు అధికంగా ఉండే దేశం. సంపద పంపిణీ రీత్యాచూస్తే జనాభాలో కేవలం 10 శాతంమంది దగ్గర దాదాపు 65 శాతం సంపద ఉండగా, వీరిలో కేవలం 1 శాతంమంది చేతుల్లో 40 శాతం సంపద ఉంది. అట్టడుగు 50 శాతం జనాభా చేతిలో కేవలం 6.4 శాతంమేర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన జోక్యాలతోనే నిరుపేద వర్గాలకు వివిధ అంశాల్లో సాయం అందించటం సాధ్యమవుతుంది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు అందుకోవాలంటే మన వర్తమాన స్థితిగతుల అధ్యయనం తప్పనిసరి. దాన్ని విస్మరించటం తెలివైన పనికాదు. -
కాలాతీత బాల్యం
‘టామ్.’ జవాబు లేదు. ‘ఒరేయ్ టామ్.’ పోలీ పెద్దమ్మ పిలుపునకు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఓ అని వినబడుతుంది. టామ్ అమెరికాలో మాత్రమే లేడుగా! వాడు ఆఫ్రికాలోనూ ఉన్నాడు, అనకాపల్లిలోనూ ఉంటాడు. అల్లరి, సాహసం కలగలిసిన ప్రతి పిల్లాడూ టామే! 1876 జూన్ 9న ‘పుట్టిన’ టామ్ సాయర్‌కు ఇప్పుడు 150 ఏళ్లు! కానీ ఆ తుంటరికి వయసనేది అయిపోతుందా? టామ్ సదాబాలుడు, సరదా బాలుడు; పోలీ పెద్దమ్మనే కాదు, సకల ప్రపంచాన్ని తన అల్లరి చేష్టలతో ఏలిన కౌబాలుడు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ నవలను మార్క్ ట్వెయిన్ కేవలం పిల్లల కోసమే రాయలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. ప్రపంచ సాహిత్య యవనికపై ఒక చిలిపి బాలుడి సాహసాలు ఇంతటి సుదీర్ఘ కాలం సజీవంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇంటి గోడకు సున్నం వేయడాన్ని కూడా ఒక కళగా మార్చి, ఇతరులతో పని చేయించుకునే తెలివితేటలున్న టామ్ నేటి మేనేజ్మెంట్ గురువులకు ఆది గురువు. ఈ నవల రాకముందు, అమెరికన్ సాహిత్యం ఎక్కువగా యూరోపియన్ శైలిని అనుకరిస్తూ, నీతి సూత్రాలతో నిండి ఉండేది. కానీ ట్వెయిన్ అమెరికన్ మాండలికాన్ని, సామాన్యుల భాషను సాహిత్య గౌరవ పీఠంపై కూర్చో బెట్టాడు. ‘ఆధునిక అమెరికన్ సాహిత్యం అంతా మార్క్ ట్వెయిన్ రాసిన ఒకే ఒక్క పుస్తకం నుండి పుట్టింది’ అని ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ (1884) నవలను కొనియాడాడు ఎర్నెస్ట్ హెమింగ్వే. ఈ నవల టామ్ సాయర్‌కు పొడిగింపు అన్నది గుర్తుంచుకుంటే దాని బీజాలు మొదటే ఉన్నాయన్నది అర్థమవుతుంది.కొన్ని కథలు రాసినా ట్వెయిన్‌కు ఇది తొలి నవల. మిసిసిపీ నది తీరాన ఉన్న హానిబాల్ గ్రామంలో గడిపిన తన సొంత బాల్య స్మృతుల నుంచే ట్వెయిన్ ఈ కథను అల్లుకున్నాడు. తనకు తెలిసిన ముగ్గురు అల్లరి పిల్లల లక్షణాలను కలిపి ‘టామ్’ను సృష్టించాడంటారు. పేరును మాత్రం లోకల్ హీరో అయిన ఒక ఫైర్‌ఫైటర్ మీదుగా స్వీకరించాడు. ట్వెయిన్‌కు అతడు స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి సాయంత్రాలు షికార్లు కొట్టేవాళ్లు. అందరికీ ఇష్టమైన హకల్‌బెరీ ఫిన్ పాత్రనేమో తన బాల్యమిత్రుడు టామ్ బ్లాంకె¯Œ షిప్ ఆధారంగా రూపొందించాడు. ట్వెయిన్ చుట్టూ ఎందరు టాములో! సిడ్ సాయర్, బెకీ థాచర్, జడ్జ్ థాచర్, జో హార్పర్, విడో డగ్లస్, ఇంజన్ జో లాంటి పాత్రలు కూడా మరిచిపోలేనివి. సినిమాలుగా, టీవీ ప్రోగ్రాములుగా, మ్యూజి కల్సుగా అలరించిన టామ్ సాయర్, టైప్‌రైటర్ మీద రాసిన తొలి నవల అని ప్రచారంలో ఉంది. కానీ అది నిజానికి ‘లైఫ్ ఆన్ ద మిసిసిపీ’ (1883) అని మరోమాట! ఇదీ మార్క్ ట్వెయిన్దే కావడం గమనార్హం.పిల్లలు కేవలం మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కాదు; వాళ్లు అల్లరి, భయం,సాహసం కలగలిసిన వాళ్లని ప్రపంచానికి చాటి చెప్పాడు ట్వెయిన్. ప్రకృతితో మమేకమవ్వడం, అన్వేషించడం నేటి పిల్లలు కోల్పోతున్న సహజ లక్షణాలు. చీకటి గుహల్లో నిధుల కోసం వెతికిన టామ్ మనకు ఇదే గుర్తు చేస్తాడు. నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్ఫోన్లకు బందీలైపోతున్న బాల్యానికి టామ్ సాయర్ ఒక తాళంచెవి. వందల ఏళ్లు గడిచినా, సమాజం ఎంత ఆధునీకరించబడినా మనుషుల్లోని అమాయ కత్వం, సాహస ప్రవృత్తి మారవు. అందుకే ‘టామ్ సాయర్’ కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బాల్యానికి నిలువుటద్దం. ఈ 150వ వేడుకల సందర్భంగా మనలోని ఆ చిలిపి టామ్ సాయర్‌ను ఒకసారి నిద్రలేపుదాం! ఈ నవలను నండూరి రామమోహనరావు (1927–2011) టామ్ మన పక్కింటి పిల్లాడే అన్నంత హాయిగా తెలుగులోకి అనువదించాడు. రచయిత నామిని తన కొడుక్కు టామ్ సాయర్ అని పేరు పెట్టుకున్నాడు. టామ్ ఎంతటి తెలుగువాడో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఈ తిరుపతి టామ్ రచయితగా మారడం ఆ టామ్‌ను కన్నమార్క్ ట్వెయిన్‌కు తగిన నివాళి. -
జగన్నామ మహానాడు!
కవిత్వంలోనూ, జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్నవాళ్లు కూడా ఎథిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్‌ను పూర్తిగా విడిచేస్తే... పైపెచ్చు, డంబాచారపు కోతలకూ, విద్వేషపు కూత లకూ మాత్రమే అంకితమైపోతే, వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే! తెలుగుదేశం పార్టీ వాళ్లు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తర్వాత చలం మాట గుర్తు కొచ్చింది. మహానాడు ఆసాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి కుహరంలో భయం బయల్దేరిందనీ, ప్రమాద ఘంటారావం మొదలైందనీ మహానాడు సన్నివేశానికి తాత్ప ర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మళ్లీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్లూ, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తున్నది? పైగా తానే అధికారంలోకి రావాలని ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేదా? తమ రెండేళ్ల అధికారాన్ని ‘మంచి’ పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయల్దేరింది.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే, జగన్మోహన్రెడ్డి నామ స్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట! కారణమేమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘనకార్యాలు ఈ రెండేళ్లలో ఏమీలేవా? జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? డెబ్బయ్ ఆరేళ్ల వయసు, యాభయ్యేళ్ల రాజకీయ జీవితం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా పదహారేళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి.ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమనాన్ని గమ్యాన్ని సమీక్షించుకునే మహా నాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిదీ గొడ్డలి? మనకు తెలిసినంతవరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. మరీ గొడ్డలి కథేంటి? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో చంపారు కనుక, అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీవాళ్లే బుద్దిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసన్నల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి వీఐపీ మర్యాదలు చేస్తున్నదెవరు? అతను అరెస్టు కాకుండా కాపాడిందెవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది.గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో ఐదారు సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయాలట! గంజాయి మీద ఉక్కు పాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని (ఎస్ఇబి) ఏర్పాటు చేసిందే జగన్ సర్కార్ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యధార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందాప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్‌బోర్డులు సిద్ధం చేశారు. వాటికి గట్టిగా ప్రచారం చేసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నదని! బెజవాడ బ్లేడ్ బ్యాచ్ గురించి, కాల్‌మనీ – సెక్స్ రాకెట్ల వ్యవహారం వెనకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు.సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట! రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్ రికార్డు ఎవరికి ఉన్నదో తెలుగు ప్రజకు తెలియనిది కాదు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జుగుప్సాకరమైన కార్టూన్లు ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్న దెవరు? మెగాస్టార్ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజ కీయ పార్టీ మీద విషప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా సుదీర్ఘమైనది. ఇక జగన్మోహన్రెడ్డి మీద గత పద్నాలుగేళ్లుగా అత్యంత హేయమైన ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు ప్రచా రాన్ని చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారం కొనసాగించడానికే వినియోగించుకున్నారు. హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని చెప్పాలట! టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలాకాలం నుంచి టీడీపీ అనుబంధ విభాగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీగానీ, వచ్చిన పార్టీగానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్సెన్స్ విషయం కదా! అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ చేసిన సేవలే ఎక్కువ. సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3–జి నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేశ్‌బాబు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలబడ్డారు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలుపడి లోకేశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో, లేని గొప్పలు చెప్పుకోవడంలో 2–జి కంటే 3–జి నాలుగాకులు ఎక్కువే చదివిందని తేలి పోయింది. జగన్నామ స్మరణే లోకేశ్ ప్రసంగం కూడా! అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ఒకటున్నది – ‘అక్క అంబా సిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్‌బాయ్, నేను లక్స్’ అంటుంది.అదే తరహాలో లోకేశ్‌బాబు కూడా జగన్ పార్టీది గొడ్డలి, మాది గూగుల్; జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేశాడు, నేను స్టాన్ ఫోర్డ్లో చదివాను’ అంటూ అథమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేసినట్టు తన కెప్పుడు కల వచ్చిందో మాత్రం చెప్పలేదు. లోకేశ్‌కు స్టాన్ ఫోర్డ్లో ఎండోమెంట్ (డొనేషన్) కోటాలో సీటొచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేశ్స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్మోహన్రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్‌ను తెచ్చుకున్నది అదానీ గ్రూప్. గూగుల్ రాకకు చంద్రబాబు – లోకేశ్‌లకు ఎటువంటి సంబంధం లేదు.సినిమాటిక్ పోలికలతో జగన్‌తో సమవుజ్జీగా నిలబడాలని లోకేశ్‌బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురు తుంది బాబూ... ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తి మంతురాలైన పార్టీ అధినేత్రిని ఎదిరించి పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి, మూడు పార్టీల కూటములను ఒక్కడిగానే ఎదురొడ్డి నిలిచిన ధీరుడు జగన్మోహన్రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తుల్లేకుండా జగన్‌ని ఎదిరించడమంటే గజగజ వణికి పోయే పరిస్థితి కూటమి పార్టీలది. గత పదిహేనేళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ అప్రెంటిస్‌షిప్ చేసిన అదృష్టం లోకేశ్‌ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవ డానికి సిద్ధపడుతున్నారాయన. జగన్ హయాంలో లక్షా ముప్పయ్ వేల సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లెయింట్ రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేశ్ విద్యామంత్రిగా నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మీద ఎన్ని వేలమంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటి స్తున్నారో గమనించండి. ట్రాక్ రికార్డు ముఖ్యం... లక్స్ – లైఫ్ బాయ్ పోలికలు కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్‌లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
ఆత్మస్తుతి – పరనింద
పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నా, వారిని కార్యసాధన దిశగా ఉరక లెత్తించాలన్నా, ఉత్సాహపరచాలన్నా అధినేతకు ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, తన కార్యాచరణపై స్పష్టత. అది రాజ్యమేలే పార్టీ అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఆ పార్టీ ప్రభుత్వం అప్పటికే ప్రజల అభ్యున్నతికోసం చాలా చేసివుండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనూ, ఇప్పుడూ దేన్నీ సక్రమంగా చేసిన చరిత్ర లేదు. విశ్వసనీయత మొదటికే లేదు. అందుకే రెండురోజుల ‘హైబ్రిడ్’ మహానాడును ప్రారంభిస్తూ బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా పరనింద, స్వోత్కర్ష దండిగా ఉన్నాయి. చేసిందేమీ లేదు గనుక... చెప్పుకోవడానికేమీ మిగల్లేదు మరి! గత ఎన్నికలకు ముందు భారీ వాణిజ్య ప్రకటనలతో, ఎస్ఎంఎస్లతో, ఊరూరా ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొట్టారు! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊరించారు. సంతకాలతో బాండ్లు రాసిచ్చారు. తీరా అమలుదగ్గరకొచ్చేసరికి అలవాటు ప్రకారం దగా చేశారు. ఆడబిడ్డ నిధి పేరిట ఆడవాళ్లందరికీ నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఆ పద్దుకింద ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 36,000. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 ఇస్తామన్న హామీ కింద ఇంతవరకూ ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 72,000. ఈ రెండు పథకాలకూ గుండుసున్నా చుట్టగా... మిగిలినవి అరకొరగా అమలు చేస్తూ వంచిస్తున్నారు. యాభైయ్యేళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తామని వాగ్దానమిచ్చి, వైఎస్ జగన్ హయాంలో ఉన్న పింఛన్‌దార్లు 66,34,372 మందిలో 6,23,079 మందికి ఎగనామం పెట్టారు. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరికి బకాయిపడ్డ మొత్తం రూ. 96,000. మహిళల కోసం తీసుకొస్తామన్న ఉచిత బస్సు పథకాన్ని తాత్సారం చేయటమేకాక, 16 కేటగిరీ బస్సుల్లో కేవలం అయిదింటికే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెబుతున్న నోటితోనే వాటిల్లో ఉచితం ఉండబోదని సెలవిస్తున్నారు. అంతేకాదు... ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఆపై 20 లక్షల మందికి కోతపెట్టి అమలు ప్రారంభించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోరకం మొత్తం వేస్తూ మోసగిస్తున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూనే తొలి ఏడాది మొండిచేయి చూపారు. రెండోఏడాది 53.52 లక్షలమంది రైతుల్లో 7 లక్షలమందికి కోతపెట్టి అరకొరగా అమలుచేశారు. రెండేళ్లకూ రూ. 40,000 ఇవ్వాల్సి వుండగా, రూ. 14,000తో సరిపెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వగైరాలన్నీ ధ్వంసం చేశారు. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పర్యవసానంగా వస్తున్న సంస్థలను తమ ఖాతాలో వేసుకోవటం, ఉన్నవాటిని తరిమే యటం బాబు ‘పారిశ్రామిక విధానం’! ఇన్ని లొసుగులుండబట్టే మహానాడును ‘హైబ్రిడ్’ చేశారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల పొదుపు పాటించదల్చుకుని ఈ మోడల్ తీసుకొచ్చామని పైకంటున్నా... కార్య కర్తలను ఒకచోట పోగేస్తే, తమ గంభీరోపన్యాసాలు విని ఊరుకోక క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో, జనం ఎలా ఛీకొడుతున్నారో ఏకరువుపెట్టే ప్రమాదం ఉందని గ్రహించటంవల్లే ఈ ఎత్తుగడ! కానీ తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షలమంది వర్చువల్‌గా పాల్గొన్నారని టీడీపీ గప్పాలు కొట్టుకుంటుండగా చాలాచోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చి ఆ పార్టీ వాలకమేమిటో బట్టబయలైంది. నియోజకవర్గానికి 7 నుంచి 10 కేంద్రాల్లో దీన్ని నిర్వహించటంవల్ల స్థానిక నేతలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 15 లక్షలు చేతిచమురు మాత్రం వదిలింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కోటా మరో పెద్ద దగా. జగన్ హయాంలో ‘అమ్మ ఒడి’ మొదలుకొని ఉద్యోగాలవరకూ... పంచాయతీరాజ్ సంస్థలు మొదలుకొని నామినేషన్ పనుల వరకూ అన్నిటా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చిన వైనం తండ్రీ కొడుకులు మరిచివుంటారు. నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గాలి మాటలతో, వెన్నుపోట్లతో, రెడ్‌బుక్ పాలనతో, హద్దులెరుగని దూషణలతో బాబు సాధించేదేమీ ఉండదు. పేలవంగా ముగిసిన వర్చువల్ మహానాడు దీన్నే చాటుతోంది. -
క్వాడ్‌లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్‌ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్‌లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్‌లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?
అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్‌గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్‌లీక్ మొదలు కొని స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్‌లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. దేశం మొత్తం ‘నీట్’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్‌ను బర్తరఫ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్‌కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్‌ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్‌ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
సాహిత్యమూ శాస్త్రమూ
‘సహితస్య భావః సాహిత్యం’ అని సాహిత్యానికి నిర్వచనం. శబ్దార్థాల సుందర సమన్వ యమే సాహిత్యం. ‘శాసనాత్ శాస్త్రం’ అని శాస్త్రానికి నిర్వచనం. శాస్త్రం – ఏదైనా విషయాన్ని బోధించి, నియంత్రించి, మార్గనిర్దేశం చేస్తుంది. సాహిత్యం మనసును తీర్చిదిద్దు తుంది. శాస్త్రం మేధస్సుకు పదును పెడుతుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర పూరకాలు. ‘సాహిత్యం, సీతాకోక చిలుకలు– ఈ రెండు మాత్రమే మనిషికి తెలిసిన తీయని అభిరుచులు’ అన్నాడు రష్యన్– అమెరికన్ రచయిత వ్లాదిమిర్ నబొకోవ్. సాహిత్యాన్నీ, సీతాకోక చిలుకలనూ ఒకే గాటన కట్టాడంటే, అతడికి ఎంతటి సౌందర్యాభిరుచి ఉండి ఉండాలి?! సాహిత్యాన్ని యాంత్రికంగా చదవడం, సాహిత్యంలోని సమస్త ప్రక్రియలను అధ్యయనం చేయడం, సాహిత్యాన్ని గురించి అనర్గళంగా ఉపన్యాసాలు చేయడం మాత్రమే చాలదు; సాహిత్యాన్ని ఆస్వాదించగలిగే లక్షణం కూడా ఉండాలి. అదే లేకపోతే, ఎంత సాహిత్యం చదివినా దండగే! సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పండిత ప్రకాండుల్లో చాలామందికి సాహిత్యాన్ని ఆస్వాదించడం చేతకాదు. అలాంటి వారిని ఉద్దేశించే, ‘అతనికి సాహిత్యం గురించి సమస్తం తెలుసు, సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలో తప్ప’ అని చెణుకు విసిరాడు అమెరికన్ రచయిత జోసెఫ్ కెల్లర్. సాహిత్యం మనోవ్యాపారం. సాహిత్యం మనిషికి విలువలు నేర్పుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. జీవితం పట్ల అవగాహన పెంచుతుంది. సాహిత్యం వల్ల భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగు తాయి. శాస్త్రం బుద్ధివ్యాపారం. శాస్త్రం మనిషికి తార్కికత నేర్పుతుంది. వాస్తవికతను నేర్పుతుంది. ప్రయోగాత్మక దృక్పథాన్ని అలవరుస్తుంది. సాంకేతిక పురోగతికి పునాదులు వేస్తుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర ప్రేరకాలు కూడా!ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలిస్తే, సాహిత్యం శాస్త్ర పురోగతికి ప్రేరణ కలిగించిన ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనిషి స్వేచ్ఛాపిపాసి. మనిషి ఊహలకు రెక్క లొచ్చి, ఆకాశం అంచుల వరకు విహరిస్తాయి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరించడానికి మనిషికి రెక్కలుంటే బాగుండు, కనీసం రెక్కల వాహనం ఏదైనా అందుబాటులో ఉండే బాగుండు అనే ఆలోచనలు పురాణకాలం నుంచే ఉన్నాయి. రామాయణంలోని పుష్పక విమానం మనకు తెలిసినదే! గ్రీకు పురాణాల్లో డెడలస్ అనే శిల్పి, అతడి కొడుకు ఇకారస్ దురదృష్టవశాత్తు చెరసాల పాలవుతారు. బందిఖానా నుంచి తనతో పాటు తన కొడుకును తప్పించడానికి డెడలస్ పక్షి ఈకలు, తేనెటీగల మైనం ఉపయోగించి మనిషి తొడుక్కోగల రెక్కలు తయారు చేస్తాడు. పురాణకాలం నాటి ఈ ఊహలు శాస్త్ర పరిశోధన లకు ప్రేరణనిచ్చాయి. తర్వాతి కాలంలో ఇటాలియన్ బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో ద వించీ ‘ఆర్నిథాప్టర్’ అనే ఎగిరే యంత్రాన్ని రూపొందించాడు. అది పెద్దగా ఫలించ లేదు. ఆ తర్వాత అమెరికన్ ఇంజినీర్లు రైట్ సోదరులు విమానాన్ని రూపొందించి, మనిషి ఊహలకు భౌతికంగా రెక్కలివ్వడంలో కృతకృత్యులయ్యారు. సాహిత్యమే లేకుంటే, మనకు విమానాలు అందుబాటులోకి వచ్చేవేనా?!ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనిషి చంద్రుడిపై కాలు మోపడానికి శతాబ్దం ముందే, ఆ ఊహను ఫ్రెంచ్ సాహితీవేత్త జూల్స్ వెర్న్ తన నవల ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్’లో రాశాడు. ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్ అణ్వాయుధాల ముప్పును తొలి అణుబాంబు దాడికి మూడు దశాబ్దాలకు ముందే తన ‘ద వరల్డ్ సెట్ ఫ్రీ’ నవలలో ఊహించాడు.శాస్త్ర పరిణామాన్ని సాహిత్యం ఊహించడం కొత్తకాదు గాని, సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే శాస్త్ర పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇటాలియన్ కవి డాంటే కావ్యం ‘డివైన్ కామెడీ’లో భూగర్భశాస్త్ర విశేషాల గురించి ఇటీవల వియన్నాలో జరిగిన యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ జనరల్ అసెంబ్లీలో ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేయడం ఇందుకు ఒక తాజా ఉదాహరణ. ‘డాంటే సాహితీవేత్త మాత్రమే కాదు, భూభౌతిక శాస్త్రవేత్త కూడా!’ అని మార్షల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ టిమోతీ బర్బరీ ఈ పరిశోధన పత్రంలో వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచంలో శాస్త్ర సాహిత్యాల సమన్వయానికి ఇదొక ముందడుగు. -
మంటలు రేపుతున్న మనువాద కూటమి
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్‌గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్‌కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్‌ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్‌ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్‌లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది.మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కాలుష్యంపై సమితి పోరు
వాతావరణ స్థితిగతులు మారి, పెను ముప్పు ముంచుకొస్తున్నా చాలా దేశాలు కళ్లు మూసుకున్నాయని గురువారం వాతావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తేటతెల్లం చేసింది. నిరుడు జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వాతావరణంపై వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చేసిన తీర్మానానికి 144 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. కానీ శిలాజ ఇంధనాలతో, తప్పుడు అభివృద్ధి నమూనాలతో కాలుష్యానికి కారణమవుతున్న అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మన దేశంతోపాటు 28 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 2015 నాటి పారిస్ ఒడంబడిక వివిధ దేశాలు ఏమేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలో నిర్దేశించినా అదంతా స్వచ్ఛందంగా అమలు చేసేది మాత్రమే. కానీ తాజా తీర్మానంతో ఆ అమలు చట్టపరమైన విధిగా మారింది. అయితే దాన్ని నిర్వర్తించమని ఒత్తిడి తెచ్చేవారెవరు?వాతావరణ మార్పులకు దారితీసే విధానాలను అవలంబించటం చట్టవిరుద్ధమనీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉద్గారాలను తగ్గించి, తన పౌరులకూ, ఇరుగు పొరుగు దేశాలకూ ముప్పు ఏర్పడకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రతి దేశానికీ ఉంటుందనీ ఐసీజే తన తీర్పులో చెప్పింది. లాభార్జనపై మాత్రమే దృష్టి పెట్టే దేశాలవల్ల ప్రజలజీవించే హక్కు, ఆరోగ్యం, ఆహారం, ఇతరేతర జీవనప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తుచేసింది. దురదృష్టమేమంటే ఐసీజే తీర్పుల్ని పాటించితీరాలన్న నియమం లేదు. అవి కేవలం నైతికబాధ్యతను మాత్రమే గుర్తుచేస్తాయి.ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇతరత్రా మార్గాల్లో చర్యలకు అవకాశం లేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకూ ఇదే వర్తిస్తుంది. ఏడాది కాలవ్యవధిలో పాకిస్తాన్, కాంగో, ఆస్ట్రియా, మధ్య యూరొప్ దేశాల్లో భారీ వరదలు సంభవించాయి. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఈ స్థాయి వరదలు రాలేదని చెబుతున్నారు. అమెరికాలో కూడా మధ్య, దక్షిణ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో టార్నెడోలు చవిచూశాయి. వేలాది ఇళ్లు నేలమట్టంకాగా, జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. పసిఫిక్ ద్వీపకల్ప దేశాలది తీరని వ్యథ. ముఖ్యంగా వనౌటు, తువాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాల సంగతలావుంచి అసలు తమ భూభాగమే కనుమరుగైపోతుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే అక్కడి భూగర్భ జలాలు ఉప్పగా మారి, తాగునీరు లభ్యత పడిపోయింది. వ్యవసాయం సాగక జనం వలసపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్‌నినో అన్ని దేశాలనూ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనీ, కరువుకాటకాలు, పెను వర్షాలు, వరదలు జనావాసాలను ముంచెత్తనున్నాయనీ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళానికి ఉత్తర భాగంలో ఉండటంవల్ల నార్వే, ఫిన్లాండ్, స్వీడన్వంటి స్కాండినేవియన్ దేశాలకు వేడి బెడద పెద్దగా ఉండదు. వీటికి ప్రామాణికమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలుండటంవల్ల వాతావరణ మార్పుల్ని తట్టుకోగలుగుతున్నాయి. స్విట్జర్లాండ్, డెన్మార్క్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలి యాలు సైతం వాటివాటి భౌగోళిక స్థానాలవల్లా, పకడ్బందీ చర్యలవల్లా సురక్షితమే. కానీ భూతాపోన్నతి పెరిగి, ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టి, మెజారిటీ దేశాలు సంక్షోభంలో పడి ఆహారగొలుసు దెబ్బతింటే అందరికీ ప్రమాదమే.అందుకే సమస్య అందరిదీ. అయితే సమితి తీర్మానం అన్ని దేశాల వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సింది. శతాబ్దాలుగా పారిశ్రామికీకరణతో వాతావరణాన్ని దెబ్బతీస్తూ, ఇప్పటికీ ఎలాంటి బాధ్యతకూ సిద్ధపడని అభివృద్ధి చెందిన దేశాలనూ... హరిత ఇంధన వ్యవస్థల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వర్థమాన దేశాలనూ ఒకేగాటన కట్టడం, ఉద్గారాల తగ్గింపునకు అవసరమైన సాంకేతికతలను చవగ్గా అందించేందుకు సంసిద్ధంకాని దేశాలను పల్లెత్తు మాట అనకపోవడం తీర్మానం లోపం. అందుకే మన దేశమూ, మరికొన్ని దేశాలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మొత్తానికి పాశ్చాత్య దేశాల్లో సైతం వాతావరణ మార్పులపై గుబులు మొదలైందని తీర్మానంపై జరిగిన ఓటింగ్ నిరూపించింది. ఎలా చూసినా ఇది మంచి పరిణామం అని చెప్పాలి. -
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు! -
స్వాగతించదగిన తీర్పు
బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కల బెడద మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు ఉదాసీనంగా ఉండటం రాజ్యానికి సాధ్యంకాదని మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకూ, జంతు ప్రేమికులకూ కళ్లు తెరిపించాలి. మనిషి ప్రాణమా, శునకాల ప్రాణమా... ఏది ప్రధానం అనే సమస్య తలెత్తినప్పుడు మానవ జీవితమే సర్వోన్నతమైనదనీ, జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ విషయంలోనూ వర్తిస్తుందనీ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పడం గమనించ దగ్గది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనలు సవ్యంగా అమలైతే ఈ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉండిపోయాయి. దాని పర్యవసానమే తాజా తీర్పు. గ్రామాలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా జనావాసాలన్నిటా శునకాలు తారసపడతాయి. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు... ఒకటేమిటి ఎక్కడికెళ్లినా వీధికుక్కల బెడద తప్పడం లేదు. అవి సవ్యంగానే ఉన్నాయా, ప్రమాదకరమైన జబ్బులతో ఉన్నాయా అని ఆరా తీసేవారుండరు. వాటి నియంత్రణ కర్తవ్యమని భావించే యంత్రాంగం ఎక్కడా కనబడదు. అలాగని వాటిని బంధించి, అత్యంత క్రూరంగా చంపటం కూడా పరిష్కారం కాదు. అనుకోని దురదృష్ట కర సంఘటన జరిగినప్పుడు మున్సిపల్ సిబ్బంది కుక్కలవేట మొదలెట్టడం, సద్దుమణి గాక ఊరుకోవటం రివాజుగా మారింది. మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నప్పుడూ, ఎవరైనా వాటిని విషాహారంతో చంపినప్పుడూ జంతు ప్రేమికులు రంగప్రవేశం చేసి కేసులు పెడతారు. ఎల్లకాలమూ ఇదిలా కొనసాగుతూనే పోవటం సరికాదు. ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడితీరాలి.కుక్కల బెడదవల్ల ఎదురయ్యే సమస్యలు తక్కువేమీ కాదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 8 కోట్ల వీధికుక్కలున్నాయి. ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమా సికంలో దాదాపు లక్షన్నర కేసులు నమోదైనట్టు అంచనా. తమిళనాడు, కర్ణాటకల్లో ఈ సంఖ్య 4.5 లక్షలవరకూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రేబిస్ వ్యాధిబారినపడి దేశ వ్యాప్తంగా ఏటా 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విష యమేమంటే... ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే కుక్కకాటు మరణాల్లో మన దేశం వాటా 36 శాతం. అందుకే ప్రమాదకర కుక్కలకు కారుణ్యమరణం ప్రసాదించ వచ్చనీ,అంత ప్రమాదంలేని వాటిని జనావాసాలనుంచి తొలగించాలనీ తీర్పు స్పష్టం చేసింది.కుక్కకాట్లవల్ల సామాన్యులకూ, ప్రభుత్వాలకూ కూడా ఆర్థికభారం తప్పడంలేదు. బాధితులకిచ్చే పీఈపీ వాక్సిన్లకూ, ఇంజక్షన్లకూ ప్రభుత్వాలు వందలకోట్లు వ్యయం చేస్తున్నాయి. అయినా వీటి లభ్యత సరిగా లేదు. బాధితుల్లో అత్యధికులు రెక్కాడితేగానీ డొక్కాడని సాధారణ జనం. చిన్నా చితకా వ్యాపారాల కోసమో, ఉపాధికోసమో వెళ్లే వారు, చెత్త ఏరుకుని జీవించేవారు. వీరంతా పనులు మానుకుని ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు. పాశ్చాత్య దేశాలు వీధికుక్కల్ని నియంత్రించి, వాటి బెడద లేకుండా చేయగలిగినప్పుడు మన దేశంలో ఎందుకు సాధ్యపడదు? ఏబీసీ నిబంధనలు పాటించని ప్రభుత్వ విభాగాలను జంతు ప్రేమికులో, మరొకరో నిలదీయరు. అది తమ బాధ్యతగా భావించరు. సమస్య ఉగ్రరూపందాల్చాక చర్యలు మొదలైతే మాత్రం ఆందోళనకు దిగుతారు. వీధికుక్కల్ని జనావాసాలనుంచి షెల్టర్లకు తరలించాలని నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని 51ఏ (జి) అధికరణం మూగజీవాలపట్ల కారుణ్యంతో మెలగాలని చెబుతోంది. దాన్ని పాటిచాల్సిందే. కానీ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగితే పట్టనట్టు ఉండకూడదు. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు ప్రభుత్వాల కర్తవ్యాన్ని గుర్తుచేయటమేకాక,అవి విఫలమైన పక్షంలో ఎలాంటి చర్యలుండాలో సూచించింది. అందుకే ఇది ఆహ్వానించదగ్గ తీర్పు. -
తీరికూర్చుని త్రిభాషా సూత్రం
దేశంలో హిందీ భాషకు ఆధిపత్య స్థానం కల్పించాలనుకుంటున్న ప్రతిసారీ దక్షిణాదిలో... ముఖ్యంగా తమిళనాడులో వివాదం తలెత్తుతుండగా కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) కొత్త ఎత్తుగడతో ఆ భాషను ప్రతిష్ఠించదల్చుకున్నట్టు కనబడుతోంది. అందువల్లే శుక్రవారంనాటి ఆ సంస్థ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా జారీ చేసినట్టు చెబుతున్న ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. అందులో ఒకటి విదేశీ భాష. మిగిలిన రెండూ ‘స్థానిక భాషలు’. త్రిభాషా సూత్రంగా పిలిచే ఈ విధానం వాస్తవానికి కొఠారీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రూపొందిన జాతీయ విద్యావిధానం–1968 నాటిదే. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నా ఏదోవంకన హిందీని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం రివాజైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలా రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నా, తమిళనాడు మాత్రం తమిళంతోపాటు ఇంగ్లిష్ బోధన ఉండే ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంది. విద్యార్థి దశలో వివిధ భాషలపట్ల ఆసక్తి, అనురక్తి పెంచి ప్రోత్సహించటంలో తప్పేం లేదు. కానీ ఆ వంకన ఒక భాష ఆధిపత్యాన్ని నెలకొల్పుదామనుకోవటమే సమస్య. ఇప్పటికైతే తల్లిదండ్రులు విద్యాసంవత్సరం మొదలై రెండునెలలు గడిచాక హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పునరాలోచన చేయకుంటే ఇది భాషా వివాదంగా మారినా మారొచ్చు. వచ్చే జూలైనుంచి అమల్లోకి రాబోతున్న ఈ విధానం సమస్యాత్మకమైనది. అన్నిటా ఇప్పటికే భాగంగా మారిన ఇంగ్లిష్‌ను ఇది ‘విదేశీ భాష’ గా గుర్తిస్తోంది. మన ప్రభుత్వాల ఉత్తరప్రత్యుత్తరాలు, జీవోలు, చట్టాలు... అన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు మొదలుకొని తీర్పులవరకూ దాని వాడకం విస్తృతం. ఇక ఐఐటీ, ఐఐఎంలాంటి ఉన్నతశ్రేణి సంస్థల్లో చెప్పనవసరం లేదు. ఉన్నత చదువులకైనా, ఉద్యోగావకాశాలకైనా అదొక తప్పనిసరి అవసరం. ఈ దశలో ఇంగ్లిష్‌ను ‘విదేశీభాష’గా గుర్తించటం వల్ల మన విద్యార్థులు జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ వంటి భాషలు నేర్చు కొనే అవకాశాన్ని కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగావున్న తీవ్ర పోటీ పర్యవసానంగా ఉద్యో గార్థులు వారి వారి రంగాల్లో నైపుణ్యం సాధిస్తే సరిపోదు. ఇంటర్వ్యూల్లో దాన్ని సమర్థ వంతంగా వ్యక్తం చేయగలగాలి. ఏ ఉత్పత్తికైనా ప్రపంచవ్యాప్త మార్కెట్ ఏర్పడిన వర్తమానంలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వస్తేనే ప్రాముఖ్యత. కానీ సీబీఎస్ఈ తీరుతో ఇంగ్లిష్ విడనాడితేనే మరో విదేశీ భాష సాధ్యం.ఉత్తరాదిన త్రిభాషా సూత్రం ఎంచక్కా అమలవుతోంది. వారు హిందీతోపాటు సంస్కృతాన్ని ‘స్థానిక భాష’గా నేర్చుకుంటారు. ‘విదేశీ భాష’గా ఇంగ్లిష్ ఉండనే ఉంది! దక్షిణాదిన మాత్రం స్థానిక భాషతోపాటు ఎంచుకోవటానికి హిందీ లేదా సంస్కృతం ఉంటాయి. సినిమాల ప్రభావంవల్ల సహజంగా అత్యధికులు హిందీని ఎంచుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలు హిందీకి దాదాపు అలవాటుపడినట్టే... అటువైపువారు సైతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఒరియావంటి భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవటం తప్పనిసరి చేస్తే వివక్ష కనబడేది కాదు. పైగా ఇటువైపువారికి ఉత్తరాదిన ఉద్యోగావ కాశాలు లభించేవి. కానీ ఆ పని చేయరు.తొమ్మిదో తరగతికి వర్తింపజేస్తూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. 6 నుంచి 8వ తరగతి వరకూ వేరే విధంగా చదివినవారు ఇప్పుడు హఠాత్తుగా సంస్కృతమో, హిందీయో నేర్చుకుతీరాలి. అసలు పాఠ్యపుస్తకాలే లేని ప్రస్తుత స్థితిలో, కీలక మలుపు అనదగిన పదో తరగతినాటికి పిల్లలంతా ఆ భాషల్లో ప్రావీణ్యత సాధించటం సాధ్యమేనా? ఇప్పటికే ఒక యూనిట్ టెస్ట్ కూడా పూర్తయింది. ‘ప్రస్తుతానికి’ తొమ్మిదో తరగతివారికి ఆరో తరగతి పాఠ్యపుస్తకం వినియోగించాలనీ, టీచర్లుండరు గనుక రిటైరైనవారి సేవలను వినియోగించుకోవాలనీ సీబీఎస్ఈ చెబుతోంది. ‘ఎలా రాసినా...’ ఆ మార్కుల్ని పట్టించుకోబోమన్న సన్నాయి నొక్కులు అదనం. కానీ అన్నిటా 90 శాతంపైగా సాధించిన విద్యార్థి మార్కుల జాబితాలో ఇదొక దిష్టిచుక్కగా మిగలదా? సీబీఎస్ఈ ఇంతకూ ఏం సాధించదల్చుకుంది? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. -
ఆమ్ రస్
బహదూర్షా జఫర్‌తో కలిసి మీర్జా గాలిబ్ తోట షికారుకు బయలుదేరాడు. తోటంటే మామిడి తోటే. అది విరగ కాసి ఉంది. మీర్జా గాలిబ్ ప్రతి పండునూ కళ్లు చికిలించి మరీ చూస్తూ ఉన్నాడు. అతని పోబడి కాసేపు పరికించి ‘ఏమిటయ్యా మీర్జా, అలా చూస్తున్నావు’ అన్నాడు జఫర్. ‘జహాపనా! ప్రతి పండు మీద తినేవాడి పేరు ఉంటుందని అంటారు. నా పేరు రాసిన పండ్లు ఏవై ఉంటాయా అని వెతుకుతున్నా’ అన్నాడు మీర్జా. జఫర్ ముచ్చటగా నవ్వి ఆ సాయంత్రం మీర్జా ఇంటికి బుట్టల కొద్ది పండ్లు పంపాడు. పేరుకు మహాకవి మీర్జా గాలిబ్... తియ్యటి మామిడి కోసం తన కవిత్వం మొత్తం ఖుర్బాన్ చేయమన్నా చేస్తాడు.బాబర్ ఇండియా మీదకు దండెత్తి వచ్చాక ‘నేను నా నేలన తిన్న తియ్యటి ద్రాక్ష ఏదీ? ఆ మధుర కర్బూజా ఫలము ఎక్కడ?’ అని ఏడ్చినంత పని చేశాడు. ‘ఊరుకో స్వామీ’ అని ఇక్కడి స్థానికులు మామిడి పండు కోసి పెట్టారు. తర్వాత బాబర్ ‘సరైన మామిడి దొరకాలేగానీ దాని అబ్బలాంటి కాయ మరేదీ లేదు’ అని బాబర్ నామాలో రాసుకున్నాడు. సరే. ‘నూర్జహాన్’ పేరు మీదే ఒక పండు అంకితం చేయబడింది. అక్బర్ మహాశయుడైతే మామిడికి దాసుడు. బిహార్‌లోని దర్భంగా దగ్గర లక్ష మామిడి చెట్లతో తోట వేశాడు. దాని పేరు ‘లఖీ బాగ్’. మొఘలులతో పని జరగాలంటే మామిడి పండ్ల బుట్ట ఇస్తే సరి అనే నానుడి ఉండేది. అందుకే అమీర్ ఖుస్రో మామిడిని ‘ఫఖర్–ఏ–గుల్షన్’... ‘తోటలకు గర్వకారణం’ అని కీర్తించాడు. కర్నూలు జిల్లా బనగాన పల్లిలో నవాబులు తమ మామిడి తోటలన్నీ శోధించి శ్రేష్ఠమైన ‘బేనిషాన్’ వెరైటీని వృద్ధి చేసి రైతులకు మొక్కలు ధారాళంగా పంచారు. ఇవాళ తింటున్న బంగినపల్లి తీపికి మొదలు అక్కడ ఉంది.మామిడి మనదే. ఆరు వేల ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఈశాన్య భారతంలో పుట్టి బౌద్ధ సన్యాసుల వల్ల, పర్షియన్ వర్తకుల వల్ల, పోర్చుగీసు వాళ్ల వల్ల ప్రపంచానికి పాకింది. ఇవాళ ఏ దేశంలో మామిడి ఉన్నా దాని వేరు మనదే. వేదాల్లో ‘ఆమ్ర’ అని ప్రస్తావన ఉందట. భూమి చుట్టడానికి బదులు తన చుట్టూ తిరిగిన వినాయకుణ్ణి మెచ్చి శివుడు మామిడి పండును బహుమతిగా ఇచ్చాడట. అంటే అది జ్ఞానఫలం. ఇక బుద్ధునికి ఆమ్రపాలి తన మామిడి తోట దానం చేయడం విదితమే. జైన మహావీరుడు 30 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ‘జ్ఞాతృఖండ వనం’ అనే మామిడితోటలో దీక్ష తీసుకున్నాడు. వినోదానికేం కొదవ? రాయలవారి తల్లికి మామిడి పండ్లు దానం చేయాలని ఉండే దట. అది తీరకనే పోయేసరికి ‘ప్రాయశ్చిత్తంగా బంగారు మామిడిపండ్లు ఇస్తేనే స్వర్గప్రాప్తి’ అని హఠాయించిన వారికి తెనాలి రామలింగడు ఇనుప కడ్డీలతో వాతబడి చేశాడని జనశ్రుతి. 2000 ఏళ్ల క్రితమే తెలుగునేలకు మామిడిగాలి సోకినా రాయలవారి కాలానికి మామిడి ఛాయ స్థిరపడింది. రాయలవారే స్వయంగా తోటలు పెంచాడు. ఆముక్తమాల్యదలో మామిడి చివురు ప్రస్తావన చేశాడు.మామిడి పండ్లు వచ్చేది ఎందుకంటే జీవితం కాసింత రసభరితం చేసుకోండయ్యా అని గుర్తు చేయడానికి. ఎండ ఉదయాన కుటుంబంతో అల్పాహారానికి కూచుని చద్దన్నంలో మామిడి రసం జుర్రుకుంటూ, వేడివేడి పూరీలను మామిడి రసంలో ముంచు కుంటూ, సువర్ణకాంతిలో మెరిసే మామిడి ముక్కల మెరుపుతో ముఖాన్ని శోభిస్తూ, జిహ్వకు స్వర్గం అందడం అంటే ఏమిటో అనుభవిస్తూ బతుకును కాస్త రుచిమధురం చేసుకోమని చెప్తుంది మామిడి కాలం. కానీ ఏమిటి చేయడం! మంచి కాయలన్నీ విదేశా లకు పంపి, కల్మష కాయలన్నీ బజారున ఒంపారు. చిన్నప్పుడు తిన్న మేలిమి రకాలెన్నో శ్రీమంతుల డైనింగ్ టేబుల్స్‌కు పరిమితమయ్యాయి. ఇటు తీపి రుచికి నోచుకోక... అటు బతుకు బాదరబందీలో కుదురు దొరక్క... రుచీ పచీ లేక మిగిలాం. గడ్డి కప్పి, మగ్గబెట్టి, వెతికి వెతికి అందుకుని తిన్న చిన్నప్పటి జ్ఞాపకం ఏమైంది?లోకాన మంచిగాని, మామిడి రుచిగాని బహు కొద్ది. అందువల్ల దొరికిన ప్రతి లిప్తను జుర్రుకోమని ఉద్బోధించే ఈ కాలానికి నమస్కరించుకుంటూ అందుకోండొక మిగలపండిన మామిడిపండు. పిల్లలకు ఇవ్వండి. మామిడి బాల్యమే తియ్యని బాల్యం. -
మెదళ్లలోకి విషపు విత్తులు!
రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో నంబర్ వన్ అనే అపఖ్యాతిని వదిలించుకొని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. ఆత్మ నిర్భర భారత్ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్‌లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకొని 14 రాష్ట్రాల్లో అరవైకి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీఎత్తున రెండు డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణరంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి – కర్నూలు ప్రాంతం కూడా ఒకటి!పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) ప్రాజెక్టుకు నిన్న (శుక్రవారం) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలనూ, సాంకేతికతనూ ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ‘ఈనాడు’ రాసింది. అతిథిగా వచ్చారు కనుక ముఖప్రీతికోసం ఆమాత్రం మాట్లాడి ఉండొచ్చు కూడా! రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎమ్ఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా? పనిలో పనిగా తమ ఎన్డీయే కూటమిలో రెండో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు.రక్షణమంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ ఇరవై మూడు నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాననీ, ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వీటివల్ల లభిస్తాయనీ పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతిచోట పదేపదే పాడుతున్నారు. ఈమధ్యనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్‌కు పాపం మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ, యాంకర్ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేశ్‌బాబు పూర్తి చేశారు.పుట్టపర్తికి వచ్చి పంచ్ డైలాగ్ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేశ్ వెల్లడించారు. పంచ్ డైలాగ్లపై పేటెంట్ హక్కు సినిమాల్లో మామయ్యదీ, రాజకీయాల్లో తనదీ అనే నమ్మకం కావచ్చు. ఇంతకీ ఆ పంచ్ డైలాగ్ ఏమిటంటే, ‘‘వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్. మనది ఫైటర్‌జెట్ బ్యాక్‌గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా రాజా’’. ఇందులో ఉన్న పంచ్ ఏమిటని వెతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి ఆత్మతృప్తి వారిది. తాను మునిగింది గంగ... తాను వలచింది రంభ... తాను విసిరింది పంచ్... అంతే! ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే, పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ రెండు భాగాలనూ చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019–24 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగైందట! అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట! ఈ లెక్కన మిగిలిన మూడేళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో ఐదేళ్ల్లకు గెలిపిస్తే సంపద సృష్టికార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు!ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా, ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తం చేయడంకోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్ చేసుకోవడంతోపాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నది. యెల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సంప్ర దాయ మీడియాతోపాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూ–ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్ బాజాను ముందుకు తీసుకొనిపోవడానికి ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి. ఈ బ్రాండింగ్ భజంత్రీల జుగల్బందీ లెక్క ప్రకారం తెలుగుదేశం అంటే అభివృద్ధి. వైసీపీ అంటే విధ్వంసం. ఎలా అని ప్రశ్నించడం అమాయకత్వం. తర్కానికి నిలబడుతుందా అనే మీమాంసతో కూడా పనిలేదు. ఈ పద జాలాన్ని ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం.ఇవాళ్టి శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పని చేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమైన తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చేతులు ఎత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్తమాన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా! ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏరకంగా మీరు అభివృద్ధికి రోల్ మోడలో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ‘నిజమైన’ అభివృద్ధి దేశంలో పట్టాలెక్కిందని మన పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు, మన మేధావులు చెబుతున్నారు. అప్పటి నుంచే లెక్కలోకి తీసుకుంటే ఈ 35 సంవత్సరాల కాలంలో ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాలపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఇప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలకు నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను వెక్కిరిస్తున్నాయి. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానిది 18వ స్థానం. మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం (28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో). నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది 8.2 శాతం. ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందనీ, అప్పుకోసం ప్రతి మంగళవారం దేహీ అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందనీ కూడా అధికారిక గణాంకాలే కుండబద్దలు కొడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేమిటి? పేదా–ధనిక వివక్ష లేకుండా, కులమతాల తేడా చూడకుండా ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య లభించాలని జగన్ మోహన్‌రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు – నేడు పేరుతో 35 వేల పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి, అందులో సగానికి పైగా పూర్తిచేసి, పిల్లలకు మంచి యూనిఫామ్‌ను కూడా ప్రభుత్వమే సమకూర్చి, పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపవుట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇంగ్లిషు మీడియంలో బోధనను ప్రారంభించి, సీబీఎస్ఈ సిలబస్ పాఠాలు చెప్పించలేదా! ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్‌లను అందజేసి, డిజిటల్ బోధనకు అంకురార్పణ చేసింది జగన్ సర్కార్ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబి సిలబస్‌ను సైతం సర్కార్ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్మోహన్రెడ్డి కాదా?టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామ చావడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈమధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కార్ బడి చదువులను చారిటీ పద్దు కిందకు మార్చడమంటే పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరం చేయడమే. పేదరికం నుంచి ఆ కుటుంబాల విముక్త మార్గాన్ని మూసివేయడమే! చదువే ప్రపంచాన్ని మార్చే పదునైన ఆయుధమని అంబేడ్కర్, పూలే, నారాయణ గురు వంటి వేగుచుక్కలే కాదు, మండేలా వంటి ఆఫ్రికన్ సూరీడు కూడా అదే మాట చెప్పారు.చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కార్ బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్ లేబర్‌గా మార్కెట్లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట! పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కనీ, అది ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతనీ ఆయన గుర్తించడం లేదు. మరోసారి నెల్సన్ మండేలాను గుర్తు చేసుకుందాము. ‘‘పేదరిక నిర్మూలన అనేది చారిటీ కాదు, అదొక ప్రాథమిక న్యాయం. పేదరికం సహజంగా ఏర్పడేది కాదు, రుద్దబడేది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన పోరాటాలు ఎంత పవిత్రమో, పేదరిక విముక్త పోరాటాలు కూడా అంతే పవిత్ర’’ మని మండేలా చెప్పారు. ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు, వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతున్నది. విద్యారంగం, వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం జగన్ విధానాలకు చోదక శక్తులైతే, ప్రైవేటుకు పెద్దపీట, ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపి స్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికా రతకు, ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరల్లేక, గింజలు కొనే నాథుడు లేక లక్షలాదిమంది రైతన్నలు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే? దీన్నే కదా విధ్వంస పాలన అనాలి?వైసీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటినుంచి ఎగురుతున్నాయి? జగన్ పాలనతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు ఆసలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకే రావడం లేదా? విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కుల మత భేదాలూ కలహాలు లేకుండా ఆకివీడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులు వేసుకొని భాయిభాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గణాంకాలను చూపకుండా, కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే, ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజా కంటకులుగా అభిశంసిస్తుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అస్పష్ట ‘శిఖరాగ్రం’!
దశాబ్దకాలంగా ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, ఇంధన రంగాల్లో పరస్పరం తలపడుతూ, వాటితోపాటే ఒకదానిపై మరొకటి అవిశ్వాసాన్ని దండిగా పెంచుకున్న రెండు అగ్ర రాజ్యాలు చర్చలకు సిద్ధపడ్డాయంటే ప్రపంచం చాలా ఆశిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం బీజింగ్ చేరుకున్నప్పుడు ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు గమనించినా, శిఖరాగ్ర సమావేశం జరిగిన గురు, శుక్రవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు చూసినా అంతా సవ్యంగా ముగిసిందని అనిపిస్తుంది. ట్రంప్‌తో వచ్చిన ప్రతినిధి బృందం సామాన్యమైనది కాదు.భిన్నరంగాల్లో ప్రపంచాన్నేలుతున్న దిగ్గజ సంస్థల చీఫ్‌లు 16 మంది ఆ బృందంలో ఉన్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్లతోపాటు ఎన్విడియా, క్వాల్కామ్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మాన్ శాక్స్, బోయింగ్, మెటా సంస్థల సీఈఓలు వారిలో కొందరు. చైనాతో అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయనీ, అవి ఇరు దేశాలకూ ఎంతో గొప్పవనీ ట్రంప్ ప్రకటించినా ఆ ఒప్పందాల వైనమేమిటో ఎవరికీ తెలియదు.బోయింగ్ సంస్థకు చెందిన 200 జెట్ విమానాలు వెంటనే, భవిష్యత్తులో మరో 750 కొనడానికి చైనా అంగీకరించిందనీ... అలాగే వందలకోట్ల డాలర్ల విలువైన సోయాబీన్స్ కొనుగోలు చేయడానికి కూడా ఒప్పుకున్నదనీ ట్రంప్ చివరిలో వివరించారు. కానీ అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ రాలేదు. లిఖితపూర్వక ఒప్పందాలు కుదిరిన దాఖలా లేదు. ప్రాథమిక చర్చలవరకూ జరిగి ఉంటాయన్నది దౌత్యరంగ నిపుణుల అభిప్రాయం. ఇరు దేశాలమధ్యా సాగిన సుంకాల యుద్ధం సామాన్యమైనది కాదు. ట్రంప్ సుంకాలు ప్రకటించిన ప్పుడల్లా చైనా దీటుగా స్పందించి ప్రతీకార సుంకాలు విధిస్తూ పోయింది. అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని చైనా నిలిపేయటంతో అమెరికా విలవిల్లా డింది. ఇక కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం రెండూ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఎన్విడియా అత్యాధునిక చిప్‌లు కావాలని చైనా కోరుతుండగా భద్రతా కారణాల రీత్యా కుదరదన్నది అమెరికా వాదన. బహుశా చైనా ఆశలు ఈడేరకపోవటంవల్ల... కొన్ని అంశాల్లో పట్టు సడలించటానికి అమెరికా నిరాకరించటంవల్ల ఒప్పందాలపై ప్రాథమిక చర్చలే సాగాయని అనుకోవాలి. కనీసం వచ్చే సెప్టెంబర్‌లో షీ అమెరికా పర్యటన నాటికైనా స్పష్టత వస్తే మంచిదే.ప్రపంచం మునుపటి తీరుగా లేదని మాత్రం ట్రంప్‌కు అర్థమై ఉంటుంది. ఎందుకంటే తైవాన్ విషయంలో తమకంటూ ఒక ‘రెడ్‌లైన్’ ఉన్నదని షీ జిన్‌పింగ్ నిర్మొహ మాటంగా చెప్పారని మీడియా అంటున్నది. అయితే తైవాన్‌పై గత వైఖరే కొనసాగుతుందని ట్రంప్‌తో వచ్చిన అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో చెప్పటం మినహా మరేదీ బయటకు రాలేదు. తమ సొంతమని చైనా చెబుతున్న తైవాన్ను స్వతంత్ర, స్వయంపాలిత, ప్రజాస్వామిక దేశంగా మనుగడ సాగించనీయాలన్నది అమెరికా వాదన.1979 నుంచి దానితో సంబంధాలు నెరపుతున్నా అవన్నీ ‘అనధికారమైనవి’. కానీ తైవాన్‌కు ఆయుధ విక్రయం జరపాలని ఇటీవల అమెరికా అనుకోవటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఈ ‘రెడ్‌లైన్’ హెచ్చరిక. ఇక ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలపైనా ఇరు దేశాలూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు పైకి అంటున్నా వాటిపైనా స్పష్టత లేదు. ఈ పర్యటన తర్వాత హార్మూజ్ వద్ద సామరస్యత ఏర్పడు తుందేమో చూడాలి.దౌత్య పరిభాషలో మర్యాదపూర్వకమైన పదాలు చాలా ఉంటాయి. అందులో రెండు దేశాలమధ్యా కుదిరిందని చెబుతున్న విజన్ కొత్తది. ‘నిర్మాణాత్మక వ్యూహాత్మక స్థిరత్వం’ అనే ఈ విజన్ అర్థం ‘పూర్తిగా స్నేహితులం కాలేకపోయినా, శత్రువులుగా మారి యుద్ధా నికి దిగొద్దు’ అన్నదే. సారాంశంలో పూర్వపు సోవియెట్ అధినేత కృశ్చేవ్ బోధించిన ‘శాంతియుత పోటీ’ వంటిది. నిజానికి ట్రంప్ పర్యటన ఆంతర్యం ఇదే. తమతో సరి సమాన స్థాయికి ఎదిగిన చైనాతో ఇరాన్, తైవాన్ ల విషయంలో స్పర్థ రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఆ పరిమితుల్లో చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమైందను కోవాలి. కానీ ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఏ మేరకు ఒదిగి ఉంటుంది... చైనా ఏ స్థాయి వరకూ తగ్గివున్నట్టు కనబడుతుందన్నది రానున్న కాలమే చెబుతుంది. -
కేరళ కిరీటం సతీశన్‌కు...
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్ సతీశన్‌కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్ మరో నాయకుడు వీడీ సతీశన్‌కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్‌కు పనికొచ్చినట్టుంది. రమేష్ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్‌లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్‌కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. -
తడబడని తొలి అడుగులు
తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి అంచనాలకూ దొరకని రీతిలో ప్రారంభమై రెండేళ్ల పాటు దాన్నే కొనసాగించి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన టీవీకే ఏలుబడి మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 22 మంది, అయిదుగురు తటస్థంగా ఉండి పోయారు. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీలు వాకౌట్ చేశాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని సమావేశం పొడవునా విజయ్ వ్యవహరించిన తీరు, విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబిస్తూ చేసిన ప్రసంగం విమర్శలకు తావీయకుండా ముగియటం గమనించదగ్గది. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పటం మద్దతుగా నిలిచిన వామపక్షాలకూ, వీసీకేకూ ఊరటనిచ్చివుంటుంది. విజయ్ అణుకువతో, ఆవేశానికి తావీయని రీతిలో ఉంటూనే చేయదల్చుకున్నది చేస్తారని ఈ సమావేశం రుజువుచేసింది. వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్డీగా నియమించటాన్ని మిత్రపక్షం వీసీకే విశ్వాస తీర్మానం సమయంలో నిలదీసి నప్పుడు విజయ్ భేషజానికి పోకుండా వెంటనే ఆ నియామకాన్ని పునస్సమీక్షిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దాన్ని రద్దుచేసినట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు వగైరాలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండొచ్చన్న నిబంధనను 500 మీటర్లకు సవరించటం, అది వెంటనే అమల్లో కొచ్చి పదులకొద్దీ దుకాణాలు మూతబడటం కూడా జనం మెచ్చే చర్య.విజయ్ రాక ఇప్పటికే ప్రధాన కూటములు, పార్టీల్లో ఊహించని ప్రకంపనలకు దారి తీసింది. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రగల ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు జనం ఆదరణ కరవై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఎన్నో సంక్షోభాల్ని తట్టుకుని నిలబడ్డ డీఎంకే–కాంగ్రెస్ కూటమి చెల్లాచెదురైంది. అందలం కోసం ఆత్రపడి కాంగ్రెస్ డీఎంకే చెలిమిని వదులుకు పోయిందిగానీ సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు అదే కూటమిలో కొనసాగుతూనే విజయ్‌కి మద్దతివ్వక తప్పని స్థితికి చేరుకున్నాయి. అన్నాడీఎంకే చీలి ఆ పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు, మాజీ సీఎం పళనిస్వామికి షాకిచ్చారు. దాంతో టీవీకేకు చిన్న పార్టీల అవసరం నిజానికి ఇప్పటికే తీరిపోయింది. ఎవరిది అసలైన అన్నాడీఎంకే అనే అంశం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా టీవీకే లేదా వ్యక్తిగతంగా విజయ్ ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండానే, గట్టి హామీలు ఇవ్వకుండానే అన్నాడీఎంకే చీలిపోయిందంటే ఎవరూ నమ్మరు. కానీ అదెక్కడా ప్రచారంలోకి రాకపోవటం విజయ్ వ్యూహచతురతకు నిదర్శనం. ద్రవిడ పార్టీలను ఎలాగైనా బలహీనపరచాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్, బీజేపీలతో అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటూనే వాటిని జనానికి చేరువ కానీయకుండా చేయటంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఇన్నాళ్లూ విజయం సాధించాయి. కానీ పార్టీకి ద్రవిడ నామం లేకుండా వచ్చిన విజయ్ సునాయాసంగా ఆ రెండు పక్షాలనూ మట్టికరిపించారు. అలాగని పెరియార్ రామస్వామి వంటివారిని ఉపేక్షించ కుండా నివాళులర్పించారు. ఆయన ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడోపక్షానికి అవకాశం ఉన్నదని నిరూపించారు. విజయ్ సినిమా ఇతివృత్తాలు కథానాయకుడు తనకెదురయ్యే అవరోధాలను ఎదుర్కొనటం అనే అంశం చుట్టూ తిరుగుతాయి. చివరగా హీరో విజయం సాధించటంతో అవి ముగుస్తాయి. గత వారం రోజుల పరిణామాలు సైతం అదే ఒరవడిలో వెళ్లాయి. నాటకీయత లేకుండా సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, చేయదల్చుకున్నది తక్షణం చేయటం ఆయనలో కనబడే ప్రత్యేక లక్షణం. దీన్నే కొనసాగిస్తే, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడిన జనాకర్షణ కాస్తా త్వరలోనే దృఢమైన పునాదిగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. -
జీరో మార్కుల ‘నీట్’!
ఉన్న ఊరునూ, అయినవాళ్లనూ వదిలి వేలాది రూపాయలు వెచ్చించి పట్టణాలు, నగరాలకొచ్చి రాత్రింబగళ్ల ధ్యాసే లేకుండా, తిండితిప్పలు పట్టించుకోకుండా ‘నీట్’ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోవటంలో తలమునకలైన లక్షలాదిమంది విద్యార్థులు మరోసారి దగా పడ్డారు. ఈ నెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీకయిందంటూ ఆ పరీక్ష కాస్తా మంగళవారం రద్దుచేశారు. విద్యార్థులు ఈ వేసవిలో మళ్లీ తిప్పలుపడాలి... కోచింగ్ కోసం మరోసారి అవస్థలు పడాలి. పోటీ పరీక్ష రాశాక ఫలితాలకన్నా ముందు లీకయిందనే వార్తలొస్తాయేమో, మళ్లీ రాయకతప్పదేమోనని కంగారుపడేంతగా ఆ వ్యవస్థను నిర్వాహకులు భ్రష్టుపట్టించారు. పదే పదే ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత! ఒకసారి జరిగిందంటే అనుకోకుండా జరిగిందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఈసారి తగిన కట్టుదిట్టాలు చేస్తారని సరిపెట్టుకోవచ్చు. ప్రతియేటా ఇదే ప్రహసనమైతే ఏమనాలి? విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించటంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి ఎప్పుడూ సున్నా మార్కులే వస్తున్నాయి.ఈసారి 22 లక్షలమందిపైగా ‘నీట్’ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశ వ్యాప్తంగా జరిగే హడావుడికి అంతులేదు. తనిఖీ పేరిట గేటువద్ద నిర్వహించే శల్య పరీక్షలతోపాటు ఆడపిల్లల ముక్కుపుడకలు, దుద్దులు మొదలుకొని పట్టాలవరకూ అన్నీ తీయించిగానీ లోపలికి పంపరు. ఒకటి రెండు నిమిషాలు లేటయ్యారని వెనక్కిపంపడం షరా మామూలు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, 5జీ జామర్ల ఆర్భాటం సరేసరి. పరీక్షార్థుల లేత ముఖాల్లో కనబడే ఆదుర్దా, వారికి తల్లిదండ్రులిచ్చే భరోసా చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారన్న వేదన కలుగుతుంది. మారుమూల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో సమాచారం రాబట్టుకునేంత సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అడుగడుగునా నిఘా నీడలు పరుచుకున్నాయని అర్థమ య్యేంతగా నిశితమైన చూపులు వెన్నాడుతుంటాయి. కానీ వాట్సాప్ మాధ్యమంలో వేలాదిమందికి ప్రశ్నపత్రం అందినా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటా వెనువెంటనే ఏ ప్రభుత్వా నికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యధిక శాతంమంది హాజరయ్యే పరీక్షల్లో ఒకటైన ‘నీట్’ను స్వచ్ఛంగా, నిర్దుష్టంగా, అవినీతిరహితంగా నిర్వహించుకోలేక పోవటం ఎంత నామర్దా! మంచికో చెడుకో ప్రజాస్వామ్యంలో ‘మెరిట్’కుండే ప్రాధాన్యత, దానికుండే గౌరవా దరాలు అపారం. ‘పుట్టకవల్లే ప్రతిభ’ అనే భావన నిరాకరించి, డబ్బుకొద్దీ చదువన్న వాదన తిరస్కరించి అందరికీ సమానావకాశాలు కల్పించటం మంచిదే. కానీ కోచింగ్ పేరిట డబ్బులు దండుకునే వ్యవస్థ వచ్చిపడింది. హాజరైనవారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేయటానికి చిక్కుముడులతో ప్రశ్నలుంటాయి. ఉండే సీట్లు తక్కువ, ఆశించే పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని సరిపెట్టుకున్నా... పరీక్ష నిర్వాహకులకూ, ప్రభుత్వాలకూ పరువుప్రతిష్ఠలపై పట్టింపు ఉండొద్దా? సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకుందామన్న తాపత్రయం కలగొద్దా? దేశవ్యాప్తంగా దాదాపు 400 మెడికల్ కళాశాలలు నిర్వహించే 40 వరకూ ప్రవేశపరీక్షలు రాయటం, అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావటం సమస్యాత్మకమవుతున్నదని 2016లో ‘నీట్’ తెచ్చి నప్పుడు చెప్పారు. వివిధ పరీక్షలకు వేర్వేరుగా సంసిద్ధం కావటంకన్నా ఒక్క పరీక్షతో ముగుస్తుందని అనేకులు సంతోషించారు. పైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ఏర్పడే సంస్థ నిర్వహించే పరీక్ష పకడ్బందీగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎప్పుడు చూసినా లీకులు, మోసాలు, అవకతవకలు! పరీక్షకు పక్షంరోజులముందే ‘ఊహాజనితమైనవ’న్న పేరిట 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో చక్కర్లుకొట్టాయనీ, అటుతర్వాత దేశమంతా వ్యాపించాయనీ వస్తున్న వార్తలు నిజమైతే అంతకన్నా ఘోరం మరొకటుండదు. విద్యారంగంలో మాఫియా ముఠాల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. లక్షలాదిమంది జీవితాకాంక్షలను చిదిమేసే లీకుల్ని అరికట్టి తీరాలన్న సంకల్పం ఇప్పటికైనా పాలకుల్లో కలిగితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదు. -
పొదుపు కాలం
ఎన్నికల హోరు సద్దుమణిగి, రాష్ట్రాలన్నిటా ప్రభుత్వాల ఏర్పాటు పూర్తికావస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ పౌరులనుద్దేశించి ఒక హెచ్చరిక లాంటి హితోపదేశం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించటానికి కోవిడ్ కాలంలో అనుసరించిన పొదుపు చర్యలు తప్పనిసరంటూ పౌరులకు సూచించారు. ఆయన చెప్పినవాటిల్లో వర్క్ ఫ్రం హోం, ప్రజారవాణా వ్యవస్థల వినియోగం, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల నిలిపివేత, విదేశీ ప్రయాణాలు మానుకోవటం, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పాటించదగ్గవే. దీనికితోడు ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు మూసేస్తారు. సోమవారం వెల్లడైన వివరాలనుబట్టి చమురు సంస్థలు రోజూ రూ. 1,700 కోట్లు నష్టపోతున్నాయని తెలుస్తోంది. గత పది రోజుల్లో మొత్తంగా నష్టాలు రూ. లక్ష కోట్ల మేర ఉన్నాయనీ దాని సారాంశం. నిజానికి ఎన్నికల ప్రచారపర్వం మధ్యలో మోదీ ఒకసారి చూచాయగా పరిస్థితి తీవ్రతను చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయనీ, పర్యవసానంగా అన్ని సరుకుల ధరవరలూ ఆకాశాన్నంటుతాయనీ విపక్షాలు ప్రచారం చేయటంతో బీజేపీ బెంబేలుపడి ఇక దాని జోలికిపోలేదు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్, అమెరికాలు దిగ్బంధించటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మన దేశం మాత్రమే వీటన్నిటికీ అతీతంగా మనుగడ సాగిస్తుందనీ, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ తట్టుకోగలదనీ భావించటం అమాయకత్వం. చైనా మొదలుకొని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలు ఇప్పటికే రక రకాల చర్యలు అమల్లోకి తెచ్చాయి. చమురు ఎగుమతులన్నీ ఆపేయాలని దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలను చైనా ఆదేశించటంతోపాటు పెట్రో ధరల్ని కూడా పెంచింది. జెట్ ఇంధనం ధరలు పెరగటంతో అక్కడి ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు సర్వీసుల్ని నిలి పేశాయి. ఫిలిప్పీన్స్ మార్చిలోనే జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉచిత సర్వీసుగా మార్చటం లేదా టికెట్ ధరలు తగ్గించటం వంటి చర్యలు తీసుకున్నాయి. సొంత వాహనాల వాడకం తగ్గించటమే దీని ఉద్దేశం. శ్రీలంక కూడా వారానికి నాలుగు రోజుల పనివిధానం ప్రకటించి, వారానికి ఒకరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతోపాటు ఇంధనంపై రేషన్ విధించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా పంతాలకు పోవటంతో 1,500 నౌకలు నిలిచిపోయాయి. అందులో మన నౌకలు 13 వరకూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ ప్రతిపా దనల్ని అమెరికా తోసిపుచ్చడంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణుగుతుందన్న ఆశ అడుగంటింది. ఉన్నకొద్దీ పరిస్థితి ముదరవచ్చు. అందుకే ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు తక్షణ కర్తవ్యం. అయితే ఈ ఆచరణ ప్రభుత్వాలపరంగా మొదలుకావాలి. ఆర్భాటాల్లేకుండా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ముగించటం, సాధ్యమైనంతవరకూ ప్రత్యేక విమానాల వాడకం ఆపేయటం, సీఎంలు, మంత్రుల కాన్వాయ్‌లలో పదులకొద్దీ వాహనాల వినియోగం వంటివి విరమించుకోవాలి. ఇక ఏపీ వరకూ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల నివాసాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వారాంతంలో ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి దుబారా అవసరమా? మన దిగుమతుల్లో బంగారం, చమురు సింహభాగం ఆక్రమిస్తాయి. 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7,200 కోట్ల డాలర్లు. మనకు అవసరమైన చమురులో 90 శాతంమేర దిగుమతి చేసుకుంటున్నాం. మొన్న ఏప్రిల్ 24కు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 69,000 కోట్ల డాలర్లయితే, ఒక్క వారంలో అంటే... ఈనెల 1 నాటికి అందులో 779 కోట్ల డాలర్లమేర హరించుకుపోయాయి. ఇదే వరస కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అయితే ఏమేరకు పొదుపు అవసరమనేది కూడా చూసుకోవాలి. అది మితిమీరినా ఆర్థికవ్యవస్థకు చేటు తప్పదు. కనుక సమతుల్యత అత్యవసరం. -
చక్రభ్రమణం
ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ... ఓహ్, ఆశకెన్ని రూపాలో! అవన్నీ మనిషిలోనే ఉన్నాయి, మనిషిని శాసిస్తూనే ఉన్నాయి; మనిషి చరిత్రను కొత్త మలుపు తిప్పుతూనే ఉన్నాయి. మనిషిలోని దురాశ హఠాత్తుగా యుద్ధవిధ్వంసాలవైపు నడిపిస్తుంది; అదే మనిషిని తిరిగి నిరాశ ఆవహిస్తుంది, అందులోంచి మళ్ళీ ఆశ మొలకెత్తుతుంది. ఇలా ఆశ,నిరాశ, దురాశ, అత్యాశల చక్రం తిరుగుతూనే ఉంటుంది. తన నిరాశను, ఆశతో జయించే ప్రయత్నంలో ఆ నిరాశకు కారణమైన వ్యక్తిని కడతేర్చడం, తిరిగి అవతలి పక్షాన్ని నిరాశ లోకి నెడుతుంది. ఏ యుద్ధంలోనైనా జరిగేది అదే. ఒకరి ఆశ, ఇంకొకరికి నిరాశ! సీతను కోల్పోయి శోకంలో మునిగిన అంతటి రామునిలోనూ ఆశాభావం నింపే బాధ్యతను తమ్ముడు లక్ష్మణుడు తీసుకున్నాడు. ‘ఉత్సాహమే బలం, ఉత్సాహవంతుడికి లోకంలో సాధించలేనిదేమీలే’ దన్నాడు. అలా మేలుకున్న ఆశతో రాముడు సాధించిన విజయం, అవతల మండోదరితో సహా రావణుని పరివారం మొత్తాన్ని శోక, నిరాశల్లో ముంచింది. అంతిమంగా జరిగింది, శోకనైరాశ్యాలు చోటు మారడమే. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందీ అదే. అయితే, తన ఆశావిజయం ధర్మరాజు శేషజీవితాన్ని శోకమయం చేసింది తప్ప ఊరటనివ్వలేదని, అదే మహాభారతం చెబుతోంది. రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన జీవనకల్లోలం మహాకవి శ్రీశ్రీని నిరాశలోకి తోసింది; ‘నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా/మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా/దారుణద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా/ బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా’ అన్న సందేహాల సందోహంలోకి నెట్టింది; ‘బతుకు వృథా, చదువు వృథా, కవిత వృథా; లేదు సుఖం, చేదువిషం జీవఫలం’ అంటూ ‘చేదుపాట’ పాడించింది. అంతలోనే ఆశ పుంజుకుని మరో ప్రపంచ మహావిష్కారం దిశగా మరో ప్రస్థానం ప్రారంభించింది. తొమ్మిది దశాబ్దాలు కావస్తున్నా, ఆ మరోప్రస్థాన గమ్యం చూపు మేరలో లేదు. జీవఫలం చేదువిషం నింపుతూనే ఉంది; దురాశ వికటించి మనిషి ప్రపంచాన్ని యుద్ధవిలయాలవైపు నడిపిస్తూనే ఉన్నాడు. ‘కాలం బందీ అయి నెత్తురోడే/ కాలం కాని ఈ కాలాల్లో కొంచెం వేచి ఉండు/ ఈ మురుగు ప్రవాహాన్ని ఇప్పుడే ఆపలేవు/ నెమ్మదిగా, నిశ్శబ్దంగా, సహనంగా/ రహస్యంగా, ధైర్యంగా, నమ్మకంగా/ మిగిలి ఉండు, వేచి ఉండు/ తప్పులను లెక్కించి లెక్కించి/ వెక్కి వెక్కి ఏడ్చి ఏమి లాభం/లే, చావులేని నూతన స్వప్నాన్ని పిలువు’ (విమల) అంటూ, ఊపిరి కడంటుతున్న ఆశకు శ్వాసపోసే కవియత్నం ఇప్పటికీ నిరవధికమవుతూనే ఉంది. ఆశల కాగడా పుచ్చుకుని నైరాశ్యపు చీకటిని తరించడానికి మనిషి స్థలకాలాలకు అతీతంగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కవి, కథకులెందరో అక్షరాల నేలలో ఆశల సేద్యం చేస్తూనే ఉన్నారు. ఓ.హెన్రీ ‘చివరి ఆకు’ కథ గుర్తుందా! ఓ దారుణ శీతర్తువులో తీవ్రంగా జబ్బుపడిన జాన్సీ అనే ఒక యువచిత్రకారిణి తన గది కిటికీ లోంచి ఓ గోడమీద పాకిన లతనే చూస్తూ, రోజురోజుకూ రాలిపోయే దాని ఆకులతో తన రోజుల్ని ముడిపెట్టుకుని ఆందోళన చెందుతుంది. చివరికి ఒక్క ఆకు మాత్రమే మిగులుతుంది. అంతలో పెద్ద గాలివాన వచ్చి వెలుస్తుంది. ఆశ్చర్యం, మరునాడు చూసేసరికి ఆకు అలాగే ఉంటుంది; దాంతో ఆమె జీవనోత్సాహాన్ని పుంజుకుంటుంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, బెయిర్మన్ అనే ఓ వృద్ధ కళాకారుడు, జాన్సీలో జీవితాశ రగిలించే బాధ్యతను మీద వేసుకుని ఆ గోడమీద వాస్తవికత ఉట్టిపడే ఒక ఆకుబొమ్మ చిత్రిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను గాలివాన ప్రభావానికి గురై జబ్బుపడి మరణించడం– కథ తిరిగిన ఓ విషాదకరమైన మలుపు. మోడువారిన చెట్లు చిగురించడం; వసంతం వెంటే గ్రీష్మం అడుగుపెట్టడం చూపించి ఆశ, నిరాశల చక్రభ్రమణం ప్రకృతిలోనే ఉందికదా, మనిషి ఎంత అనవచ్చు. కానీ ఎన్ని రంగాలలో మనిషి ప్రకృతిపై జయకేతనం ఎగురవేయడం లేదు! ఈ చక్రభ్రమణాన్ని ఛేదించలేడా? రేపటికి వాయిదా వేయకుండా ఈ రోజే ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఆశావహం చేయలేడా?! -
కోల్‌కతా టూ చెన్నయ్!
బెంగాల్ విజయంతో బీజేపీ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయినట్టే. జాతీయోద్యమ కాలంలో సమున్నతంగా రెపరెప లాడిన సాంస్కృతిక పతాకం బెంగాల్! ‘ఇవాళ బెంగాల్ ఏమని ఆలోచిస్తుందో రేపు మిగతా భారతదేశం అదే ఆలోచిస్తుంద’ని గోపాలకృష్ణ గోఖలే చేసిన ప్రశంస చరిత్ర ప్రసిద్ధమైనది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం కూడా బెంగాలే. బీజేపీ తీవ్రంగా ద్వేషించే కమ్యూనిస్టు భావ జాలానికి దేశంలో ఒక దిక్సూచి మాదిరిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు బెంగాల్ నిలబడింది. అటువంటి బెంగాల్లో అఖండ విజయాన్ని సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్నది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు, ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు.బెంగాల్ సరే, బీజేపీది చారిత్రాత్మకమైన విజయమే. మరి ఒక్క సీటే గెలిచిన తమిళనాడులో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ హైటెన్షన్ డ్రామాను నడిపించింది? అత్యధిక సంఖ్యా బలం కలిగిన విజయ్ ఐదు రోజులపాటు గవర్నర్ కటాక్షం కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పక్షం నేతను గవర్నర్ ఆహ్వానించాలనీ, శాసనసభ వేదికపై బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నీయాలనీ గతంలో సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. మెజారిటీ బలపరీక్ష జరగాల్సింది శాసనసభలో తప్ప, రాజ్‌భవన్ (లోక్ భవన్)లో కాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా, పూంఛీ కమిషన్లు కూడా ఇదే మాటను చెప్పాయి. సంప్రదాయాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 161 స్థానాలను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 140 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మెజారిటీ సీట్ల కంటే బీజేపీకి 111 సీట్లు తక్కువున్నాయి. అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ బీజేపీ నేత వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దేశ ఆర్థిక గమనాన్నే ఒక మలుపు తిప్పిన పీవీ నరసింహారావు కూడా మైనారిటీ ప్రభుత్వాన్నే చాలా కాలంపాటు నడిపారు. 240 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ 1991లో పెద్ద పార్టీగా అవతరించడంతో, మెజారిటీకి 32 సీట్లు తక్కువ ఉన్న ప్పటికీ నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రభుత్వ ఏర్పాటుకు పి.వి. నరసింహారావును ఆహ్వానించారు. 2018లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి, ప్రస్తుత తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు ఎందుకింత ధర్మం మీమాంస ఏర్పడిందో, ఎందుకు విజయ్ను పడిగాపులు పడేలా చేశారో తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.బెంగాల్ మాదిరిగానే తమిళనాడు కూడా ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రం. వర్తమాన చరిత్రలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ముందంజలో ఉన్న ఘనత దానిది. సంప్రదాయాలూ– హేతుబద్ధమైన ఆలోచనలూ సహజీవనం చేసే గతిశీలత కలిగిన ప్రాంతం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చు కున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్‌గా మారాయి.పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్, గవర్నర్ నిర్ణయం కోసం ఐదు రోజులుగా నిరీ క్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువున్నప్ప టికీ, మూడుసార్లు గవర్నర్‌ను విజయ్ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు నాలుగోసారి శనివారం సాయంత్రం 121 మంది మద్దతుదారుల జాబితాతో, వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. తమిళగ వెట్రి కళగం (విజయ్ పార్టీ)తో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళని స్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నతో ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి స్టాలిన్ అంగీకరించలేదని తెలుస్తున్నది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళని స్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజ కీయాలు నడపడం అంత తేలిక కాదని విజయ్ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉన్నది.పళని స్వామి ప్రయత్నాలేమో గానీ, ఆయన పార్టీకే ఎసరు పెట్టే పరిణామాలు శనివారం నాడు జరిగాయి. ఆయన నిర్వ హించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు గైర్హాజర య్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్ నాయకుడు ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూ పించుకునే అవకాశం విజయ్కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్‌కు అనుకూలంగా ఓటేస్తా రనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువల్లనే అటువంటి పరిస్థితి రానీయకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్ కొన సాగించారనే అభిప్రాయం ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతు న్నామనే డ్రామాను పళని స్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించ డానికి గవర్నర్ ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడితే మరో రకమైన పాజిటివ్ గేమ్‌ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టాలిన్‌తో మాట మాత్రమైనా చెప్పకుండానే విజయ్‌కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్‌కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి స్టాలిన్ ప్రయత్నించారు. స్టాలిన్‌తో సంబంధం లేకుండా విజయ్‌కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసు కున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నది.స్టాలిన్ సలహా మేరకే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూ ఎంఎల్ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకే స్టాలిన్ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉన్నది. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నదనే వార్తలు కూడా శనివారం వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను సమర్పించింది. లోపాయికారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలి యదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్‌కు లైన్ క్లియర్ అయింది.ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకొని వేసిన ఎత్తులు స్టాలిన్ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇకముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదేళ్లపాటు విరామమెరుగని పోరాటం చేసి బెంగాల్‌ను గెలుచుకున్న బీజేపీ తమిళనాడుపై ఆశలు వదులుకుంటుందని భావించలేము. శనివారం కోల్‌కతాలో జరిగిన సువేందు ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సోమవారం నాడు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తున్నది. సరిగ్గా వెయ్యేళ్ల కింద భారత్ పైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ భద్రపరిచిన అపార ధనరాశిని కొల్లగొట్టాడని చరిత్ర చెబుతున్నది. మహమ్మదీయ దాడులు ఈ ఆలయంపై పలుమార్లు జరిగాయని కూడా చరిత్ర లిఖించింది.మత దురహంకారాలు, విద్వేషాలు చెలరేగిన మధ్య యుగాల నాటి పరిస్థితికి సోమనాథ్ ఆలయ విధ్వంసం ఒక ప్రతీక. ఈ గజనీల లక్ష్యం కేవలం సంపద లూటీ మాత్రమే కాదనీ, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయటం కూడా వాటి ధ్యేయ మనీ అల్బెరూనీ అనే పర్షియన్ పండితుడు తన రచనల్లో విశ్లే షించాడు. ఇదంతా వెయ్యేళ్లనాటి మాట. మతమౌఢ్యాలు రాజ్య మేలిన నాటి పరిస్థితి. ఈ వెయ్యేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశం లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నది. ఈ నేపథ్యంలో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని దేశవ్యాప్తంగా అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ ప్రకటనలను గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే సోమనాథ్ ఆలయానికి హిందూ సమాజంలో విశిష్ట స్థానం ఉన్నది.దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా సోమనాథ్ ప్రసిద్ధి చెందింది. బెంగాల్లో విజయం అనే ఒక చారిత్రకమైన మైలురాయిని బీజేపీ దాటిన వెంటనే సోమనాథ్ ఆలయ సందర్భం రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ జాతీయతను, మతాన్ని కలగా పులగం చేసే బీజేపీ రాజకీయ వ్యూహానికి ఉపకరించే విధంగానే ఈ సందర్భాన్ని బీజేపీ మలుచుకుంటున్నది. రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని బలహీనపరచడంతో పాటు తన సైద్ధాంతిక విరో ధులైన కమ్యూనిస్టుల భావజాలాన్ని కూడా తుడిచేశామన్న ఆనందం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 డెడ్‌లైన్ పెట్టి మరీ బుల్లెట్ కమ్యూనిస్టులను అణచివేశామనీ, కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో బ్యాలెట్ కమ్యూనిస్టులు కూడా అంతరించినట్టేననీ వారు భావిస్తున్నారు. ప్రధాని కూడా తన మనోగతాన్ని దాచుకోలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగానే ప్రపంచంలోనూ, దేశంలోనూ, అడవుల్లోనూ కమ్యూనిస్టులు అంతరించారని మొన్నటి విజయోత్సవ సభలో ప్రకటించారు. బహుశా ఈ సంగతి డోనాల్డ్ ట్రంప్‌కు తెలిసినట్టు లేదు. మమ్దానీ వంటి సోషల్ డెమోక్రాట్లను చూసి కూడా కమ్యూనిస్టులున్నారని ఆయన కంగారు పడుతున్నారు. కోల్ కతా, చెన్నయ్ నగరాల్లో శనివారం నాడు ఆవిష్కృతమైన రెండు సన్నివేశాలు బీజేపీ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. కోల్‌కతాలో అంతా అంగరంగ వైభోగం. చెన్నయ్‌లో విజేతకు ఆఖరి నిమిషం దాకా అంతులేని టెన్షన్. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్‌ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్‌కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్‌భవన్‌లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్‌కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్‌కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
కల్లోల కాలంలో శిఖరాగ్రం!
ప్రపంచం పెనుసంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో శుక్రవారం ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఏసియాన్) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు గురువారం ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ సంక్షోభ స్థితి గురించీ, దాన్ని అధిగమించటానికి గల మార్గాల గురించీ స్థూలంగా చర్చించారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా పశ్చిమాసియాలో ప్రతిష్టంభన ఏర్పడి, ఇంధన సంక్షోభం చుట్టుముడుతోంది. ఈ సంస్థలోని 11 సభ్య దేశాలూ ఇంధన దిగుమతులపై ఆధారపడినవే. ఈ ప్రతిష్టంభన వల్ల ఆహార సరఫరా మార్గాలు సైతం మూసుకుపోయాయి. వీటి జనాభా మొత్తంగా 70 కోట్లు. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతోపాటు ఆహార పదార్థాల, సరుకుల లభ్యత గణనీయంగా పడిపోతుందనీ, ప్రాణావసర ఔషధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతారనీ ఆసియాన్ దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి. అర్థరహితమైన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో తన తొలి ఏలుబడిలోనే డోనాల్డ్ ట్రంప్ స్వీయరక్షణ చర్యలు మొదలెట్టారు. రెండోసారి దాన్ని మరింత ముమ్మరం చేయటంతో పాటు స్వపర భేదం లేకుండా అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలన్నిటినీ బెంబేలెత్తించారు. దాన్ని తట్టుకోవటం ఎలాగన్న మీమాంసలో అందరూ పడిన తరుణంలో గ్రీన్ ల్యాండ్ సొంతం చేసుకుంటామనీ, కెనడాను విలీనం చేసుకుంటామనీ బెదిరింపులు ప్రారంభించారు. కెనడాలో నిరుడు ఎన్నికల తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్ కెర్నీ ‘త్వరలోనే మా 51వ రాష్ట్ర గవర్నర్ అవుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక వెనెజులా వ్యవహారం అత్యంత దారుణమైనది. ఆ దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించి తీసుకొచ్చి అమెరికాలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి విచారిస్తు న్నారు. ఇక ఇరాన్‌పై 68 రోజుల క్రితం అకారణంగా యుద్ధానికి దిగారు.ఇరాన్‌కు ఒకే ఒక పేజీలో తాజా ప్రతిపాదనలు పంపామనీ, దానిపై ఆ దేశం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయనీ అమెరికా చెబుతోంది. ఇది కేవలం ఏసియాన్ శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని, దాన్ని మభ్యపెట్టేందుకు సాగిస్తున్న కపట నాటకమా లేక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ తాజా ప్రతిపాదనలన్నీ ఒబామా హయాంలో 2015 జూలైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ’ పేరిట ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయంటున్నారు. గత ఏలుబడిలో అది పనికిమాలిన ఒప్పందమంటూ బుట్టదాఖలా చేసింది ట్రంపే. సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా దివాలా తీస్తుందన్న భయంతో కాళ్లబేరానికొస్తే మంచిదే. ఏసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3,80,000 కోట్ల డాలర్లు. ఇది కాస్తా దిగజారడం మొదలైందంటే... పొదుపు చర్యల అమలు తప్పనిసరైతే ఎక్కడి కక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తి ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చాన్నాళ్లుగా ఫిలిప్పీన్స్ ప్రాంతీయ చమురు పంపకం ప్రతిపాదన చేస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి గనుక ఇలాంటి సహకారం సంక్షోభాన్ని నివారిస్తుందన్నది ఆ ప్రతిపాదన సారాంశం. కానీ పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంతత నెలకొనడం తప్ప మరేదీ పరిష్కారం కాదు. మిగిలినవన్నీ తాత్కాలిక ఉపశ మనాలే. దీర్ఘకాలం కొనసాగించటానికి పనికొచ్చేవి కాదు. అమెరికా చాటున అణిగి మణిగి ఉండే పాత రోజులు అంతరించాయనీ, గట్టిగా నిలబడి స్వరం పెంచితేనే ఏదో మేరకు ఆ దేశం దిగొస్తుందనీ ఏసియాన్ గుర్తించాలి. అదే సమయంలో ఆహారం,ఇంధనం, వాణిజ్యం అంశాల్లో ఇతర ప్రాంతీయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. వాటి సహకారం పొందాలి. తమ వంతు సాయం అందించాలి. ఏసియాన్‌తో భారత్ వాణిజ్యం సరిగా లేదు. ఆ దేశాలనుంచి వచ్చే దిగుమతులతో పోలిస్తే, అక్కడికి మన ఎగుమతులు చాలా తక్కువున్నాయి. ఈ వాణిజ్యలోటు 2023 నాటికి 4,400 కోట్ల డాలర్లుంది. ఇలాంటి లోటుపాట్లన్నిటినీ సరిచేసుకుంటేనే ఏసియాన్ అన్ని రకాల సంక్షోభాలనూ దృఢంగా ఎదుర్కొనగలుగుతుందని శుక్రవారం జరగబోయే దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గుర్తించాల్సి ఉంది. -
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి. పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?సర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
అందమైన నివాసం
మనిషికి ఆకాశంలోకి ఎగరాలన్న కాంక్ష పుట్టించేది పక్షి కాదు, తారలు కూడా కాదు, చదమామ! కథలు వినాలన్న ఆసక్తి పుట్టించడంలో నానమ్మ పాత్ర ఎంతో చందమామదీ అంతే. చందమామే ఒక కథ. ఒక కవిత కూడా. ఒక అందమైన స్త్రీ ఎలాంటి కవితావేశాన్ని కలిగిస్తుందో, నిండు చందమామ అలాంటి భావావేశాన్ని పుట్టిస్తుంది. అందుకే చందమామను తన అక్షరాల్లోకి ఒడిసిపట్టని భావకవులు ఉండరు. అసలు ఏ కవికైనా తన తొలి కవితకు సరంజామా ఇవ్వగలిగేది చందమామ కాక ఇంకేమిటి? అది మనిషికి ఎంత దూరమో అంత దగ్గర. ఈ నట్టనడి ఎండల్లో చంద్రుడి తలంపే మనకు చల్లని గొడుగు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని తిలక్ అన్నప్పుడు ఈ వాక్యానికి అందం అందమైన ఆడపిల్లల వల్లే రాలేదు; వాళ్లు వెన్నెల్లో ఆడుకోవడం వల్ల వచ్చింది. చంద్రుడిని తలుచుకుంటేనే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక రహస్యోద్వేగం. అని మనిషిని మెలకువలోంచి కలల్లోకి మేలుకొలిపే మార్మిక మంత్రదండం. ఒంటరి ప్రయాణీకుడికి చందమామే దారి దీపం. అనంత చీకటిమయ ఆకాశాన్ని సజీవ మూర్తిగా నిలబెట్టేది దానికి రెండో కన్నుగా ఉండే చందమామే. పౌర్ణమికి దినదిన ప్రవర్ధమానమవుతూ, అమవసకు అంతా కోల్పోయినట్టవుతూ మనిషి జీవిత చక్రాన్ని ఇది గుర్తుచేస్తుంది. అన్ని మతాల్లోనూ, సంస్కృతుల్లోనూ చంద్రుడి చుట్టూ ముడివడి ఎన్నో పండుగలున్నాయి. అసలు శరదృతువులో పౌర్ణమిని చూడటమే ఒక పండుగ!చైనా భావకవితోద్యమానికి మార్గదర్శిగా చెప్పే లీ తై–పో క్రీ.శ. 699–705 ప్రాంతంలో జన్మించాడు. పదేళ్లకే కన్ఫ్యూసియస్ పుస్తకాలన్నీ చదివేశాడు. దేశమంతా తిరిగాడు. రాజప్రాసాదాల్లోనూ జీవించాడు, గుహల్లోనూ నిద్రించాడు. మద్యం, మగువ, కవిత్వం ఆయనకు ప్రాణాధారం. వెనుక సంచీలో పుస్తకాలు, అంగీ మడతలో గుప్తంగా పిడిబాకు, అరచేతిలో సిద్ధంగా కవిత– ఇదీ ఆయన వేషం. ఒకరోజు తాగిన మత్తులో సరస్సులోని చంద్రుడి బింబాన్ని కౌగిలించుకోబోయి మరణించాడని చెబుతారు. ఎలాంటి భావకవి! ర్యోకన్ తైగు అనే జెన్ గురువు గుడిసెలోకి ఒక దొంగ వచ్చాడట. తన దుస్తులు సహా దొంగకు ఒలిచి ఇచ్చేశాడు గురువు. దొంగ వెళ్లిపోయిన తర్వాత, ఒంటి మీద నూలుపోగైనా లేకుండా నిండుగా వెలుగుతున్న చందమామను కిటికీలోంచి చూస్తూ కూర్చున్న గురువు, అంతటి అందమామను దొంగకు ఇవ్వలేకపోయినందుకు నొచ్చుకున్నాడట! దొంగలు మన దగ్గరినుంచి ఎత్తుకెళ్లలేనిది మన విద్య, వివేకాలనే కాదు, మనకున్న చందమామను కూడా! ఒక్క చంద్రుడుని నిండుగా ఆనందించగలిగే హృదయముంటే ఎన్ని పూటల భోజనానికి పడే ఆరాటం తప్పుతుంది! ఇటాలో కాల్వీనో కథా ప్రపంచంలోనైతే చందమామ మీదికి నిచ్చెన వేసుకుని ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. అక్కడి మీగడ చిక్కదనపు పాలను లోడుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే!గ్రీకు ప్రకృతి దేవత మీదుగా నామకరణం చేసి, చంద్రుడి మీదకు ‘నాసా’ పంపిన వ్యోమనౌక ఆర్టెమిస్–2 ఏప్రిల్ 1–11 వరకు తిరుగాడి భూమ్మీదకు తిరిగొచ్చింది. భూమి నుంచి అంతరిక్షంలోకి సుదూరం పయనించి గతంలోని ‘అపోలో’ రికార్డును ఇది బద్దలుకొట్టింది. అన్నట్టూ అపోలో, ఆర్టెమిస్ గ్రీకు పురాణంలో కవల సోదరీమణులు. మొదలైనప్పటినుంచీ తిరిగొచ్చేదాకా 6,95,081 మైళ్లు ప్రయాణించిన ఆర్టెమిస్–2 అంతరిక్షంలోకి సుదూరంగా వెళ్లే వ్యోమగాములకు అవసరమైన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని నిర్ధారించేందుకు ఉద్దేశించినది. వస్తూవస్తూ సాక్ష్యంగా కొన్ని ఫొటోలను తెచ్చింది. వాటిని చూస్తే, చంద్రుడి మీద వెన్నెల మీగడలు ఏమీ లేవని తెలియడం ఒకింత కాల్పనిక నిరాశ. ఇది మామూలు భూమిలానే ఉందని తెలియడం ఒక వాస్తవం. కానీ చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలంగా నివసించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కావడం సాంకేతిక సంభ్రమం. -
బెంగాల్లో ‘ఎగ్జిట్’ డెమోక్రసీ?
బెంగాల్‌ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్‌కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్వైజర్ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్ కోసం మరో ఆదేశం జారీ అయింది.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్ఆర్ ఖన్నా, పిఎన్ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.ఇప్పుడు ప్రణయ్‌రాయ్ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత సూపర్ హిట్ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్‌రాయ్ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్రాయ్లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్ మాదిరిగా సెల్‌ఫోన్ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సక్సెస్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్ మై ఇండియా’కు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్ ఎగ్జిట్ పోల్‌ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్డీ ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్‌పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్ మై ఇండియా, కీలకమైన బెంగాల్ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్ గుప్తా బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?ఒక్క బెంగాల్‌కు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్లోనే ‘సర్’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్ భావిస్తున్నది. బెంగాల్ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్‌కు తోడు బెంగాల్‌ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్‌లో ఇంగ్లిష్ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్‌ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్‌ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్‌పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్‌తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షరాలా నిప్పుల కొలిమి
ప్రతియేటా ఇంచుమించు మే నెల మొదటి వారానికిగానీ ఉగ్రరూపం దాల్చని మార్తాండుడు ఈసారి ఫిబ్రవరి నెలాఖరునాటికే చెలరేగడం మొదలెట్టాడు. ముందే రావటం, దీర్ఘకాలం తిష్టవేయటం కొన్నాళ్లుగా కనబడుతున్నా ఈ స్థాయిలో ఎండలు మండిపోవటం ఇదే తొలిసారి. మన దేశంలో రుతువులు గతి తప్పి చాన్నాళ్లయింది. గతంలో పొద్దుటిపూట ఒక రకం, రాత్రికి మరో రకం వాతావరణం దర్శనమిచ్చేవి. ఎంత ఎండాకాలమైనా రాత్రికి ఎటునుంచో వచ్చి చల్లని గాలులు తాకేవి. సేదతీర్చేవి. ఇప్పుడు రాత్రింబగళ్లు తేడా లేదు. వేడిగాలుల వెనకే హఠాత్తుగా వాతావరణం మారి, జల్లులు మొదలై వడగళ్లు పడటం రివాజుగా మారింది. అటు తర్వాత కాసేపటికే ఉక్కబోత మొదలవుతోంది. ప్రకృతికి సంబంధించినంతవరకూ ఉత్తర దక్షిణాలన్న తేడా... మధ్య, పశ్చిమ భారత్లన్న వ్యత్యాసం లేదు. వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నదాన్నిబట్టి ప్రస్తుతం 23 రాష్ట్రాలకు వడగాడ్పుల తాకిడి ఉంది. అందులో డజనుకుపైగా తీవ్ర వడగాడ్పులను చవిచూస్తున్నాయి.వందలాది నగరాలు భరించలేనంత ఉక్కబోతతో విలవిల్లాడుతున్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలూ ఇప్పటికైతే ఈ సమస్యకు దూరంగా ఉంటున్నాయి. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల పర్యవసానంగా భవిష్యత్తులో ఇవి సైతం భానుడి ప్రతాపాన్ని చవిచూడకతప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలకన్నా కనీసం 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువుంటే, అది వరసగా రెండ్రోజులు కొనసాగితే వడగాడ్పులు వీస్తున్నట్టు లెక్కేస్తారు. అది 7 డిగ్రీల సెల్సియస్‌కి మించి పెరిగితే తీవ్ర వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఒక ప్రాంతం మైదానమా, కొండలతో ఉందా అనే అంశాన్ని కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. బొంబాయి ఐఐటీ ఇటీవల చేసిన అధ్యయనంలో గంగా–సింధు మైదానం (ఉత్తర భారతం)లో వేడిగాలులకు స్థానిక నేలలు, ఇతర వాతావరణ పరిస్థితులు కారణమని తేల్చింది. వెలుపలినుంచి వచ్చే వేడిగాలులే ఇందుకు దోహదపడుతున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత పెరగడంతో వేడిగాలులు భూ ఉపరితలానికి దగ్గరగా ఉండిపోతున్నాయి. నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారురోడ్లు పగలంతా తీవ్ర ఉష్ణోగ్రతను స్వీకరించి, రాత్రికి సైతం సెగలు కక్కుతూనేవుంటున్నాయి. అందుకే ఇంతచేటు తీవ్రత!వరదలు, తుపానులు, భూకంపాల్లాగే వడగాడ్పులు కూడా ప్రకృతి వైపరీత్యమే. కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. వడగాడ్పులవల్ల ఏటా వందలాది మరణాలు సంభవిస్తున్నా, ఆ విధంగా లెక్కేయటానికి తగిన విధానం రూపొందలేదు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ లేదా అంతకన్నా ఎక్కువకు చేరి, శరీరంలో చెమట పట్టడం ఆగిపోయి చర్మం పొడిబారి ఎర్రగా మారితే, స్పృహ కోల్పోవటం లేదా మతిస్థిమితం తప్పడం, మూర్ఛరావడం వంటివి కనబడితే వడగాడ్పు మరణమని చెబుతారు.వీటికితోడు బాధితుడున్న ప్రాంతంలో వడగాలుల హెచ్చరిక ఉందా, అతను మరణించటానికి ముందు ఎండలో పనిచేశాడా లేదా అనేవి కూడా చూస్తారు. ఆ తర్వాతే వడగాడ్పు మరణంగా నిర్ధారిస్తారు. గుండెజబ్బు వగైరాలున్నా, వృద్ధాప్యంలో ఉన్నా ఆ జాబితాలో లెక్కేయరు. ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరి మారాలి. వేసవిలో మరణాల రేటు గత కొన్నేళ్లలో ఎలావుందో చూసే విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఆ కొలమానాన్ని తీసుకోవటం లేదు?పదహారో ఆర్థిక సంఘం నిరుడు ఇచ్చిన నివేదికలో వడగాడ్పుల్ని, పిడుగుపాటుల్ని కూడా ప్రకృతి విపత్తులుగా పరిగణించాలని కోరింది. చాలా రాష్ట్రాలు ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాయి. అలా లెక్కేస్తే అందుకు సంబంధించిన నిధుల్ని సహాయ కార్యక్రమాల కోసం వ్యయం చేయటానికి, బాధితులకు తక్షణ సాయం అందించటానికి వీలవుతుంది. వడగాడ్పులున్న ప్రాంతాల్లో భవన నిర్మాణం, సాగుపనుల సమయాలను మార్చటానికి, విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళల్ని సవరించటానికి వీలవుతుంది. అందుకే ప్రభుత్వాలు తక్షణం కదలాలి. అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. జనం ప్రాణాలు కాపాడాలి. -
ఫిరాయింపులు... ప్రశ్నలు!
ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకోవటంతో ఫిరాయింపుల చట్టం ప్రహసనప్రాయమని మరోసారి తేలిపోయింది. బహుశా ఎన్నికల ముంగిట్లోవున్న పంజాబ్‌లో రేపో మాపో ఆప్ ప్రభుత్వానికీ ఇలాంటి గండం తప్పకపోవచ్చు. ఆప్ పుట్టుక, ఎదుగుదల భిన్నమైనవి. 2011–12 మధ్య దేశంలో హోరెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన కొద్దిమంది రాజకీయేతర నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ఆయన మాదిరే పూర్వాశ్రమంలో ఉన్నతోద్యోగ వర్గంలో, భిన్న సామాజిక రంగాల్లో పనిచేసి కొన్ని ఆదర్శాలు నమ్మి వచ్చినవారు చాలామంది ఉన్నారు. ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యాలతో ఎదిగి, స్వల్పకాలంలోనే మధ్యతరగతిలో పాతుకుపోయిన ఆ పార్టీ అచిరకాలంలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ సారథుల్లో భిన్నాంశాలపై అప్పటికే ఉన్న మౌలిక విభేదాలు పలు నిష్క్రమణలకు దారితీశాయి. శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అడ్మిరల్ రాందాస్ వంటి లబ్ధప్రతిష్టులైనవారిని కీలక పదవులనుంచి తప్పించారు. కొందరు వారికై వారు తప్పుకున్నారు. అటు తర్వాత మధ్యలో అడపా దడపా ఒకరిద్దరు నేతలు నిష్క్రమించినా ఇప్పుడు రాఘవ్ చడ్డా కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఒక సమస్య విషయంలో పార్టీ వైఖరితో ఏకీభావం లేనప్పుడూ, దాని సిద్ధాంతాలు దారితప్పుతున్నాయనుకున్నప్పుడూ బయటకుపోతే ఎవరూ తప్పుబట్టరు. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ, గంభీరమైన ఉపన్యాసాలిస్తూ కాస్తయినా నైతికత పాటించాలన్న స్పృహ లేనివారిని జనం చీదరించుకుంటారు. ఒక సాధారణ గుమాస్తా సంస్థ నుంచి తప్పుకుంటే మూణ్ణెల్ల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉంటుంది. లేకుంటే సంస్థలు వాటి పద్ధతిలో అవి చర్య తీసుకుంటాయి. ప్రజానీకం సమస్యల్ని చర్చిస్తూ వారి సంక్షేమానికీ, భద్రతకూ అవసరమైన చట్టాలు తీసుకొచ్చే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాల్సినవారికి మాత్రం ఏ నిబంధనా ఉండొద్దా? వారి ప్రవర్తన నలుగురికీ ఆదర్శప్రాయం కావొద్దా?రాజీవ్ గాంధీ హయాంలో 1985లో ఈ ఫిరాయింపుల జాడ్యాన్ని వదిలిస్తామంటూ 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ చేర్చారు. కానీ అది ఎందుకూ కొరగాకుండా పోయిందని తేలిన చాన్నాళ్ల తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అందులో కేవలం లెజిస్లేచర్ పార్టీలో మూడింట రెండొంతుల మంది తప్పుకుని వేరే పార్టీలో విలీనమైతే సరిపోదనీ, ఆ చీలిక, విలీనం పార్టీ స్థాయిలో కూడా కనబడాలనీ నిర్దేశించింది. దురదృష్టమేమంటే... ఈ ప్రాతిపదికన ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని మన న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు లేవు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని సభాధ్యక్షుల దగ్గర ఫిర్యాదులైతే దాఖలవుతున్నాయి. కానీ వాటిపై వేగంగా నిర్ణయం తీసుకున్న ఉదంతాలు లేవు. సుప్రీంకోర్టు గడువు విధించటంతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ బీఆర్ఎస్ వినతుల్ని ఆయన తోసిపుచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభలోనూ, ఏపీ అసెంబ్లీలోనూ చేసిన ఫిర్యాదులు తేలకుండానే ఆ సభల పదవీకాలం ముగిసిపోయింది. ఫిరాయించటానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఏపీలో ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా అయిదేళ్లకు మించి గడువున్న ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయారు. ఆ తర్వాత వారిలో కొందరు బీజేపీ, టీడీపీల పంచన ‘ఎన్నికయ్యారు’. నైతిక విలువలు లేకపోవటమే పెద్ద అర్హతగా మారిన వర్తమానంలో ఇలాంటి వెర్రిమొర్రి పోకడలు కనబడటం వింతేం కాదు. రాఘవ్ చడ్డా నిష్క్రమించదల్చుకున్నప్పటి నుంచీ మధ్యతరగతి పెను సమస్యలుగా భావించేవాటిని సభలో ప్రస్తావించటం, వాటిల్లో కొత్తేం లేకపోయినా అవి వైరల్ కావటం వెనకున్న సారాంశం చాలామంది గ్రహించకపోలేదు. ఏదేమైనా ఫిరాయింపులకు కళ్లెం పడనంత కాలమూ, ఈ గోడ దూకుళ్లు ఆగనంత కాలమూ మన ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండదు. -
ఉబుసుపోని పనులు
ఉబుసుపోని మనుషులు రకరకాల పనులు చేస్తారు. ఉబుసుపోని పనులకు అర్థం, పరమార్థం ఉండవు. ఉబుసుపోని మనుషులు నలుగురూ ఒకే చోటుకు చేరితే పోసుకోలు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కుదిరితే చతుర్ముఖ పారాయణాన్ని ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉబుసుపోని మనుషులు– అభిరుచి మేరకు పుస్తక పఠనంలోనో, కళాసాధనలోనో నిమగ్నమవుతారు. అంతటి అభిరుచులేవీ లేకుంటే, ఊరకే పడక్కుర్చీలో కూర్చునో, మంచంమీద వాలిపోయో పగటికలలు కంటారు. ఉబుసుపోని మనుషులకు పొరపాటున అదృష్టం బాగుండని అర్భక శ్రోతలెవరైనా దొరికితే, ఆవకాయ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు అనర్గళంగా ప్రసంగించి, మేధాప్రదర్శన చేస్తారు. ఉబుసుపోని మనుషులు ఇది చేస్తారు, అది చేయరని నియమాలేమీ లేవు. ఉబుసుపోని సందర్భాల్లో మనుషులు తమ బుద్ధికి తోచిన పనులు చేస్తారు.ఉబుసుపోనితనం, దానివల్ల కలిగే విసుగు మనిషిని కుదురుగా ఉండనివ్వవు. రోజులు రొడ్డగొట్టుడుగా మారిపోయినప్పుడు; దినచర్యలో మార్పు లేనప్పుడు; జీవితంలో ఉత్తేజం లోపించినప్పుడు; బతుకు బొత్తిగా నిరర్థకంగా మారిపోయిందని అనిపించినప్పుడు– మనిషికి ఉబుసుపోనితనం ఏర్పడుతుంది. దానివల్ల విసుగు పుడుతుంది. విరామ సమయాలను అర్థవంతంగా గడపలేని దుఃస్థితి తటస్థిస్తుంది. విశ్రాంతి మనశ్శాంతిని ఇవ్వలేని పరిస్థితి వాటిల్లుతుంది. ఉబుసుపోనితనం గురించి తత్త్వవేత్తలు, మనస్తత్త్వవేత్తలు, సాహితీవేత్తలు అనేక నిర్వచనాలను ఇచ్చారు. కొందరు ఉబుసుపోనితనంలోని సానుకూలతలను చూశారు. ఇంకొందరు ఉబుసుపోనితనాన్ని బూచిలా చూశారు. ఆధునిక మానసికశాస్త్ర పరిశోధకులు ఉబుసుపోనితనం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగిస్తున్నారు. ‘ఉబుసుపోనితనం నైతికవాదులకు ఒక గడ్డు సమస్య. నిజానికి లోకంలో జరిగే సగానికి సగం పాపాలు ఉబుసుపోనితనం పట్ల భయం వల్ల జరిగేవే’ అన్నాడు ఇంగ్లిష్ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రసల్. ‘ఉబుసుపోనితనం: కోరికల కోసం కోరిక’ అన్నాడు సుప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్. ‘ఉబుసుపోనితనం– అనుభవం గుడ్డు పెట్టే కలల పక్షి’ అన్నాడు జర్మన్ తత్త్వవేత్త వాల్టర్ బెంజమిన్. ‘ఉబుసుపోనితనం మీద కాస్తంత దృష్టి పెడితే, అది నమ్మశక్యం కానంత ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నాడు అమెరికన్ వైద్య నిపుణుడు జాన్ కాబత్జిన్. బహుశా, ఈ మేధావులంతా తమ తమ జీవితాల్లోని ఉబుసుపోనితనంతోనే ఇన్నిన్ని పరిశోధనలు సాగించి ఉంటారు. ఉబుసుపోని స్థితిలో ఖాళీగా ఉన్న మనిషి బుర్రను ‘దయ్యాల కార్ఖానా’తో పోల్చాడు ఇంగ్లిష్ రచయిత జాన్ బున్యన్. ఉబుసుపోని ఖాళీ సమయాన్ని పనికిమాలిన సమయంగా చాలామంది పరిగణిస్తారు. కానీ, ఉబుసుపోనితనానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది ఆధునిక మనస్తత్త్వ శాస్త్రం. ఉబుసుపోని స్థితిలోనే మనిషిలోని సృజనాత్మకత రెక్కలు తొడుక్కుంటుందని ఇంగ్లండ్‌లోని సెంట్రల్ లాంకషీర్ వర్సిటీకి చెందిన మనస్తత్త్వ శాస్త్రవేత్తలు శాండీ మాన్, రెబెక్కా కాడ్మన్ కనుగొన్నారు. ఉబుసుపోని స్థితిలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా పలు అద్భుత ఆవిష్కరణలు చేశాడని చెబుతారు. ‘మనిషిలోని జిజ్ఞాసకు, సృజనశీలతకు ఉబుసుపోనితనమే ఉత్ప్రేరకం’ అని ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెబుతుండేవాడు. ఉబుసుపోనితనం గురించి డేనిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్కగార్డ్ దాదాపు రెండు శతాబ్దాల కిందటే ‘ద పవర్ ఆఫ్ నథింగ్నెస్’లో చర్చించాడు. ఇందులో ఆయన ‘ఉబుసుపోనితనం అన్ని దుర్మార్గాలకూ మూలం’ అని అభిప్రాయపడ్డాడు.ఉబుసుపోనితనంతో చాలామంది అర్థంలేని పనులు చేస్తుంటారు. అక్కడక్కడా కొందరు అనర్థకరమైన పనులు కూడా చేస్తుంటారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో మాటినా అనే ఇరవై రెండేళ్ల ఉబుసుపోని కుర్రాడు ఏమీ తోచక అడవికి నిప్పుపెట్టి, కార్చిచ్చును రగిల్చాడు. ఉబుసుపోనితనం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అంతమాత్రాన ఉబుసుపోనితనం అనర్థాలకు హేతువు అని నిర్ధారణకు రావడం మాత్రం నిర్హేతుకమే అవుతుంది. ఉబుసుపోనితనమే లేకుంటే, ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఉండేవేనా?! -
మణిపూర్ చక్కబడేదెన్నడు?
మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగి మూడేళ్లు కావస్తున్నా అక్కడింకా పరిస్థితులు చక్కబడలేదని తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి. 2023 మే నెలలో హింసకు దారితీసిన వదంతులే ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. బీరేన్ సింగ్ నాయ కత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అది ఏడాది కొనసాగాక మొన్న ఫిబ్రవరిలో ఆ పార్టీకి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ పరస్పర అపనమ్మకం, జాతి విద్వేషాలు ఆగిందిలేదు. వందలాదిమంది ఆయుధాలు ధరించి గుంపులుగా బయల్దేరి ఊళ్లమీద పడి నిర్విచక్షణగా హత్యాకాండకు, అత్యాచారాలకు పాల్పడటం, ప్రార్థనా స్థలాలు, ఆవాసాలు తగలబెట్టడం ఇప్పుడు లేక పోవచ్చుగానీ... అవతలి పక్షంపై ఆగ్రహావేశాలు తగ్గలేదు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరగటం, రహదారులను స్తంభింపజేయటం ఆగలేదు. కేంద్ర బలగాల సంఖ్యను పెంచటం, నిరంతర పహారా వంటివి హింసాత్మక ఉదంతాలను గణనీయంగా కట్టడి చేశాయి. కానీ ఇప్పటికీ విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలూ, తప్పుడు సమాచారం వ్యాప్తిలోనే ఉన్నాయి. ఈ నెల మొదటివారంలో ఒక ఇంటిపై బాంబుపడి ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆ బాంబు కుకీలు నివసిస్తున్న ప్రాంతంనుంచి వచ్చిపడిందనీ, వారికి భద్రతా బలగాలు కొమ్ముకాస్తున్నా యనీ ప్రచారం వెల్లువెత్తడంతో జనం ఒక సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేశారు. అటుగా వాహనంలో వెళ్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన అధికారిని గుంపు చుట్టుముట్టి దౌర్జన్యం చేసింది. ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు రక్షించగలిగాయి. మొన్న మంగళవారం ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ముఖ్య మంత్రిని ఆందోళనకారులు అడ్డుకున్నప్పుడు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని అక్కడినుంచి ఆయన బయటపడాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మాజీ సైనికుడితో సహా ఇద్దరు నాగా జాతీయుల్ని మిలిటెంట్లు హతమార్చారు. మూడేళ్ల క్రితం మెయితీలకూ, కుకీలకూ మధ్య వైరం హింసకు దారితీయగా ఇప్పుడు మెయితీల గురి నాగాలపై కూడా పడింది. ఒక పద్ధతి ప్రకారం వదంతులు వ్యాప్తిచేయటం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ఇంకా ఆగలేదు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆ వదంతుల్ని ఖండిస్తూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఉద్రిక్తతల్ని ఆపటంలో అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. గతంలో బీరేన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మెయితీలకు చెందిన సాయుధ మిలిటెంట్ సంస్థ ఆరంబాయ్ టెంగోల్ను చూసీచూడనట్టు వదిలేశారు. కుకీల ‘దురాక్రమణల్ని’ అడ్డుకునే పేరిట ఏర్పడిన ఆ సంస్థ కుకీలకూ, నాగాలకూ మాత్రమే కాదు, వారిని ప్రశ్నించే మెయితీలకు సైతం పెద్ద బెడదగా పరిణమించింది. బెదిరించటం, దౌర్జన్యం చేయటం, బలవంతంగా వసూళ్లకు పాల్పడటం ఆ సంస్థకు నిత్యకృత్యమైంది. మూడేళ్లనాటి ఉదంతాలతో పోలిస్తే హింసాత్మక ఘటనలు తగ్గివుండొచ్చు. కానీ ఇప్పటికీ సమాజం చీలికలు, పేలికలుగా ఉంది. మెయితీలూ, కుకీలూ ఒకరి ప్రాంతంలోకి ఒకరు వెళ్లలేకపోతున్నారు. పనిచేయగలిగిన సత్తావుండి అది దొరుకుతుందన్న భరోసా ఉన్నచోటకు పోలేకపోవటం, పై చదువులకు అర్హతలున్నా ఊరు కదల్లేక పోవటంకన్నా మించిన హింస ఏం ఉంటుంది? పరిమిత వనరులు, ఉపాధి లేమి, భిన్న తెగలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటంవంటి కారణాలవల్లే అసంతృప్తి అవధులు దాటుతోంది.యువతకు ఉపాధి కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, వారికి మెరుగైన అవకాశాలు రావటానికి తగిన ప్రణాళికలు రూపకల్పన చేయటంవంటి ప్రయత్నాలు ఎక్కడా కనబడవు. కనుకనే మిలిటెంట్ సంస్థల ఆధిపత్యం సాగుతోంది. మౌలిక సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నేతలు ఓట్లు రాబట్టుకోవటానికి మాత్రం ఆయా తెగల్ని శాసించగల మిలిటెంటు సంస్థలకు సహకరిస్తున్నారు. ఇది కొనసాగినంత కాలమూ మణిపూర్ నెత్తురోడుతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిస్తేనే ఆ రాష్ట్రం తెరిపిన పడుతుంది. -
కీలక పోరుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ల భవితవ్యాన్ని తేల్చబోయే పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో గురువారం తొలి దఫాలో 152 స్థానాలకు పోలింగ్ జరగబోతుండగా, ఈ నెల 29న మరో 142 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తమిళనాట మాత్రం మొత్తం 234 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ పూర్తవుతుంది. తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పర్వం ఎప్పుడూ ప్రశాంతమే. బెంగాల్లో మాత్రం మహోద్రిక్త వాతావరణమే అలుముకుంటుంది. పార్టీల వైరం సరేగానీ... ఎన్నికల సంఘం(ఈసీ) సైతం ఈ ఉద్రిక్తతలకు దోహదపడటం కొత్త పరిణామం. జనం తమవెంటే ఉన్నారా లేదా... వ్యూహం, ఎత్తుగడలూ కుదిరాయా లేదా అని పార్టీలు ఆత్ర పడటం సహజం. సాధారణ జనంలో సైతం కాబోయే విజేతలెవరు, పరాజితులెవరన్న ఆత్రుత ఉండితీరుతుంది. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను లోపరహితంగా పూర్తిచేద్దామన్న ఆత్రుత ఈసీలో లేకుండా పోయింది. అందువల్లే బెంగాల్లో 91 లక్షలమంది, తమిళనాడులో 70 లక్షలమంది ఓటర్లలో ఈసారి ఓటు వేయగలమా లేదా అన్న ఆందోళన ఏర్పడింది. బెంగాల్లో ట్రిబ్యునళ్లలో అప్పీల్ దాఖలు చేసి విజయం సాధించినవారికి ఓటేసే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇంత తక్కువ వ్యవధిలో ఎందరికి ఆ వరం దక్కుతుందో అనుమానమే. ‘స్వచ్ఛమైన’ ఎన్నికల జాబితాతో పోలింగ్ జరిపితీరాలన్న ఈసీ దృఢ నిశ్చయాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. అందుకోసం ‘సర్’ తీసుకొచ్చారు. కానీ పోలింగ్ తేదీలు ప్రకటించే నాటికి సైతం ఒక కొలిక్కి రాకపోవటం, సాధారణ జనం నానా హైరానా పడటం ఈసీ అసమర్థతకు అద్దం పట్టింది. పోలింగ్‌కు 48 గంటల ముందు కూడా ఓటుహక్కు ఉంటుందో, ఊడుతుందో తెలియనివారు అనేకులు. ఓటర్లకూ, వారి తల్లిదండ్రులకూ వయసు వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ లేదా 50 ఏళ్లకు మించి ఉంటే... ఒకే జంటకు ఆరుగురు, అంతకన్నా ఎక్కువమంది సంతానం ఉంటే... ఇంగ్లిష్‌లో ఉన్న పాత రికార్డుల్లోని పేర్లకూ, ఇప్పుడు నమోదైన పేర్లకూ మధ్య అక్షరం తేడా ఉంటే... ఓటరు వయసుకూ, వారి తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ వయసులకూ మధ్య 40 ఏళ్లకన్నా తక్కువుంటే ఈసీ వాడిన క్రమసూత్ర పద్ధతి (అల్గోరిథిమ్) పొరపాటుగా పరిగణించింది. ఇది మానవ తప్పిదమైనా ఎప్పుడూ లేనట్టు ‘తార్కిక విరుద్ధత’ అనే కొత్త విధానంతో ఈ పేర్లన్నిటినీ తొలగించారు. చాలా ఆలస్యంగా వెల్లడికావటంవల్ల అనేకులు ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించలేకపోయారు. ఇలాంటివారు ఎన్ని లక్షలమందో తీరిగ్గా వెల్లడవుతుంది. అప్పటికల్లా పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది!ఆంధ్రప్రదేశ్‌లో 2024లో యథేచ్ఛగా సాగిన ఎన్నికల వైపరీత్యాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకూ ఈసీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. లోక్‌సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి జరిగిన పోలింగ్‌లో నిమిషానికి నలుగురు ఓటేశారన్నా దానికి పట్టదు. కానీ తగుదునమ్మా అంటూ మొన్న బిహార్‌లో, ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరగబోతున్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా పేరుతో ‘సర్’ ప్రక్రియ మొదలెట్టింది. ఏపీ విషయంలో ఈ ‘స్వచ్ఛ సంకల్పం’ ఏ గంగలో కలిసినట్టు? తమిళనాట చాలా దశాబ్దాల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేలకు సినీ హీరో విజయ్ నెలకొల్పిన టీవీకే పార్టీ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఇందువల్ల ఎవరి లెక్క తారుమారువుతుందన్నది చూడాల్సి ఉంది. ఆయన సభలకు భారీయెత్తున జనం రావటం గమనించదగింది. బెంగాల్లో రెండు దశాబ్దాలనాడు భూసేకరణ విధానంపై పోరాడి ఏకంగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికే ఎసరు తెచ్చిన నందిగ్రామ్ ఇప్పుడు కొత్త దోవ తొక్కటం గమనార్హం. ఆనాడు మొత్తం సమాజానికి జరిగిన అన్యాయంపై ఒక్కటై ప్రశ్నించిన నందిగ్రామ్ ఇవాళ ఏ దేవుడు గొప్ప – రాముడా, జగన్నాథుడా అనే అంశం చుట్టూ తిరుగుతోంది. తొలి దశ పోలింగ్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ రామనామాన్ని, టీఎంసీ తన ఆధ్వర్యంలో నిర్మాణమైన జగన్నాథ్ ఆలయాన్ని తెగ ప్రచారం చేశాయి. ఏదేమైనా పోలింగ్ ప్రశాంతంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. -
ద.కొరియాకు దగ్గరగా...
ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకున్నప్పుడు మన దేశంలో విదేశీ అధినేతల పర్యటనలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. దానికితోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సృష్టించిన అనిశ్చితి సరేసరి. ఇలాంటి వాతావరణంలో ఆదివారం భారత్‌కొచ్చి మూడు రోజులు పర్యటించి వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌కు ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యటనకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆ మాటెలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేర్చాలని అధినేతలిద్దరూ సంకల్పించారు. ఇందుకోసం 2010లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉంది. మ్యూంగ్ తనతోపాటు 200 మంది వ్యాపార వేత్తలూ, సీఈవోలతో కూడిన భారీ ప్రతినిధి బృందాన్ని వెంట బెట్టుకుని వచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), రక్షణ, షిప్పింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, క్రీడలు, సాంస్కృతిక రంగం వగైరాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక బంధానికి ఎంతో చరిత్ర ఉందంటారు. క్రీస్తుశకం 48లో అయోధ్యకు చెందిన యువతి హియోహాంగ్కు అప్పటి కొరియా రాజు సురోతో వివాహమైందని 13వ శతాబ్దంనాటి ఒక బౌద్ధ సన్యాసి రచించిన పుస్తకంలో ఉంది.అందులో ప్రస్తావించిన ‘అయుత’ ఇప్పటి అయోధ్య అయివుంటుందని అనేకులు భావిస్తారు. కొరియా చరిత్రలో ఆమె యువరాణి సురిరత్నగా నమోదైంది. అయోధ్యలో సరయూ నది ఒడ్డున రాణి హియోహాంగ్ స్మృతిలో ఒక పార్క్ నిర్మించారు. 2019లో ఆమె స్మారకార్థం రెండు దేశాలూ కలిసి ఒక స్టాంపు విడుదల చేశాయి. నాలుగో శతాబ్దంలో బౌద్ధం ఆ దేశంలో ప్రవేశించింది. 1973లో తొలిసారి దౌత్య సంబంధాలు ఏర్పడినా... అంతకు చాన్నాళ్లముందే 1950–53 నాటి కొరియా యుద్ధకాలంలో మన దేశంనుంచి వైద్య బృందాలు అక్కడికెళ్లి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిశాక తొలిసారి 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ దేశంలో పర్యటించారు. ప్రత్యేకించి ఎలాంటి కారణాలూ లేకపోయినా 2018లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–యీ తర్వాత దౌత్య సంబంధాల్లో స్తబ్ధత ఆవరించింది. అప్పుడూ, అంతకుముందూ కుదిరిన ఒప్పందాలు ఆచరణలో కొనసాగుతున్నా ఇరు దేశాల వాణిజ్య లోటుపై మన దేశానికి కొంత అసంతృప్తి ఉంది. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 2,700 కోట్ల డాలర్లున్నా, అక్కడినుంచి మనకొచ్చే దిగుమతుల విలువ దాదాపు 2,100 కోట్ల డాలర్లు. మన ఎగుమతుల విలువ 600 కోట్ల డాలర్లు మించదు. ఇందులో సమతౌల్యత సాధించాలని మన దేశం ఎప్పటినుంచో భావిస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి, చీడపీడలు చూపి మన సాగు ఉత్పత్తులను దక్షిణ కొరియా అడ్డుకుంటోంది. నౌకా నిర్మాణంలో దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. పర్యావరణ హితమైన, అత్యాధునిక నౌకల నిర్మాణంలో, ఇతర నౌకాసంబంధ కార్యకలాపాల్లో మన దేశానికి సహకరించేందుకు అంగీకరించింది. నౌకాశ్రయాలను సాంకేతికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లటంతోపాటు ఓడల మరమ్మతుకు, అతి పెద్ద ఓడల నిర్మాణానికి తోడ్పడే భారీ డ్రై డాక్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. విమాన విధ్వంసక ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు ఇక్కడే అభివృద్ధిపరచడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల్ని బదిలీ చేయటానికి దక్షిణ కొరియా అంగీకరించింది. యుద్ధక్షేత్రంలో చురుగ్గా కదిలి, శత్రుసైన్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ కె9 వజ్ర కొరియా సహకారంతోనే ఇక్కడ ఉత్పత్త వుతోంది. ఇవిగాక సెమీ కండక్టర్లు, ఫార్మా, జౌళి, ఐటీ రంగాలకు సైతం సహకారం విస్తరించటానికి సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో భిన్న రంగాల్లో మరింత దగ్గరయ్యేందుకు దక్షిణ కొరియా అధినేత పర్యటన దోహదపడుతుంది. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
నీటి గుడి
కాశీలోని ఒక ముసలామెకు రోజులు ముగిశాయి. యమభటులు వచ్చి ‘అవా... బయలుదేరు...’ అంటే ఆమె అందుకే కాచుకుని ఉన్నట్టు ఒకటీ అరా వస్తువులు ముల్లె కట్టుకొని ‘పదండి నాయనా’... అని కదలబోయింది. విష్ణుభటులు ప్రత్యక్షమయ్యారు. ‘మీరెందుకు వచ్చారు’ అన్నారు యమభటులు ఆశ్చర్యపోయి. ‘ఈ అవ్వ మా కేండేటు. స్వర్గానికి పిల్చకపోవడానికి వచ్చాము’ అన్నారు. ‘అంత ఘనకార్యం ఏం చేసిందీ అవ్వ. కొంపదీసి యజ్ఞాలుగానీ చేసిందా’ అన్నారు యమభటులు. ‘అంతకు మించే చేసింది. అవ్వకు కొడుకూ బిడ్డా ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఈ కాశీలో చలివేంద్రం పెట్టింది. ఇక్కడ రోజూ వచ్చే భక్తులు, బైరాగులు ఈమె పెట్టిన కుండల్లోని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు. ఒక్క దప్పిక తీరిస్తే నూరు అశ్వమేధ యాగాల పుణ్యం. మరి ఈమె పుణ్యం లెక్కవేయడానికి మీ చిత్రగుప్తుడి చిట్టాపద్దులు సరిపోతాయా’ అని అవ్వను పల్లకీ ఎక్కించి, పూలవానలో స్వర్గలోకానికి తోడ్కొని వెళ్లారు. ఈ ఎండల్లో వినదగ్గ కథే ఇది.అదేమిటో యుగాలు గడిచినా రంతిదేవుణ్ణి తలదన్నే ఉదారపురుషుడే కానరావడం లేదు. దానాలకు అన్నీ పోగా 48 రోజులు ఉపవాసం ఉన్న రంతిదేవుడికి కొంత జావా, కొన్ని నీళ్లు దక్కాయి. జావ తాగబోతే ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘ఆకలి’ అన్నాడు. ఇచ్చేశాడు. నీళ్లు తాగబోతుంటే ఒక శూద్రుడు వచ్చి ‘దప్పిక’ అన్నాడు. ఇచ్చేశాడు. పాత్రలో ఉన్న చివరి నీటి చుక్కలను తాగుదామనుకునేలోపు ఒక పంచముడు వచ్చి ‘అయ్యా... దప్పికతో చచ్చేలా ఉన్నాను’ అనంటే ఆ చివరి నీటి చుక్కలతో పంచముడి పెదవులు తడిపాడు. అప్పుడు ఆగలేక విష్ణువు ప్రత్యక్షమై ‘నీ త్యాగం ముందు నా వైకుంఠం దిగదుడుపు’ అన్నాడు. ‘నీకేం కావాలో కోరుకో’ అనీ అన్నాడు. ‘నాకేం వద్దు. ఈ లోకంలో ఎవరినీ దప్పికతో ఉంచొద్దు’ అన్నాడు రంతిదేవుడు. ‘తథాస్తు’ అన్నాడు విష్ణువు. ఈ భగభగమండే ఎండల్లో అలా రోడ్డు మీద వెళితే ఈ ‘తథాస్తు’ ఏ మేరకు సిద్ధించిందో తెలుస్తుంది.పనుల మీద ఊరుగాని ఊరుకు వస్తారు చాలామంది. ఉన్న ఊళ్లోనే రెక్కాడితేగాని డొక్కాడని బతుకుకై బయలుదేరుతారు చాలామంది. జనుల ఆకలి తీర్చడానికి తిండి బుట్టలు వీపున కట్టుకుని తిరిగేవారు వేలమంది. ఇక ఈ దేశంలో కోట్ల మందికి ట్రంకు రోడ్డే ఆఫీసు, మెయిన్‌రోడ్డే షాపు. కాసింత చెట్టు నీడ కూడా దొరకని ఈ పొడవైన, నిర్దాక్షిణ్యమైన, నల్లటి రోడ్డు మీద వేసవిలో బతుకులు వెళ్లమార్చే వారంతా ఉష్ణాన్ని తట్టుకోగలరేమోగానీ దప్పికను తట్టుకోగలరా? ఏం కావాలి వీరికి? మన మనసు చల్లదనం. అది మన చేత పెట్టించే చలివేంద్రం. తడి గుడ్డ కట్టిన, చూడగానే ప్రాణం లేచి వచ్చే చల్లని మంచినీరు!‘అప ఏవ ససర్జాదౌ’ స్మృతివాక్యం. అంటే ‘పరమాత్ముడు మొదట నీరు సృష్టించాడు’. నారము– నీరును, ఆయనము– నివాసము చేసుకున్నవాడు నారాయణుడు. ‘నీటిలో రుచిని నేను’ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నీళ్లతో సేవ చేయడమంటే దేవునికి పూజ చేయడమే. ‘పానీయం పరమం దానం’. నీటిదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. పామరులు ఈ మాటనే ‘కుండలో నీళ్లు పోస్తే పుణ్యం వాగు పారినట్టు’ అన్నారు. ‘దాహం అన్నవాడికి లేదనకు. లక్ష్మి ఇల్లు కదలుతుంది’ అని హెచ్చరించారు. ఉత్తర భారతాన ‘ప్యావూ’ అని పిలిచే చలివేంద్రాల సంస్కృతి ఉంది. ఇంటి బయట, వీధి చివర ఎవరో అజ్ఞాతవ్యక్తులు పెద్ద పెద్ద రజాయిలు పెట్టి నీళ్లు నింపుతుంటారు. ఎండన పడి వెళ్లేవాళ్లంతా తాగుతుంటారు. అజ్ఞాతంగా ఎందుకు? దప్పిక తీర్చి చెప్పుకోకూడదు. దప్పిక తీర్చామని అహానికి పోకూడదు. దప్పిక తీరినవారు ఫలానా వారికి రుణపడ్డామని అనుకోకూడదు. నీరు దైవసొత్తు. మనిషి సృష్టించింది కాదు. దైవసొత్తును మరో మనిషికి చేరవేయడంలో మన ఘనకార్యం ఏముంది? మరైతే మన దేశంలో చలివేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? కేరళ. గతంలో తెలుగునాట ఎండలు వస్తే పోటీలు పడి చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు రీల్స్ చూడటంలో పడి బిజీగా ఉంటున్నారు. గ్లాసెడు నీరు ముంచి ఇచ్చి పోగేసుకునే సంతృప్తికి కౌంటింగ్ మెషీన్ లేదని వీరికి తెలిసేదెలా? ఎండాకాలంలో పుణ్యయాత్రలకు రెడీ అవుతుంటారు చాలామంది. మంచిదే. కాని మన ఇంటి ముందే ఒక గుడి కట్టే వీలుండే ఈ కాలాన్ని మిస్ చేసుకోవద్దు. నీటి గుడి కట్టండి. నీరున్న కుండలో దేవుడు ఉన్నాడు! -
రుతుపవనాల దగా?
ఒక్కోసారి కష్టాలు కూడబలుక్కుని వస్తాయంటారు. అసలే అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాలతో ఏటికి ఎదురీదుతున్న ప్రపంచంపై ఈసారి ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడుతోంది. రాగల కాలంలో వాతావరణ పరిస్థితుల గురించి భారత వాతావరణ విభాగం(ఐఎండీ), ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన అంచనాలు భయపెడుతున్నాయి. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాల్లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరగటంతోపాటు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించగా, మన దేశంలో రుతుపవనాలు బలహీనపడి సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఇదేవిధంగా చెబుతోంది. వైద్య పరిభాష మాదిరే వాతావరణానికి సంబంధించిన పరిభాష కూడా సామాన్యులకు కొరుకుడు పడదు. ‘సాధారణంకన్నా తక్కువ’ వర్షపాతం ఉంటుందంటే– తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయని. మన దేశంలో 60 శాతంమంది రైతులు ఖరీఫ్ సీజన్లో పూర్తిగా రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడతారు. శాస్త్రవేత్తల అంచనా నిజమైతే ఇప్పటికే అనేకచోట్ల వడగళ్లుపడి, వర్షాలు కురిసి నష్టపోయిన రైతులకు ఇది సహజంగానే గోరుచుట్టుపై రోకటి పోటువంటి దవుతుంది. ఒకప్పుడు ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం మూడురోజులముందే వాన ఎక్కడెక్కడ పడే అవకాశం ఉన్నదో, దాని తీవ్రత ఎలావుంటుందో అంచనా వేస్తున్నారు. తుపాన్లు, ఉప్పెనలు, సునామీలు వంటివి ముందస్తుగా పసిగట్టి వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ఠ స్థాయికి ఉంచగలుగుతున్నారు. అలాగని అన్నీ కచ్చితంగా చెప్పటం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రకృతిని అంచనా వేయటం జూదంలాంటిది. అది అర్థమైనట్టే కనబడుతుంది. తీరా కొన్ని సందర్భాల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అలాగని ఏమరుపాటుతో ఉంటే ముంచేస్తుంది. అందుకే సమస్యలొస్తాయన్న అంచనాలతో ముందస్తు చర్యలు ఎప్పుడూ తప్పనిసరవుతాయి.అయితే ప్రస్తుత అంచనాలు ప్రాథమికమైనవి. వచ్చే నెలాఖరు నాటికి మరికొంత స్పష్టత వస్తుంది. ఎల్ నినో ఏర్పడటానికీ, రుతుపవనాలు బలహీనపడటానికీ మధ్య బలమైన సంబంధం ఉంది. గత 70 ఏళ్లలో 17 సార్లు ఎల్ నినో ఏర్పడితే అయిదుసార్లు సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన సంవత్సరాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. గ్రామీణ భారతంలో మెజారిటీ ప్రజానీకం వ్యవసా యంపై ఆధారపడతారు. అందువల్లే వర్షాలుపడక కరువుకాటకాలు ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో వానలు లేకపోవడం లేదా అకాల వర్షాలు పడటం కారణంగా పంటలు దెబ్బతిన్నాయిగానీ... దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా వర్షపాతం బాగానే ఉంది. సాగు దిగుబడి పెరిగింది. ఆహార ధరలు అదుపులో ఉన్నాయి. అందువల్లే రిజర్వ్‌బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించింది. కానీ ఇదంతా తారుమారైతే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీరేట్లు మళ్లీ పైపైకి పోతాయి. నిజానికి ఇరాన్ యుద్ధంవల్ల ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. మన దేశానికి సంబంధించి కేవలం ఎల్ నినో ఒక్కటే నిర్ణాయక శక్తి కాదు. హిందూమహాసముద్రంలో పశ్చిమ(ఆఫ్రికా వైపు), తూర్పు(ఇండొనేసియా వైపు) ప్రాంతాలమధ్య ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల అనుకూల, ప్రతికూల, తటస్థ ద్విధ్రువ (డైపోల్) స్థితులు ఏర్పడవచ్చు. అనుకూల స్థితి ఎల్ నినోవల్ల ముందుకు కదల్లేని రుతుపవనాలకు బలం చేకూర్చి భారత్ వైపు వచ్చేలా చేస్తుంది. మిగిలిన రెండూ అందుకు భిన్నమైన ఫలితాలనిస్తాయి. దానికితోడు యురేసియా ప్రాంతంలో ఈసారి మంచుకవచం తక్కువుందంటున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు మెరుగ్గానే ఉంటాయనుకోవచ్చు. ఏదేమైనా ఈసారి రుతుపవనాలపై ఏ ప్రభావాలు బలంగా పనిచేస్తాయో, వాటి ఫలితాలెలా ఉంటాయో పెద్ద సస్పెన్స్. అంతా సవ్యంగా ఉండాలని కోరుకోవటం మినహా ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. -
బిహార్‌కు బీజేపీ సారథ్యం!
మండల్ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్‌లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్‌మేకర్‌గా లేదా జూనియర్ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్‌లో జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్‌ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్ కూడా ఊహించివుండరు. ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్‌రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్ ఏలికగా నితీశ్ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్‌పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బిహార్‌లో కూడా ఆదినుంచీ సంఘ్ పరివార్‌ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.అయితే బిహార్‌కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్‌లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్‌కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్‌ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
హద్దులెరుగని జ్ఞానం
‘మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని’ అంటాడు శ్రీశ్రీ. మానవ జీవనప్రస్థానం గోడలు లేని దశ నుంచి గోడలు కట్టుకునే దశకు చేరుకుని ప్రస్తుతానికి అక్కడే స్థిరపడింది. గోడలు లేని దశ గురించిన స్పృహ మనిషిలో అంతరించి గోడలు కట్టుకోవడమే స్వాభావికమూ, స్థిరమూ, సత్యమనే భావన బలపడింది. గోడలు కట్టుకో వడం రకరకాల రూపాలలో జరుగుతుంది. వర్ణం, కులం, ప్రాంతం, దేశం, భాష మొదలైనవి కొన్ని మాత్రమే! దేశాల విషయానికి వస్తే, గోడలను సరిహద్దుల పేరుతో పిలుచుకుంటాం. కానీ, ప్రకృతినే గమనిస్తే, సరిహద్దులు లేనిదే ప్రకృతి అనీ, సరిహద్దులు గీసు కోవడం వికృతి అనీ ఇట్టే బోధపడుతుంది. భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశమనే పంచ భూతాలు సరిహద్దులనెరుగవు; ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరాఘాటంగా వ్యాపిస్తాయి. మొదట్లో మనిషి కూడా అలా వ్యాపించినవాడే. కాలగతిలో సరిహద్దులు నిర్మించు కోవడానికి అలవాటుపడ్డాడు. ఆ విధంగా సరిహద్దులు లేని దశ నుంచి సరిహద్దుల దశకు చేరుకోవడం మనిషి భౌతిక, బౌద్ధిక వికాసంలో మెరుపులీనే మైలురాయి కావడం విచిత్రం; అదే అతని చరిత్రలో ఒక విరోధాభాస. అదే సమయంలో, తన మేధనూ, మేధాగతమైన జ్ఞానాన్నీ సరిహద్దులను దాటించి పరస్పరం పంచుకున్న, పంచుకుంటున్న అనుభవమూ మనిషికి ఉంది. అయినాసరే, తనే కల్పించుకున్న కృత్రిమ సరి హద్దులే నిజమని నమ్మి ఆ ఇరుకులో కూరుకుపోవడమే అతనిలోని వైరుద్ధ్యం. ‘జ్ఞాన’మనే మాటనే తీసుకోండి. తెలుగులో ఎరుక, తెలివి, తెలివిడి మొదలైన పర్యాయపదాలు ఉన్నప్పటికీ, వాటికన్నా ఎక్కువగా జ్ఞానమనే మాటే ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి ఈ మాట నేటి మనదేశపు సరిహద్దులకు బయట ఆరువేల సంవత్స రాల క్రితం మాట్లాడిన ప్రోటో–ఇండో యూరోపియన్ భాష నుంచి పుట్టింది. వ్యుత్పత్తి పదనిఘంటువు ప్రకారం, ‘తెలుసుకోవడ’మనే అర్థమిచ్చే ‘గ్నో’ అనే ప్రోటో–ఇండో యూరోపియన్ మూలపదం నుంచి ‘టు నో’, ‘నాలెడ్జ్’, ‘ఎకనాలెడ్జ్’, ‘కాగ్నిషన్’, ‘డయో గ్నొసిస్’, ‘ఇగ్నొరెంట్’, ‘ఇగ్నోర్’, ‘నొబిలిటీ’ వంటి మాటలు రూపొందాయి. ఇదే సంస్కృతంలో ‘జ్ఞ’గా మారి ‘జ్ఞాన’మనే మాటను పుట్టించింది. పర్షియన్ల అవెస్తాలో జ్ఞానమనే అర్థంలో ‘జయింతి’గా, ఓల్డ్ చర్చి స్లవోనిక్లో గుర్తించడమనే అర్థంలో ‘జ్ఞన్టి’గా, తెలుసుకోవడమనే అర్థంలో రష్యన్లో ‘నాట్’గా, గ్రీకులో ‘నాత్స్’గా, తెలిసినదనే అర్థంలో ఐరిష్లో ‘గనాత్’గా మారింది. అలాగే, అతి ప్రాచీనకాలం నుంచీ, ఆధునిక కాలం వరకూ జ్ఞానప్రసారం కూడా అన్ని రకాల సరిహద్దులనూ దాటి జరుగుతూనే ఉంది. మనదేశానికి సంబంధించే చెప్పు కుంటే, సున్నాను, జ్యోతిశ్శాస్త్రాన్ని ఇచ్చిన ఆర్యభట్టు; శస్త్రచికిత్సలో మార్గదర్శి అయిన సుశ్రుతుడు, రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రసిద్ధుడైన సీవీ రామన్ మొదలుకొని – ప్రాచీన గ్రీసుకు చెంది, తర్కాన్ని, శాస్త్రవిజ్ఞానాన్ని ఇచ్చిన అరిస్టాటిల్; క్షేత్రగణితాన్ని ఇచ్చిన పైథాగరస్; వైద్యశాస్త్రాన్ని ఇచ్చిన హిపోక్రటెస్ – యునైటెడ్ కింగ్డమ్కు చెంది, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, కలన గణితా(కేల్క్యులస్)న్ని ఇచ్చిన న్యూటన్, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చాల్స్ డార్విన్, కంప్యూటింగ్‌ను ఇచ్చిన అలాన్ ట్యూరింగ్– జర్మనీకి చెంది, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఇచ్చిన మాక్స్ ప్లాంక్ వరకూ, సరిహద్దులకు అతీతంగా యావత్ప్రపంచ దీప స్తంభాలుగా నిలిచి జ్ఞానకాంతిని విశ్వవ్యాప్తం చేసిన మేధాభాస్కరులు ఎందరెందరో! అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలితాలు, పరికరాలతో సహా అన్ని రంగాలలో అన్ని దేశాలవారూ ప్రసాదించిన జ్ఞానభిక్షను అందుకుంటూ, పంచుకుంటూ జీవితాన్ని అన్నివిధాలా తేజోవంతం చేసుకుంటూనే; అనేకానేక సరిహద్దుల సంకెళ్ళతో తనను తాను బంధించుకుంటూ సరిహద్దులెరుగని ప్రాపంచిక జ్ఞానానుభవాన్ని గుర్తించలేక పోవడమూ మనిషికే చెల్లింది. ప్రకృతి మరే జీవజాలానికీ ఇవ్వని వరాలను మనిషి కిచ్చింది; కానీ వాటికి తనవైన శాపాలను జోడించుకుంటూ జీవితాన్ని ముళ్ళకంపగా మార్చుకునే అవివేకతలో కూడా మనిషికి మరే జీవీ సాటిరాదు. ప్రకృతి గీసిన హద్దుల్లో జీవించడమే తప్ప స్వయంగా హద్దులు గీసుకోవడం చేతకాని జీవులే మనిషి కన్నా సుఖంగా జీవిస్తున్నాయనిపిస్తుంది. సరిహద్దులెరుగని వసుధైక భావన దిశగా మనిషి పునఃప్రస్థానం ఇంకా ఎప్పటికి?! -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్‌మాన్ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్’ అన్నారు. స్పీక్‌మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్‌పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్‌కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్‌హౌస్‌లో, ట్రంప్‌కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్‌పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్‌కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
‘తాత్కాలిక సంధి’ దశ!
నలభై రోజులుగా ఇరాన్ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్‌ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్‌పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్ ఆ దాడులు ఆగబోవంటున్నది. రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఇవాళ ఇరాన్‌కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్‌కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇరాన్‌పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ ట్రిగ్గర్పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్‌ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు! -
ప్రమాదపుటంచుల్లో దేశాలు
ఇజ్రాయెల్‌తో కలిసి ఏకపక్షంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్‌లైన్ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్‌లు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్‌కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్‌లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్‌ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. ట్రంప్ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్మిల్ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నెర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్‌ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్ బేనన్ వరకూ అందరిలోనూ వైట్‌హౌస్‌ను ‘ఇజ్రాయెల్ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నిష్క్రమించాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్ షాక్’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. -
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్‌సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్‌లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్సీఆర్ఏ కింద నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.ఎఫ్సీఆర్ఏకు 2020 సవరణల అనంతరం ఎన్జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్‌తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్‌తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్‌కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్‌పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్‌కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
నేపాల్‌లో మారిందేమిటి?!
తిరుగుబాటు గాలి ఒకచోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్నచోటకల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులూ, ప్యాలెస్‌లూ వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్‌లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటీన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావొచ్చు... నేపాల్‌లో సైతం జెన్ జీ తరం నిరుడు సెప్టెంబర్‌లో అధికార పీఠాలను కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపర్, కఠ్మాండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతోపాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని, సీపీఎన్(యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలిని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను నిరుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన సంగతి నిజమే అయినా, ఆ వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్‌లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహ్మాన్ ప్రకటించి ఇంతవరకూ విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్‌ను కోరుతున్న మాట వాస్తవమే అయినా, అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే దానికి ఉన్నట్టు కనబడదు. నేపాల్‌లో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన నిరసనోద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలిని, అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్ ఓలి అపరాధాన్ని నిర్ధారించలేదు. కానీ కాల్పులను ఆయనగానీ, లేఖక్గానీ ఆపలేకపోయారని తెలిపింది. నేపాల్‌లో ఉద్యమకాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంటు ఆవరణలో, కోర్టుల్లో గుంపులు జొరబడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతాదళాలు మౌనంగా ఉండగలవా? అయితే ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతోకాక వారి ప్రాణాలు తీయ టానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి కారకుల్ని శిక్షించాల్సిందే. కానీ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. రిపబ్లిక్ గా ఏర్పడ్డాక నేపాల్‌లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలూ బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజయింది. వీటన్నిటినీ చూసి తీవ్రంగా కలతచెందబట్టే జెన్ జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇక ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరేసరి. అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతోకొంత మిగిల్చి కుటుంబాలకు పంపటం మామూలే. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. తయారీరంగ పరిశ్రమలపైనా, ఇతర ప్రాజెక్టులపైనా దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటానికి బదులు కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టి తాను గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది. -
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్‌లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్‌లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
తిరోగాముల పురోగమనం
మన దేశానికి గల ఘనతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు; సనాతన సంప్రదాయ పరంపరను ఎంతైనా కొనియాడుకోవచ్చు. అలాగని గతవైభవ సంకీర్తనలతోనే కాలం వెళ్లబుచ్చడం ఏమాత్రం వివేకమున్న పని కాదు. వర్తమానంలో చెప్పుకోదగినది ఏదీ లేనప్పుడు; భవితవ్యం అగమ్యగోచర అయోమయంగా మారినప్పుడు బుద్ధి పనిచేయక చాలామంది తమ గత వైభవాన్ని పదే పదే చెప్పుకుంటూ తన్మయంలో మునిగిపోతుంటారు. వర్తమా నంలోని వేగాన్ని అందుకోలేక, భవితవ్యంలోని అభివృద్ధిని అంచనా వేయలేక ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వలపోస్తూ ఉంటారు. ఇలాంటి వారిది తిరుగులేని తిరోగమన ధోరణి.గత వైభవ స్తోత్రాలు వల్లించేవారు దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంటారు కాని, పదవులకు శాశ్వతంగా దూరమైన రాజకీయ నాయకుల్లోను; తెరమరుగైపోయిన సినీ ప్రముఖుల్లోను; పాఠకులు పట్టించుకోని రచయితలు, కవులలోను; ఆధ్యాత్మిక ప్రవచన కర్తల్లోను తిరోగమనవాదులు ఎక్కువగా కనిపిస్తారు. బహిరంగ వేదికల మీద మైకులు దొరికితే వీరి వాగ్ధారకు మాత్రమే కాదు, వాగ్దాష్టీకాలకు కూడా అంతు ఉండదు. ఇటీవలి కాలంలో ఇలాంటి వాగ్దాష్టీకాల ఉదంతాలే వార్తలకెక్కుతున్నాయి; ప్రసార మాధ్యమాల కార్యక్రమాల్లో ప్రధాన చర్చాంశాలవుతున్నాయి; సామాజిక మాధ్యమాల్లో రణగొణలవు తున్నాయి.గత వైభవ గాథలను మితిమీరి ఊదరగొడుతుంటే, జనాలకు విసుగు పుడుతుంది. ఒక్కసారి చరిత్రను తరచి చూసుకుంటే, ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ ఎందుకన్నాడో ఎవరికైనా సులువుగానే బోధపడుతుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోని వర్తమానానికి భవిష్యత్తు ఉండదు. గతంతో పోల్చి చూసు కున్నప్పుడు వర్తమానం సాధించే ఎలాంటి పురోగతినైనా స్వాగతించాల్సిందే! గతంలో జరిగిన పొరపాట్లకు వర్తమానంలో జరిగే ఎలాంటి దిద్దుబాటునైనా హర్షించాల్సిందే! సమీప గతం పట్ల ఎరుక కలిగిన సామాన్య ప్రజానీకం వర్తమానంలో చోటుచేసుకునే ఎలాంటి సానుకూలతనైనా ఆమోదిస్తుంది. కాని, తిరోగాములకు వర్తమాన సానుకూలతలు ఇనుపగుగ్గిళ్లలా మింగుడుపడవు. తమ ఘనతకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోననే భయంతో నోటికి పని చెబుతారు. ఏ వేదిక దొరికినా, సమయ సందర్భాలతో, ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా తమ లోలోపలి అక్కసునంతా వెళ్లగక్కుతారు.జనాభాలో తిరోగాములు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్లేమీ కాదు. పురాణకాలంలోని పురాతన రాజ్యాలలోనూ ఇలాంటి కురచబుద్ధుల తిరోగాములు ఉండే వారు. వీళ్లు నిత్యదుఃఖితులు. ఇలాంటి వాళ్ల గురించే ‘ఈర్షా్యళు ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశంకితః/ పరభాగ్యోపజీవీ చ షడతే నిత్యదుఃఖితాః’ అని విదురనీతి చెబుతుంది. ఇతరుల పట్ల ఈర్ష్యపడేవారు; ఇతరులను నిష్కారణంగా అసహ్యించు కునే వారు; నిత్యం అసంతృప్తితో రగిలిపోయేవారు; ఉత్తపుణ్యానికే కోపంతో చిర్రుబుర్రు లాడేవారు; ప్రతి విషయాన్నీ అనుమానించేవారు; ఇతరుల భాగ్యంపై ఆధారపడి జీవించే పరాన్నభుక్కుల వంటివారు నిత్యం దుఃఖంతోనే కొట్టుమిట్టాడుతుంటారు.అంతటితోనే ఆగరు. తమ పరిసరాల్లోని మనుషుల సంతోషాన్ని కూడా హరించేస్తారు. సామాజిక వేదికలను అధిరోహిస్తే, యావత్ సమాజంలోని సుఖశాంతులకే భంగం కలిగిస్తారు. ‘వివేక తిరోగమనే మూర్ఖత్వ పురోగమనం’ అని రష్యన్ రచయిత తామెర్లాన్ కుజ్గోవ్ ఇలాంటి బాపతు తిరోగాముల గురించే వ్యాఖ్యానించాడు. సమాజానికి చేటు కలిగించే తిరోగాములను కనీసం సామాజిక వేదికలకు దూరంగా ఉంచడం మంచిది. లేకుంటే, వాళ్లు మూర్ఖత్వ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తారు. వారి కృషిని సమాజం భరించలేదు. ఇటీవలే ప్రభుత్వ బిరుదాంకితుడైన ఒక ప్రవచనకర్త ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పోషకాహారంగా గుడ్లు పెట్టడం మీద నోరుపారేసుకుని కలకలం రేపిన ఉదంతం ఈ కృషికి తాజా ఉదాహరణ. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం పురోగామి సమాజం బాధ్యత. -
నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది!
రోడ్డు ప్రమాదాలను నివారిస్తామనీ, సురక్షిత ప్రయాణానికి అనువైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం చెప్పే కబుర్లు ఉత్త గాలి మాటలేనని ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామ సమీపంలో గురువారం వేకువజామున 5.40 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో జరిగిన ఈ విషాదంలో 14 మంది చనిపోగా, మరో 20 మంది వరకూ గాయపడ్డారని చెబుతున్నారు. మరికొంతసేపట్లో గమ్యస్థానం చేరతామని ప్రయాణికులు అనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా పరుగులెత్తే ప్రైవేటు బస్సులను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆ వాహనాలకు ఫిట్నెస్ ఉందా? నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్సుందా? రహదారి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సంగతులులేవీ వారికి అక్కరలేదు. వాహనం సక్రమంగా లేదని బస్సెక్కినప్పటి నుంచి తాము చెబుతూనే వచ్చామనీ, చివరకు స్టీరింగ్ మొండికేయటంతో ప్రమాదం జరిగిందనీ ప్రయాణికులంటున్న మాట! ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ఒక్క అధికారి బస్సును గమనించలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.దాదాపు రెండేళ్లనుంచి హింస, దౌర్జన్యాలు, అక్రమ కేసులు మినహా ఏపీలో మరేదీ సక్రమంగా చేయడం రాని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం ఎంతటిదో ఈ ప్రమాదం తేటతెల్లం చేసింది. ప్రమాదం జరిగాక ఏదోరకంగా బయటపడిన ప్రయాణికులు తేరు కోవటానికే కొంత సమయం పట్టింది. ఆ తర్వాత 108 వాహనానికి డజనుసార్లకు పైగా ఫోన్ చేస్తే గానీ ఎవరి నుంచీ స్పందన లేదు. వేకువజాము వేళకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు వేగంగా వస్తుంటాయి. ఆ సమయంలో భారీ వాహనాలు సైతం అదే రహదారిపై వెళ్లటం ప్రమాదాలకు దారి తీయదా? ముఖ్యంగా క్వారీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయటం, వేగాన్ని నియంత్రించటం కోసం స్పీడ్గన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రమాదకరమైన మలుపులున్నచోట చాలా ముందుగానే హెచ్చరిక బోర్డులు అమర్చాలి. ఏవీ సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలుగా భావించ గలమా? క్వారీ వాహనాలు ట్రాఫిక్ అధికంగా ఉండే సమయంలో జాతీయ రహదార్లపైకి రాకుండా కట్టడి విధించే నిబంధనలున్నాయి. క్వారీలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే పని చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అంత వేకువజామున భారీ లోడ్ వాహనం ఎలా వచ్చింది? అంటే రాత్రంతా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయన్న మాట! స్థానికంగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధి కారులంతా ఉంటారు. కానీ ఏం లాభం? జిల్లాల పరిధి పెద్దగా ఉంటే పర్యవేక్షణ కష్ట మవుతుందని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నదో క్షణంలో తెలిసే టెక్నాలజీ వాడుతున్నా నని ఆయన స్వోత్కర్షలకు పోతుంటారు. కానీ ఈ లోటుపాట్ల విషయం మాత్రం ఆయనకు తెలియదు! వైద్యవిద్యలో పేదవర్గాల పిల్లలకు అవకాశాలు రావాలనీ, అదే సమయంలో ప్రజ లకు మెరుగైన, ప్రామాణికమైన వైద్య సదుపాయాలు అందాలనీ భావించి జగన్ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల్లో మార్కాపురం కాలేజీ కూడా ఒకటి. అందులో ఏడెనిమిది కాలేజీలు ప్రారంభం కాగా, తుది దశలో వున్న వాటిలో మార్కాపురం కాలేజీ కూడా ఉంది. ఈలోగా కూటమి సర్కారు వచ్చిపడి దాన్ని కాస్తా పక్కన పెట్టింది. పర్యవసానంగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు రాలేదు. అది అందుబాటులోకి వచ్చివుంటే బస్సు ప్రమాదం బారినపడిన వారిలో మరికొందరి ప్రాణాలు నిలబడేవి. తమ నిర్వాకంతో బాధిత కుటుంబాలకు చేసిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన పరిహారం రూ. 5 లక్షలు ఏ మూలకు? ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం ఇంతమంది మరణానికి దారి తీశాయని బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? -
మహిళల కోటాపై కదలిక
వచ్చే నెలలో జనగణన తొలి దశ ప్రారంభం కాబోతుండగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, అందరూ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ రెండింటికీ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాస్తవానికి 2023లో మహిళా కోటా బిల్లును ఆమోదించినప్పుడు ఆ మరుసటి సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలకే దాన్ని వర్తింపజేయాలని విపక్షాలు కోరాయి. కానీ 2026 జనగణనకు ముందుగా ఇది సాధ్యంకాదని అప్పట్లో కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకూ దీన్నే కారణంగా చూపింది. ఈ హఠాత్ పునరా లోచనకు గల కారణమేమిటో కేంద్రం వివరించలేదు. అలాగే మహిళల కోటా నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్నది కూడా చెప్పలేదు. వీటికి సంబంధించిన విధి విధానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియపై రాజకీయ పక్షాల మధ్య స్పర్థలున్నా మహిళల కోటా విషయంలో అన్ని పక్షాలూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా ఆ చట్టం అమలు వాయిదా పడింది.కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్లున్నాయి. నేపాల్‌లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ ఏడాది జనగణన ప్రక్రియ మొదలైనా, తుది గణాంకాలకు ఏడాది పడుతుంది. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కోటా దక్కలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దనుకోవటం మంచి నిర్ణయమే. అయితే నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించటమే ఇందుకు కారణం. 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవటంవల్ల లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ 816కు ఎగబాకుతాయనీ, ఇందులో 273 స్థానాలు మహిళలకు లభిస్తాయనీ ఒక అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికలకు దీన్ని వర్తింపజేస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాలు 26కు... 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగు తాయంటున్నారు. ఏపీకి ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు దాదాపు 38కి, ప్రస్తుత 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరుతాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన మహిళలు చదువుల్లో, వృత్తి ఉద్యోగాల్లో ముందుండటం, కుటుంబ నియంత్రణ వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్‌కన్నా కొంత ఎక్కువ కాగా... ఆరు దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు అధికం. జనాభా ప్రాతిపదిక కాక, రాష్ట్రాల్లోని స్థానాలపై కొంత శాతం అధికంగా సీట్లిచ్చే విధానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచిస్తున్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ అధికరణానికి ఇది విరుద్ధం. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. కానీ జనాభారీత్యా యూపీ ఓటరు ఓటుకుండే విలువకన్నా తమిళనాడు లేదా కేరళ ఓటరు విలువ ఎక్కువుంది. ఈ వ్యత్యాసం కొనసాగనీయటం సమర్థనీయ మేనా అన్న సందేహం తలెత్తుతుంది.ప్రతి జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా, ఇందులో ఇమిడివున్న సమస్యలను పసిగట్టి గత పాలకులందరూ వాయిదాల్లో గడిపారు. 2000 సంవత్సరం వరకూ స్తంభింపజేస్తూ 1976లో... దాన్ని 2026 వరకూ పొడిగిస్తూ 2001లో రాజ్యాంగ సవరణలు తెచ్చారు. మొత్తానికి ఈ భారం ప్రస్తుత పాలకులపై పడింది. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఉత్తర–దక్షిణాల వ్యత్యాసం రాకుండా సమస్యను పరిష్కరించగలిగితే దేశ సమైక్యతకు అది దోహదపడుతుంది. -
సంక్షోభ సమయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు... అటు ఇరాన్ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్‌ను ఇరాన్‌తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే. యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్ ప్రతిదాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్ అంటున్నది. కనుక గల్ఫ్‌లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు. గల్ఫ్ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ సమయాల్లో పెద్దగా చర్చకు రాని విదేశాంగ విధానం సంక్షోభ కాలంలో ముందుకొస్తుంది. మనది మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తమ కాలంలో ఎప్పుడూ ఇలా లేదని కూడా చెబుతున్నారు. కానీ నాటి ద్విధ్రువ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అప్పుడు అలీన విధానం అని చెప్పుకున్నామేగానీ సోవియెట్‌కు సన్నిహితంగా మెలిగాం. అప్పట్లో అమెరికాపై దూకుడు ప్రదర్శించటం అందులో భాగమే. నిజంగా తటస్థంగా ఉన్నట్టయితే హంగేరీ (1956), జెకొస్లోవేకియా(1968), అఫ్గాన్(1979)లపై సోవియెట్ దురాక్రమణకు దిగినప్పుడు ఖండించి ఉండేవాళ్లం. మారిన పరిస్థితుల్లో భిన్న దేశాలపై వేర్వేరు అంశాల్లో ఆధారపడి ఉన్నామన్నది కాదనలేని సత్యం. నిజానికి అన్ని దేశాల పరిస్థితీ అదే. చైనా, రష్యాలు ఇరాన్‌కు గట్టి మద్దతుదార్లుగా నిలిచినా ఆపత్సమయంలో అవి తటస్థంగానే ఉండిపోక తప్పలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయటాన్ని చూపి, కనీసం రష్యా ఇరాన్‌కు నిఘా సమాచారాన్ని ఇచ్చింది. పరిస్థితులు మున్ముందు మరింత సంక్లిష్టంగా మారినా మారొచ్చు. ఈలోగా మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే మెరుగైన విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటే మంచిది. -
ట్రంప్‌కు జ్ఞానోదయం!
‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్‌తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్‌పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్. తీరా ఇరాన్‌తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.ఇరాన్ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగుతున్నారు? అసలు ఇరాన్ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్‌తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్‌తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్. ఆ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్‌లో 2003లో జార్జి బుష్... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్‌కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్ బోనపార్టే. యూరొప్ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి. -
రక్త బేహారులు
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రక్తం నల్లరంగులో ఉండేది. హీరోకో, హీరోయిన్‌కో నుదుటిన దెబ్బ తిగిలి రక్తం కారితే ‘కెవ్వు’మని కేక వేసి కళ్లు తిరిగి పడిపోయే పాత్ర ఒక్కటైనా ఉండేది. పాత సినిమాల ఫైటింగులన్నీ రక్తం కానరాని తుపాకీ మోతలే. ఢామ్మంటే ఒకడు పడేవాడు. ఢమామంటే మరొకడు. కత్తి యుద్ధాలన్నీ చుక్క నెత్తురు కారని కమ్మని కాలక్షేపాలే. కలర్ సినిమాలు వచ్చాక రక్తం రంగు తెర మీద ఎర్రగా కనిపించడం మొదలయ్యింది. అది కూడా ఆస్పత్రిలో బెడ్ పక్కన సీసాలో వేళ్లాడుతూ. హీరో తల్లికో, హీరోయిన్ తండ్రికో రక్తం కావాల్సి వస్తే ప్రేక్షకులు అప్పుడు రక్తం చూసేవారు. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు పెద్దయ్యి తానెవరో తెలియకనే తల్లికి రక్తం ఇవ్వడమనే సన్నివేశం మన సినిమాకు మాత్రమే సాధ్యమైన ఫార్ములా ఎమోషన్. దీనిని దర్శకుడు మన్మోహన్ దేశాయ్ సైన్స్‌కు అతీతంగా ఎత్తులకు చేర్చాడు. ‘అమర్ అక్బర్ ఆంథోని’లో హాస్పిటల్లో ఉన్న తల్లికి ఆమె తప్పిపోయిన ముగ్గురు కుమారులు ఒకేసారి రక్తం ఇస్తారు మూడు విడివిడి ట్యూబుల నుంచి. ఎమోషన్ పండి గల్లాపెట్టె నిండింది. ఇలాంటి అతి తార్కిక దర్శకుల మధ్యే, రక్తం అమ్మి రూమ్‌రెంట్ కట్టక తప్పని 1980ల నిరుద్యోలను చూపిన వేజెళ్ల సత్యనారాయణ వంటి గతితార్కిక దర్శకులు కూడా ఉండేవారు.మన సినిమాల్లో చాలా రోజులకుగానీ రక్తం పౌరుషానికి గుర్తుగా మారలేదు. హీరో చాలాసేపు మామాలుగా ఫైట్ చేశాక ఒక దెబ్బ పడి అతని పెదవి చిట్లుతుంది. అప్పుడు హీరో పాజ్ ఇచ్చి చిట్లిన పెదవి నుంచి కారే రక్తాన్ని చూపుడు వేలితో చూసుకుంటాడు. అలా చూశాడంటే హీరో చెలరేగిపోతాడని ప్రేక్షకులు ఈలల మోత మోగించేసేవారు. ఈ ధోరణి సాగుతుండగానే రక్తం సత్తా ఏమిటో ‘ప్రేమ్‌నగర్’లో వాణిశ్రీ చాలా గట్టిగా తెలుగు ప్రేక్షకులకు చెప్పారు. తాగుడుకు బానిసైన అక్కినేని ఎదుట, తన నుదుటి నుంచి కారిన రక్తాన్ని గ్లాసులో పట్టి, పెట్టి ‘ఊ.. తాగండి’ అంటే అక్కినేనికే కాదు ప్రేక్షకులకూ జుగుప్స కలుగుతుంది. అవును... రక్తమంటే జుగుప్స. భీతి. బీభత్సం. ఏవగింపు. రోత. ఏహ్యత. అసహ్యం.ఎన్ని మాటలనుకున్నా మన కమర్షియిల్ దర్శకులు మెచ్చదగినవారు. ఉత్తుత్తి ఫైటింగులన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చూపేవారు. హీరోలు కెమెరా ముందు నిలబడి కెమెరాపై ముష్టిఘాతాలు విసిరి సరిపెట్టుకునేవారు. అయితే నిజంగా రక్తం వచ్చేలా ఒక హత్య చేస్తే ఎలా ఉంటుందో మొదటిసారి రామ్‌గోపాల్ వర్మ తెర మీద ఉలికిపాటుతో చూపించారు. ‘శివ’ సినిమాలో రక్తం పైకి కనిపించకపోయినా కథలో, ప్రేక్షకుడి మానసిక ఆవరణలో అంతటా వ్యాపించి ఉంటుంది. రక్తంతో చెలగాటం ప్రాణాంతకం అని ఈ సినిమా చూసిన తెలివైనవారు గ్రహిస్తారు.అయితే దేశమంతా ఏ భాషకు ఆ భాష ఉన్నా అందరికీ అర్థమయ్యే భాష ‘రక్తభాష’ అని దర్శకులు మెల్లగా కనిపెట్టారు. సినిమాను పాన్ ఇండియా చేస్తూ హీరోకొక ఆయుధం చేతికిచ్చారు. ఒక సినిమా ముగిసేలోపు కనీసం వంద మందిని ఊచకోత కోయకపోతే అతను హీరో కాదు ఆ సినిమా పాన్ సుపారీ కాదు అని బాక్సాఫీసు సాక్షిగా తేల్చారు. ప్రతి సినిమా విడుదల సమయంలో హీరో చేతికి ఉన్న సరికొత్త ఆయుధాన్ని చూస్తే ప్రేక్షకులకు ఉద్రేకం వచ్చి బుక్ మై షో వైపు వేళ్ల కదలికలు సాగుతున్నాయి. నెత్తురు అలవాటు చేశారు. నెత్తురు చూడటం అలవాటుగా మారింది. నెత్తురును చూస్తే భీతి, ఏహ్యత, అసహ్యం కలగడంలేదు. నెత్తురు ఇప్పుడు ప్రేక్షకుడి పాలిట డోపమైన్.యుద్ధంలో చిట్టచివరి నైచ్యం స్త్రీలను, పిల్లలను, రోగులను చంపడం. యుద్ధం వస్తే ఇప్పుడు మొదట వాళ్లనే చంపడాన్ని ‘నార్మలైజ్’ చేశారు. అత్యంత దారుణాలన్నీ ‘సాధారణ విషయాలు’గా మార్చే కొద్దీ, మారే కొద్దీ ఏమవుతుంది? ప్రతిస్పందన మాయమవుతుంది. నిరసన, ప్రతిఘటన, తిరుగుబాటు... అన్నీ మనకెందుకులే అని మంచినీరు తాగి పడుకుంటాయి. మనిషిలోని మృగ నిష్పత్తి పెరుగుతుంది. తెర మీద ఎంత రక్తం కనపడితే అంత హిట్ చేస్తున్న యువత ఏ వెలుతురుకు పురోగమిస్తుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? పిల్లల వేలు తెగితే తల్లడిల్లే తల్లిదండ్రులు తెర మీద డ్రమ్ముల కొద్దీ నెత్తురు చూస్తున్న పిల్లల గూర్చి ఏమనుకుంటున్నారో! ఇలాంటివి తీస్తున్న దర్శకుల ఇంటి ముందు రోజూ లోటాడు నెత్తురక్కర్లేదు ఎర్రరంగు ప్రత్యక్షమైతే రంజుగా ఉంటుందంటారా? రక్తం ప్రచండ శక్తి. అందుకే ప్రకృతి దానిని ఒంట్లో దాచి ఉంచింది. అట్లాగే ఉండనివ్వండి. -
ఇరాన్ ఊబిలో ట్రంప్!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ యుద్ధం పద్దెనిమిదో రోజుకు చేరుకున్నా ఆ రెండు దేశాలకూ దారీతెన్నూ తోచడం లేదు. మంగళవారం కీలకమైన ఇద్దరు ఇరాన్ నేతలు అలీ లారిజానీ, సులేమానీలనూ, బుధవారం మరో అగ్రశ్రేణి నేత ఇస్మాయిల్ ఖతీబ్నూ హతమార్చామని అమెరికా, ఇజ్రాయెల్ ఘనంగా చెప్పుకున్నా ఈ పరిణామాల తక్షణ ప్రభావం పెద్దగా లేదని ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులే నిరూపిస్తున్నాయి. యుద్ధకాలంలో ఎవరి ఆదేశాల కోసమూ ఎదురుచూడకుండా ఏయే దశల్లో ఎలా స్పందించాలో దేశం నలుమూలలా మోహరించి ఉన్న సైనిక దళాలకు ముందే నిర్దేశించి ఉండటం ఇందుకు కారణం. యుద్ధరంగంలో సాధిస్తున్న విజయాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా ఆయనకు ప్రతికూలతలే ఎదురవుతున్నాయని మంగళవారం నాటి రెండు పరిణామాలు చాటుతున్నాయి. హార్మూజ్ జలసంధి విముక్తికి యుద్ధ నౌకలతో, విమానాలతో తరలి రావాలన్న ట్రంప్ పిలుపును నాటో దేశాలు తిరస్కరించాయి.‘మీ యుద్ధంతో మాకేమిటి సంబంధమ’ంటూ ఎదురు ప్రశ్నించాయి. దానికితోడు అమెరికా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా భద్రతకు ఏమాత్రం ముప్పులేని ఇరాన్‌పై యుద్ధం ప్రకటించటం అనైతికమని ఆయన ప్రకటించారు. జో కెంట్ మొదటి నుంచీ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు. ‘మాగా’ ఉద్యమ సూత్రధారుల్లో ఒకరు. ట్రంప్ చుట్టూ చేరిన పాలనా వ్యవస్థలోని ఇజ్రాయెల్ అనుకూలురు, ప్రధాన మీడియా ఆయన్ను పక్కదోవ పట్టించాయన్నది కెంట్ అభియోగం. ట్రంప్‌ది అమాయకత్వమా, మూర్ఖత్వమా అన్న సంగతలా ఉంచి అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ మాటే చెల్లుబాటవుతున్నదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్ కోసమే అయినా రెండు దేశాలూ సమాన స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. అమెరికా ఇంతవరకూ 7,000 లక్ష్యాలపై విరుచుకుపడగా, ఇజ్రాయెల్ 7,600 దాడులు చేసిందని సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతున్నాయి. సైనికంగా ఇరాన్‌ను బలహీనపరచటం శక్తిమంతమైన అమెరికాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గరున్న డ్రోన్లూ, క్షిపణులూ కాలం గడుస్తున్నకొద్దీ తగ్గిపోవచ్చు. అదే పరిస్థితి కాస్త వెనకో ముందో ఇజ్రాయెల్, అమెరికాలకు కూడా ఎదురవుతుంది. కానీ దీర్ఘకాలం ఈ యుద్ధాన్ని సాగదీయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థనూ, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఇరాన్కుంది. గత నెల 24న జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించినప్పుడు అందులో ఎక్కడా ఇరాన్ ప్రస్తావన లేదు. ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం గురించే ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించటంతో అవి పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్నాయి. మున్ముందు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. అందుకే ట్రంప్ విజయాలేవీ అమెరికన్లను రంజింప జేయలేక పోతున్నాయి. కనుకనే అందరిపైనా ట్రంప్ ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మాట వినని నాటో మాత్రమే కాదు... నిలదీస్తున్న రిపబ్లికన్లు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ‘మాగా’ ఉద్యమ కారులు ఆయన్ను కుదురుగా ఉండనీయటం లేదు. ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు రుజువు. తొలుత బ్రిటన్ సాయాన్ని అర్థించి, ఆ తర్వాత హార్మూజ్ విముక్తికి సహకరించమని నాటోతోపాటు చైనాను కూడా వేడుకుని, వారంతా నిరాకరించాక ఇరాన్‌ను ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఆయన మానసిక స్థితిని వెల్లడిస్తోంది. నాటోను కోరడంలో వింతేమీ లేదు. కానీ ఆర్థిక రంగంలో సవాలుగా మారిన చైనాను అర్థించటం ట్రంప్ బలహీనతను బయటపెడుతోంది. 2003 నాటి ఇరాక్ దురాక్రమణ అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తే, ఆ మేరకు చైనా లాభపడింది. ఇప్పుడు సైతం చైనా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుండగా, అది సాయ పడుతుందని ట్రంప్ ఎలా అనుకున్నారో అనూహ్యం. మొత్తానికి ఆయన ఇరాన్ అనే ఊబిలో దిగబడ్డారు. దాన్నుంచి బయటపడటం సులభమేం కాదు. -
యుద్ధమంటే...
యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్ ‘వార్ అండ్ పీస్’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! -
బెంగాల్ ‘సర్’ తేలేదెప్పుడు?
నిరుడంతా బిహార్‌లో కలకలం సృష్టించి, బెంగాల్లో అంతకుమించిన వివాదాలతో గత నెల 28న ముగిసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మొత్తానికి 8.09 శాతం మంది ఓటర్లు... అంటే 60.06 లక్షల మంది జాబితాల నుంచి కనుమరుగై, నికరంగా 7.04 కోట్ల మంది అసలైన ఓటర్లుగా తేలారని ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతోంది. జాబితాలో లేనివారు న్యాయనిర్ణయ పరిధి(అజ్యుడికేషన్)లో ఉన్నట్టు లెక్క. ఇలాంటి వారి వినతులను పరిష్కరించటానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్‌ను మంగళవారం కోరింది. ఈ ప్రక్రియ ముగిశాకే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలుంటాయా... ముందే పూర్తవుతాయా అన్నది చెప్పేవారు లేరు. సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమారే ఆ విషయంలో స్పష్టత ఇవ్వటానికి నిరాకరించారు. చాలా అంశాల్లో ఇలా మౌనంగా ఉండిపోవటం ఆయనకు అలవాటే కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు. మన దేశంలో మంచికో చెడుకో అట్టడుగు ప్రజానీకంలో దృఢమైన విశ్వాసం ఒక టుంటుంది. ఓటు హక్కు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయినవాళ్లతో సమానమని వారు నమ్ముతారు. నిజానికి అంత నమ్మకం ఉండబట్టే... పార్టీలు దొంగ హామీలిచ్చి నెగ్గుతూ, అటుపై అధికారం వెలగబెడుతూ వంచిస్తున్నా మరో దఫా ఎన్నికల్లో ఓటేయటానికి ఎంతో నిబద్ధతతో క్యూలో నిలబడతారు. సామాన్యుల్లో ఉన్న ఈ అచంచల విశ్వా సమే మన ప్రజాస్వామ్యాన్ని ఈ మాత్రంగానైనా నిలబెడుతోంది. బిహార్‌లో ‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లోనే ప్రధాన పోరాటం సాగింది. బెంగాల్ పరిస్థితి భిన్నం. అక్కడున్నది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నిరసనలు, ఇతరత్రా ఉద్యమాలు జోరుగానే కొనసాగాయి. అలాగని న్యాయస్థానా లను విస్మరించలేదు. స్వయానా మమత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో ఊరటనిచ్చేవి. ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు గోడు చెప్పుకోవటానికి హైకోర్టు పర్యవేక్షణలో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడతాయి. నిర్ణయాధికారం అధికారులకే అప్పగిస్తే ఇష్టానుసారం చేస్తారన్న భయం ఉండేది. కానీ ట్రిబ్యునళ్లు ఈ సమస్య లేకుండా చేశాయి. నిజానికి ఈ వివాదానికి మూలం ఈసీ తీరులో ఉంది. ఫలానా ప్రాంతంలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఇక్కడ ఉండటం లేదనో, దొంగ ఓటరనో ఫిర్యాదు చేయడానికి ‘ఫామ్–7’ వెసులుబాటు ఉంది. అయితే అలా ఫిర్యాదు చేసినవారి వివరాలు చాలా సందర్భాల్లో సక్రమంగా లేవు. ఎదుటి పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోని ఓటర్లు నకిలీలని వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. దాదాపు అన్ని పార్టీలూ ఈ పనిచేశాయి. వాటి ఆధారంగా ఓటర్లకు నోటీసులీయటం, పత్రాలు తీసుకురావాలని ఆదేశించటం, తీరా నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడటం, పేర్లలో అక్షరక్రమం కొంచెం తేడావచ్చినా అనర్హులుగా జమవేయటం సాధారణ ఓటర్లకు తలనొప్పిగా మారింది. చిత్రమేమంటే ఒక బీజేపీ నాయకురాలి పేరుమీద దాఖలైన ఫిర్యాదుల సంగతి అధికారులు చెబితేగానీ ఆమెకు తెలియలేదు. దొంగ ఫిర్యాదులపైనా, వాటి ఆధారంగా నిర్ణయం తీసుకున్న వారి పైనా వెనువెంటనే చర్యలుంటే ఈ అరాచకం ఆగేది. కానీ దానికి సమయం పడుతుంది. బంగ్లాదేశ్‌కు పొరుగున ఉండటం బెంగాల్ ముస్లింలకు తలనొప్పిగా మారింది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవారు కూడా అక్రమ వలసదారులన్న ఫిర్యాదులతో అందు కవసరమైన పత్రాలు సేకరించలేక, పత్రాలున్నా పరిశీలనలో పేర్లలో కనబడిన స్వల్ప తేడా వల్ల జాబితాల నుంచి గల్లంతైనవారు అనేకులు. ఇలాంటి సమస్యలుంటాయని ఎన్నికల సంఘం ముందే అంచనా వేసి, తరుణోపాయం సూచిస్తే ప్రజలు న్యాయ స్థానాలకెక్కే అవసరం ఉండకపోయేది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా మిగిలిపోయిన ఎన్నికల సంఘం ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది? నిజమైన ఓటర్లకు సత్వరన్యాయం లభించాలని కోరుకోవటం మినహా ఎవరూ చేయగలిగింది లేదు. -
తిప్పలు తప్పని యుద్ధం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్‌పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్కు రోమ్పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్‌కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి. నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్‌పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం. యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్‌తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే! -
నేపాల్‌పై యువకేతనం
ఉవ్వెత్తున ఎగసిన నేపాల్ యువ తరంగంలో ఆర్నెల్లు దాటుతున్నా ఆగ్రహాగ్ని చల్లారలేదని, దాని సంకల్పం చెదరలేదని గత గురువారం నాటి పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. నేరుగా ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) 125 సొంతం చేసుకుని ప్రజాస్వామ్యంతో ఇన్నాళ్లూ చదరంగమాడిన ప్రధాన పక్షాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసింది. మరో 110 మందిని ఆ యా పార్టీలకొచ్చిన ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ పార్టీకీ తిరుగులేని మెజారిటీ ఉండరాదన్న ఆలోచనతో నేపాల్ దేశ రాజ్యాంగంలో ఈ ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని పొందుపరిచారు. తీరా ఆర్ఎస్పీ దాన్ని సైతం అధిగమించి మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. గెలుపు కోసం ప్రచార పటాటోపం, విచ్చలవిడి వ్యయం అవసరం లేదని, కేవలం హ్యాష్టాగ్లే ప్రత్యర్థులను మట్టికరిపిస్తాయని ఆర్ఎస్పీ నిరూపించింది. కీలకమైన అంశం ఏమంటే పట్టణాలు, పల్లెల వ్యత్యాసం లేకుండా అన్నిచోట్లా వామపక్షాలు, నేపాలీ కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యాయి.నేపాల్ మాదిరే శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కూడా యువత తిరగబడి పాలకులు పదవులు వదిలి పారిపోయేలా చేసింది. కానీ ఆ రెండుచోట్లా ఎన్నికల సమయానికల్లా సంప్రదాయ పక్షాలు ప్రత్యక్షమయ్యాయి. శ్రీలంకలో 1960లో ఏర్పడిన జనతా విముక్తి పెరుమున(జేవీపీ), బంగ్లాలో 1980లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) విజేతలయ్యాయి. అక్కడ ఉద్యమంలో ముందుండి పనిచేసిన యువతకు అధికారంలో చోటు దక్కలేదు. కానీ నేపాల్ పరిస్థితి వేరు. సామాజిక మాధ్యమాల నిషేధంతో ఆగ్రహించి వీధుల్లోకొచ్చిన యువతకు ఆర్ఎస్పీకి చెందిన 35 ఏళ్ల బాలేంద్ర షా, ఇతర నేతలు మార్గదర్శనం చేశారు. వారితోపాటే నడిచారు. వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చారు. పర్యవసానంగా ఈసారి ఎన్నికల్లో పార్టీల, నాయకుల కంచుకోటలు అనుకున్నవి తునాతునకలయ్యాయి. వీటన్నిటా గతానుభవం లేని యువత విజేతలయ్యారంటే సాధారణ ప్రజానీకం పాత తరంతో ఎంత విసుగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. అజేయుడనుకున్న మాజీ ప్రధాని కేపీ ఓలిశర్మ... బాలేంద్ర షా చేతిలో అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు విప్లవ వీరుడిగా నీరాజనాలందుకున్న మావోయిస్టు సెంటర్ నాయకుడు ప్రచండ అతి కష్టం మీద గట్టెక్కారు. ఆయన పార్టీకి ఒక డజను స్థానాలు మించి వచ్చే అవకాశం లేదు.అయితే ప్రధాని కాబోతున్న బాలేంద్ర షా ముందు ఎవరెస్టు శిఖరాన్ని తలపించేలా సమస్యలున్నాయి. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆర్థిక వ్యత్యాసాలు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. ఉద్యోగాలు లేక జనాభాలో మూడోవంతు మంది చిన్నా చితకా ఉద్యోగాల కోసం భారత్ సహా పలు దేశాలకు వలస పోతున్నారు. వారు ప్రతి నెలా కుటుంబాలకు పంపే డబ్బే నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. నేపాల్ జీడీపీలో ఇది 28 శాతం. జలవిద్యుదుత్పాన మినహా ఖజానా కళకళలాడటానికి తోడ్పడే సహజ వనరులు లేవు. లోటు ఆర్థిక వ్యవస్థ, అరకొర వేతనాలు నేపాల్‌కు శాపాలు. మన దేశం తోడ్పాటునిస్తే ఉపాధి కల్పనకు బాటలు పరిచే ప్రాజెక్టులు వస్తాయని యువత ఆశిస్తోంది. అందుకే కావొచ్చు... ప్రతి ఎన్నికల్లోనూ రివాజుగా కనబడే భారత వ్యతిరేకత ఈసారి దాదాపు కనుమరుగైంది. సుస్థిర పాలన వుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అది లేకపోవటమే నేపాల్ ఎదుగుదలకు ఇన్నాళ్లూ ఆటంకంగా మారింది. పాలన అంటే నిరసనోద్యమాలు నడపటమంత సులభం కాదు. ఉద్యమకారుడి గెటప్ నుంచి సమర్థ పాలకుడిగా బాలేంద్ర పరివర్తన చెందాల్సి ఉంది. అసలే కోవిడ్ మహమ్మారితో విదేశాల్లో కొలువులు కొడిగడితే, వర్తమాన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆ సమస్యను మరింత పెంచాయి. లుంబినీ వనం, ఎవరెస్టు శిఖరం ఉన్నా పర్యాటక రంగం ఎదుగుదల లేదు. ఇవన్నీ మళ్లీ పట్టాలెక్కాలంటే పారదర్శక పాలన, నిపుణుల తోడ్పాటు, ఇరుగుపొరుగు ఆపన్న హస్తం అవసరం. మూణ్ణెల్లు గడిస్తే చాలు... జనం నిలదీయటం మొదలుపెడతారు. గత పాలకుల కన్నా భిన్నమైనవాడినని నిరూపించుకోవటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించటం బాలేంద్రకు తక్షణ సవాళ్లు. -
పేరు మాయని మనిషి
అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్ను కాదని రష్యన్‌ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్‌ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్‌లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్‌కు అందింది. అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్‌కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్‌స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్‌ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్‌ను కలుపుకోవచ్చు. -
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’ అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్‌లో మైమరిచిపోవాలి. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్! మీ నాయకుడు క్రిస్టియన్. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.భారత్‌ను లౌకిక (సెక్యులర్) రిపబ్లిక్‌గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు. అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్‌ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్‌లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్మోహన్రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్ సర్కార్ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి ఫేక్ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?... ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అక్షరాలా ఉగ్రవాద చర్య
ఒకపక్క చర్చలు సాగుతుండగా అన్ని రకాల నీతి నియమాలనూ కాలదన్ని ఇరాన్‌పై దండయాత్ర ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిగజారుడుతనం ఉన్నకొద్దీ మితిమీరుతోంది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్ర జలాల్లో 130 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై జలాంతర్గామి ద్వారా దొంగదెబ్బ తీసి 92 మంది నావికుల మృతికి కారణం కావటం ఆ వరస లోనిదే. భారత నావికాదళం ఆహ్వానంపై విశాఖలో ‘మిలన్–2026’ నావికాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెడుతుండగా ఈ దాడి జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి అణు జలాంతర్గామి ద్వారా టార్పెడోను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశామని అమెరికా సంబరంగా ప్రకటించుకుందిగానీ... ఈ చర్య అనేక విధాల ఖండనార్హమైనది. భద్రతా మండలిలో రష్యా, చైనాలు చెప్పినట్టు ‘అంతర్జాతీయ ఉగ్రవాద చర్య’. ఆ రెండు దేశాల వల్లా ఉద్రిక్తతలు పెరగటం ఒక్కటే కాదు... ఆ బాంబులు, క్షిపణుల్లో వాడే రసాయనాల వల్ల పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుంది. ధ్వంసమైన నౌక నుంచి లీకవుతున్న చమురు వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని శ్రీలంక వ్యక్తం చేస్తున్న ఆందోళన కూడా సహేతుకమైనది. ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి ఆ నౌక వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశాలకుండే సార్వభౌమత్వం వాటికి సంబంధించిన నౌకలకు సైతం వర్తిస్తుంది. ముఖ్యంగా ఘర్షణ ప్రాంతాల్లో కాక ప్రశాంత జలాల్లో పయనించే సైనిక నౌకలను ‘నిరపరాధ’ నౌకలంటారు. ముందస్తు సమాచారంతో వెళ్లే ఆ నౌకలపై ఎవరూ దాడి చేయరు. ప్రాదేశిక సముద్ర ప్రాంతం, దాని చేరువ ప్రాంత జలాల్లో వెళ్లే యుద్ధ నౌకల విషయంలో పాటించాల్సిన నీతిపై 1958లో అంతర్జాతీయ ఒడంబడిక కుదిరింది. దానిపై అందరితోపాటు అమెరికా కూడా సంతకం చేసింది. దాన్ని బేఖాతరు చేయటం దానికదే పెద్ద నేరం. ఇదెక్కడి రణనీతి? మన ఆహ్వానంపై వచ్చి వెడుతున్న అతిథి వంటిది ఆ నౌక. మన మిత్రదేశంగా ఉంటూ మన సంప్రదాయాలను ఉల్లంఘించి దానిపై దాడి చేయటం అమెరికా అమిత్ర చర్య. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతి మండలంగా ఉంచాలని దశాబ్దాలుగా మన దేశం చేస్తున్న కృషికి తూట్లు పొడవటం కూడా! మనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అణు జలాంతర్గామిని ఇటువైపు పంపడం ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒడంబడిక రీత్యా కూడా అత్యంత దారుణమైనది. 2021లో కూడా ఎలాంటి సమాచారమూ లేకుండా లక్షద్వీప్ సమీపంలో అమెరికా నావికా విన్యాసాలకు తెగబడింది. అందుకే భారత నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ చెప్పినట్టు ఇది మన సరిహద్దుల్లోకి యుద్ధాన్ని విస్తరింపజేయటంతో సమానం. కనుక అమెరికాకు మన అసంతృప్తిని తెలియజేయటం అత్యంత అవశ్యం. మిలన్ అంటే స్నేహపూర్వక కలయిక లేదా సమ్మేళనం. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు మన దేశం ఆ పేరు పెట్టడంలోనే సుహృద్భావం, సహకారం, ఐక్యత ధ్వనిస్తున్నాయి. అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ సముద్ర జలాల భద్రత కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నది ఈ సమ్మేళనం ఆంతర్యం. అన్నిటికన్నా ముఖ్యం– ప్రశాంత జలాల్లో ఇటువంటి దాడి జరిగితే గాయాల పాలైన నావికాదళ సభ్యుల్ని కాపాడటానికి ప్రయత్నించాలన్నది అన్ని దేశాల నావికా దళాలు పాటించే అలిఖిత నియమం. ఈ ఘనకార్యం తర్వాత అమెరికా జలాంతర్గామి కనీసం అక్కడ అర క్షణమైనా నిలబడే ప్రయత్నం చేయకుండా పరారైన తీరు సిగ్గుచేటైనది.అంతర్జాతీయ చట్టాలతోపాటు స్వదేశీ చట్టాలను కూడా ఉల్లంఘించి యుద్ధం మెదలెట్టిన ట్రంప్ తాను ఎవరికీ జవాబుదారీ కాదనుకుంటున్నారు. దీన్నెవరూ అంగీకరించకూడదు. అమెరికా, ఇజ్రాయెల్‌ల తప్పుడు చర్య వల్ల పశ్చిమాసియా రణరంగంగా మారి ఎగుమతులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో నెల్లాళ్లవరకే వంటగ్యాస్ నిల్వలున్నాయంటున్నారు. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ రెండు దేశాల తప్పుడు చర్యను ఖండించటానికి ప్రభుత్వాలు సంశయిస్తున్న వేళ ఆ దేశాల ప్రజలతో సహా ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసిస్తే తప్ప ఈ దుండగం ఆగదు. -
మళ్లీ బలపడిన బంధం
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారి దెబ్బతింటే అతుక్కోవటం అంత సులభం కాదు. అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. గత రెండేళ్లుగా అందుకోసం తెర వెనుక సాగిన ప్రయత్నాలన్నీ ఫలించి కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4.65 లక్షల కోట్లకు చేరుకునేలా ఇరుదేశాలూ కృషి చేయాలన్న నిర్ణయం జరిగింది. అలాగే అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచటానికి కెనడా అంగీకరించింది. దీని విలువ రూ. 17,403 కోట్లు. ఇవిగాక పునరుత్పాదక ఇంధన వనరులతో సహా పలు అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు... రెండూ అకారణంగా ఇరాన్‌పై విరుచుకుపడుతున్న పర్యవసానంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతా అలుము కున్న అస్థిర వాతావరణం నేపథ్యంలో భారత్, కెనడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవటం మంచి సందేశం పంపుతుంది.ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల సంబంధాలు దెబ్బతినటం నిజమే కావొచ్చు గానీ... అంతకు చాన్నాళ్లముందే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అనుసరించిన విధానాలు ఇరుదేశాల మధ్యా పొరపొచ్చాలు పెంచాయి. కెనడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు కోసం ఆయన వేర్పాటువాదులను ప్రోత్సహించారు. భారత్‌లో నేరాలు చేసి వచ్చిన వేర్పాటువాదులను అప్పగించేందుకు ఆయన ప్రభుత్వం నిరాకరించేది. అందుకే 2018లో ట్రుడో మన దేశం పర్యటనలో ఘనమైన స్వాగత సత్కారాలు లభించలేదు. ట్రుడోను భారత్ అవమానించిందంటూ కెనడా మీడియా వ్యాఖ్యానించింది కూడా! నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ఆరోపించటం, అక్కడి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించటానికి దోహదపడ్డాయి. వేర్పాటువాదులను ఆదరిస్తే జరిగేదేమిటో ట్రుడోకు నిరుడు ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రుడో నాయకత్వం కొనసాగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చటంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్ కార్నీ స్వల్పకాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని పార్టీ విజయావ కాశాలు పెంచగలిగారు. మెరుగ్గా కనబడిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ వెనకబడటం మొదలైంది. ఈలోగా అమెరికాలో ట్రంప్ ఏలుబడి మొదలైనాక ఆయన కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనటంతో పాటు ఏకపక్షంగా సుంకాలు విధించటం ట్రంప్‌కు సన్నిహితంగా మెలిగిన ఆ మితవాద పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది.నిరుడు కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాక దౌత్యసంబంధాలు చిగురించటం మొదలైంది. అంతక్రితం నిజ్జార్ వ్యవహారంలో ఆరోపణలు, దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ వంటివి జరగ్గా, నిరుడంతా ఇరుదేశాలూ హైకమిషనర్లను నియమించుకోవటం, రెండు దేశాల మధ్యా వివిధ మంత్రిత్వశాఖల స్థాయిలో సమన్వయం సాధించటం వంటివి చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పల్టీలు కొడుతుండగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక విధిస్తున్న సుంకాలు మరింత కుంగదీస్తున్నాయి. కెనడా కూడా చాలావిధాల దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవటం ఆ దేశానికి తప్పనిసరైంది. ఇటు మన దేశం కూడా రాగల కాలంలో విద్యుదుత్పాదనను విశేషంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మన అణువిద్యుదుత్పాదన 6,780 మెగావాట్లు మాత్రమే. వచ్చే దశాబ్ది ప్రారంభానికి ఇది 22,500 మెగావాట్లకు చేరాలి. 2047 నాటికి 100 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తయితే తప్ప మన అవసరాలు తీరబోవన్న అంచనాలున్నాయి. పదేళ్లపాటు యురేనియం ఎగుమతి చేసేందుకు కెనడాతో కుదిరిన ఒప్పందం ఇందుకు దోహద పడుతుంది. అయితే ఇరు దేశాల మధ్యా ఇంకా అపోహలు లేకపోలేదు. కలిసి కదలటం మొదలుపెడితే, స్నేహసంబంధాలు మెరుగవుతుంటే అలాంటివి పటాపంచలవుతాయి. ఆ దిశగా కార్నీ పర్యటన ఒక ముందడుగు. -
వేట్లపాలెం దోషులెవరు?
అంటించి వదిలేస్తే చాలు నింగిలోకి దూసుకెళ్తూ, ఆ వెంటనే ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ, నక్షత్రాలు రాలుస్తూ, రంగురంగుల పొగలు కక్కుతూ, చిత్రమైన ధ్వనులు చేస్తూ అబ్బురపరిచే బాణాసంచా తయారీ ప్రాణాంతకమైన పరిశ్రమ. అక్కడ పనిచేయటం నిప్పుతో చెలగాటం. చిన్న ఏమరుపాటు సైతం పెను నష్టానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో శనివారం మిట్టమధ్యాహ్నం ఒక బాణాసంచా గోడౌన్లో రెండు గంటల పాటు నిరంతరాయంగా జరిగిన పేలుళ్ల పర్యవ సానంగా ఇంతవరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం భద్రత, పర్యవేక్షణల్లో మరోసారి మన డొల్లతనాన్ని చాటింది. పేలుడు ధాటి ఏ స్థాయిలో ఉందంటే... శరీర భాగాలు ఛిద్రమై విసిరేసినట్టు పడ్డాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండాల్సిన ఘటనాస్థలిలో పేలుడు సమయంలో 45 మంది ఉన్నారని అంటున్నారు. ఈ ఉదంతంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇంత జరిగాక అక్కడకు పోయిన మంత్రులు నమోదైన సంఖ్యకు మించి పనివారిని అక్కడుంచారనీ, పరిమితి కన్నా ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనీ, అధికారుల పర్యవేక్షణ లేనేలేదనీ చెబుతున్నారు. ఇవన్నీ తమ పాలన నిర్వాకమేనని... జరిగిన విషాదంలో తమకూ నైతిక బాధ్యత ఉంటుందనీ వారికెవరు చెప్పాలి? కార్మిక శాఖ పట్టించుకోదు. పోలీసు నిఘా ఉండదు. అగ్నిమాపక విభాగానికి అసలే పట్టదు. ఆ రోడ్డు పక్కనుంచి తరచూ మంత్రులు, వారి అనుచరగణం రాకపోకలు సాగిస్తున్నా, పొలాల మధ్యలో అక్కడ సాగుతున్న కార్యకలా పాలేమిటన్న ఆరా ఉండదు. కనీసం అధికారుల్ని అడిగి తెలుసుకుందామన్న స్పృహ కూడా ఉండదు. ఇక ఇటువంటి ఘోరాలు చోటుచేసుకోవటంలో ఆశ్చర్యమేముంది? ఇలాంటి ఘటనల్ని ప్రమాదాలంటాం గానీ... నిజానికి అవి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా దాపురించే ఘోరాలు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి అమలును పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం, పర్యవేక్షించటంలో విఫలమైన ఉన్నతాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటం వంటివి తప్పనిసరి చేయాలి. కానీ అలాంటివేమీ జరగటం లేదు. నిబంధనలకేం... చాలా ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలనీ, ఆ కేంద్రంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలనీ, షెడ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి కనీసం రెండు గంటలపాటు అగ్నిని నిరోధించగలగాలనీ, బాణసంచా పనిలో ఉండేవారు ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలనీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిందేమిటో అవగాహన కలిగి ఉండాలనీ నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రాథమిక వైద్య సదుపాయం, అగ్నిమాపక సిలెండర్లు, అయిదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు నింపిన బకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవన్నీ అమలవుతున్నాయో లేదో చూసేదెవరు? దేశంలోని బాణసంచా పరిశ్రమల్లో చిన్నవో, పెద్దవో తరచు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో, కార్మికుల భద్రత గురించి శ్రద్ధ చూపటంలో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రదర్శించే హడా విడి మరికొన్ని రోజులకే కనుమరుగవుతుంది. మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగానే ఉందన్న భ్రమ ఆవరిస్తుంది. సాధారణ సమయాల మాటెలా ఉన్నా కనీసం పండు గలు, శుభకార్యాల సమయాల్లోనైనా బాణసంచా పరిశ్రమలపై దృష్టిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం అధికార యంత్రాంగంలో లోపిస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రోజుకు దాదాపు 12 గంటలసేపు పనిచేయిస్తారు. కార్మికులు ఊపిరి తీసుకోవటానికి కూడా వ్యవధి చిక్కనంతగా పనిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.వేట్లపాలెం ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపించాలి. అధికారులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా బాణసంచా తయారీ కేంద్రాలను సందర్శించేలా, లోటుపాట్లు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఏర్పరచాలి. కార్మిక శాఖ, పోలీసు, అగ్నిమాపక, విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. వాటిమధ్య సమన్వయం ఉండాలి. ఇవేమీ లేకుండా మీడియా కోసం ఆగ్రహావేశాలు నటించటం వల్ల ప్రయోజనం ఉండదు. -
రంగుల కల
ప్రకృతి వర్ణభరితంగా ఉంటుంది. వసంతాగమన వేళ చెట్టు చేమలు హరితహాసాలు చిందిస్తాయి. చెట్లకు, మొక్కలకు పూచే పువ్వులు రకరకాల రంగులతో కనువిందు కలిగిస్తాయి. నేల మీద మట్టిలోనూ రకరకాల వన్నెలు కనిపిస్తాయి. ప్రతిరోజూ పొద్దుపొడుపు నుంచి పొద్దుగూకే లోపు నీలాకాశం కూడా వన్నెలు మారుతూ ఉంటుంది. నింగిలో ఎగిరే పక్షులు, నేల మీద సంచరించే జీవులు నానా రంగుల్లో ఉంటాయి. వర్షర్తువులో ఆకాశంలో మెరిసే ఇంద్రచాపం సప్తవర్ణాలతో అలరిస్తుంది. దేశదేశాల్లోని మనుషుల్లోనూ వర్ణవైవిధ్యం కనిపిస్తుంది. జీవవైవిధ్యమే కాదు, అందులోని వర్ణవైవిధ్యమూ ప్రకృతి సహజ లక్షణం. నేలకూ నింగికీ నడుమ కనిపించే వన్నెచిన్నెలే ప్రకృతి చేవ్రాలు.ఒకవేళ రంగులే లేకుంటే, ప్రకృతి ఎంత నిస్సారంగా ఉండేది! ఒకవేళ అన్నీ ఏకవర్ణంలోనే ఉంటే, ప్రకృతి ఎంత నిర్లిప్తంగా ఉండేది! వర్ణహీనత అయినా, ఏకవర్ణ పరివ్యాప్తి అయినా ప్రకృతికి స్వభావ విరుద్ధాలు. వర్ణవైవిధ్యాన్ని పండుగ చేసుకోవడానికి వసంతోత్సవం లాంటి వేడుకలు మొదలయ్యాయి. ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం ఒక సామూహిక వినోదమే కాదు, వైవిధ్యానికి ఆమోదం కూడా! రుతువులు మారినప్పుడల్లా ప్రకృతి తన వర్ణాలను మార్చుకుంటుంది. ప్రకృతి తన భావోద్వేగాలను వర్ణలిపిలో వ్యక్తం చేస్తుంది. ‘రంగులు కూడా స్వభావాల మాదిరి గానే భావోద్వేగాలను అనుసరిస్తాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. రంగుల మర్మం చిత్రకారులకెరుక, కవులకెరుక!‘కాలమనియెడు చిత్రకారుండు గీచినవి / ఆరు ఋతువుల శబల చిత్రాల వృత్త / నర్తనమ్మిది ఋతువైభవ శ్రేణి దీప్తు / లలర చక్రమాగక నిరతము తిరుగుచుండు’ అన్నారు సాంధ్యశ్రీ. వైవిధ్యం ప్రకృతి స్వభావం. వైవిధ్యం ప్రజాస్వామిక లక్షణం. ‘వైవిధ్యంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. నిరంకుశత్వం వైవిధ్యాన్ని వ్యతిరేకిస్తుంది’ అని అమెరికన్ దౌత్యవేత్త సామ్ బ్రౌన్బ్యాక్ అన్నారు. ప్రకృతిలో మనుషులూ భాగమే! ప్రకృతిలోని వైవిధ్యమంతా మనుషుల్లోనూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో లెక్కకు మిక్కిలి భాషలు ఉన్నాయి; రకరకాల సంస్కృతులు ఉన్నాయి; మనుషులు సృష్టించిన కళలలో అనేకానేక శైలీభేదాలు ఉన్నాయి. వైవిధ్యమే లేకుంటే, మానవ సృజనకు ఆస్కారమెక్కడ? వైవిధ్యమే లేకుంటే మన జీవితాలు ఎంత నిస్సారంగా మారిపోతాయో ఊహించు కోగలమా?అనాదిగా మానవాళి వైవిధ్యాన్ని ఆమోదిస్తూనే ఉంది. అందుకు నిదర్శనమే హోలీ వంటి వసంతోత్సవాలు. హోలీ పండుగ గురించిన పురాణగాథలు ఎలా ఉన్నా, ఇది వైవిధ్యాన్ని వేడుక చేసుకునే రంగుల పండుగ. హోలీ వంటి పండుగలు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రీస్ దేశంలో జరుపుకొనే ‘ఫ్లోర్ వార్’ తీరు దాదాపు హోలీ మాదిరిగానే ఉంటుంది. ఈ వేడుకలో జనాలంతా వీథుల్లోకి చేరి, రంగులు కలిపిన పిండిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇరాన్లో జరుపుకొనే ‘చహార్శంబే సూరీ’ పండుగలో కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. గ్రీస్, ఇరాన్ దేశాల్లో కూడా ఈ రంగుల పండుగలను వసంతారంభంలోనే జరుపుకొంటారు.ప్రకృతిలోనే వైవిధ్యం ఉన్నప్పుడు మనుషుల్లోని వైవిధ్యాన్ని ఆమోదించడానికి శషభిషలు పడటంలో అర్థంలేదు. అయినా, కొందరికి వైవిధ్యం నచ్చదు. ప్రపంచమంతా తమ తీరులోనే ఉండాలనే మంకుపట్టు వారిది. ఇలాంటి మొండిశిఖండులకు దేశాధి కారం చేతికొస్తే, ప్రజలకు నిత్యనరకం తప్పదు. ఉదాహరణకు ఉత్తర కొరియానే తీసు కుందాం. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో అక్కడ నెత్తిమీద జుట్టు కత్తిరించుకునే తీరుకూ పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వామోదానికి భిన్నమైన తీరులో నెత్తిమీద జుట్టు పెంచుకుంటే, అక్కడ అంతే సంగతులు! వైవిధ్య వ్యతిరేక ధోరణులు ఇప్పుడు ప్రపంచ మంతటా ప్రబలుతున్నాయి. ఆహార, ఆచార, ఆలోచనా వైవిధ్యాలను విభేదాలుగా పరిగణించి, అసహనానికి ఆజ్యంపోసే శక్తులు కల్లోలాలను రెచ్చగొడుతున్నాయి. జీవ వైవిధ్యాన్నే కాదు, మానవాళిలోని సమస్త వైవిధ్యాలను కాపాడుకుంటేనే అది అసలైన వసంతోత్సవం కాగలదు; అదే అసలైన రంగుల పండుగ కాగలదు. -
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి కోడై కూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కోమాలోకి జారి పోయింది. రెండున్నర లక్షల మంది వలంటీర్లను నమ్మించి గొంతులు కోసింది కూటమి ప్రభుత్వం. సర్వేల పేరుతో పనిభారం పెంచి సచివాలయ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి పారిపోయేలా ప్రేరేపిస్తు న్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వారి ఆత్మహత్యలు, అకాల మరణాలు రికార్డయ్యాయి.నిస్సంకోచంగా, యథేచ్ఛగా, బరితెగించి సాగుతున్న లంచ గొండి దర్బార్లకు ప్రజాప్రతినిధులే గాడ్ఫాదర్లుగా వ్యవహ రించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. కీలక శాఖల్లో పనిచేసే అధికారులను ఏరికోరి నియమించుకొని వారి నుంచి నెలవారీ వాటాలను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు పదేపదే వినవస్తున్నాయి. అందుకు సంబంధించి కొందరు అధికారుల ఆడియోలు కూడా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులే స్వయంగా ఉద్యోగస్వామ్యాన్ని అనినీతి మేత కోసం ఉసిగొల్పు తున్నారు. ఈ పని చేస్తున్న సదరు ప్రజాప్రతినిధులకు నదురూ లేదు... బెదురూ లేదు. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెతను వారు శిరోధార్యంగా స్వీకరిస్తున్నారు.‘ఉద్యోగాల కల్పన’ అనే దేవతావస్త్రం పేరు చెబుతూ ఉర్సా, లుల్లూ అండ్ అదర్స్‌కు ఖరీదైన భూముల్ని కట్టబెడు తున్న ప్రభుత్వ పెద్దల దూకుడు నుంచి ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందుతున్నారు. పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న కల్తీ మద్యం కార్ఖానాల నుంచి పారుతున్న కరెన్సీ చూసి ఉత్తేజం పొందుతున్నారు. అధినాయకుడు తమ బంధుత్వాలను గౌరవించి వేలకోట్ల విలువైన భూముల్ని చుట్టబెట్టడం క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పులకింపజేస్తున్నది. సొంత పాల కంపెనీ, దాని అనుబంధ సంస్థల లాభాల కోసం దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగగలిగిన ఆ లాఘవం జూనియర్ నాయకులకు నిజంగా ఒక పాఠ్యాంశమే!పై స్థాయి నుంచి పొంగిపారిన స్ఫూర్తిని కింది స్థాయి కూడా అందిపుచ్చుకోవడంతో అవినీతి ప్రవాహం రాష్ట్ర మంతటా కట్టలు తెంచుకున్నది. దాని ఫలితమే కల్తీ పాల చావులు, కలుషిత జలాల మరణాలు, కృత్రిమ మద్యపు మరణ మృదంగం! పోషక బలాన్నిచ్చే పాలే కాటేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? ప్రాణావసరమైన మంచినీళ్లే ప్రాణాలు తీస్తా యని కలగన్నామా? పాలూ, నీళ్లే కాదు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో తింటున్నదీ, తాగుతున్నదీ సమస్తం కల్తీయేనని పాలక కూటమి నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లా ‘జనసేన’ అధ్యక్షుని వీడియో ఒకటి ఈ మధ్యనే సంచలనం సృష్టించింది. ‘‘ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఊహించని స్థాయిలో అవినీతి పెరిగింది. పాస్‌బుక్కులో పొరపాట్లు సరిదిద్దడానికి కూడా వేల రూపాయలు సమర్పించుకోవలసి వస్తున్నది. చిరంజీవి ఠాగూర్ సినిమాను మించి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌లో లంచావతారాలున్నాయి. అవినీతి అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి సిగ్గేస్తు న్నది. అసలీ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా?’’ పాలక కూటమి లోని ఓ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుని మాటలివి!రాజకీయ నాయకులు – అధికారులు లంచాల కోసం కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ తినేదీ తాగేదీ సమస్తం కల్తీ అయిందనే అభిప్రాయం జన సామాన్యంలో బలపడింది. అదే అభిప్రాయాన్ని జనసేన నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. పైస్థాయిలో అవినీతి ఉండకపోతే కింది స్థాయిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు. అవినీతి వాటాల ఫలితంగా పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం అట కెక్కింది. ప్రభుత్వ పాలన పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతి– భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దనిపిస్తుంది. రక్షక భటులు పొలిటికల్ పోలీసింగ్‌కు మాత్రమే పరిమితం కావడంతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగు తున్నాయి. ఈ శక్తులకు రాజకీయ నాయకత్వం అండ దండిగా లభిస్తున్నది.‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...’ అంటూ మురిసిపోయాడు ఒక కవి. ఆ భవితవ్యాన్ని పసితనంలోనే మసి చేస్తున్న కీచకసేనల పదఘట్టనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఓ మైనర్ దళిత బాలికను బెదిరించి 14 మంది యువకులు కొన్ని నెలలపాటు అత్యాచారాలు చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. తండ్రి లేని ఆ బాలిక బయటికి చెబితే చంపేస్తారన్న భయంతో నోరు మెదపలేకపోయింది. బయటపడిన తర్వాత కూడా అధికార పార్టీ మద్దతుదారులైన నిందితులను పట్టుకోవడానికి చట్టం తటపటాయించింది. కర్నూలు జిల్లాలో చిన్నారి బాలికలను బెదిరించి మద్యం తాగించి పాలక పార్టీ యువకులు అత్యా చారాలు చేసి వీడియోలు కూడా తీశారు. చిన్నారులపై జరిగిన ఇటువంటి అత్యాచారాలే డజన్‌కు పైగా ఇప్పటివరకు వెలుగు చూశాయి. అత్యాచారాలు సగటున రెండు రోజులకొకటి జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే చెబు తున్నాయి.హత్యలైతే సగటున రోజుకొకటి. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, రెడ్ బుక్ అరాచకాలు నేడు జగమెరిగిన సత్యాలు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని బాబు సర్కార్ ఎత్తివేసింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కోరుకున్న చోటుకి, కోరుకున్న సమయంలో డ్రగ్స్, మద్యం డోర్ డెలివరీ చేసే విధానం అమల్లో ఉందట! డబ్బులు వెదజల్లితే జరగని పాడు పని ఏదీ లేదని చెప్పుకుంటున్నారు. పైనున్న అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఈ దురవస్థకు అందరూ బాధ్యులే. తిలాపాపం తలా పిడికెడు! నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు దాచేస్తే దాగేవి కాదు. అందుకని వాటిని అంగీకరిస్తూనే అందుకు బాధ్యతను అధికార యంత్రాంగంపైనో, కొందరు ప్రజాప్రతినిధులపైనో నెట్టేయడానికి యెల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్నది. అధినేత హెచ్చరించినా అనుచరులు దారికి రావడం లేదంటూ వాపోతున్నది. అసలు అధినేత సుద్దపూసైతే కదా! ఎవరైనా దారిలోకి వచ్చేది.ఆవు పాలు, గేదె పాలే కాదు... రాష్ట్రంలో ‘మిక్సీ పాలు’ అనే మాట కూడా బాగా పాపులరైంది. అంటే పాలే లేకుండా పాలను తయారు చేయడమన్నమాట! పాల తయారీకి రసాయ నాలను ఉపయోగించడమన్నది విచ్చలవిడిగా జరుగుతున్నదనీ, అవి మోతాదు మించడం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపెడితే వీటిని నియంత్రించడం అసాధ్యమేమీ కాదు. కానీ, వ్యవస్థీకృతమైన అవినీతి అందుకు అవకాశమివ్వదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికీ, పలువురు అస్వస్థతకు గురి కావడానికీ ఈ వ్యవస్థీకృత అవినీతే కారణం. మంచినీటి పైపులైన్లు మురుగు నీటితో కలుషితమై, డయేరియా ప్రబలి శ్రీకాకుళంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. రెండొందల మంది వరకు అస్వస్థులయ్యారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించే ప్రయత్నం చేయకపోగా ఈ విషాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కల్తీ పాలు, కలుషిత నీటి విషాద ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ నిర్లక్ష్యంతో ఇంకెంత మంది ప్రాణాలు తీస్తార’ని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పరిపాలనపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరో పించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా పలుమార్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో వందలాది మంది అస్వస్థులయ్యారు. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయిన విషయాన్ని, రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా అస్వస్థులైన సంగతిని కూడా జగన్ ప్రస్తావించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు – కొందరు అధికారుల అవినీతి మిలాఖతే!విచ్చలవిడి అవినీతి కారణంగా పాలనా యంత్రాంగానికి పక్షవాతం సోకినా, పైకి మాత్రం బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనే భజనను యెల్లో మీడియా యథాశక్తి కొనసాగిస్తూనే ఉన్నది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసి డర్ తానేనంటూ సెల్ఫ్ ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి పేరుతో తన ఖాతాలో వేసుకున్న చాలా కార్యక్రమాలు ‘క్రెడిట్ చోరీ’ ద్వారా జగన్ ఖాతాలోంచి తెచ్చుకున్నవేనని జనానికి కూడా బాగా అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనంలో ఉన్నదని పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తే నిరూపిస్తున్నది. ‘కాగ్’ లెక్కల ప్రకారమే రాష్ట్ర జీఎస్టీ రాబడి నానాటికీ తగ్గుతున్నది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో అత్యంత ముఖ్యమైన, అధిక వ్యయమయ్యే రెండు పథకాలను (నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి) పూర్తిగా ఎగవేసి మిగతా వాటిని అరకొరగా అమలుచేసి... ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశారని పదేపదే చెప్పుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చ రిల్లింది. ప్రజాపాలన పడకేసింది. కనీసావసరాల కోసం,వైద్యం కోసం, మెరుగైన విద్య కోసం పేద ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. లేని అభివృద్ధి పేరుతో భజన బృందం చేస్తున్న కృత్రిమ సందడిలో వారి ఆర్తనాదాలు వినిపించక పోవచ్చు. కానీ సరైన సమయంలో అవి దీర్ఘశ్రుతితో శంఖా రావమై వినపడవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చిగురాశలపై పిడుగుపాటు
సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్‌తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి. గత వారం గుజరాత్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం! ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు. -
ట్రంప్ అరాచకానికి బ్రేక్
‘అరాచకం సద్దుమణిగింది... దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది’ అని అమెరికా ప్రజలంతా ఊపిరి పీల్చుకుని 24 గంటలు గడవకముందే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద నిరుడు ఏప్రిల్ నుంచి సుంకాలు విధిస్తున్న ఆయన చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం 6–3 మెజారిటీతో తీర్పునివ్వగా, దాన్ని వమ్ము చేస్తూ ట్రంప్ కొత్తగా అన్ని దేశాలపైనా 15 శాతం అదనపు సుంకాలు విధించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్ని మూర్ఖులుగా, దేశభక్తి లోపించిన వారిగా నిందించారు. పలు వ్యాపార సంస్థలతోపాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పువల్ల ధరలు తగ్గి జనం లబ్ధి పొందుతారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పులిస్తూ వచ్చింది. ఏడాది కాలంలో అది మొత్తం 26 తీర్పులు వెలువరించగా, అందులో 21 ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవే. ఇందులో అత్యధికం అప్పీళ్ల రూపంలో వచ్చినవి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ప్రజల తీర్పును వమ్ముచేయటానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి ట్రంప్‌కు తొలి ఉపశమనం దొరికింది. నిరుడు మార్చిలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయాన్ని కింది కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. మొన్న డిసెంబర్లో మాత్రం ఇల్లినాయీస్ నేషనల్ గార్డును స్వాధీనంలోకి తీసుకోవటం, షికాగో అభీష్టానికి భిన్నంగా అక్కడికి పంపటాన్ని తప్పుబట్టింది. నిజానికి గత వారం ట్రంప్‌కు ‘అన్నీ మంచి శకునములే...’ అన్నట్టు మొదలైంది. అమెరికాలో 3,600 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అనుమతిస్తూ జపాన్ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అధిక సుంకాలను 35 శాతానికి పరిమితం చేయటానికి అమెరికా అంగీకరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధిక సుంకాలను 32 శాతం వద్దే ఆపుతామన్న ట్రంప్ హామీకి కృతజ్ఞతగా గురువారం ఇండొనేసియా అధ్యక్షుడు దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వు నిచ్చారు. వెంటనే ‘అమెరికా మళ్లీ గెలుస్తోంది’ అంటూ ట్రంప్ ట్రూత్ మాధ్యమం ద్వారా తెగ సంబరపడ్డారు. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కాస్తా రద్దయ్యాయి. ఆ తీర్పు అనంతరం ట్రంప్ పెంచిన సుంకాలు కేవలం 15 శాతం కావటంతో ఆ రెండు దేశాలూ తమ నిర్ణయాలకు సహజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. మన దేశం సైతం పునరాలోచనలో పడిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మన ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో జరపవలసిన చర్చలు వాయిదా పడ్డాయి. వియత్నాం 20 శాతం అదనపు సుంకా లకు అంగీకరించగా, ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. ఇంకా దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా వంటి దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా తలపట్టుకుంటున్నాయి. కాకపోతే ఒప్పందాల్ని రద్దుచేసే సాహసానికి దిగలేదు. నిరుడు 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) 15 శాతం సుంకాలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకోగా, ట్రంప్ వాటిపై సైతం కొత్తగా 15 శాతం అదనపు సుంకాల భారం మోపారు. తన అరాచక నిర్ణయాలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని ట్రంప్ గట్టిగా నమ్మారు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పొగుడుతూ వచ్చారు. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర బహిరంగ రహస్యం. ఆ రకంగా చూస్తే మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి, మరో అయిదుగురు రిపబ్లికన్ అనుకూలురు. ముగ్గురు మాత్రమే డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఏదేమైనా ట్రంప్ తాజా సుంకాలు 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రతినిధుల సభ ద్వారా తన పంతం నెగ్గించుకోవటం ఆయనకు కష్టమే. ట్రంప్ రేటింగ్ పడిపోయి, వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఊడ్చిపెట్టుకుపోవటం ఖాయం అన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఏం చేస్తారన్నది చూడాలి. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినా సరే... దేశాన్ని అనిశ్చితిలో పడేసే తన ధోరణి మారబోదని ట్రంప్ తేల్చిచెప్పారు. -
ముత్యాలూ సజ్జలూ
అమ్మ పాలేరుకు అన్నం పెడుతుంది. కూర పెడుతుంది. అంత పచ్చడి కూడా! తిన్నంత తింటే విసుక్కోకుండా పెడుతుంది. కాని మజ్జిగ మాత్రం పోయదు. అప్పుడే హైస్కూ లుకు వచ్చిన కొడుకు ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు’ అంటే జవాబు చెప్పదు. పాలేరు ఇంట్లోకి రాకూడదు. బయటే కూచోవాలి. తినాలి. వెళ్లిపోవాలి – మజ్జిగ ముఖం చూడకుండా! ఇంట్లో కుండ నిండా మజ్జిగే! అమ్మ ఇరుగూ పొరుగుకు ఇస్తుంది. ఎండనబడి వచ్చిన వాళ్లకు ఇస్తుంది. పాలేరుకు తప్ప. అప్పటికి పాలేరు కులం ఏమిటో మూలం ఏమిటో కొడుకుకు తెలియదు. ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు?’... ‘పోయకూడదు నాయనా... పోస్తే వెన్నలో పురుగులు పడతాయి’. పాలేరుకు మజ్జిగ పోస్తే వెన్నలో పురుగులు పడతాయా? చూద్దాం అని అమ్మ లేనప్పుడు పాలేరు బెదిరిపోతున్నా కొడుకు అతని కంచెంలో మజ్జిగ వొంపేశాడు. మరికొన్ని రోజులకు అమ్మ వెన్న కాచి నెయ్యి చేస్తోంది. కొడుకు తొంగి తొంగి చూస్తున్నాడు. ’ఏమిట్రా?’... ‘పురుగులేమైనా పట్టా యేమోనని’... పకపకా నవ్వాడు.ఒక పిల్లాడిది అడవి దాపు పల్లె. స్కూలుకు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. రెండు చేతులు, రెండు కాళ్లు... పుస్తకాలున్నాయా... లేవు... నోట్‌బుక్కులు... అయ్యబాబోయ్. అయ్యవారు దయదలిచి పాతవేవో సంపాదించి ఇస్తారు. నోట్ బుక్కులు మాత్రం కొనుక్కోవాల్సిందే! పిల్లాడి దగ్గర అడవి ఉంది తప్ప డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం బడి తెరిచాక నోటు బుక్కుల కోసం ఆ పిల్లాడు ఒకటే పని చేస్తాడు. రోజూ అడవికి వెళ్లి రేగుపండ్లు కోసి సంచీ నిండా వేసుకొని వస్తాడు. స్కూల్లో ఆ రేగు పండ్లకు మారుబేరం పెడతాడు. గుప్పెడు రేగుపండ్లు ఇస్తే పిల్లలు తమ నోటు బుక్కులో సెంటర్ పిన్ను దగ్గర ఒక టావు తీసి ఇవ్వాలి. రేగుపండ్లు ఖాళీ అయ్యే కొద్దీ టావులు పోగవుతాయి. ఇంకేమిటి? రేగుపండ్ల నోట్‌బుక్ తయార్!కానుకలు అందరూ ఇస్తారు. పుచ్చుకుంటారు. కాని కొన్ని కానుకలు జీవితాంతం వెంటాడుతాయి. ఆ టీచరు పాఠాలు చెప్తుంటే ఒక ముసలామె మనవణ్ణి చేత్తో పట్టుకుని వచ్చి బడిలో వదిలింది. ‘ఈ ముసలి ప్రాణం తప్ప వీడికి ఎవరూ లేరు టీచరమ్మా! నాలుగు అక్షరాలు నేర్పించు’... ఆ టీచరు పిల్లాడిని దగ్గరగా పొదువుకుంది. తల నిమిరింది. పాఠాలు ఏం చెప్పిందో కాని తన బాక్స్‌లోని నాలుగు మెతుకులు పెట్టింది. ఆకు కూరలమ్మే ముసలామె తన మనవడికి టీచరమ్మ దొరికినందుకు ఎంతో సంతోషపడింది. మనవడు మాత్రం సిగ్గుతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ‘టీచర్స్ డే’ వచ్చింది. స్కూల్లో అందరూ టీచరమ్మకు గ్రీటింగ్ కార్డులు, ఆపిల్స్, గులాబీ పూలు ఇస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆ పిల్లాడు ఒక్కడే మిగిలాడు. ఏదో కానుక తెచ్చినట్టే ఉన్నాడు. ‘ఏంట్రా అది?.. ఇవ్వు’... చాలా బిడియపడుతూ వీపు వెనుక ఉన్న చేతిని ముందుకు సాచాడు. ఆకుకూర! వాడి చిట్టిచేతిలో జీవస్పందన వంటి పచ్చటి ఆకుకూర గుచ్ఛం!జీవితాల్లో గాలికిపోయే ఊకలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ఇలా స్వాతిచినుకుల్లా రాలి, కుదురును కదిలించి, ముత్యాలుగా మారతాయి. వాటిని సాహిత్యంగా చేసినప్పుడు మిలమిలమని మెరుస్తూ వేల చేతులు మారి అదే అనుభూతితో తాకుతాయి. ‘నేను రాసింది ఏ.ఐ.కి ఫీడ్ చేస్తాను. అది వెంటనే అర్థం చేసుకొని విడమ ర్చిందంటే రాసింది సాహిత్యం కాదని చించేస్తాను’ అన్నాడు రచయిత గురుచరణ్‌దాస్. సరళరేఖలు, తెలిసిన గీతలు టక్కున తెలిసిపోతాయి. ఏ.ఐ.కి చిటికెలో పని. కాని సాహిత్యం సరళం కాదు... ఉపరితలమూ కాదు. అది స్పందనల పరావర్తనలు పడే పెరడు. భావోద్వేగాలు నర్తించే ఎరీనా. తుది ఘట్టాన సాక్షాత్కారాలను ఒసగే యుద్ధ క్షేత్రం. సాహిత్యం మనిషికొక అర్థం... మనసుకొక తాత్పర్యం. అంతేతప్ప ఏ.ఐ. చెప్పే మూసకట్టు చిలకజోస్యం కాదు.రాసినదంతా ఏ.ఐ. దగ్గర ఉంది! రాయవలసినదంతా మనిషి వద్ద ఉంది!! మనిషి రాయకపోతే ఏం చేసినాగాని ఏ.ఐ. పైన చెప్పిన మూడు ఘటనలను సృష్టించలేదు. అవి మనిషికే తెలుసు. మనిషి చెయ్యే వాటిని రాయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ.ఐ. మీద చర్చ జరుగుతోంది. రచన, ప్రచురణల్లో ఏ.ఐ. పాత్ర ఏమిటనేది శోధనగా ఉంది. ఏ సాంకేతికతైనా సృజనకు సాయం మాత్రమే! అదే సృజన కాబోదు. రచయితలు జీవన పేటికల మీటలు నొక్కినంత కాలం ముత్యాలకు కొదవలేదు. సజ్జలతో సరిపెడదామను కుంటే ఏ.ఐ. ఉంది పదండి!! -
ఎలాంటి ఒప్పందాలు మేలు?
ఆర్థిక సార్వభౌమాధికారం, దీర్ఘకాల పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్య దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. ప్రస్తుతం 13 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), 6 ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు అమలులో ఉన్నాయి. దశల వారీగా దిగుమతి సుంకాల తగ్గింపు; ఇతర దేశాల ద్వారా భారత్‌లోకి ప్రవేశి స్తున్న చైనా వస్తు ప్రవాహాన్ని అరికట్టడం; ఆహార ప్రాసెసింగ్, ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, రసాయనాల విషయంలో భారత్‌కు ఉన్న పోటీతత్వాన్ని నిలుపుకోవడం; రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రక్షణ లాంటి అంశాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఆయా వాణిజ్య ఒప్పందాలు భారత్‌కు మిశ్రమ ఫలితాలను అందించాయి. భారత్ – ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌కు వాణిజ్య లోటు అధికమైంది. దక్షిణ కొరియా విషయంలో భారత్ నుండి ఎగుమతుల కన్నా కొరియా నుండి దిగుమతులు అధి కంగా ఉన్నాయి. జపాన్, ఎస్ఏఎఫ్టీఏలో ఒప్పందాలు పరిమిత ప్రయోజనాలనే అందించాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఒప్పందాలు వాణిజ్యపరంగా ప్రయోజ నాన్ని కల్పించాయి.ఎదురయ్యే పరిణామాలుసంబంధిత లెజిస్లేటివ్, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత యూకేతో జరిగిన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుంది. అటు ఈయూ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్; ఇటు భారత పార్లమెంటు ఆమోదం తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఖరారవుతుంది. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. ఒప్పందాలు ఖరారయ్యే సమయంలో కొన్ని వ్యూహాత్మక సవాళ్లను భారత్ ఎదుర్కోవచ్చు. ఆ యా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వలన దిగుమతుల పెరుగుదలతో పాటు, సున్నితమైన రంగాలలో ఉపాధి నష్టాన్ని భారత్ చవిచూడవచ్చు. దిగుమతి సుంకాలు తగ్గించనప్పటికీ ఉత్పత్తుల సర్టిఫికేషన్, పర్యావరణ, శ్రామిక ప్రమాణాలు, శానిటరీ, ఫైటో శానిటరీ అంశాలు భారత్‌కు సమస్యగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.వ్యవసాయ సబ్సిడీలు ఆ యా దేశాలలో అధికంగా ఉన్నందు వలన భారత రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈయూ, యూకే నుండి డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులను నిరోధించే విధంగా భారత్ ఒప్పందం చేసుకోవాలి. ఈయూ చివరి నిమిషంలో ‘వాతావరణ అనుసంధాన వాణిజ్య నియమాలకు’ పట్టుబట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ నుండి ఎగుమ తయ్యే సిమెంటు, ఉక్కు, అల్యూమినియంపై ‘కార్బన్ ట్యాక్స్’ పడి, ఆయా ఉత్పత్తుల విషయంలో పోటీతత్వం తగ్గుతుంది. అమెరికా కూడా ఒప్పందం సమయంలో డిజిటల్ వాణిజ్య సరళీకరణ, పటిష్ఠమైన మేధా సంబంధిత హక్కులు, వ్యవసాయం, మెడికల్ డివైజెస్‌కు సంబంధించిన డిమాండ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్ కూడా ఫార్మా రంగం, హెచ్–1 బి వీసాల సరళీకరణ లాంటి అంశాలు లేవనెత్తవచ్చు.చేరకపోవడమే సముచితంచైనా కేంద్ర బిందువుగా ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్సీఈపీ) ఏర్పాటయింది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు, న్యూజిలాండ్ ఇందులో సభ్య దేశాలు. దీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలలో భారత్ పాల్గొన్న ప్పటికీ, ఒప్పందం సమయంలో సభ్యత్వం పొందడాన్ని విరమించు కొంది. ఈ ఒప్పందం వలన రైతులు, ఎంఎస్ఎంఈ సంస్థలకు నష్టం కలుగుతుందనీ, వాణిజ్య లోటు అధికమవుతుందనీ, ప్రాంతీయ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉంటుందనీ భారత్ భావించింది. డైరీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ మార్కెట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ పోటీ ఎదుర్కొంటోంది. ఒప్పందం వలన గోధుమ, పామాయిల్, మిల్క్ పౌడర్ లాంటి ఉత్పత్తులు చౌకగా భారత్‌లోకి దిగుమతి అయినట్లయితే రైతులు నష్టపోయేవారు. ఆ యా దేశాలు అవలంబించే డంపింగ్‌ను నియంత్రించడానికి సరిపోను రక్షణ వలయం విషయంలో భారత్ వెనుకబడి ఉంది. రసాయనాలు, యంత్రాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఆట వస్తువులు చైనా నుండి భారత్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. చౌక ధరలకు ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయినప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తాయి. ఈ ఒప్పందంలో భారత్ భాగం కాకపోవడాన్ని సమర్థవంతమైన నిర్ణయంగా చూడాలి.ఏ వ్యూహం అవసరం?పశ్చిమ దేశాల మార్కెట్లతో పాటు చైనాపై అధికంగా ఆధార పడే కన్నా ఫార్మల్ అగ్రిమెంట్స్ లేకపోయినప్పటికీ కొన్ని దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఆఫ్రికా ప్రస్తుత జనాభా 1.4 బిలియన్లు కాగా 2050 నాటికి 2.5 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికాలతో వాణిజ్య ఒప్పందాలకు భారత్ ప్రయత్నించాలి. ఆఫ్రికాతో ఒప్పందం కారణంగా ఆహార భద్రత, శక్తి, ఖనిజాలు, అవస్థాపనా సౌకర్యాల ప్రాజెక్టులు, ఫార్మా రంగంలో భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతాయి. వాణిజ్యపరమైన అడ్డంకులు తక్కువగా ఉండటంతో పాటు ఆఫ్రికా వృద్ధి రేటు అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. భారత్ ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఉన్న మిడిల్ ఈస్ట్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్‌లతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం, వ్యవ సాయ ఉత్పత్తులు, టెక్ట్స్‌టైల్స్, ఆభరణాలు, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, మెషినరీ, హ్యాండీక్రాప్ట్స్, ఆయుర్వేదిక్, హెర్బల్, వెల్నెస్ ఉత్పత్తులకు ఆ యా మార్కెట్లలో డిమాండ్ ఉంది.లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, మెక్సికో, చిలీ, పెరూ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అవసరం. ఇంజినీరింగ్ వస్తువులు, రసాయ నాలు, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, టెక్స్టైల్స్ ఉత్పత్తులకు బ్రెజిల్లో డిమాండ్ అధికం. మొత్తంగా లాటిన్ అమెరికా మార్కెట్ లోనే వీటికి డిమాండ్ అధికంగా ఉన్నందువలన భారత్‌కు వాణిజ్య పరంగా లాభదాయకంగా ఉంటుంది. చిలీ, పెరూ, మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొరకు చర్చలు జరుగుతున్న సమయంలో భారత్ వేగంగా స్పందించడం ద్వారా ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. తక్కువ దిగుమతి సుంకం, మార్కెట్ లభ్యత కారణంగా భారత్ ఎగుమతులు పెరుగుతాయి.‘స్మార్ట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ అవలంబించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించాలి. అత్యంత సరళీకరణ ఒప్పందాలు వాణిజ్య లోటు పెరుగుదలకు దారి తీస్తాయి. వస్తువులకు సంబంధించిన ఒప్పందాల వలన పరిమిత ప్రయోజనాలే సిద్ధిస్తాయి కనుక తయారీ, సేవలకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ భవిష్యత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వాణిజ్య ఒప్పందాల ద్వారా అధిక ప్రయోజనాలు పొందాలంటే శ్రామిక మార్కెట్లు, లాజిస్టిక్స్, తయారీ రంగం, సేవల వాణిజ్యం, మౌలిక సౌకర్యాల రంగాలలో సంస్కరణలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్‌ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్‌సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్‌ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్‌డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్‌డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్‌సైట్‌కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్‌ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్‌గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్‌ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్‌లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్‌లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్‌లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్‌లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్‌రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్‌గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్‌కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్‌కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్‌లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బిల్ గేట్సూ... మన నైతికత!
దాదాపు 48 గంటల ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో భారీ యెత్తున జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సులో గురువారం కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెనక్కి తగ్గారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చి, ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉందని వెల్లడైనప్పటి నుంచి గేట్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ భంగపాటు. గురువారం నాటి ఏఐ సదస్సు కార్యక్రమం గురించి నిర్వాహకులు వెబ్సైట్లో మంగళవారం ఉంచిన జాబితాలో గేట్స్ పేరు లేదు. ఇక అక్కడినుంచి మొదలైంది ప్రహసనం! ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రస్తావన ఉంది గనుక ఆయన హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు చెప్పడం, అదేం కాదు... వస్తున్నారంటూ గేట్స్ ఫౌండేషన్ వివరణ, ఆ వెంటనే వెబ్సైట్లో మళ్లీ ఆయన పేరు దర్శనమీయటం, కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం తప్పించుకునే ధోరణిలో జవాబీయటం పెద్ద చర్చకు దారితీసింది. తెరవెనుక ఏం జరిగిందోగానీ... గేట్స్ హాజరు కాబోరని చివరి నిమిషంలో నిర్ధారణ అయింది. చిత్రమేమంటే... ఈలోగా సోమవారం ఆయన విశిష్ట అతిథిగా అమరావతిలో ప్రత్యక్షం కావటం, చంద్రబాబు పాలనను చూసి పొంగిపోయి ఉదారంగా ప్రశంసలు కురిపించటం పూర్తయిపోయింది. ఆయన్ను ‘తీసుకు రాగలినందుకు’ కూటమి పక్షాలన్నీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్న తరుణంలోనే పిడుగుపాటులా ఏఐ సదస్సు ఎపిసోడ్ వెల్లడై పరువు పాతాళానికి పడిపోయింది. అలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు సామాజిక మాధ్యమాల్లో చీవాట్లు మొదలయ్యాయి. ఆయన నేపథ్యాన్ని గమనించకుండా తీసుకొచ్చి పొగిడించుకున్నంత మాత్రాన భ్రమల్లో పడేదెవరు? ‘అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక...’ అన్న నానుడి బాబు మరిస్తే ఎలా?అయిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పటికీ ఎప్స్టీన్ ప్రేతాత్మ అనేకుల్ని వెన్నాడుతోంది. 30 లక్షల పేజీలున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటినుంచీ పీఠాలు కదులుతున్నాయి. శిఖరాలు కూలు తున్నాయి. ఇందులో ఆడ, మగ కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధినేత క్లింటన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ తదితరుల పేర్లున్నాయి. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ గురువారం అరెస్టయ్యారు. బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మాన్ శాక్స్ న్యాయ సలహాదారు క్యాథరిన్ రుమెల్లర్ పదవికి రాజీనామా చేశారు. ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నానన్నందుకు ఆ సంస్థ చీఫ్ డేవిడ్ సోలొమాన్కు చీవాట్లు పడుతున్నాయి. ప్రముఖ నౌకా రవాణా నిర్వహణ సంస్థ డీపీ వరల్డ్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్ తప్పుకున్నారు. అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్వీస్ చీఫ్ బ్రాడ్ కార్ప్ రాజీనామా చేశారు. ఇంకా బ్రిటన్ మాజీ రాయబారి, ఎంపీ లార్డ్ పీటర్ మాండెల్సన్, శత కోటీశ్వరురాలైన బ్యాంకర్ అరియానే డి రోత్స్, ఆర్థికవేత్త లారీ సమ్మర్స్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వగైరాల పేర్లున్నాయి. ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్లోకెక్కారు. వీరంతా ఎప్స్టీన్ నేరాల్లో భాగస్వాములని కాదు. ఈ మెయిళ్లలో అతన్ని ‘విలాస పురుషుడి’గా ప్రశంసించినవారు మొదలుకొని, అతగాడు అడిగిన పనులు చేసిపెట్టినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఎవరినుంచి అయినా సమాజం నైతిక విలువలు ఆశిస్తుంది. అవి లోపించాయని గ్రహిస్తే ఎంతటివారినైనా తృణీకరిస్తుంది. బిల్ గేట్స్‌కు ఏపీలో నీరాజనాలు పట్టడం చూసినా, ఏఐ సదస్సులో ఆయన పాల్గొనటంపై బాహాటంగా బయటపడిన ఊగిసలాట గమనించినా ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాలకన్నా వెనకబడి ఉన్నామా అన్న సంశయం ఏర్పడి విచారం కలిగిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు... మన రాజ్యాంగం సైతం మహిళల పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో చెబుతుంది. కానీ బిల్ గేట్స్ ఎపిసోడ్ ఆ విషయంలో మనకంతగా పట్టింపులేదన్న అభిప్రాయం కలిగిస్తుంది. -
పదునెక్కిన బంధం
అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్‌తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్‌లు నిర్ణయించటం చరిత్రాత్మకం. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్లో అప్పటి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్‌ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెల్లుచీటీ ఇచ్చారు. ఈ కల్లోల స్థితిలో భారత్–ఫ్రాన్స్‌ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్‌దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్ దాన్ని నెరవేర్చగలుగుతోంది. మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్‌బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది. -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్‌స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్‌ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్‌సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్‌సీక్‌పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్‌సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్‌ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
గజేంద్ర ‘మోక్షం’
‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై’ అనే పోతన గారి పద్యం సుప్రసిద్ధం. ఇప్పటి సంగతేమో కానీ, ఇటీవలి వరకూ ఈ పద్యం విననివారు ఉండరు. దాని వెనక కథేమిటంటే, ఓ ఏనుగు మడుగులోకి దిగింది. ఓ మొసలి దాని కాలు పట్టు కుంది. విడిపించుకోడానికి ఏనుగు హోరాహోరీ పోరాడింది. ఆ పోరాటం ఏళ్ళ తరబడి సాగింది. ప్రాణం కడతేరే దశలో ఏనుగు ఈశ్వరునికి మొర పెట్టుకుంది. ఆ క్రమంలో ఏకంగా విశ్వమూలాల్లోకి వెళ్ళిపోయింది; ఈ జగత్తు ఎవరివల్ల పుట్టిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, పరమేశ్వరుడెవరో, అనాది మధ్య లయుడెవరో, అంతా తనే అయినవాడెవరో– అతని నుంచి పుట్టిన ఈశ్వరుని శరణువేడుకుంటు న్నానంటుంది. అప్పుడు ఈశ్వరుడు వచ్చి మొసలిని చంపి ఏనుగును రక్షిస్తాడు! ఈ క్షణాన ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఏనుగులు ఇలాగే మొరపెట్టుకుంటున్నాయి; ఈసారి అక్కడి అటవీ గ్రామాల వాళ్ళు కూడా ఆ మొరలో గొంతు కలుపుతున్నారు. మనుషులకీ, ఏనుగులకీ మధ్య అక్కడ పతాక స్థాయిలో జీవన సమరం జరుగుతోంది. ఉభయులనూ రక్షించగల ఈశ్వరుడే కనుచూపు మేరలో కానరావడం లేదు. గత పన్నెండేళ్ళలోనే 68 ఏనుగులతోపాటు, 698 మంది మనుషులు మరణించారు. కొద్దిరోజుల క్రితమే ఓ 70 ఏళ్ళ వృద్ధుని ఏనుగులు తొక్కి చంపేశాయి. భారత వన్యప్రాణి సంస్థవారూ, జంతు సంక్షేమ సంఘం వారూ రంగంలోకి దిగి చేస్తున్న రోదనలు అక్షరాలా అరణ్యరోదనే అయి నట్టు కనిపిస్తున్నాయి. మరీ క్రూర జంతువులను మినహాయిస్తే, ఏనుగులు సహా వన్యప్రాణులతో మనిషి సహజీవనం చేయని దశ చరిత్రలో కనిపించదు. ఇప్పుడు సహజీవనం చేయలేని దశకు చేరుకున్నాడు. అందుకు తనే బాధ్యుడు తప్ప వన్యప్రాణులు కావు. ఈ భూమండలం మీద జీవించే హక్కు అన్ని ప్రాణులకూ ఉన్న సంగతి మరచిపోయి తన సర్వం సహాధిప త్యాన్ని స్థాపించుకోడానికి పూనుకున్నాడు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నరికేసి జనావాసాలను సృష్టిస్తున్నాడు, గనులు తవ్వేస్తున్నాడు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యుత్తంత్రులను వేలాడదీస్తున్నాడు. దాంతో వన్యప్రాణులకు సంచార భూమి కుదించుకుపోయి ఊళ్ళమీద పడుతున్నాయి. ఇటీవలి వరకూ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఏనుగుల సంఖ్య నామమాత్రం. ఇప్పుడు మూడు వంతుల మేరకు, అంటే దాదాపు 400కు వాటి సంఖ్య పెరిగిపోయింది. అభివృద్ధి పేరిట జరుగుతున్న తవ్వకాల వల్ల అలవాటుపడిన దారులు మరచిపోయి అవి జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. 90 శాతం ఏనుగుల మరణానికి విద్యుదాఘాతాలే కారణమంటున్నారు. ఆ పైన గోతులు, బురద నేలలు వాటి ప్రాణాలు హరిస్తున్నాయి. అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాడుకోవడంలో ఎంతో తెలివి కనబరచిన మనిషి, చివరికి వాటితోనే పోరాడి ప్రాణాల మీదికి తెచ్చుకునే తెలివి హీనతకు దిగ జారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వార్థం వికటించి ప్రకృతి విధించిన అన్ని రకాల హద్దులనూ, సహజీవన ధర్మాన్నీ ఉల్లంఘించడమే అందుకు కారణం. పురాణ, ఇతిహాస కాలంతో మొదలుపెట్టి, చరిత్ర కాలం వరకూ మనిషికీ, ఏనుగుకీ ఉన్న అనుబంధం అనేక రూపాల్లో అక్షరబద్ధమైంది. ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని కొలవడం సరేసరి; ‘ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవు’డని పిల్లలు పాడుకోవడం మనకు తెలుసు. ధర్మరాజు వాకిట్లో ఏనుగుల నుంచి స్రవించే మదం బురద కట్టగా, కిక్కిరిసిన సామంత రాజులు ధరించిన ఆభరణాల నుంచి జారిన రజం ఆ బురదను కప్పేసిందంటూ ధర్మరాజు గజ సంపదనూ, సామంత రాజుల బలగాన్నీ కూడా – ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు’ అనే పద్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు తిక్కన. యుద్ధంలో ఓడిన తర్వాత, ఏనుగునెక్కి, రెండు వైపులా అనేక ఏనుగులు వెంట రాగా పురవీథుల్లో ఎలా విహరించగలవంటూ, చక్కని మరో తిక్కన పద్యంలో అర్జునుడు దుర్యోధనుని ఆక్షేపిస్తాడు. ‘ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ తిరుపతి వెంకటకవులు సగర్వంగా చెప్పుకుంటారు. ఏనుగునెక్కి యుద్ధాలు చేసిన మనిషి ఏనుగుతో యుద్ధం చేయవలసి రావడమే అతని వివేక భ్రష్టతకు పరాకాష్ఠ. ఛత్తీస్‌గఢ్ అడవులు ఘోషిస్తున్న సత్యం అదే! -
‘కృత్రిమ’ ధోరణులపై కొరడా
డిజిటల్ ప్రపంచంలో కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా వేషం మార్చుకుని మోసగిస్తున్న మాయగాళ్ల పనిపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. 2021లో తెచ్చిన సమాచార సాంకేతికత(ఐటీ) నిబంధనల్ని సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకప్పుడు వదంతులుగా, లేదా తప్పుడు ప్రచారంగా చలామణీ అయిన ప్రతిదీ ఇప్పుడు అసలుగా భ్రమింపజేసే వీడియోలు, ఆడియోలుగా మారిపోతోంది. ఏది నిజమో, ఏది కాదో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎన్నికల్లో సామాన్య జనాన్ని ఏమార్చటానికి ప్రయత్నించటం దగ్గర నుంచి... మనుషుల్లో క్రౌర్యాన్నీ, హైన్యాన్నీ, నీచప్రవృత్తినీ ప్రేరేపించే, భావోద్వేగాలను రెచ్చగొట్టే ధోరణి గలవన్నీ డిజిటల్ ప్రపంచంలో స్వైరవిహారం చేస్తున్నాయి. వాటి ప్రభావంతో మనుషులు స్వీయనియంత్రణను కోల్పోయి, మానసిక దుర్బలులవుతున్నారు. కొందరు వ్యామోహాలకు లోనై నిలువుదోపిడీ ఇచ్చుకుంటున్నారు. ఆనక లబోదిబోమంటున్నారు. నిత్యజీవిత ఆచరణ ద్వారా, అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా ఒక క్రమపద్ధతిలో రావలసిన జ్ఞానాన్ని కృత్రిమ మేధ అడ్డుకుని, వారిలోని విచక్షణను ఆవిరి చేస్తోంది.లింగవివక్ష అధికంగా ఉన్న సమాజాల్లో సహజంగానే మహిళలు ఈ సాంకేతికతల వల్ల బాధితులవుతున్నారు. ప్రపంచమంతటా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. బుడి బుడి నడకల్లో ఉన్న బుడతల దగ్గర్నుంచి, వృద్ధుల వరకూ అందరికందరూ దీని ప్రభావం నుంచి తప్పించు కోలేకపోతున్నారు. ఇందులో పొంచివున్న ప్రమాదాన్ని అందరి కన్నా ముందు పసిగట్టింది యూరోపియన్ యూనియన్(ఈయూ). అది రెండు మూడేళ్లపాటు శ్రమించి 2024లో తెచ్చిన ఈయూ కృత్రిమ మేధ(నియంత్రణ) చట్టం ఉన్నంతలో సమగ్రమైనది. అయితే ఆ చట్టం వచ్చేనాటికి డీప్ లెర్నింగ్ సాంకేతికత బీజప్రాయంలో ఉంది. దాంతో తయారయ్యే నకిలీ(ఫేక్)ని చెప్పడానికి ‘డీప్‌ఫేక్’ పదం ఇటీవల వాడుకలోకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్ వల్ల ఏర్పడగల ప్రమాదతీవ్రత ఆధారంగా ఆ చట్టం వాటిని నాలుగు రకాలుగా – అంగీకారయోగ్యం కానివి, అధిక ప్రమాదంతో కూడుకున్నవి, పరిమితంగా ప్రమాదకరమైనవి, కనిష్ఠ ప్రమాదం ఉన్నవిగా వర్గీకరించింది. మన ప్రభుత్వం ఇప్పుడు రూపొందించిన నిబంధనలు వినియోగదారుడి రక్షణ, దేశభద్రతనూ ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాయి. ఈ నెల 20 నుంచి అమల్లోకొచ్చే ఆ నిబంధనలు ఇకపై ఏఐ ఆధారంగా రూపొందే ఎలాంటి కంటెంట్‌కైనా ఆ విషయాన్ని స్పష్టంగా సూచించటం తప్పనిసరి చేశాయి. అలాగే అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, తప్పుడుగా ఉన్నాయని ప్రభుత్వాలు, లేదా న్యాయస్థానాలు నిర్ధారించి తొలగించమని ఆదేశిస్తే... మూడు గంటల్లో శిరసావహించాలి. పాక్షిక లేదా పూర్తి నగ్నంగా చిత్రించే ఫొటోలు, వీడియోలు, శృంగార సంబంధిత కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన రెండు గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 36 గంటల గడువును వాటి తీవ్రతను బట్టి తగ్గించారు. హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నపక్షంలో అది తయారు చేసిందెవరో, అప్లోడ్ చేసిందెవరో కూపీలాగే ఉపకరణాలను సామాజిక మాధ్యమాలు రూపొందించుకోవటం తప్పనిసరి చేశారు.అయితే మన ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రతిస్పందన ప్రాతిపదికగా ఉంది. రూపొందే కంటెంట్ ఏ పరిమితుల్లో ఉండాలన్నది ఈయూ చట్టం ముందస్తుగా నిర్దేశిస్తోంది. ఏ సామాజిక మాధ్యమమైనా ఉల్లంఘించిన పక్షంలో మన నిబంధనలు క్రిమినల్ కేసులకు మొగ్గుచూపుతుండగా, ఈయూ చట్టం నిర్లక్ష్యం వహించిన సామాజిక మాధ్యమానికి దాని ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 7 శాతం వరకూ జరిమానా విధిస్తోంది. మారుతున్న సాంకేతికతల్ని ఆసరాగా చేసుకుని ప్రతిరోజూ, ప్రతి నిమిషమూ వచ్చి పడుతున్న కంటెంట్‌ను అరికట్టడానికి నిబంధనలు ఏర్పర్చటం, చట్టాలు రూపొందించటం ఏ దేశంలో పాలకులకైనా పెను సవాలు. అంతకన్నా ముఖ్యం... అవి దుర్విని యోగం కాకుండా చూడటం! కుల, మత, రాజకీయ వివక్షతో సద్విమర్శలను నేరపూరితం చేసే ధోరణులు భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. సద్భావంతో చేసే సృజనాత్మ కతకు శాపంగా పరిణమిస్తాయి. బహుపరాక్! -
సాహసోపేతమేగానీ...
సహనం, ఓర్పు, సంయమనం, ప్రయామం, నిగ్రహం... ఎదుటివారు ఎంతగా రెచ్చ గొడుతున్నా మాట తూలకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని చెప్పటానికి ఇలా బోలెడు పదాలున్నాయి. కనీసం ఆర్నెల్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయినట్టేనని తరచు చెబుతూవచ్చారు. అందుకు మన దేశంనుంచి ఆశాజనకమైన స్పందన రానప్పుడల్లా రెచ్చిపోయి మాట్లాడారు. పాకిస్తాన్ పౌర, సైనిక అధినేతల్ని నెత్తినెక్కించుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జమ్మూ–కశ్మీర్ భౌగోళిక చిత్రపటాన్ని పాకిస్తాన్ సంబరపడేలా మార్చేశారు. ఎన్ని చేసినా మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం, లేదా ఆచితూచి మాట్లాడటం పనికొచ్చినట్టుంది. ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత–అమెరికాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మొన్న శనివారం అధికారికంగా ఉమ్మడి ప్రకటన వెలువడింది. అందుకు సంబంధించిన ఒక అమరిక (ఫ్రేమ్‌వర్క్) కూడా రూపొందింది. అంతే... వెనువెంటనే 25 శాతం అదనపు సుంకాలు రద్దయ్యాయి. ఇకపై సుంకాలు 18 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి అలముకున్న తరుణంలో మన దేశం ఈ మాదిరి ఒప్పందానికి సంసిద్ధం కావటం ఒక సాహసోపేతమైన చర్య. అయితే ‘ఇల్లలకగానే పండగ కాద’న్నట్టు ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చేవరకూ ఒకింత ఉత్కంఠ, సంశయం తప్పవు. అటు తర్వాత కూడా దిన దిన గండం ఉండనే ఉంటుంది. అక్కడున్నది ట్రంప్ గనుకే ఈ సమస్య. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు గమనిస్తే ఇది తెలుస్తుంది. ‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, ఆ ఉత్పత్తులను అమెరికా నుంచే కొంటుందని ఆశిస్తున్నామ’ని అందులో ఉంది. భారత– రష్యా చమురు వాణిజ్యంపై తమ నిఘా ఉంటుందని కూడా అంటున్నది. ఈ విషయంలో మన దేశం అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఉమ్మడి ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. కానీ జాతీయ ఇంధన ప్రయోజనాలే మన గీటురాయి అని గతంలో మోదీ అన్నారు. మన వ్యవసాయ, పాడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు. అలాగే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు సుంకాలు తగ్గించబోమంటున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో అమెరికాకు సంబంధించిన అన్ని పారిశ్రామిక సరుకులు, విస్తృతశ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు చేయటానికి భారత్ అంగీకరించిందని ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనట్టయితే భారత్ వెనక్కి తగ్గిందని ట్రంప్ యాగీ చేయటంతోపాటు, అదనపు సుంకాలకు సాకుగా ఉపయోగించుకుంటారు.ప్రస్తుత భారత–అమెరికా వాణిజ్యం 13,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో అమెరికాకు మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్ల వరకూ ఉంటే, అమెరికా నుంచి దిగుమతులు 4,500 కోట్ల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే మనం 4,000 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులులో ఉన్నాం. దీన్ని మార్చాలన్నదే ట్రంప్ తాపత్రయం. అందుకే వచ్చే అయిదేళ్లలో అమెరికా నుంచి 50,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులుండేలాఒప్పందం నిర్దేశిస్తోంది. ఇంధనం ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు,సాంకేతిక ఉత్పత్తులు, అరుదైన లోహాల వంటివి ఉంటాయంటున్నారు. అంటే ఆ దేశంనుంచి ఏటా అదనంగా వందకోట్ల డాలర్ల అదనపు ఉత్పత్తులు వస్తాయి. అప్పుడు మన వాణిజ్య మిగులు ఆవిరై, లోటులో పడుతుంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?కార్మికుల అవసరం ఎక్కువుండే మన ఉత్పత్తులకు ఒప్పందం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశమైతే ఉంటుంది. ఆ రకంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవు తాయి. ఇక జన్యుమార్పిడి ఆహారం అనారోగ్యహేతువని, ఆ విత్తనాల వల్ల దిగుబడి భారీగా వచ్చినా, అవి వాడిన పంటపొలాల్లో భవిష్యత్తులో దేశీయ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదని గతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో సందే హాలన్నీ నివృత్తి చేయాలి. అలాగే తుది ఒప్పందం సమయానికి అవసరమైన మార్పులు, చేర్పులకు ఇరుపక్షాలూ సిద్ధపడే షరతుపైనే ఏ ఒప్పందంపైనైనా సంతకం చేయాలి. -
సహజ గుణం
తెలుగులో ఇటీవల అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’. దీనికంటే ముందు ‘నా ఇష్టం’, ‘విజయానికి ఐదు మెట్లు’ లాంటివి బెస్ట్ సెల్లర్స్. అత్యధిక పునర్ముద్రణలు పొందినవాటిల్లో ‘మహాప్రస్థానం’, ‘వేయి పడగలు’ లాంటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు చదవాల్సి వచ్చేవో, ఉపవాచకాలుగా నిర్దేశించినవో కూడా మంచి అమ్మకాలే సాధిస్తాయి. కానీ ఇవన్నీ మినహాయింపులు మాత్రమే. సాధారణంగా తెలుగు సాహిత్యంలో బాగా అమ్ముడైన పుస్తకాలంటే వేసిన వెయ్యి కాపీలు మిగలకుండా పోయినవే! ఇప్పుడా వెయ్యీ లేకుండా ఐదొందలు, మూడొందలు, ఆఖరికి వంద కాపీలు ముద్రించుకునే అవకాశం వచ్చింది. లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేది ఏ తెలుగు రచయితైనా కనే పగటి కల మాత్రమే. నిజంగానే లక్ష కాపీలు అమ్ముడైనా ఆ రచయితను మొత్తం తెలుగు జనాభాలో ఎంతమంది చదివినట్టు? సుమారు 0.1 శాతం! ఇలాంటి లెక్కల్నే ఆంగ్ల రచయితలకు అన్వయిస్తూ, ‘‘మీ పుస్తకాన్ని ఎవరూ చదవరు. ఇది అవమానించడం కాదు. ఇది లెక్కలపరమైన వాస్తవం’’ అంటారు పబ్లిషర్ స్టీఫెన్ స్పార్క్స్. ఆయన ప్రకారం, ఏ రచయిత వ్యాప్తి అయినా నామమాత్రమే. అందుకే గొప్పగా రాసివుండీ ఎవరూ చదవని రచయితల గురించి ‘రైటర్స్ నో వన్ రీడ్స్’ పేరుతో టంబ్లర్ పేజీ నడుపుతున్నాడు విల్ షొఫీల్డ్. ఈ రచయితలు గొప్ప రచయితలయ్యింది వాళ్ల అమ్మకాల వల్ల కాదు, వాళ్లది ఎంత ఒరిజినల్ రైటింగ్ అన్నదాన్నిబట్టి! ‘‘మరిచిపోయిన, నిర్లక్ష్యానికి గురైన, వదిలివేయబడిన, మరుగున పడిన, తక్కువగా అనువదింపబడిన రచయితలను వెలుగులోకి తేవడం...’’ అని షొఫీల్డ్ చెప్పింది తెలుగులోనూ చాలామంది రచయితలకు వర్తిస్తుంది. ‘మహా వేధ’ నవల రాసిన చివుకుల పురుషోత్తంను ఎవరైనా తలుచుకుంటున్నారా? కథకుడు అల్లం శేషగిరిరావుకు.. స్థాయికి తగిన గుర్తింపు ఉందా? తొలితరం యాక్టివిస్టు–రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మకు ఎన్ని విగ్రహాలు పెట్టారు? దళిత ఉనికితో కాకుండా నాగప్పగారి సుందర్రాజును గుర్తుచేసుకోవడం జరుగుతోందా? ‘చెంఘిజ్‌ఖాన్’ను తెలుగు నేల మీద నిలబెట్టిన తెన్నేటి సూరికి ఎవరైనా హారతులు పడుతున్నారా? గుర్తింపు ఉన్న రచయితలు అనుకునేవాళ్లకు కూడా పెద్దలెక్కల్లో ఏ గుర్తింపూ లేనట్టే! ఇక అచ్చుకే ‘నోచుకొని’ రచయితల సంగతి? ప్రపంచ వ్యాప్తంగా విస్మరించలేని రచయిత అయిన ఫ్రాంజ్ కాఫ్కా రచనలు అతడు బతికివుండగా పెద్దగా అచ్చుకాలేదు. ఎమిలీ డికిన్సన్ కవిత్వమూ అంతే. ‘నువ్వు లేని అద్దం’ నవల ద్వారా కొత్త ఆసక్తికి కారణమైన చిత్రకొండ గంగాధర్ పుస్తకాలేవీ అతడు తన నలభైల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అచ్చుకాలేదు. మరి చదువుతారన్న గట్టి హామీ లేనప్పుడు కూడా రచయితలు ఎందుకు రాస్తున్నారు? వాళ్లను నడిపించే ఆ జీవలక్షణం ఏమిటి? ‘‘నా రచనకు ఆరంభ బిందువు ఎల్లప్పుడూ ఒక పక్షపాతం, ఒక అన్యాయ భావనే... నేను రాస్తాను– ఎందుకంటే బయటపెట్టవలసిన ఏదో అబద్ధం ఉంటుంది, చూపించ వలసిన ఏదో నిజం ఉంటుంది’’ అంటాడు జార్జ్ ఆర్వెల్. ‘‘ప్రతి వ్యక్తి ఆత్మ తాలూకు వైశిష్ట్యాన్ని స్పష్టంగా చూపించటం నవలాకారుడి బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అంటాడు హరూకీ మురకామి. ‘‘రచన నా శరీరానికి పొడిగింపు’’ అంటారు నటాలీ డయాజ్. ‘‘మనిషిగా ఉండే ఒక పార్శా్వన్ని చూపించడం’’ కోసం రాస్తానంటాడు కజువో ఇషిగురో. కీర్తి కోసం అని విలియమ్ ఫాక్నర్ బోల్డుగా చెప్పేయొచ్చు; నాలుగు డబ్బుల కోసం అని ఇంకో రచయిత ఒప్పేసుకోవచ్చు. కానీ ప్రతి రచయితకూ భిన్న కారణం ఉంటుంది. అసలు ఏ కారణమూ ఉండకపోవచ్చు. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా– రాయడం అనేది రచయిత సహజ లక్షణం. వాళ్లు రాయగలుగుతారు కాబట్టి రాస్తారు. రాయకుండా ఉండలేరు గనుక రాస్తారు. లోకం మీది ప్రేమతో దాన్ని జనానికి కానుక చేస్తారు. -
మణిపుర్ చక్కబడేనా!
రెండున్నరేళ్లపాటు కనీవినీ ఎరుగని హింసతో అట్టుడికి, నిరుడు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనలో కొచ్చిన మణిపుర్లో ఎట్టకేలకు బుధవారం ముమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే మెయితీ తెగకు చెందినవారే అయినా ఖేమ్‌చంద్‌కు మధ్యేవాదిగా ముద్ర ఉంది. మణిపుర్ సమాజంలో తీవ్రస్థాయి విద్వేషాలు ప్రబలిన వర్తమానంలో ఆగ్రహావేశాలు అంత త్వరగా సమసిపోవు. అందుకే కుకీ–జో తెగలకు చెందిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ‘మెయితీ ప్రభుత్వం’లో చేరొద్దంటూ ఆ తెగలకు చెందిన సంస్థలు హెచ్చరించాయి. దాన్ని బేఖాతరు చేసి, ఢిల్లీలోని మణిపుర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రమాణం చేసిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్పై నిప్పులు చెరిగారు. రాజధాని ఇంఫాల్‌లో ఆమె ప్రమాణం చేయలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. మెయితీల ఆధిక్యత గల ఇంఫాల్ మణిపుర్ లోయలో ఉంది. వారినుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతోపాటు, కుకీలు కూడా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. సమస్య ఎంత జటిలంగా మారిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యవహార శైలి మెరుగ్గావుంటే, ఇలాంటి సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. అయితే సమాజంలో సామరస్యతకు ముందు సొంతింటిని చక్కదిద్దుకోవటానికి బీజేపీ కృషి చేయాల్సి ఉంది. అధిష్ఠానం మాటవినే సంస్కృతికి భిన్నంగా అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇష్టారాజ్యం సాగించారు. పరిస్థితి క్షీణిస్తోందని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తున్నా ధోరణి మార్చుకోలేదు. రాజీనామా చేయమని ఆదేశిస్తే శిరసావహించి నట్టు కనబడి, పెద్ద డ్రామా సృష్టించి జనం అడ్డుకున్నారని ఆగిపోయారు. ఎట్టకేలకు నిరుడు ఫిబ్రవరి 9న ఆయనతో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అప్పటికే ఆయన తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించి కుకీల్లో అసంతృప్తి రెచ్చగొట్టారు. వారితో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకొని ఆగ్రహావేశాలను పెంచారు. వారిని గంజాయి పండించేవారిగా, మాదకద్రవ్య పంపిణీదార్లుగా, అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చేవారిగా చిత్రించారు. మణిపుర్లో హింస చెలరేగే నాటికే అక్కడ ఇరుపక్షాల్లోనూ ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడింది. 2023 మే నుంచి హత్యలు, లూటీలు, గృహదహనాలు, పార్థనా స్థలాలకు నిప్పెట్టడ యథేచ్ఛగా కొనసాగాయి. 260 మంది హత్యకు గురయ్యారని, 1,000 మంది గాయపడ్డారని, 32 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 60,000 మందికి పునరావాస శిబిరాలే శాశ్వత చిరునామాలయ్యాయి. అంతా సవ్యంగా ఉన్నందువల్లే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని అనుకోనవసరం లేదు. రాష్ట్రపతి పాలన ఏడాదికి మించి పొడిగిస్తే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు తప్పలేదు. ఇప్పటికీ మెయితీలు, కుకీ–జోలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు పోయే పరిస్థితి లేదు. తమ ప్రాంతాలకు స్వయంపాలన హక్కు ఇచ్చేందుకు అంగీకరించి, అందుకు నిర్దిష్ట కాల పరిమితిని లిఖిత పూర్వకంగా ప్రకటిస్తేనే ప్రస్తుతానికి ప్రభుత్వంలో పాలుపంచు కునేందుకు సిద్ధపడతామని కుకీ–జో తెగలు ఇప్పటికే తెలిపాయి. ఆ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదన్న ఆగ్రహంతోనే కొత్త సర్కారులో ఎవరూ భాగస్వామ్యం తీసుకోవద్దని వారు పిలుపునిచ్చారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం విడిచిపెట్టదల్చుకున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం సంగతలా ఉంచి ముందు సంయమనం పాటించటం, అందరినీ కలుపుకొని వెళ్లటం వంటివి అవసరమని ఖేమ్‌చంద్ తెలుసుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వం వస్తే కనీసం సమస్యలు చెప్పుకునే వీలుంటుందని జనం అనుకుంటారు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ పరిష్కారాలపై పెద్ద ఆశలేమీ ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న విశ్వాసమైతే కలగాలి. ఆ విశ్వాసాన్ని ఖేమ్‌చంద్ ప్రభుత్వం పొంద గలిగితే కొంతమేర విజయం సాధించినట్టే! -
పాక్‌కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్‌ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్‌లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్‌తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్‌ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్‌తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్‌ఖాన్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
అనిశ్చితిలో ఆచితూచి...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఆమె... స్థిరంగా ముందుకు సాగుతున్న ఆర్థిక వృద్ధిని అదే స్థాయిలో ముందుకు నడిపించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ, తయారీరంగ పరిశ్రమల పెంపునకూ తోడ్పడే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కూడా ఏవో అద్భుతాలుంటాయని ఎప్పటిలాగే మధ్యతరగతి, వ్యాపార వర్గాలు ఆశించిన మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల విడిచి సాము మంచిది కాదన్న ధోరణినే కనబరిచారు. అవసరమైనచోట్ల వెసులుబాట్లకు కూడా చోటిచ్చారు. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయటం అందులో ఒకటి. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువుల కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గించటం కూడా మంచి నిర్ణయం. మూలధన వ్యయం ఈసారి రూ. 12.22 లక్షల కోట్ల వరకూ ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. నిరుటి ప్రతిపాదన రూ. 10.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో దీన్ని వ్యయం చేయటానికి సంకల్పించారు. పర్యవసానంగా హైవేలూ, సరుకు రవాణా కారిడార్లూ, ఓడరేవులు, జాతీయ జల రవాణా మార్గాలు, పట్టణప్రాంత ప్రజా రవాణా తదితర రంగాలు బహుముఖంగా విస్తరిస్తాయి. ఇదంతా దక్షిణాది రాష్ట్రాల్లో పరిశ్రమల విస్తరణకూ, ఉద్యోగాల కల్పనకూ ఎంతగానో దోహద పడుతుంది. పెంచిన ఈ మూలధన వ్యయాన్ని రాష్ట్రాలు వడ్డీరహిత రుణాలు పొంది, పెట్టుబడులు పెట్టడానికి వినియోగిస్తామని చెప్పారు. దానికే పరిమితమైతే లక్ష్యసాధనకు ఎంతమాత్రం సరిపోదు. తయారీ రంగంలో ఫార్మా, సెమీ కండక్టర్లు, రసాయనాలు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, భారీ యంత్రాలు, క్రీడా పరికరాలు, రసాయనాలు తదితరాల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చేసిన ప్రతిపాదనలు సైతం మెచ్చదగ్గవే. అయితే ప్రస్తుతం అన్ని రంగాలనూ ఏలుతున్న ఏఐ ఆధారిత సాంకేతికత ఇక్కడ కూడా గణనీయంగా ఉంది. అందువల్ల ఈ రంగాలు తీసుకు రాబోయే ఉద్యోగకల్పనపై మరీ ఆశ పెట్టుకోనవసరం లేదు. విచక్షణారహితంగా సుంకాలు విధించే అమెరికా ధోరణి వల్ల ప్రైవేటు మదుపుదారులు ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశాలు తక్కువ.ఈ బడ్జెట్లో మెచ్చదగ్గ ప్రతిపాదన కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడే సాంకేతికతలకై వచ్చే అయిదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యయం చేస్తామని చెప్పటం! స్వచ్ఛ ఇంధనానికి తోడ్పడే ఈ ప్రతిపాదనకు మరింత కేటాయిస్తే బాగుండేది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ తొలగింపునకూ, దాన్ని నిల్వ చేసి ఉత్పత్తులకు తోడ్పడటానికీ అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వటంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మన వృద్ధి రేటు దాదాపు 7 శాతం ఉంది. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉంది. విదేశీ మారక నిల్వలకు కూడా లోటు లేదు. కానీ దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పడుతూ లేస్తూ సాగుతున్న క్రమంలో, అంతర్జాతీయంగా అంత సానుకూల వాతా వరణం కనబడని స్థితిలో జాగ్రత్తగా అడుగులేయటం మంచిదే. ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం మించనీయరాదన్న గత బడ్జెట్ లక్ష్యాన్ని సాధించటంలో విజయం సాధించి నట్టేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గించి 4.3 శాతానికి పరిమితం చేస్తామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. కానీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని పఠించటం అంత సులభం కాదు. తయారీరంగ పరిశ్రమల విస్తరణ ఉపాధి కల్పనకు తోడ్పడి,ప్రజల్లో కొనుగోలుశక్తిని పెంచుతుంది. ఆ దిశగా ప్రయత్నించటానికి ఈ బడ్జెట్ ప్రతిపాద నలు దోహదపడతాయనే చెప్పాలి. ఎంతో ఆచితూచి, జాగ్రత్తగా అడుగులేసిన ఈ బడ్జెట్ చూడటానికి నిరాశ కలిగించవచ్చుగానీ... ఈ అనిశ్చితిలో దూకుడుగా పోకుండా భయ భక్తులతో మెలగటమే క్షేమదాయకం. -
సర్వేలో ఆశావహ స్వరం
ప్రపంచవ్యాప్తంగా అలముకున్న అనిశ్చితికి తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, పడిపోతున్న రూపాయి విలువ, ఉపాధి లేమి తదితరాలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేన్నయినా అంచనా వేయటమంటే కత్తి మీద సాము. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు ఆర్థిక సర్వే సమర్పించారు. ముగియబోతున్న ఆర్థిక సంవత్సరంలో మన స్థితిగతులెలా ఉన్నాయో వివరించి, ఇకముందు రాగల సవాళ్లేమిటో... వాటిని అధిగమించటానికి ప్రభుత్వానికున్న ఆలోచనేమిటో స్థూలంగా వివరించటం ఆర్థిక సర్వేల లక్ష్యం. నిజానికి ఆర్థిక సర్వేకు ముందురోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో సంస్కరణలు మరింత వేగవంతం కాబోతున్నాయని సూచనప్రాయంగా చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ 6.8–7.2 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్నిటా ఆర్థికంగా మందగమనం కొనసాగుతున్నా మన దేశం ‘వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా ఆశించటానికి కారణం ఉంది. వృద్ధి రేటు బలంగా ఉండటం, మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నిపుణులు ‘గోల్డీలాక్స్ ఎకానమీ’ అంటారు. దేశం ఏదైనా, పాలకులు ఎంతగానో కోరుకునే సమతౌల్య స్థితి ఇది. స్వేచ్ఛగా ప్రాథమ్యాలను ఎంచుకోవటానికీ, దూకుడుగా ముందుకు పోయేందుకూ అనువైన బడ్జెట్‌ను రూపొందించుకొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఒడుదొడుకులు ఉన్నా యని ఆర్థిక సర్వే గమనిస్తే అర్థమవుతుంది. 2025–26 సంవత్సరానికి గణాంకాల మంత్రిత్వ శాఖ లోగడ అంచనా వేసిన వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.4 శాతంకాగా, అది అంతకన్నా తక్కువే ఉంటుందని సర్వే చెబుతోంది. పన్ను వసూళ్లలో 11 శాతం వృద్ధి ఉండొచ్చని నిరుడు అంచనా వేస్తే అది 8 శాతం మించలేదు. నిరుడంతా విదేశీ మదుపుదారులు 1,900 కోట్ల డాలర్లమేర వెనక్కి తీసుకోగా, ఈ జనవరిలోనే 400 కోట్ల డాలర్ల ఈక్విటీలు విక్రయించారు. సంస్కరణలు మొదలయ్యాక ఇలా జరగటం ఇదే ప్రథమం. అయితే విదేశీ మారక నిల్వల్లో మనం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నామని సర్వే వివరిస్తోంది. ఈ నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెబుతోంది. అలాగే ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా పెరిగింది. ముగుస్తున్న సంవత్సరంలో ఇది 135.4 బిలియన్ డాలర్లు. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలకు మూలం ప్రపంచ స్థితిగతుల్లో ఉంది తప్ప అది అంతర్గతమైంది కాదని సర్వే ప్రకటించింది. అయితే తయారీ రంగ పరిశ్రమలు విస్తరించి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడటం మన బాధ్యతే. కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలు అవాస్తవమనీ, పైపెచ్చు తగిన మార్పులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ సర్వే అంటున్నది. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా, యాప్‌ల ద్వారా దేశంలో శరవేగంతో విస్తరిస్తున్న ‘గిగ్ ఎకానమీ’పై ఈ సర్వే దృష్టి సారించటం ప్రశంసనీయం. 2021లో ఈ రంగంలో 77 లక్షల మంది ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం కోటీ 20 లక్షలు. కానీ దాదాపు 40 శాతం మంది నెలకు రూ. 15,000 కన్నా తక్కువే సంపాదిస్తున్నారని చెబుతూ... గంటకు నిర్ణీత మొత్తం ఇచ్చేలా, లేక నిర్దేశించిన లక్ష్యానికి ఫలానా మొత్తం అనే విధంగా ఉంటే మెరుగైన ఆర్జన సాధ్యమవుతుందని సర్వే భావించింది. వారి పని పరిస్థితులు మెరుగయ్యేలా చూస్తామని వాగ్దానం చేస్తోంది. అయితే సామాజిక రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచితే తప్ప, ఉగ్రరూపం దాలుస్తున్న ఉపాధి లేమిని సరిచేస్తే తప్ప వాస్తవ అభివృద్ధి సాధ్యపడదు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం చాలా తక్కువుంది. ఆ రంగాలపై శ్రద్ధ పెట్టనంతకాలం నాసిరకం చదువులు, అనారోగ్యం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు పీడిస్తూనే ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదేమిటో రెండు రోజుల్లో రాబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది. -
వివక్ష వద్దంటే ఆందోళనా!
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అంతం కావటానికీ, సమానత్వం సిద్ధించటానికీ అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో విద్యార్థుల ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బరేలీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి కొలువుకు రాజీనామా చేయగా, దాన్ని నిరాకరించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. బీజేపీ నాయకులు ఒకరిద్దరు యూజీసీ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఆధిపత్య కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూజీసీ (UGC) ఇటువంటి మార్గదర్శకాలు జారీచేయటాన్ని బీజేపీలోని ఆధిపత్య కులాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ వర్గాలను సైతం ఈ పరిధిలోకి తీసుకురావటం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా కులాన్ని అంతం చేయటం సంగతలా ఉంచి, కుల వివక్షను రూపుమాపేందుకు జరిగే ప్రయత్నాలకు సైతం వ్యతిరేకత ఎదురు కావటం వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. వివక్ష ఎంతగా బాధిస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో దాన్ని అనుభవించేవారికి తప్ప అన్యులకు తెలిసే అవకాశం లేదు. అందుకే కుల వివక్షయినా, లింగ వివక్షయినా అవేమంత పెద్ద విషయాలు కాదన్నట్టు వాదించేవారు కనబడతారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందనీ, జ్ఞానం పరిధి విస్తరించేకొద్దీ అందరూ కుల, మతాల పరిమితులు అధిగమిస్తారనీ సంస్కర్తలు ఆశించారు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష రూపుమాపటం సంగతలా ఉంచి, దాన్ని ప్రోత్సహించే ధోరణులు కనబడటం చేదు నిజం. యూజీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ఇటీవలి కాలంలో క్యాంపస్‌లలో కుల వివక్ష పెరిగింది. మొత్తంగా అయిదేళ్లలో 704 విశ్వవిద్యాలయాల నుంచి, 1,553 కళాశాలల నుంచి 1,160 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే అయిదేళ్లలో ఇలాంటి ఫిర్యాదుల శాతం 118.4 శాతం పెరిగింది. విద్యాసంస్థలు మాత్రమే కాదు, ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని ఓబీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపించటం కనబడుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కుల వివక్ష అవాస్తవమని వాదించటం ఆత్మవంచన.యూజీసీ తనకు తానుగా ఈ మార్గదర్శకాలు రూపొందించలేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2016 జనవరిలో ఆత్మహత్య చేసుకున్న యువ దళిత విద్యార్థి రోహిత్ వేముల (Rohith Vemula) తల్లి రాధిక, 2019లో ముంబైలో పీజీ చేస్తూ ప్రాణం తీసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ అనే ఆదివాసీ యువతి తల్లి అబేదా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇవి వెలువడ్డాయి. వాస్తవానికి 2012లోనే ఇలాంటివి రూపొందినా, అవి సలహాపూర్వకమైనవి మాత్రమే! ఉల్లంఘనలకు ఎటువంటి చర్యలుండాలో అందులో లేదు. వివక్ష, వేధింపులకు దీటుగా శిక్ష ఉండాలని ఆ తల్లులిద్దరూ పిటిషన్లో అభ్యర్థించారు. తాజా మార్గదర్శకాలు పాటించని సంస్థలను యూజీసీ ప్రోగ్రాంల నుంచి దూరం పెట్టడం, కేంద్ర గ్రాంట్లు నిలిపేయటం వంటి చర్యలున్నాయి. ఫిర్యాదుల విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్దేశించారు. వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటును సూచించారు. ఫిర్యాదులపై వెనువెంటనే దర్యాప్తు చేయటం తప్పనిసరి చేశారు.ఈ మార్గదర్శకాల వల్ల జనరల్ క్యాటగిరీ విద్యార్థులు వేధింపులకు గురవుతారన్నది ఆందోళన చేస్తున్నవారి వాదన. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు... ఆర్థికంగా బలహీన వర్గాలకూ, అంగవైకల్యం ఉన్నవారికీ కూడా వివక్ష, వేధింపుల నుంచి రక్షణ కల్పించారు. ఈ మార్గదర్శకాలపై ఉన్న అపోహల్ని తొలగిస్తామనీ, ఇవి దుర్వినియోగమయ్యే అవకాశమే లేదనీ కేంద్రం చెబుతోంది. ఏదేమైనా కుల, మత, లింగ వివక్షలు ఉండరాదంటున్న రాజ్యాంగ అధికరణం 15కు ఈ మార్గదర్శకాలు అనుగుణంగానే ఉన్నాయి. వివక్ష, దాని ఆధారంగా వేధింపులు కళ్లెదుట కనబడుతుండగా ఇలాంటి నిబంధనల్ని వ్యతిరేకించటం, దుర్వినియోగమవుతుందన్న సాకు చెప్పటం ధర్మం కాదు. ఆచరణలో లోటుపాట్లుంటే చక్కదిద్దటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. -
చిరకాల ఆకాంక్ష
ఆలోచనకూ, అది సాకారం కావటానికీ మధ్య ఇరవై రెండేళ్ల సుదీర్ఘకాలం పట్టిందంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య మంగళవారం సంతకాలైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) వెనక ఇలాంటి ఆశ్చర్య పోయే సంగతులు చాలానే ఉన్నాయి. బహుశా ‘నియమాల ఆధారిత’ అంతర్జాతీయ క్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్వంసించటం మొదలెట్టకపోతే ఈ ఎఫ్టీఏకు మరికొంత సమయం పట్టేదేమో! ఈయూతో ఒప్పందమంటే ఆర్థిక స్థోమత పుష్కలంగా ఉన్న 27 యూరోప్ దేశాలతో బహువిధ రంగాల్లో ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటమే! అందుకే ఈ ఒప్పందాన్ని ‘సకల ఒప్పందాలకూ తల్లిలాంటిద’ని చెప్పటంతో పాటు, దీన్ని కేవలం వాణిజ్య ఒప్పందంగా కాక, ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపొందించిన ‘బ్లూ ప్రింట్’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్, ఈయూలు రెండూ ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడోవంతు వాటా కలిగివున్న రెండు ప్రధాన ఆర్థికవ్యవస్థలు. విడిగా చూస్తే మన దేశం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. కూటమిగా ఈయూ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఉక్రెయిన్ యుద్ధం వంటి ఆటుపోట్లు... అమెరికా, చైనాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ఈయూ ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతోంది. మన డెయిరీ రంగానికి ఎఫ్‌టీఏలో మినహాయింపు ఇచ్చేందుకు ఈయూ అంగీకరించింది. అయితే చిన్న, మధ్యతరహా సంస్థల ప్రవేశానికీ, సర్వీసుల రంగానికీ మన దేశం వెసులుబాటు నిచ్చింది. కార్ల దిగుమతిపై ఉన్న 110 శాతం సుంకాలు పది శాతానికి పడిపోతాయి. ఎన్నడో 2004లో ఒక ఆలోచనగా బయల్దేరిన ఎఫ్‌టీఏ జాప్యం కావటంలో ఈయూ మొండి వైఖరే ప్రధాన కారణం. అసలు దానిపై చర్చల ప్రారంభానికే మూడేళ్లు పట్టింది. అప్పట్లో ఈయూకు చైనాయే ఇష్టసఖి. అందుకే భారత్‌ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అమెరికాతో మనకు కుదిరిన పౌర అణు ఒప్పందం ‘123’ దాని కళ్లు తెరిపించింది. 2013లో ఎఫ్‌టీఏ కోసం ఈయూ విధించిన షరతులు లీకైనప్పుడు నిరస నలు వెల్లువెత్తాయి. మేధాసంపత్తి హక్కుల పేరిట తన ఫార్మా రంగాన్ని రక్షించుకోవ టానికి ఎఫ్‌టీఏలో ఈయూ పెట్టిన నిబంధన మన ప్రజారోగ్య రంగానికి చేటు తెస్తుందని, జెనెరిక్ మందుల ఉత్పత్తి నిలిచిపోతుందని ఆక్స్‌ఫావ్‌ు వంటి సంస్థలు హెచ్చరించాయి. సాగు రంగంపై అది చూపగల ప్రభావంపైనా భయాందోళనలు వ్యక్తమ య్యాయి. ఇవి గాక అనంతర కాలంలో కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలు ఈయూకు అభ్యంతరకరం అనిపించాయి. ఈమధ్య పలు దేశాలతో మనకు ఎఫ్‌టీఏలు కుదిరాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, మారిషస్, యూఏఈలతోపాటు ఐస్‌ల్యాండ్, లిచెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్టీఏ)తో సైతం ఎఫ్‌టీఏలపై సంతకాలు చేసింది. ఈయూతో సంబంధంలేని కూటమి ఈఎఫ్టీఏ. ఉభయపక్షాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ నిరుడు మార్చి ఆఖరునాటికి 13,600 కోట్ల డాలర్లు. ఈయూ సరుకుల ఎగుమతుల జాబితాలో భారత్‌ది అగ్రస్థానం. అయితే తాజా ఎఫ్‌టీఏ అమల్లోకి రావటానికి కొన్ని అవరోధాలున్నాయి. ఈ నెల 1 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జెస్ట్మెంట్ మెకానిజం(సీబీఏఎం) పేరిట ఈయూ అమల్లోకి తెచ్చిన ‘పర్యా వరణ పన్ను’ ప్రధాన అవరోధం. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, ఎరువుల వంటివి చవగ్గా ఉత్పత్తి చేయటానికి కర్బన ఉద్గారాల ముప్పును భారత్ పట్టించుకోవటం లేదని, అందుకే ఇది అవసరమని ఈయూ వాదన. దీన్ని మన దేశం ఖండిస్తోంది. కేవలం తమ ఉత్పత్తుల్ని రక్షించుకోవటానికి ఇదొక సాకు మాత్రమేనన్నది మన వాదన. సీబీఏఎం నుంచి భారత్‌కు మినహాయింపు ఇస్తుందా, అసలు దాని అమలునే ఈయూ వాయిదా వేస్తుందా అన్నది చూడాలి. ఇవిగాక ఆరోగ్యం, భద్రత ప్రమాణాలు... కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటివి కూడా ఉన్నాయి. కానీ ట్రంప్ దూకుడు నుంచి కాపాడుకోవాలంటే ఇలాంటి సాకులు వదులుకోక తప్పదు. మొత్తానికి 27 యూరోప్ దేశాల చట్టసభలతోపాటు ఈయూ పార్లమెంటు, మన పార్లమెంట్ ధ్రువీకరించాక ఎఫ్‌టీఏ అమలు మొదలవుతుంది. దానికెంత కాలం పడుతుందో చూడాలి. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్‌పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్‌పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్‌పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్‌కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్‌టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
కాంగ్రెస్ రంగు మారిందా?
సింగరేణిపై ఏ గద్దలనూ, ఏ పెద్దలనూ వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఈ శనివారం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదేవారంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రెండో మీడియా సమావేశం ఇది. రాబందుల ప్రయోజనాలను కాపాడటానికే రాధాకృష్ణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక’గా ఆ పత్రికను అభివర్ణిస్తూ ‘ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి నాపై తప్పుడు వార్తలు రాస్తున్నావ’ని రాధాకృష్ణను ఆయన ప్రశ్నించారు.సింగరేణి యాజమాన్యం కింద ఉన్న నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల కాంట్రాక్టును ఎన్టీవీ యజమాని బంధువుకు ఇప్పించడం కోసమే ఎక్కడా లేని ‘సైట్ విజిట్’ నిబంధనను భట్టి విక్రమార్క తీసుకొచ్చారని ఆ వ్యాసంలో రాధాకృష్ణ ఆరోపించారు. అదే కాంట్రాక్టు మీద కన్నేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుతగలడంతో ఆయన మీద ఎన్టీవీలో ఒక అభ్యంతరకరమైన కథనం ప్రసారమైందని రాధాకృష్ణ ఆరోపించారు. ‘సైట్ విజిట్’ నిబంధనను తను తీసుకొని వచ్చానన్న ఆరోపణ శుద్ధ అబద్ధమని తేలుస్తూ శనివారం నాడు భట్టి డాక్యుమెంటరీ సాక్ష్యాలను విడుదల చేశారు.నలభయ్యేళ్లుగా రాజకీయ నిబద్ధతతో నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం పట్ల భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగినందుకే తనను రాధాకృష్ణ టార్గెట్ చేశారని కూడా మొదటి సమావేశంలో ఆయన ఆరోపించారు. నిజంగానే భట్టిది నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితమే! దళిత కుటుంబం నుంచి ఎదిగిన విద్యాధి కుడు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎం.ఏ. చదివారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం ఎమ్మెల్సీగా పని చేసి, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి వరసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు రికార్డును బద్దలు కొట్టారు. గడచిన అసెంబ్లీలో తన సహచర పార్టీ ఎమ్మెల్యేలు వరుసకట్టి పార్టీ ఫిరాయిస్తున్నా చలించకుండా పార్టీకే కట్టుబడిన వ్యక్తి. అనంతరం పార్టీ గెలుపు కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న వారిలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి తన కెరీర్‌పై మీడియాలో బురద చల్లడం పట్ల సహజంగానే ఆయనకు ఆవేదన కలిగి ఉంటుంది.భట్టితో పాటు అదే వ్యాసం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బజారున పెట్టింది. మంత్రి పదవిలో ఉండి సొంత పనికోసం తన పలుకుబడిని ఉపయోగించుకున్నారనే మరకను ఆయనకు అంటించారు. పేర్లు ప్రస్తావించకుండా మంత్రి మీద, మహిళా అధికారుల మీద ఎన్టీవీ ప్రసారం చేసిన ‘ఆఫ్ ది రికార్డు’ కథనం అభ్యంతరకరమైనదే! కాకపోతే మాజీ గవర్నర్, వయోవృద్ధుడైన ఎన్.డి. తివారీ మీద రాసలీలల పేరుతో కథనాలు వండివార్చిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మరో మీడియా ఛానల్‌ను ఎత్తిచూపడమే వింతగొలుపుతున్నది. మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వచ్చినప్పుడు ఆ మీడియా సంస్థ ముఖ్యబాధ్యులకు నోటీసులివ్వడం, పరువు నష్టం కేసులు, సివిల్ కేసులు వేయడం ఒక సంప్రదాయం. కానీ ఎకాయెకిన క్రిమినల్ కేసులు పెట్టి, ఎంపిక చేసుకున్న ముగ్గురు బీసీ, ఎస్సీ జర్నలిస్టులను (దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సురేశ్) అరెస్టు చేశారు. గత కొంతకాలంగా పాత కాంగ్రెస్ నేతల మీద రకరకాల లీకులు, ఆరోపణలు అటు యెల్లో మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వరసగా కనిపిస్తున్నాయి. దీని వెనుకనున్న అదృశ్య హస్తం ఎవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడైన మంత్రి మీద కూడా సోషల్ మీడియాలో విప రీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా జగి త్యాల ప్రాంత కాంగ్రెసుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నేత, నిబద్ధత గల నాయకుడిగా పేరున్న జీవన్‌రెడ్డికి పార్టీలోనే పొగబెట్టడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గాంధీ భవన్లో జరిగిన తమ పార్టీ ప్రాంతీయ సమావేశంనుంచి కూడా ఆయన వాకౌట్ చేసి బయటకు రావలసిన దుఃస్థితి పాత కాంగ్రెస్ నేతల పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతున్నది.కాంగ్రెస్ వ్యవహారాల్లో ఈ లీకులు, ఆరోపణలు, యెల్లో మీడియా ద్వారా వెలువరిస్తున్న కథనాలు, కుంభకోణాలు వగైరాలన్నీ ఉపకథలు మాత్రమే. అసలు కథ అంతర్లీనంగా జరుగుతున్న రాజకీయ మార్పు. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం తెలంగాణ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎన్టీఆర్ అభిమా నులూ, చంద్రబాబు అనుయాయులూ కలిసి బొందపెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగ స్వామి. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఓడించడానికి ఎన్డీఏ అభిమానులను ఆహ్వా నించడమేమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో కాంగ్రెస్ రక్తమే ఉన్నదా? లేక ‘క్రమశిక్షణ కలిగిన రక్తకణాలు’ ఏవైనా బయట నుంచి ప్రవేశించాయా? ‘మా రక్తాన్ని ఎక్కించుకుంటే చిరంజీవి ఎన్నికల్లో గెలిచే వాడ’ని వెనుకటికి ఒక ‘కులోత్తుంగ’ చోళుడు నుడివిన పలుకులు ఎవరూ మరిచిపోయేవి కావు. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్పయితే జరుగుతున్నదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఈమధ్య బాగా వినిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిందెవరు? బీఆర్ఎస్సా? ఎంత మాత్రం కాదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగుదేశం’ను భూస్థాపితం చేసింది. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసుకున్నా కూడా 2009లో అది లేవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో మోదీతో, పవన్‌తో జోడీ కట్టి అలవికాని హామీలిచ్చి టీడీపీ పునరుజ్జీవం పొందగలిగింది. కానీ తెలంగాణలో రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అది సమాధి స్థితిలోనే ఉన్నది.కేసీఆర్ హయాంలో జరిగిందేమిటంటే, ‘ఓటుకు నోటు’ బాగోతంలో దొరికిపోయినందువల్ల ‘పదేళ్ల రాజధాని’ హైదరా బాద్‌ను వదిలేసుకుని చంద్రబాబు సర్కార్ పలాయనం చిత్తగించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టింది మాత్రం 2004లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలే! ముఖ్యమంత్రి సందేశాన్ని అందుకొని తెలుగుదేశం అభిమానులు పగ సాధించ వలసింది ఎవరిపైన? కాంగ్రెస్‌పైనే కదా! నాటి కాంగ్రెస్ – నేటి కాంగ్రెస్ అని విభజించి యాక్షన్ ప్లాన్ అమలుచేయాలా? ఏమిటిప్పుడు తెలుగుదేశం అభిమానుల తక్షణ కర్తవ్యం?‘ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసం నా మీద అసత్య వార్తలు రాస్తున్నావు రాధాకృష్ణా?’ అని భట్టి ప్రశ్నిస్తున్నారు. ఆ కళ్లు ఎవరివై ఉంటాయి? ఏ రాబందుల ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. ఆ రాబందులు ఎక్కడివై ఉంటాయి? భట్టి మీద, ఆయనతో సహా పాత తరం కాంగ్రెస్ నేతల మీద ఆ కళ్లు ఎందుకని నిప్పులు పోసుకుంటున్నాయి? జీవన్‌రెడ్డి వంటి నీతిమంతులైన నేతలను ఎందుకని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రొటో కాల్‌ను పక్కనపెట్టి ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణను కలిసిరావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కింది నుంచి పైస్థాయి వరకు చాలామందికి మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ను తరిమికొట్టే పేరుతో తెలుగుదేశం అభిమానులకు స్నేహహస్తం చాచడం కూడా పార్టీ కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇరవై రెండేళ్ల కింద తామే స్వయంగా సమాధి చేసిన పార్టీ ఆత్మను ఇప్పుడు ఆవాహన చేయవలసిన అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో నిట్టనిలువునా ఒక సైద్ధాంతిక విభజనైతే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ శ్రేణుల దౌర్భాగ్యం ఏమిటంటే స్వయానా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీకి చంద్రబాబుతో అంతుచిక్కని చెలిమి ఏదో ఏర్పడి ఉండటం! ఫలితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల జాతీయ పార్టీకి నియంత్రణ లేకుండా పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందువల్ల, బీజేపీ మీద బలమైన సైద్ధాంతిక పోరాటం ఆ పార్టీ చేయాలని కాంగ్రెస్ నాయకులు గానీ, లౌకికవాదులు గానీ ఆశిస్తారు. కానీ ఇక్కడ ఎన్డీఏ ముఖ్య భాగస్వామి కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.వ్యూహాత్మకంగానే రెండు రాజకీయ పరిణామాలు తెలంగాణలో నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకటి – కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ లేదా సైద్ధాంతిక కాంగ్రెస్‌వాదులు పూర్తిగా పట్టు కోల్పోయేలా చేయడం! రెండు – రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీజేపీ బలపడాలంటే బీఆర్ఎస్ నిర్వీర్యం కావాలి... అందుకు అవసరమైన భూమికను తయారుచేయడం! గత కొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, విచారణలు వగైరాలన్నీ ఈ కోణంలోంచి చూసినప్పుడే అర్థం చేసుకో గలుగుతాము. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరుగుతున్న దర్యాప్తులో వేగం పెంచాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం, ‘ఫార్ములా–ఇ’ రేసు కేసులో ఈడీ రంగప్రవేశం, ఆగమేఘాల మీద బొగ్గు వ్యవహారంపై కేంద్ర కమిటీ దర్యాప్తు ప్రారంభించడం వగైరాలన్నీ తెలంగాణలో తెర వెనుక జరుగుతున్న విచిత్ర రాజకీయ మైత్రీబంధాల సంకేతాలుగానే భావించాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పొంచివున్న పెనుముప్పు
గుక్కెడు మంచినీళ్ల కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం ఇక్కట్లు పడాల్సి ఉంటుందని నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు రేపో మాపో నిజం కాబోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరిస్తున్నది. మనిషికే కాదు... సమస్త జీవకోటికీ గాలి తర్వాత నీరే ప్రాణాధారం. కానీ మారుతున్న పర్యావరణం, పెరిగిపోతున్న కాలుష్యంతో పాటు మితిమీరిన వినియోగం కారణంగా నీరు శరవేగంతో అడుగంటి పోతున్నదని ఆ నివేదిక చెబుతోంది. ముంచుకురానున్న ఈ ప్రమాద తీవ్రతను తెలియ జెప్పేందుకు నివేదిక కొత్త పదాన్ని ఎంచుకుంది. జల సంక్షోభం, జలగండం వంటివి అలవాటైన పదాలు. సంక్షోభం అనడంలో దాన్ని అధిగమించగలమన్న భరోసా కూడా ఏదో ఒక మూల ఉంటుంది. గండం అని చెప్పడంలో గట్టెక్కగలమన్న విశ్వాసం ఎంతో కొంత ధ్వనిస్తుంది. కానీ ముంచుకురాబోయే ముప్పు ఇంకెంత మాత్రమూ సాధారణ మైనది కాదు. అందుకే ఆ ముప్పును ‘జల దివాళా’ అంటోంది నివేదిక.ప్రకృతి మనకు వాన రూపంలో, మంచురూపంలో ప్రసాదించే జలరాశి ఆదాయంతో సమానమని, కానీ పొందుతున్న జలరాశిని మించి... చెప్పాలంటే అవసరాలను మించి నదులు, సరస్సులు, చిత్తడి నేలలు, భూగర్భ జలాశయాలు వగైరాల నుంచి మానవాళి పీల్చేస్తున్నదని నివేదిక రూపొందించిన ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన జల, పర్యావరణ, ఆరోగ్యసంస్థ డైరెక్టర్ కావే మదానీ అంటున్నారు. ఆదాయాన్ని మించి వ్యయం చేస్తే సర్వస్వం కోల్పోయిన విధంగానే కుంచించుకుపోతున్న నదీనదాలూ, సరస్సులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని ఆయన భావన. కనీసం ఈ దశలోనైనా మేల్కొంటే ఆ దివాళాను నివారించటం సాధ్యమేనని ఆయన చెబుతున్నారు.నివేదికను గమనిస్తే ప్రపంచీకరణకూ, ఆవిరైపోతున్న నీటి వనరులకూ ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద సరస్సుల్లో 1990 తర్వాతే నీరు అడుగంటుతున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన భూగర్భ జలాశయాల్లో 70 శాతం క్షీణత కనబడుతోంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) భూభాగంతో సరిసమానమైన చిత్తడి నేలలు గత 50 ఏళ్లలో అంతరించగా, 1970 దశకం నుంచి చూస్తే హిమానీనదాలు 30 శాతం మేర కొడిగట్టాయి. నీటి వ్యవస్థపై అంతగా ఒత్తిడి లేని ప్రాంతాల్లో సైతం కాలుష్యం వల్ల మంచినీటి కొరత ఏర్పడటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపు తోంది. నీటి కోసం భవిష్యత్తులో దేశాల మధ్యా, దేశాల్లో ప్రాంతాల మధ్యా వైషమ్యాలు పెచ్చరిల్లే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తోంది. నీటి వనరుల క్షీణత దాదాపు అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ప్రతియేటా కనీసం ఒక నెలరోజులపాటు 400 కోట్లమంది ప్రజానీకం దాహార్తితో ఉంటున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ నగరం నీటి లభ్యతను పూర్తిగా కోల్పోనున్న తొలి ప్రపంచ నగరం కాబోతున్నదని నిపుణులంటున్నారు. మెక్సికో నగరమైతే ఏడాదికి 20 అంగుళాల చొప్పున నీరు కోల్పోతోందని చెబుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, లాస్ వేగాస్ నగరాలు, ఇరాన్ రాజధాని తెహ్రాన్లలో నీటి పంపిణీకి పరిమితులు విధించక తప్పని స్థితి ఏర్పడినా పాలకులు మాత్రం వాటి విస్తరణను ఆపడం లేదు. 2003–2019 మధ్య ఇరాన్ 200 ఘున కిలోమీటర్ల (7,062 శతకోటి ఘనపుటడుగుల) నీటి నిల్వను కోల్పోయిందని అంచనా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియాలో పెరుగుతున్న పట్టణీకరణ నీటి వనరుల్ని దెబ్బతీస్తోంది. మన దేశం సంగతికొస్తే ప్రపంచ జనాభాలో మనం 18 శాతం. కానీ ప్రపంచ స్వచ్ఛనీటిలో మన వాటా 4 శాతం. అమెరికా, చైనాల తర్వాత అత్యంత భారీగా భూగర్భ జలాలను వాడుతున్న దేశం మనది. గంగ, యమున, సబర్మతి నదుల్లో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి కలుస్తున్నాయి. 56 శాతం జిల్లాల భూగర్భ జలాల్లో నైట్రేట్లు కలగలిసివుంటున్నాయని తేలింది. విచ్చలవిడి నీటి వినియోగం, జలకాలుష్యం నివారించటంతోపాటు భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకుంటేనే సమితి నివేదిక చెప్పిన ‘జల దివాళా’ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉండటం క్షేమం కాదు. -
మళ్లీ గవర్నర్ల పంచాయతీ!
జవాబుదారీతనం కొరవడినచోట ఇష్టారాజ్యం నెలకొంటుంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే చెప్పినా సమస్య ఎప్పటిలానే మిగులుతుంది. వార్తల్లో వ్యక్తులుగా ఉండా లనుకుంటారో, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను తిప్పలు పెట్టాలనుకుంటారో... కొందరు గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారం కొత్త తగువులు తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో చేయాల్సిన ప్రసంగాన్ని కాదని రవి వాకౌట్ చేస్తే, కేంద్రాన్ని విమర్శించే ప్రస్తావనలున్న భాగాలను అర్లేకర్ చదవకుండా వదిలిపెట్టారు. రవి వివాదాలకు కొత్తగాదు. ప్రభుత్వం పంపిన పది బిల్లుల్ని దీర్ఘకాలం సమ్మతి తెలపకుండా, అలాగని అభ్యంతరాలేమిటో చెప్పకుండా తన దగ్గరే ఉంచుకున్న ఘనుడాయన. అందులో 2020 నాటి బిల్లు కూడా ఉంది! అందుకే రవి తీరును నిరుడు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. బిల్లుపై నిర్ణీత వ్యవధిలో గవర్నర్ ఏ మాటా చెప్పని పక్షంలో దాన్ని ఆమోదించి నట్టుగా భావించాలని కూడా తీర్పునిచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలన కొచ్చిన బిల్లునైతే వెంటనే లేదా గరిష్ఠంగా నెలరోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. అటు తర్వాత రాష్ట్రపతికిచ్చిన సలహాపూర్వక అభిప్రాయంలో బిల్లును ‘ఆమోదించినట్టుగానే పరిగణించాల’న్న భావన సరికాదని మరో ధర్మాసనం తెలిపింది. కానీ అందులో సైతం ‘దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో ఉంచటం’ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయటమేనని స్పష్టం చేసింది. గవర్నర్ల వ్యవస్థ ఆది నుంచీ వివాదాస్పదమే. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంలో విపక్షాలను కూడగట్టి కేంద్రంపై రణభేరి మోగించారు. రాజకీయాలకు అతీతంగా ఆ వ్యవస్థ మనుగడ సాగించ లేకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపంగా పరిణమించింది. రాజ్యాంగ నిర్ణాయక సభలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అధికరణాలపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు కేంద్రం నామినేట్ చేస్తే వచ్చే గవర్నర్‌కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ అనవసర ఘర్షణలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. అయితే గవర్నర్‌గా వచ్చేవారు రాజ్యాంగపరిధిలో తమంత తాము నిర్వర్తించే కర్తవ్యాలు ఏమీ ఉండబోవనీ, రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే వారు పనిచేస్తారనీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారికి నచ్చజెప్పారు. ఇన్ని దశాబ్దాలు గడిచాక ఇప్పుడు జరుగు తున్నదేమిటి?వాకౌట్ చేయటానికి రవి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కాదు. సమా వేశాలను తమిళ రాష్ట్రగీతంతో మొదలుపెట్టి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక చివరగా జాతీయగీతాలాపన ఉంటుందని ప్రభుత్వం చెప్పినా ఆయనకు రుచించలేదు. ఇతరేతర ఆరోపణలు రాజకీయ స్వభావం ఉన్నవి. వాటిని ఎటూ ప్రజాక్షేత్రంలో విపక్షాలు లేవనెత్తుతాయి. ఎన్నికల సమయంలో జనం తీర్పునిస్తారు. ఆ విషయంలో గవర్నర్‌గా రవి ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించే ముందు గవర్నర్‌గా తన నిర్వాకమేమిటో ఆయన సమీక్షించుకోవద్దా? బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం రాజ్యాంగ ఉల్లంఘనేనని గతంలో సుప్రీంకోర్టు చెప్ప లేదా? కేరళ గవర్నర్ రాజేంద్ర తీరు సైతం అలాగే ఉంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగపాఠంలో తనకు నచ్చని భాగాలు వదిలేయటం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి కావాలి. అది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి, ప్రజల భద్రతకు ముప్పుగా మారితే వేరే విషయం. అలాంటపుడు కేంద్రానికి నివేదిక పంపి చర్య తీసుకోవాలని కోరవచ్చు. కానీ తమకు నచ్చని పార్టీ ఏలుబడి ఉన్నచోట చీటికీ మాటికీ రచ్చ ఏం సబబు? ఇటువంటి కీచులాటల్లో గవర్నర్‌దా... రాష్ట్ర ప్రభుత్వానిదా, ఎవరిది పైచేయి అని జనం చూడరు. మొత్తంగా వ్యవస్థ పట్లే అపనమ్మకం పెంచుకుంటారు. అందుకే హద్దులు గుర్తెరిగి ప్రవర్తించాలనీ, జవాబుదారీతనంతో వ్యవహరించాలనీ గవర్నర్లు తెలుసుకోవాలి. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
కరుణ ముఖ్యం
ఒక రైతు పెంచుకుంటున్న కుక్క ఆ రోజు కనపడలేదు. ఇంటికి రాలేదు. రైతు వెతకబోయే వేళకు చీకటి పడిపోయింది. రైతు విలవిలలాడిపోయాడు. రైతుకూ కుక్కకూ ఉన్న అనుబంధం గ్రామస్థులకు తెలుసు. రాత్రంతా జాగారం చేస్తున్న రైతు బాధ గమనించి తెల్లవారుతూనే రైతుకు సాయంగా కుక్కను వెతక బయలుదేరారు. వెళ్లగా వెళ్లగా వంతెన కింద మట్టిలో కుక్క పడుకుని కనిపించింది. వంతెన మీద నుంచి గ్రామస్థులు ఎంత పిలిచినా అది లేచి రాలేదు. ఏమై ఉంటుందా అని గ్రామస్థులు వంతెన దిగి కుక్క దగ్గరకు వెళితే అక్కడ కుక్క కుక్కలా లేదు. వెచ్చటి రగ్గులా ఉంది. ఎవరిదో తెలియని కుక్కపిల్ల చలికి వణుకుతూంటే దాని ఒళ్లు వెచ్చబెట్టేందుకు రాత్రంతా ఇంటికి రాకుండా కరుణతో కాపాడుతూ ఉంది. గ్రామస్థులు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. దీనికి ఉన్న కరుణ మనిషికి ఎందుకు లేదు?దేశంలో ఈ గడ్డకట్టే చలిగాలుల్లో, నెత్తి మీద కాసింత నీడ లేక, ఉత్తబిత్తల ఆకాశం కింద, తోచిన గుడ్డ కప్పుకుని వేలాదిమంది అభాగ్యులు రాత్రుళ్లు దయనీయంగా పడు కుని ఉన్న దృశ్యాలు మీడియాలో వస్తున్న వేళ – ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో నోబెల్ శాంతి విజేత ‘లైమా గ్బవీ’ తమ ఆఫ్రికా దేశపు కథను చెప్పడం కేవలం యాదృచ్ఛికం. ఆమె చెప్పిన కథకు కొనసాగింపుగా మరో నోబెల్ శాంతి విజేత కైలాశ్ సత్యార్థి తన జీవితంలో ఎదురైన ఘటనను చెప్పుకొచ్చారు – చాలా ఏళ్ల కిందటి మాట. ఒక తండ్రి నా తలుపు తట్టాడు. అయ్యా... నా కూతురిని రక్షించు అన్నాడు. అప్పుడు చిన్న పత్రికను నడుపుతున్నాను. ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్‌కు 30 కుటుంబాలు పనికి వెళితే వారిని కట్టు బానిసలుగా చేశారనీ, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారనీ, తన కూతురు వయసుకు రావడం చూసి అమ్మేయబోతున్నారనీ, పోలీసులు సాయానికి రాకపోవడం వల్ల పత్రికలో రాస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని వచ్చాననీ ఆ తండ్రి నాతో ఏడుస్తూ చెప్పాడు. పత్రికలో ఆ విషయం రాయడానికి కూచుని వెంటనే పెన్సిల్ పక్కన పడేశాను. అక్కడ ఉన్నది నా కూతురో, చెల్లెలో అయితే ఇలా వ్యాసం రాస్తూ కూచుంటానా? అనుకున్నాను. ఆ తర్వాత నా తల పగిలి ఉండొచ్చు. వెన్నుపూసను విరిచినంత పని చేసి ఉండొచ్చు. నా కాలిని విరగ్గొట్టి ఉండొచ్చు. కాని ఇప్పటికి లక్షా ముప్పై వేల మంది అలాంటి పిల్లలను కాపాడాను. వారి ఆనంద బాష్పాలలో నేను దేవుణ్ణి చూశాను. కరుణే నాకు ఇంత శక్తి ఇచ్చిందని అనుకుంటున్నాను.‘మనిషి మంచివాడే. నాగరికత వల్ల చెడిపోయాడు’ అన్నాడు రూసో. నాగరికత అంటే గాలి కూడా పీల్చడానికి వీల్లేనంతగా అభివృద్ధి చెందడం కాబోలు! మరి చెడి పోవడం అంటే? కరుణ అడుగంటిన వాడు అవడమే! కరుణ లేకపోతే ఏమవుతుంది? పీడన, పెత్తనం, చెడు, దుర్మార్గం, నిస్సహాయత, హింస, దౌర్జన్యం... కళ్ల ముందు కని పిస్తున్నా చలించని జడత్వం వస్తుంది. జడత్వం రాయి. కరుణ జల. తల్లిదండ్రులకు తమ పిల్లల ఐ.క్యూ (ఇంటెలిజెన్స్ కోషియెంట్) బాగుండాలని ఉంటుంది. కాని పిల్లల్లో చూడాల్సింది, పాదుకొనేలా చేయాల్సింది సి.క్యూ. అంటే ‘కంప్యాషన్ కోషియెంట్’. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత సంతోషపడాలి. చీకట్లో నల్లపూస దొరకగలదేమోగానీ నేటి మనిషిలో కరుణ దొరకడం దుర్లభం అవుతోంది.అందుకే మనిషికి ఇంకో మనిషి, వర్గం, ప్రాంతం, కులం, మతం... అన్నింటి పట్లా విరోధభావం, శత్రుత్వం. తుదకు పశుజాలం పట్ల కూడా మనిషి కరుణ చూపడం లేదు. మనిషికి కరుణ ఉంటే నదులు, పర్వతాలు, అడవులు ఇలా ఉండేవా? అన్నారు కైలాశ్ సత్యార్థి. అందుకే మనిషిలో ‘సి.క్యూ’ కొలవగలిగే యాప్‌ను కనిపెట్టాలి. అది ఎక్కువ కలిగిన వారినే వివాహానికి, ఉద్యోగానికి, రాజకీయ పదవులకి ఎన్నుకోవాలి. స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణ ఇచ్చినట్టే కరుణ పెంచుకోవడానికి శిక్షణ ఇవ్వాలి అన్నారు సత్యార్థి.జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన తాజా పుస్తకం ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంప్యాషన్’ ఆవిష్కరణ వేడుకలో ఇంటిని, కుటుంబాన్ని, సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరగల కరుణ అవసరం గురించి ఇలాంటి మాటలెన్నో సాగాయి. ‘త్రుంచ బోకుము... తల్లికి బిడ్డకు వేరు చేతువే’ అని విలపించిన కరుణశ్రీ నడిచిన తెలుగు నేలకు కరుణ తెలియదా ఏమి? కాకుంటే కాస్త మరుగున పడి ఉంటుంది, మరుపున అణిగి ఉంటుంది అంతే! -
విద్యాహక్కుకు చికిత్స!
జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి. అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు. -
ముంబైని గెలిచేదెవరు?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్‌గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది. బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకుంది. ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్‌ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు. దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది. -
వీధికుక్కల బెడద తీరేదెలా?
మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు. జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి. వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది. అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు. ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి. -
అష్టదిగ్బంధంలో ఇరాన్!
సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు. పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది. ఇరాన్‌కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్‌పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్‌కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది. పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి. -
శీతకాలం కోత పెట్టగ...
చల్లదనం గురించీ, వేడి గురించీ ఒక్కోసారి మన ఊహల్ని తలకిందులు చేస్తూ, మాటలకు మనమిచ్చే అర్థాలను సవరించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ శీత ఋతువులో అదే జరుగుతోంది. శీతవాయువు కోతకత్తిగా మారి శరీరాన్ని నిలువునా కోసి చలికారం అద్దుతోంది. మండువేసవిని మించి, రోజంతా చలి దహిస్తోంది. బతుకైనా, బాగైనా మితిలోనే ఉందనీ, అతి అన్నిటా అనర్థానికే దారి తీస్తుందనీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ ఏడాది దేశంలో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయి చలిగాలుల ఊపేస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. భూమి చరిత్రలోనే కానీ, మానవ చరిత్రలోనే కానీ ఋతుగమనం హఠాత్తుగా తూకం తప్పి బతుకులను తలకిందులు చేసిన ఘట్టాలు అసంఖ్యాకం. చరిత్రకెక్కినవి కొన్నే. సాధారణ శకం 536లో అగ్నిపర్వతాలు బద్దలై యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా లలో ఆకాశాన్ని అంధకారంతో కప్పేసి అతి శీతల వత్సరాలను సృష్టించాయి. అది అసాధారణ స్థాయిలో హిమపాతానికీ, కరవు కాటకాలకూ, మానవ, జంతు మరణాలకూ దారితీసింది. యూరప్‌తో సహా పలుచోట్ల 1300–1850 మధ్యకాలాన్ని చిన్నపాటి మంచుయుగంగా లెక్కించారు. 1709లో యూరప్‌లో విస్తారమైన ప్రాంతాలు మంచు భూములుగా మారిపోయి, అనేక ప్రాణాలకు సమాధులయ్యాయి. 1783–84లో ఉత్తర అమెరికాలో విపరీత శైత్యం తీవ్ర దుర్భిక్షానికీ, చివరికి ఫ్రెంచి విప్లవానికీ దారితీసింది. 1816లో వేసవే లేకుండా పోయింది. 1963లో బ్రిటన్‌లో, 1972లో ఇరాన్లో, 2008లో అఫ్గానిస్తాన్‌లో హిమపాతాలూ, చలిగాలులూ పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించాయి. శిశిరం శివతాండవం చేస్తూ కరవు కాటకాలతో జీవజాలాన్ని ఆకుల్లా రాల్చి వేయడం గమనిస్తే శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ కవిత గుర్తొస్తుంది. అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటూ మనిషి స్థాపించిన సామ్రాజ్యాలు... ‘ఇతరేతర శక్తులు’ లేస్తే పేకమేడల్లా పడిపోయా యంటాడాయన. అలాగే, మౌర్య సామ్రాజ్యంలో తలెత్తినట్టు చెబుతున్న పన్నెండేళ్ళ దుర్భిక్షానికి అతిశీతల వాతావరణమో, లేదా అలాంటి మరేదైనా ‘ఇతరేతర’ శక్తో కారణం కావచ్చు. అప్పుడు భద్రబాహుడనే జైనముని జైన సంఘాన్ని వెంట బెట్టుకుని దక్షిణ భారతానికి తరలివచ్చాడనీ, చక్రవర్తి చంద్రగుప్తుడు కూడా సింహా సనాన్ని త్యజించి దక్షిణాపథానికి వచ్చాడనీ చరిత్ర చెబుతోంది. సమతూకపు ఋతుగమనానికీ, భూమ్మీద జీవజాలం మనుగడకూ ఉన్న పీటముడి ఎలాంటిదో – ఆ తూకం హఠాత్తుగా తారుమారైనప్పుడే తెలిసి వస్తుంది. శీతర్తువు కరుణించి తగినంత వెచ్చదనాన్ని జోడించినప్పుడు, పోతన భాగవతంలో వర్ణించినట్టు మన్మథుడు విరహులకు హేమంతం అడుగుపెట్టినట్టు గబ్బున తోపించి అదేపనిగా వేధిస్తూ అర్ధాంగి నులివెచ్చని ఆలింగన సౌఖ్యం వైపు నడిపిస్తాడు. హాలుడు ‘గాథాసప్తశతి’లో అభివర్ణించినట్టు, ఆ భరోసాతోనే భర్త పశువులను కొనుక్కోడానికి పైబట్టను అమ్ముకుంటాడు. ‘చలి వడి కించే శైశిర కాలం వస్తూపోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే’నంటూ మహాకవి శ్రీశ్రీ శైశవగీతిని ఆలపిస్తాడు. అదే శీతర్తువు ఒకింత గతి తప్పిందా... అస్తిత్వమే అల్లకల్లోలమైపోతుంది. చలిగాలుల విజృంభణకు శాస్త్రవేత్తలిప్పుడు వివిధ కారణాలు ఎత్తి చూపుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులూ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో సంభవించే అలజడులూ చల్లని ఉత్తరపు గాలుల్ని సృష్టించి హిమాలయాల మీదుగా వ్యాపింపజేస్తాయంటున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం కూడా ఉష్ణోగ్రతను కట్టడి చేసి శీతల వాయువులను సృష్టిస్తోందట. శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు కొన్ని భాగవత కవికి అనుభవపూర్వకంగా తెలుసు. ఉత్తరపు గాలి విసురుతోందనీ, తామరలు తరిగి అంతటా మంచు నెలకొందనీ అంటాడు. సూర్యుడు శక్తిహీనుడు కావడం వల్ల హిమాలయాల నిండా మంచు పేరుకుని ఆ పేరును సార్థకం చేస్తోందని రామాయణ కవి అంటాడు. వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో పుడమితల్లి ఇలాంటి పురిటినొప్పులు ఎన్ని పడిందో! ఎన్ని మంచు యుగాలను చూసిందో! మన మేరకు మనం చేజేతులా వాతావరణ విధ్వంసానికి పాల్పడకుండా జాగ్రత్త పడటమే చేయవలసినదీ, చేయగలిగినదీ! -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్‌కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నిష్పూచీ నిష్క్రమణలు
‘అంతర్జాతీయ న్యాయం నాకు అవసరం లేదు. అధ్యక్షుడిగా నా అధికారానికి పరిమితులు విధించేదీ, దాన్ని నిరోధించేదీ నా నైతికత మాత్రమే’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించాక ప్రకటించారు. ఇప్పటికే ఆయన నైతికత ఎలాంటిదో రుజువైంది గనుక భిన్నరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నామని తాజాగా ఆయన చెప్పటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఈ నిర్ణయం కారణంగా మొత్తం 66 సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందినవి 31 కాగా, ఇతర సంస్థలు 35. భావోద్వేగాలకు లోనుకావటం వల్లనో, ప్రలోభాలకు ఆశపడటంవల్లనో అనర్హుల్ని అందలం ఎక్కించిన దేశం కష్టాల్లో పడుతుంది.కానీ అమెరికా ప్రజలు చేసే తప్పు ప్రపంచాన్ని కకావికలు చేస్తుందని ఏడాది కాలంగా అందరికీ అర్థమవుతోంది. తనకు తోచిందే న్యాయం, తాను చెప్పిందే ధర్మంగా ఇంటా బయటా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని సరే... అమెరికాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రావటానికి ఆయన చెబుతున్న కారణాలు చిత్రమైనవి. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలను నెరవేర్చటం లేదట! నిరుడు అధికారంలోకొచ్చిన వెంటనే 2015 నాటి పారిస్ ఒప్పందం నుంచి వైదొలగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటికొచ్చారు. నిబంధనల ప్రకారం ఈనెల 20 నుంచి అది అమలవుతుంది. తాజా నిర్ణయం వల్ల అధికంగా సమస్యలెదుర్కొనే సంస్థలు వాతావరణ పరిశోధనలకు సంబంధించినవి. వాతావరణం గురించి, అది క్షీణిస్తున్న తీరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా అమెరికాకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఇది ట్రంప్‌తోనే మొదలు కాలేదు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్‌కు అమెరికా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దేశమూ ఉద్గారాల తగ్గింపునకు లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి ప్రయత్నించినట్టు చూపాలి. ప్రపంచాన్ని కాలుష్యభరితం చేయటంలో ముందువరసలో ఉండే అమెరికాకు ఇలాంటి ఆంక్షలు నచ్చుతాయా? కనుకనే దాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆ ప్రోటోకాల్ వెలుపలే ఉండిపోయింది.నిజానికి క్యోటో ప్రోటోకాల్‌ను నీరుగార్చటానికీ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పుకోవటానికీ 2015లో అందరినీ మభ్యపెట్టి ప్యారిస్ ఒడంబడికకు దోహదపడింది. కానీ ఆ మరుక్షణం నుంచీ అటకెక్కించింది. ఎంతో వెనకబడిన దేశాలనుకున్నవి సైతం తమ శక్తి మేరకు ఆ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోగా, అమెరికా చేసింది దాదాపు శూన్యం. ఉద్గారాలను పరిమితం చేయగల హరిత సాంకేతిక తపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నా, వాటి పర్యవసానంగా ప్రభావ వంతమైన ఆవిష్కరణలు సాధ్యమైనా సక్రమంగా ఆచరణలో పెట్టింది లేదు. పోనీ దాన్ని బడుగు దేశాలకు చవగ్గా అందించాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. పాలకుడెవరైనాఅమెరికా తీరు ఇంతే! కాకపోతే ట్రంప్ వారిని మించిన ఘనుడు. అసలు వాతావరణ మార్పు అనేదే బూటకమని ఆయన వాదన. భూగోళం మరింత వేడెక్కకుండా ఉండాలంటే 2030 నాటికి అన్ని దేశాలూ 2005 నాటి కర్బన ఉద్గారాల పరిమాణంలో 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. కానీ ట్రంప్ మూర్ఖత్వం కారణంగా ఆ లక్ష్యసాధన ఇక అసాధ్యం. ఆయన హరిత ఇంధన సాంకేతికతల్ని పూర్తిగా పక్కకు పెట్టడమే కాదు... చమురు వాడకాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నారు.ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇతర ముఖ్య సంస్థలు సైతం నిధుల కొరతతో నీరసిస్తాయి. ఘర్షణాత్మక ప్రాంతాల్లో పిల్లల బాగోగుల కోసం పని చేయటం, అటువంటి ప్రాంతాల్లో చోటుచేసుకునే లైంగిక నేరాల్ని అరికట్టడం వంటి అంశాల్లో పనిచేసే ప్రతినిధుల్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. భారత్, ఫ్రాన్స్‌ల చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) కూడా ఈ జాబితాలో ఉంది. ప్రపంచానికి తన వంతుగా లేశమాత్రమైనా మంచిచేసేది లేదని ట్రంప్ చాటుతున్నారు. కనుక ఇకపై ఈ ధూర్తదేశంతో ఎలా వ్యవహరించాలో ప్రపంచ దేశాలు నేర్చు కోక తప్పదు. -
కాలుష్యం కోరలు తీసేదెలా?
సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్లూ, సల్ఫేట్లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి. నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు. అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి. ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది. సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి. -
ట్రంప్ అసంతృప్తి లోగుట్టు!
పరాయి దేశాల్లో సైనిక కుట్రలు, కుయుక్తుల మాటెలావున్నా అగ్రరాజ్యం హోదాలో అమెరికా నాగరికంగా, గంభీరంగా ఉన్నట్టు కనబడేది. తాను ఏం చేసినా ప్రపంచశాంతి కోసమే, అది సురక్షితంగా ఉండటానికేనని ప్రవచించేది. నిరుడు ఆ దేశాధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇలాంటి డొంకతిరుగుడు నచ్చదు. బాహాటంగా బెదిరింపులకు దిగటం ఆయన నైజం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసట. మరో రెండు రోజులకు దాన్ని కాస్త మార్చి, తనతో మోదీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు. ఇలా మాట్లాడుతూనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిపేయకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. రెండు దేశాల దౌత్యసంబంధాలు లేదా వాణిజ్యసంబంధాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పుడు పరస్పరం చర్చించుకోవటం ఆనవాయితీ. ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే ఎక్కడో ఒకచోట సదవగాహన సాధ్యమవుతుంది. కానీ ఫలానాది మాత్రమే కావాలని పట్టు బట్టడం, మొండికేయటం వల్ల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండి పోతుంది. మన దేశానికి మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఒమన్‌లతో ఒప్పందాలు కుదిరాయి. అటు అమెరికాకు ఈయూ, జపాన్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాలతో ఇదే విధంగా ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా వేరే దేశాలతో ఈ రెండు దేశాలూ ఒప్పందాలు కుదుర్చుకోగలిగినప్పడు వాటి మధ్య మాత్రం ఒప్పందాలు ఎందుకు అసాధ్యమవుతున్నాయి? తమ భద్రత అమెరికా చేతుల్లో ఉండటంతో వేరే దేశాలు అమెరికా షరతులను శిరసావహించక తప్పదు. వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రత పాటించే వారిని ఒత్తిళ్లు ప్రభావితం చేయలేవు. అందువల్లనే భారత్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అంత తేలిగ్గా సాధ్యపడవు. ట్రంప్‌ను సంతోషపెట్టడం వేరే దేశాల బాధ్యత ఎందుకవుతుంది? అసలు ఆ బాధ్యత అమెరికా ప్రజలకే ఉండదు. అన్ని దేశాల పాలకుల మాదిరే తన దేశ ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత ట్రంప్‌ది. ఆయన్ను అందుకు ఒప్పించటం రిపబ్లికన్ల బాధ్యత. లేనట్టయితే నష్టపోయేది ఆ పార్టీయే. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని గప్పాలు కొట్టుకున్నట్టే భారత్ తనను సంతోషపరచటానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారా? ఈ విషయంలో మన దేశంవైపు నుంచి ఖండనేమీ లేదు. వాణిజ్య ఒప్పందం అనేది చాలా సీరియస్ అంశం. బహిరంగ వేదికలపై దాన్ని చర్చించటం సాధ్యపడదు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారానో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనో కూర్చునో తోచింది చెప్పటం, అందుకు అనుగుణంగా అవతలి దేశం మారాలని, కాళ్లబేరానికి రావాలని భావించటం... అది సాధ్యపడనప్పుడు హెచ్–1బి వీసా ఫీజు పెంచటం, బహిరంగ విమర్శలకు దిగటం ట్రంప్ ఎన్నుకున్న తప్పుడు మార్గం.నిజానికి మన దేశం చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. నిరుటితో పోలిస్తే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 80 శాతం పెరిగాయి. 1962లో వచ్చిన అణుశక్తి చట్టాన్ని ఇటీవల రద్దుచేసి ఆ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రమేయానికి అనుమతిస్తూ మన దేశం ‘శాంతి’ పేరిట కొత్త చట్టం తెచ్చింది. అణువిద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం జరిగితే పరిహారం చెల్లింపు బాధ్యత ఆ పరికరాల సరఫరాదారుకు ఉండబోదన్న విషయంలోనూ అంగీకరించింది. ఇవి తనను సంతోషపరచటానికేనని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. అవి ఎంతమాత్రమూ సరిపోవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావొచ్చు. ఇక 95 శాతం అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎత్తేయటానికి మన దేశం సిద్ధపడింది. బాదం, యాపిల్, అవకాడో వంటివాటిపై సుంకాలు తగ్గించటానికి ఒప్పు కున్నదంటున్నారు. కానీ డెయిరీ ఉత్పత్తులు, జన్యుమార్పిడి మొక్కజొన్న,సోయా బీన్స్ వగైరాలపై ఆంక్షలొద్దన్న ట్రంప్ షరతుకు అంగీకరించటం లేదు. మన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి మాత్రమే ఆయనను సంతోష పరుస్తాయనుకుంటే ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని మన దేశం చెప్పటమేసరైంది. -
అగ్నిజ్వాల... శబ్దఘోష!
కోనసీమ గడ్డపై మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం మోరి–5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి, గ్యాస్ ఎగదన్నుతూ భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నానికి బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా మరికొన్ని రోజులు ఇది కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్న మాట. సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రాతిపొర తగిలితే ఆ గొట్టం ద్వారా బాంబింగ్ జరపడం అలవాటు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా సహజ వాయువు పెల్లుబికి ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. చిన్నవో, పెద్దవో ఇలాంటి ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1993లో కొమరాడలో తొలిసారి ప్రమాదం జరగ్గా 1995 జనవరిలో పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించి 65 రోజులపాటు కోనసీమను హడలెత్తించింది. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైన్ పగిలి గ్యాస్ విడుదలై 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నవే కావొచ్చుగానీ... అటుతర్వాత కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రస్తుత ఉదంతంతో సహా దాదాపు అన్నీ జనం అప్రమత్తంగా ఉన్న వేళ సంభవించినవే. కానీ ఆదమరిచి నిద్రిస్తున్నవేళ జరిగితే జనం ప్రాణాలు ఏం కావాలి? మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్క సారిగా సహజ వాయువు ఎగదన్నిందనీ, ఆకాశాన్నంటేలా మంటలు వ్యాపించాయనీ మీడియా కథనం. క్షణాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ అలుముకోవటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనివారు ఇళ్లకు తాళాలేసి ప్రాణభయంతో పిల్లాపాపల్ని తీసుకుని పరుగులు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులొచ్చినా ఓఎన్జీసీ సిబ్బంది మాత్రం గంటన్నర తర్వాతగానీ రాలేదని జనం చెబుతున్నారు. తరచు సమస్యలెదురవుతున్నా, ప్రమాదం జరిగే ప్రాంతాలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నా ఏటా వేలకోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువులను తోడేస్తున్న సంస్థలు భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన వరస చర్యలేమిటో సిబ్బందికి కనీస అవగాహన ఉందా? అక్కడి నుంచి మాయంకావటం తప్ప ఇంకేమీ తెలియదా? వెంటనే ఎవరెవరికి సమాచారం అందించాలో, నిపుణులైనవారు అనుసరించాల్సిన విధివిధానా లేమిటో రూపొందాయా? అవసరమైన ఉపకరణాలేమైనా అక్కడ అందుబాటులో ఉన్నాయా? జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను ఈ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంచారా? స్థానికులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇచ్చే వ్యవస్థలుండాలి. గోప్యత పాటిస్తే అనవసర వదంతులు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఓఎన్జీసీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలన్నీ సాగేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థల ప్రమేయం పెరిగింది. చేసేది ఎవరైనా నిర్లక్ష్యం సహించరానిది. కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిశాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగావకాశాలతోపాటు, అభివృద్ధి పనులు కూడా చకచకా మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగిందంతా వేరు. అంతంతమాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్న మాట. చమురు, గ్యాస్ వెలికితీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పగా మారిందంటున్నారు. జల, వాయు కాలుష్యాలు ప్రజారోగ్యంపై కలగజేస్తున్న ప్రభావం ఏమిటో ప్రభుత్వాలు ఆరా తీసినట్టు లేదు. తెలంగాణలోని సింగరేణిలో తవ్వే బొగ్గుపై వచ్చే ఆదాయంలో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికిస్తుండగా చమురు, సహజవాయువుల నుంచి లభించే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నదెంత? కోనసీమకు దక్కుతున్నదేమిటి? ఈ బ్లోఅవుట్ చల్లారిన తర్వాతైనా ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులూ దీనిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా చూడాలి. -
భారత ప్రజలమైన మేము...
1946 డిసెంబర్ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ హాల్లో రాజ్యాంగ సభ మొదటి సారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టి ట్యూషన్’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపు దిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తామెలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్ నుంచి బెజ వాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్ యూనియ న్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజా కోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పు డైనా ‘రీకాల్’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనా రిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుతరాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూ షన్(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమ తులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్ యూనియన్’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చిన ప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్లామ్ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థా నాలను గుర్తించాం’ అంటారు రచయితలు.ఇంకా న్యాయమూర్తులు ఎలా భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్ తీసు కోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్ డ్రాఫ్ట్ రూపొందించిన సర్ బి.ఎన్.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిల బడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసు కోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బు రమో కూడా అర్థమవుతుంది. తర్వాతి రాజ్యాంగ సవరణలు ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే!ఎడిటోరియల్ టీమ్అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్: ఎ న్యూ డెమాక్రటిక్ హిస్టరీరచయితలు -
సామ్రాజ్యవాద దురహంకారం
తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్‌లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్‌ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం. 2019 ఏప్రిల్‌లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్‌లతో జతకట్టడం, బ్రిక్స్‌లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి. అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్‌ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్‌ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి. -
నూటా నలభై
‘నేను బూడిదగానైనా మిగులుతానుగానీ మట్టిగొట్టుకుపోను’ అన్నాడు జాక్ లండన్. బతికినన్నాళ్లూ అగ్నిజ్వాలలా బతికాడు. లోకాన్ని మెరుపులా చుట్టాడు. చేయగలిగిన పనులన్నీ చేశాడు. యాక్టివిస్టు, సాహస యాత్రికుడు, యుద్ధక్షేత్రంలో విలేఖరి; నావికుడు, పేపర్ బాయ్, బొగ్గు గని కార్మికుడు, ఐసు బండి డ్రైవరు, వలస కూలీ, ఫొటోగ్రాఫర్, గోల్డ్ డిగ్గర్ లాంటి రెండు డజన్ల పనులు చేశాడు. నియమంగా రోజుకు వెయ్యి పదాలైనా రాసేవాడు. నవలలు, జ్ఞాపకాలు, కథలు, నాటకాలు, కవిత్వం, వ్యాసాలతో సుమారు 50 పుస్తకాలు వెలువరించాడు. తన కాలంలో అత్యంత ప్రభావశీల అమెరికా రచయితగా వెలిగాడు. కానీ నలభై ఏళ్లకే మరణించాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి నలభై ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోవడమేమిటి? కాలానికి ఏ కనికరమూ ఉండదేమో! లేదా, దాని లెక్కలు మనకు అర్థం కావేమో! ఏ లెక్కలూ పాటించని కాలాన్ని మన లెక్కల్లోకి తీసుకునే ప్రయత్నంలో దానికి లేని లక్షణాలను ఆపాదిస్తామేమో! ఫ్రాంజ్ కాఫ్కా, ఎడ్గార్ అలెన్ పో, కాథరీన్ మాన్స్ఫీల్డ్; జాన్ కీట్స్, ఎమిలీ బ్రాంటే, పి.బి.షెల్లీ, లార్డ్ బైరన్; స్వామి వివేకానంద; అలెగ్జాండర్; మొజార్ట్; బ్రూస్ లీ, మార్లిన్ మన్రో; మాల్కమ్ ఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్; త్రిపురనేని శ్రీనివాస్, నాగప్ప గారి సుందర్రాజు, చిత్రకొండ గంగాధర్– వీళ్లంతా కూడా నలభై ఏళ్లు దాటకుండానే ఈ అవనీ తీరం దాటేసినవారు!నలభై ఏళ్లంటే మనిషి సరిగ్గా పక్వానికి వచ్చే వయసు. అన్ని బాల్య, యవ్వన చాపల్యాలను అధిగమించి నింపాదితనాన్ని సంతరించుకునే వయసు. జీవితాన్ని అత్యంత సమీపంగా దర్శించే వయసు. స్వీయ అనుభవాల వెలుతురులో గత చీకట్లను తరచి చూసుకునే వయసు. తాను నేర్చుకున్నదానికీ, తన జీవిత పాఠాలకూ మధ్యగల తేడాను నిశితంగా పట్టుకుని, తనదైన చింతనకు రూపు కట్టుకునే వయసు. ఉరుకులాటలు, వెంపర్లాటలు తగ్గి తనదైన స్థిమితాన్ని నెలకొల్పుకునే వయసు. అవసరం రీత్యా వేసుకున్న అన్ని మేకప్పులనూ కరిగించుకునే వయసు. స్పష్టమైన, స్థిరమైన గొంతును ఏర్పరుచుకునే వయసు. లోకానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే వయసు. కానీ వీళ్లెవరూ ఈ వయసుకు చేరకుండానే అంతకుమించిన పరిణతిని చూపారు, మహాద్భుతాలు చేశారు. కాలం కఠినాత్మురాలే కాదు, కరుణామయి కూడానేమో. వాళ్లకు పుట్టుకతోనే నూరేళ్ల వివేకాన్ని ఆశీర్వదించింది. అట్లా వాళ్లు నూటా నలభై ఏళ్లు బతికేసి వెళ్లారు.‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’, ‘ద సీ–వూల్ఫ్’, ‘వైట్ ఫాంగ్’, ‘ది ఐరన్ హీల్’ లాంటి నవలలు రాసిన జాక్ లండన్ 1876లో జన్మించాడు. ఈ జనవరి 12తో 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. కిడ్నీ ఫెయిలై, స్కర్వీతో ముందటి నాలుగు పళ్లు కోల్పోయి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుదిదశలో అగ్ని ప్రమాదంలో కాలిపోయి, డిసెంట్రీ, యురేమియా లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ తాను చేయగలిగింది చేసిపోయాడు లండన్. గొగోల్, చెకోవ్, డి.హెచ్.లారెన్స్, ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్, సాదత్ హసన్ మంటో లాంటివాళ్లంతా కూడా నలభైల్లోనే వెళ్లిపోయారు. ఇంకా యుద్ధ క్షేత్రాల్లో, విప్లవ రణరంగంలో, సామాజిక కార్యాచరణలో తమ నిండు యవ్వనాల్ని బలిచ్చిన జ్ఞాత, అజ్ఞాత తేజోదివ్వెలు ఎన్నో! వీళ్లు ఇంకా కొన్నేళ్లు బతికివుంటే మరింత వెలుగు కురిసేదా? అసలు, కురిసినదే చాలినంతా? ఏ కారణాల వల్లయినా వీళ్లు లోకం వీడొచ్చుగాక! ఈ వెళ్లిపోవడంలో బాధతో పాటు, అబ్బురం కలగలిసి ఉండటం ఒక వైచిత్రి. పాతుకుపోతున్నకొద్దీ అంటే ఈ లోకపు మకిలిని పులుముకోకుండానే, ఇంకా లోకం వారిపట్ల సంభ్రమంగా కళ్లు విప్పార్చుతున్నప్పుడే వెళ్లిపోవడం ఇందులోని మరో పార్శ్వం. డాట్ బాల్స్ ఆడుతూ విసుగెత్తించకుండా, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ రిటైర్ కావడం లాంటిదది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము అని అన్నమయ్య ఏ అర్థంలో పాడినా, నాటకం లాంటి ఈ జీవిత రంగస్థలం మీద ఉజ్జ్వలంగా, ధగద్ధగాయమానంగా తమ పాత్రను వెలిగించి నిష్క్రమించారు. సెల్యూట్! -
ఇది పురోగమనమా... తిరోగమనమా?
ఇరవయ్యొకటో శతాబ్దంలో పాతికేళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో ఇరవయ్యొక్క సంవత్సరాలు ఓపిక పట్టండి, భారత దేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అర చేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత దేశం వలస పాలన సంకెళ్లు తెంచుకొని అప్పటికి (2047) వందేళ్లు పూర్తవుతాయి. మనదేశం శతమాన స్వతంత్ర భారత మవుతుంది. అధినేతలు ‘అదివో అల్లదివో’ అంటూ ఆకాశం వైపు చూపెడుతున్నట్టు సూపర్ పవర్‌గా భారత్ ఆవిష్కృతమైతే ఆనందపడని పౌరుడెవరుంటారు? కానీ, ఆ గమ్యం చేరేందుకు ముందుగా స్వాతంత్య్రోద్యమం నాటి ఆకాంక్షలు నెరవేరవలసి ఉంటుంది. దేశ బహుళత్వ స్వభావంలోంచి ఒక ఏకత్వ భావనను పెంపొందింపజేయడం స్వతంత్ర భారతానికి తొలి సవాల్‌గా ఎదురైంది. అభివృద్ధి క్రమంలో హస్తిమశకాంతరాలున్న ప్రజలు, ప్రాంతాల మధ్య సమన్వయం కూర్చడం ఒక పెద్ద బాధ్యత. బ్రిటిష్ వాళ్ల ప్రత్యక్ష పరిపాలనలో కునారిల్లిన ప్రాంతాలు ఒక పక్కన, ఫ్యూడల్ దోపిడీకి నెలవైన వందలాది స్వదేశీ సంస్థానాలు మరో పక్కన! ఈ రెండింటినీ ఒకే చట్టంతో ముడివేసి ఒక దేశంగా ముందుకు నడవ్వలసిన సందర్భం అది. విభిన్న మతవిశ్వాసాలూ, భాషా సంస్కృతులూ చేతులు కలిపి గంగాయమునా సంగమ శ్రుతిలో ప్రవాహ గీతం పాడుకోవా లని బాస చేసుకున్న సన్నివేశమది. అమానవీయమైన స్థాయిలో ఏర్పడిన ఆర్థిక అంతరాలను తొలగించడానికి అందరికీ సమానా వకాశాలు లభించే విధంగా ఒడంబడిక చేసుకున్న ఓ అరుదైన ఘట్టం. కదిలే కాలంతో నాటి స్వరాజ్య భానూదయం ఒక చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకున్నది.మహాదార్శనికుడైన పండిత జవహర్లాల్ నెహ్రూ మాటల్లో అదొక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’. ప్రపంచమే ప్రణమిల్లిన గాంధీ మహాత్ముని ఆశయాలకు అధికారిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్న ముహూర్తం. ఈ నేపథ్యంలో రూపుదిద్దు కున్నదే భారత రాజ్యాంగం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 389 మంది రాజ్యాంగ సభ సభ్యుల మేధోశ్రమను మథించి, ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగాలను పరిశో ధించి, దేశ అభివృద్ధి క్రమానికి అవసరమైన రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియుల మాగ్నాకార్టాగా పరిగణన పొందిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలనీ, భావ ప్రకటనతోపాటు విశ్వాస ఆరాధనా స్వేచ్ఛ అందరికీ ఉండాలనీ, అవకాశాల్లో, హోదాల్లో అందరి మధ్యన సమానత్వం పరిఢ విల్లాలనీ, వ్యక్తిగత గౌరవ మర్యాదలతో అందరి మధ్యన సౌభ్రా తృత్వం వెల్లివిరియాలనీ రాజ్యాంగం ఆకాంక్షించింది.ఈ రాజ్యాంగ లక్ష్యాలు పూర్తిగా సఫలమైన రోజున సుశిక్షితులూ, నిపుణులైన ప్రజలు దేశ జనాభాకు తగినట్టుగా అభివృద్ధి పథంలో కూడా దేశాన్ని నంబర్‌వన్ స్థాయిలో నిలబెట్ట గలుగుతారు. నూటా నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి సూపర్ పవర్ హోదా అసాధ్యమైనదేమీ కాదు. కావలసినదల్లా ప్రజల్లో సౌభ్రాతృత్వం, విశ్వాస – ఆరాధనా స్వేచ్ఛ, సమాన స్థాయిలో లభించే అవకాశాలు. ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మనం ఎక్కడున్నామనే విషయం తెలిస్తే సూపర్ పవర్ హోదా ఇంకెంత దూరంలో ఉన్నదో అర్థమవుతుంది. ప్రజల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని నిరుపేదరికం తగ్గి వుండవచ్చు నేమో. కానీ, ఆర్థిక అసమానతలు నాటికంటే నేడు మరింత పెరిగాయి. అసమానతల పెరుగుదలలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగం అభిలషించిన సౌభ్రాతృత్వ భావన అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ‘హిందూ రాష్ట్ర’ సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ ప్రభుత్వ అండదండలతో దేశ ఆయువుపట్టు వంటి పార్శ్వాల్లోకి ఎలా పాకిందో వెల్లడిస్తూ వారం రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక పరిశోధనా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది.‘బ్రిటిష్ రాజ్’ నాటి ఆర్థిక అసమానతల కంటే నేటి ‘బిలియనీర్ రాజ్’లో భారతదేశ ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని అసమానతలపై ప్రపంచ నివేదిక – 2026 వ్యాఖ్యా నించింది. భారతదేశంపై నివేదికలను రూపొందించడంలో థామస్ పికెట్టీ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు భాగం పంచు కున్నారు. వార్షిక ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి రూపొందించే ప్రపంచ బ్యాంకు నివేదికలకు భిన్నంగా ఆదాయం, సంపదలతో పాటు అనేక ఆర్థిక కార్యకలాపాలపై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది. ‘బ్రిటిష్ రాజ్’తో పోల్చితే 1980వ దశకం నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు బాగా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. సంఘ్ పరివార్ నిత్యం ఆడిపోసుకునే నెహ్రూ విధానాలు అమలైన కాలం కూడా ఇదే కావడం గమనించతగ్గది. దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరగడం 2000 సంవత్సరం తర్వాత మొదలైంది. 2014–15 నుంచి 2022–23 మధ్యకాలంలో ఈ పెరుగుదల రాకెట్ వేగాన్ని అందుకున్నది. ప్రస్తుతం దేశ వార్షికాదాయాల్లో 22.6 శాతం ఒక్క శాతం జనాభా ఉన్న అగ్రశ్రేణి సంపన్నులే దక్కించుకున్నారు. అయితే జాతి సంపదలో వీరి దగ్గర పోగుపడిన సంపద 40.1 శాతం. ఒక్క శాతం కుబేరుల చేతిలో 40.1 శాతం సంపద కేంద్రీకృత మైంది. ప్రపంచంలో మరే దేశంలోనూ టాప్ ఒక శాతం కుబే రులు ఈ స్థాయిలో దండుకోలేకపోయారు. ఇందులో గోల్డ్ మెడల్ భారత్‌దే! దేశంలోని ఈ కుబేరుల మీద సంపద పన్ను వేసి ప్రభుత్వం ఆ సొమ్మును ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో కేవలం 167 మంది అగ్రశ్రేణి కుబేరుల మీద రెండు శాతం పన్ను వేసినా వచ్చే మొత్తం దేశ వార్షికాదాయంలో 0.5 శాతానికి సమానమట! దీన్ని విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఈ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలను ప్రోత్సాహకాలిచ్చి మరీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలంటున్న చంద్రబాబు ఆర్థిక విధానాలకూ, ఈ ఆర్థికవేత్తల సూచన పూర్తి విరుద్ధంగా ఉండడం మరో గమనించదగిన అంశం.ఈ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల చేతిలో 65 శాతం సంపద పోగైంది. కిందిస్థాయిలో ఉండే 50 శాతం మంది పేదల మొత్తం సంపద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే. మధ్యశ్రేణిలో ఉండే 40 శాతం మంది స్థితిమంతుల వాటా 32 శాతం. భారతదేశంలో ఆర్థిక వ్యవహారా లకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా అందుబాటులో ఉండవనీ, వాస్తవానికి అసమానతలు తాము చెబుతున్నదానికంటే మరింత ఎక్కువ ఉండే అవకాశముందనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ జమానాకు ‘బిలియనీర్ల రాజ్’గా అసమానతల నివేదిక నామకరణం చేసింది. ‘బ్రిటిష్ రాజ్’ జమానాలో ఏర్పడిన ఆర్థిక అసమానతల రికార్డును మన ‘బిలియనీర్ల రాజ్’ బద్దలు కొట్టింది.‘బిజినెస్’ చేయడం ప్రభుత్వాల బిజినెస్ కాదనే ఆకర్ష ణీయమైన కొటేషన్ల మాటున కీలకమైన ప్రభుత్వరంగ సంస్థ లను సైతం ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఎన్డీఏ సర్కార్ ఓ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ రంగాల పరిశ్రమలు కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. చివరకు గత రెండు దశా బ్దాలుగా గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచి, వలసలకు కొంత మేర అడ్డుకట్ట వేసిన ‘నరేగా’ను సైతం సర్కార్ నిర్వీర్యం చేసింది. డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కూలీల హక్కును ఈ పథకం నుంచి తొలగించింది. పథకం అమలుకయ్యే వ్యయంలో 40 శాతం రాష్ట్రాలే భరించాలనడంతో నిజస్వరూపం వెల్లడైంది. పథకాన్ని నామమాత్రం చేయడం ఎన్డీఏ ఆర్థిక ప్రాధాన్యతలకు అద్దం పడితే, పథకం పేరులోంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దాని సైద్ధాంతిక విధానంగా పరిగణించవచ్చు. ఆరెస్సెస్ భావజాలం ప్రభావం వల్లనే మహాత్ముడిని గాడ్సే హత్య చేశాడన్న ఆరోపణను నాడు ఆరెస్సెస్ ఖండించింది. ఇప్పుడో కీలకమైన పథకం నుంచి ఆయన పేరును తొలగించడం వెనుక ఆ భావజాలం ప్రమేయం లేదని మాత్రం ఆరెస్సెస్ ఇప్పటి దాకా ఖండించలేదు. డిసెంబర్ 29వ తేదీనాడు ‘న్యూయార్క్ టైమ్స్’ బ్యానర్ స్టోరీగా ప్రచురించిన కథనం ప్రధానమంత్రి పంద్రాగస్టు అధికా రిక ప్రసంగాన్ని ఉటంకించడంతో మొదలైంది. ఆ ప్రసంగంలో ప్రధానమంత్రి ఆరెస్సెస్‌ను ఒక గొప్ప సేవా సంస్థగా ఆకాశాని కెత్తారు. మోదీ వంటి శక్తిమంతుడైన ప్రధానమంత్రి సుస్థిర పాలనను ఆసరా చేసుకొని ఆరెస్సెస్ బాగా బలపడిందని ఈ కథనం వ్యాఖ్యానించింది. పోలీసులు, రక్షణ శాఖ, ఉన్నతోద్యో గులు, వ్యాపారులు... ఇలా అన్ని రంగాల్లో చిన్న చిన్న ఉప సంఘాల పేరుతో ఆరెస్సెస్ చొచ్చుకొనిపోయిందనీ, దాదాపు రెండు వేల వరకు దాని ఉపసంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయనీ, వీటి ప్రభావం వల్ల దేశంలో విద్వేష పూరిత వాతావరణం నెలకొన్నదనీ, దాడులు ముస్లిమ్‌ల వరకే పరి మితం కాలేదు... మతమార్పిడి బూచీని చూపెట్టి చర్చిల మీద, క్రైస్తువుల మీద, క్రిస్మస్ ఉత్సవాల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయనీ పత్రికా కథనం ఆరోపించింది. పత్రిక ఆరోపణే కాదు, ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చిన తాజా సంఘటనలే!ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనే ఆశయం ఆచరణలో అభాసుపాలైంది. సమాజంలో సౌభ్రాతృత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమిస్తున్నది. అయినా మనం రాజ్యాంగబద్ధ పాలనలోనే ఉన్నామా అనే అనుమానం తొలుస్తు న్నది. అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నా, ఉపాధి – ఉద్యో గాలు కొరవడుతున్నా, జాతి సంపదలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తు లకు కైంకర్యం అవుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలు నాణ్య మైన విద్యా, వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నా, వ్యవసాయ రంగం కుదేలై రైతాంగం వధ్యశిలలపై నిలబడి ఉన్నా పాలక పక్షాలకు జనం సమ్మతి ఎలా లభిస్తున్నది? తమ పాలనపై నోరెత్తే వారిని దండించడానికి అధికార పక్షాలకు ఒక చేతిలో రెడ్ బుక్ ఉన్నట్టే, తటస్థులను సంతృప్తిపరచడానికి మరో చేతిలో ప్రవచనాల పుస్తకం కూడా ఉంటుంది. మతం పేరుతో,సంస్కృతి పేరుతో, ఆచారాల పేరుతో పౌర సమాజాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఇది అక్కరకొస్తుంది. దీన్నే ఆధిపత్య భావజాలం అంటారు. పౌర సమాజాన్ని ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్నంత కాలం పరిపాలన పురోగమనంలో ఉన్నదా తిరోగమనంలో ఉన్నదా అనే సంగతి జనానికి పట్టకపోవచ్చు. పౌర సమాజంలోని అన్ని పార్శ్వాలను దానికి అర్థమయ్యే భాషలో చైతన్యపరచకుండా మన జాతీయ ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా అడపాదడపా స్వయం ప్రకటిత బాంబుల్ని ప్రయోగి స్తానంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఆయన పేలని బాంబుల పేరయ్యగా మిగిలిపోయారు. ప్రగతిశీలమైన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలుచేసే శక్తులు సమీప భవిష్యత్తులో ముందుకు వస్తాయా? లేక ఆ రాజ్యాంగమే కొంత కాలానికి అదృశ్యమయ్యే రోజును చూస్తామా అనేదే నేడు మనముందున్న కీలకమైన మీమాంస!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎవరు ప్రజాసేవకుడు?
కాలం మారుతుందనీ, రేగిన గాయాన్ని మాన్పుతుందనీ అనుకుంటాం. కానీ, అన్ని సార్లూ అది నిజం కాదు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ ప్రాంత అత్యాచార కేసులో తాజా పరిణామాలు పాత గాయాన్ని మళ్ళీ రేపి, బాధితుల గుండెల్లో బడబాగ్నిని రగిలించాయి. సదరు కేసులో దోషి అని తేల్చి, మాజీ ఎమ్మెల్యే – బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్సింగ్ సెంగార్‌కు ఆరేళ్ళ క్రితం 2019లో ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధిస్తే, వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్ట్ ఆ శిక్షను సస్పెండ్ చేయడం గగ్గోలు రేపింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుల్దీప్ ‘ప్రజా సేవకుడు’ కిందకు రారనీ, కాబట్టి చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినవారిపై ప్రయోగించే ‘పోక్సో’ చట్టంలోని కఠిన అంశాల కింద గతంలో ఆయనకు శిక్ష వేయడం సరికాదనీ హైకోర్ట్ మాట. ఇది అన్యాయ మంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, సీబీఐ అప్పీలు చేయడం, హైకోర్ట్ ఉత్తర్వును డిసెంబర్ 29న సుప్రీంకోర్ట్ పక్కనపెట్టడం ఇప్పుడు ఒకింత ఊరట. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన 17 ఏళ్ళ మైనర్, దళిత బాలిక అత్యాచారం, ఆ తదుపరి సంఘటనలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె బద్దలవుతుంది. ఉద్యోగం మిషతో రప్పించిన మైనర్ బాలికపై కుల్దీప్ తన నివాసంలో 2017 జూన్‌లో అత్యాచారం జరి పారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, కొన్ని నెలల పాటు అతీగతీ లేదు. పోరాటం చేసిన బాలిక తండ్రిని సైతం తప్పుడు కేసులో ఇరికించి, చావచితక కొట్టారు. ఆఖరికి 2018 ఏప్రిల్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట బాలిక ఆత్మాహుతి యత్నానికి దిగేసరికి, ఉన్నావ్ కేసు జాతీయస్థాయి సంచలనమైంది. కనపడని పోలీసు దెబ్బలతో కన్నతండ్రి కస్టడీలోనే మరణించడం రచ్చ రేపేసరికి, కేసు సీబీఐకి చేరింది. అయినా తిప్పలు తప్పలేదు. కేసులో పోరాడుతున్న బాధిత కుటుంబం, లాయరుతో సహా వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం గుద్ది, బాధితురాలి కుటుంబసభ్యులిద్దరిని 2019 జూలైలో పొట్టనబెట్టుకుంది. బెదిరింపులకు తాళలేక ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని రక్షణ కోరేసరికి, విషయం సుప్రీం దృష్టికి వెళ్ళింది. 2019 డిసెంబర్లో కుల్దీప్ను దోషిగా తేల్చి, శిక్ష వేసినా, చట్టంలోని లోటుపాట్లు ఆసరాగా బయటకు వచ్చే ప్రయత్నం హైకోర్ట్‌లో సాగింది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు సభ్యుల తాజా మధ్యంతర ఉత్తర్వుల ఫలితంగా... ఇప్పటికైతే కుల్దీప్ను కస్టడీ నుంచి విడుదల చేయరు. కానీ ఆయన అప్పీలు పెండింగ్‌లో ఉంటుంది. బాధితులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలోని అసలు స్ఫూర్తిని అర్థం చేసు కోకుండా, కేవలం అందులోని మాటలను అడ్డం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే కష్టమే నని తాజా ఘటనలో హైకోర్ట్ వ్యవహారశైలి రుజువు చేసింది. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతున్న వేళ హైకోర్ట్ జడ్జీల నిబద్ధతను సమర్థిస్తూనే, సుప్రీం ఇచ్చిన తీర్పు కొత్త ఆశలు రేపుతోంది. బాలికపై అత్యాచారం, ఆ పైన ఆమె తండ్రి మరణంలో దోషి అయిన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకొస్తే, ప్రాణాపాయం తప్పదని బాధిత కుటుంబం బెంబేలెత్తుతున్న సమయంలో సుప్రీం తీర్పు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. పైపెచ్చు, ఈ వ్యవహారంలో చట్టంతో ముడిపడిన అనేక కీలక ప్రశ్నలు ముందుకు వచ్చాయనీ, వాటిపై పూర్తిస్థాయిలో ఆలోచన జరపడం అవసరమనీ సుప్రీంకోర్ట్ పేర్కొనడం గమనార్హం. అంటే, రాబోయే రోజుల్లో పలు అంశాల్లో ఈ కేసులో కోర్ట్ ఇచ్చే స్పష్టత, దాని పర్యవసానాల ప్రభావం దీర్ఘకాలం ఉండనుంది. ‘ప్రజా సేవకుడు’ ఎవరనే అంశంలో హైకోర్ట్ చెప్పిన భాష్యం లోపభూయిష్ఠం. ఒక వేళ ఆ భాష్యాన్నే అనుసరిస్తే, తీవ్రమైన లైంగిక నేరాల పరిధి నుంచి చట్టసభల సభ్యులు ఇట్టే తప్పించుకొనే ప్రమాదం ఉంది. ‘ఈ లెక్కన పోక్సో చట్టం కింద కానిస్టేబులేమో పబ్లిక్ సర్వెంట్ కానీ, ఎమ్మెల్యే మాత్రం కాదన్నమాట’ అని సుప్రీం చేసిన వ్యాఖ్య చిన్నది గానే కనిపించినా, లోతుగా ఆలోచన రేపే చురకత్తి. దోషిగా తేలిన వ్యక్తిని సైతం సాంకేతిక కారణాలతో రక్షించాలనుకోవడం వకీళ్ళకు చెల్లుతుందేమో కానీ, చేసిన నేరాన్నీ, దాని తీవ్రతనూ వదిలేసి వ్యవహరించడం న్యాయమూర్తులకు పాడి కాదు. ఒకవేళ చేసిన చట్టంలోనూ, దానిలో ప్రొవిజన్లలోనూ స్పష్టత లోపిస్తే, వాటిని సరిదిద్దేలా కోర్టులు వివరణ ఇస్తేనే ధర్మం నిలబడుతుంది. దోషులకు శిక్ష పడి, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉన్నావ్ కేసులో తాజా సుప్రీం జోక్యం ఆ దిశగా అడుగులేయడమే ఇప్పుడు అవసరం. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్‌ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్‌ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఆరావళి ఆరాటం
ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో పలు రాష్ట్రాల ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో ఆరావళి పర్వతాలకు సంబంధించి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. మంచిదే! కానీ ఈ విజ్ఞత ముందేవుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. గత ఆదివారం ఆరావళి గురించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పిన కొత్త నిర్వచనమైనా, చుట్టుపక్కల భూమి కన్నా కనీసం వంద మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలన్న ఆ మంత్రిత్వశాఖ సిఫార్సును ఆమోదిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా పర్యావరణ కార్యకర్తలను విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దన్న ఆదేశాలు తప్ప, ఈ పర్వతాలను అమాంతం కబళించే ప్రమాదమున్న కొత్త నిర్వచనానికి స్వస్తి పలుకు తున్నామన్న భరోసా లేదు. ఈ నేలపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆవిర్భవించిన పర్వతశ్రేణి ఆరావళి. వాటి వయసు 250 కోట్ల సంవత్సరాలంటారు. వాయవ్య భారత్‌లో 670 కిలోమీటర్ల పొడవునా, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూపోయే ఈ ఆరావళిని దశాబ్దాలుగా అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆ పర్వతశ్రేణి పర్యావరణపరమైన ప్రయోజనాలను విస్మరించి, అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలను బేఖాతరు చేసి కాసుల కక్కుర్తితో కొంచెం కొంచెంగా చిదిమేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్వచనం చెప్పుకుంటూ ఇప్పటికే చాలా భాగాన్ని స్వాహా చేసిన వైనం కనబడుతూనే ఉంది. ఆ పర్వతశ్రేణిలో కేవలం 0.19 శాతంలో మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే 99 శాతానికిపైగా విస్తీర్ణం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కనుక మైనింగ్ ప్రాంతం తక్కువనిపిస్తుంది. కానీ అంకెల్లో చూస్తే అసలు సంగతి బోధపడుతుంది. అది ఏకంగా 68,000 ఎకరాలు! మైనింగ్ సంస్థలు గోరంత లీజుకు కొండంత తవ్వుకుపోవటం మన దేశంలో వింతేమీ కాదు. కనుక వాస్తవంలో ఇది మరింత ఉండొచ్చు. అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకు అందించిన నివేదిక గమనిస్తే అది ఆరావళిని రక్షించదల్చుకున్నదా... భక్షించే వారికి వంత పాడదల్చుకున్నదా అనే సందేహం తలెత్తుతుంది. ‘ఆరావళిలో ప్రతి భాగమూ పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతమూ ఆరావళిలో భాగం కాదు’ అని అనడంతోపాటు ‘కేవలం ఏటవాలే హద్దుల నిర్ణయానికి గీటురాౖయెతే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంద’ని చెప్పడంలో పర్యావరణహితం ఆవగింజంతైనా కనబడుతోందా? దశాబ్దాల తరబడి అక్కడి అక్రమ, ‘సక్రమ’ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్వతరహిత ప్రాంతాలుంటే ఉండొచ్చు. కానీ పర్యావరణ శాఖ కమిటీగా ‘చేర్చాలన్న’ ఆత్రుత కన్నా మినహాయింపుల వైపే మొగ్గటం సరైందేనా?మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచి చాన్నాళ్లయింది. దాన్నుంచి వేరు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరావళి ఆవలున్న థార్ ఎడారి చూపుతోంది. అక్కడి ఇసుక తుపాన్లు మన వైపు రాకుండా అడ్డుపడుతున్నవీ, స్థానికంగా భూగర్భజలాలను పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నవీ ఈ పర్వతాలే! ఇంతకూ ఆరా వళి ప్రాంతాన్ని మైనింగ్‌కు ఇవ్వబోమన్న హామీ వినబడుతోంది గానీ... జాతీయ రాజ ధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దాన మైతే ఇంతవరకూ లేదు. నిజానికి వందమీటర్ల గీటురాయి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి రూపొందించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపున్న చిట్టచివరి ప్రాంతం ఎన్సీఆర్. అక్కడ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. కానీ ఇంకా చిన్న గుట్టలు, పొదలూ విస్తారంగా ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిందే! యునెస్కో అరుదైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఆరావళిలో అంగుళం కూడా నష్టపోకూడదు. -
శభాష్... ఇస్రో!
గగన వీధుల్లో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో అపురూపమైన రికార్డు నమోదు చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఇంతవరకూ ప్రయోగిస్తూ వస్తున్న రాకెట్లలో అరుదైనదిగా, ‘బాహుబలి’గా చెబుతున్న ఎల్వీఎం3–ఎం6 బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముకుంటూ ఏకంగా 6,100 కిలోల బరువుండే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకుపోయి నిర్దిష్ట కక్ష్యలో ఉంచింది. ఎల్వీఎం3–ఎం6 సాదాసీదా రాకెట్ కాదు. దాని బరువు 6,40,000 కిలోలు. ఎత్తు 43.5 మీటర్లు. మన గడ్డపైనుంచి ఇంతవరకూ ప్రయోగించిన ఉపగ్రహాల్లో బ్లూబర్డ్ బ్లాక్–2 అత్యంత భారీ ఉపగ్రహం. ఈ ప్రయోగంలో మరో రికార్డు కూడా ఉంది. కేవలం 52 రోజుల వ్యవధిలో రెండు ఉపగ్రహాలను పంపటం ఇదే ప్రథమం. గత నెల 2న 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఎల్వీఎం3–ఎం5 భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టింది. తాజాగా ఎల్వీఎం3–ఎం6 కేవలం 15 నిమిషాల్లో నిమ్న భూకక్ష్య (లియో)లో ... అంటే 518 కిలోమీటర్ల ఎత్తులో బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని ఉంచింది. ఎల్వీఎం3 రాకెట్ మన శాస్త్రవేత్తలకు విశ్వసనీయమైనది. ప్రయోగాత్మకంగా పంపిన తొలి రాకెట్‌తో మొదలుపెట్టి ఇంతవరకూ ఈ రకం రాకెట్ ద్వారా ఎనిమిది ప్రయోగాలు విజయవంతం కాగా, ఇప్పుడు తొమ్మిదో ప్రయోగం సైతం భేషుగ్గా ఉండటం మన శాస్త్రవేత్తల ఘనతకు తార్కాణం. అంతరిక్షంలో సమర్థవంతమైన వాణిజ్య సేవలందించి దేశానికి కీర్తిప్రతిష్ఠలతోపాటు దండిగా ఆదాయాన్ని తెచ్చేవిధంగా ఇస్రో తనను తాను తీర్చిదిద్దుకుంది. ఈ రంగంలో ఎదురవుతున్న పోటీని అవలీలగా అధిగమించేలా మన శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. వ్యయం అదుపు, లక్ష్యాన్ని సాధించగల నేర్పు ఇస్రో సొంతం. అందుకే 34 దేశాలు 434 ఉపగ్రహాలను ఇస్రో ద్వారా ప్రయోగించాయి. ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం ఉపగ్రహ ప్రయోగాల కోసం దాన్ని ఆశ్రయిస్తున్నాయి. విదేశీ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఉపగ్రహాలను ప్రయోగించటం కోసం ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంస్థను ఏర్పర్చింది. దానికింద ఇంతవరకూ రెండు ఉపగ్రహాలను పంపింది. ఆ వరసలో బ్లూబర్డ్ బ్లాక్–2 మరో కలికితురాయి. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానమే తాజా ప్రయోగం.ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు దీటుగా సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ 5జీ యుగంలో పాత ఉపగ్రహాలు పెద్దగా ఉపయోగపడవు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించటం వర్తమాన అవసరం. అందుకు బ్లూబర్డ్ బ్లాక్–2 సరిగ్గా తోడ్పడుతుంది. ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహం ఇంతవరకూ అంతరిక్షం చేరుకున్న ఈ రకం ఉపగ్రహాల్లో మూడున్నర రెట్లు పెద్దది. స్టార్‌లింక్, వన్‌వెబ్ వంటి ఉపగ్రహాలు సైతం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నా వాటితో పోలిస్తే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం సాంకేతికంగా ఉన్నతమైనది. దీనికున్న ప్రత్యేక యాంటెన్నాలు టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ డేటాను అందించగలవు. అలాగే ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నామనిపించే విధంగా అవతలి గొంతును స్పష్టంగా వినిపించగలవు. నాణ్యమైన వీడియో కాల్స్‌కు తోడ్పడగలవు. అయితే మన దేశం నుంచి దీన్ని ప్రయోగించారన్న మాటేగానీ... ఇది అందించే సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండవు. కారణం మన నిబంధనలు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అనుమతించవు. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీపడుతున్నాయి. ఏ ప్రయోగా లైనా ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు శాంతియుత ప్రయోజనాలకు, మానవాళి మేలుకు తోడ్పడాలి. ఆ దిశగా మన ఇస్రో ఎన్నదగిన కృషి చేస్తోంది. ప్రయోగాల్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించటం, సంక్లిష్ట ప్రయోగాలను సైతం సునాయాసంగా చేయగల నేర్పును సొంతం చేసుకోవటం ఇస్రో ప్రత్యేకత. ఇప్పుడు సాధించిన విజయం భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలకు బాటలు పరుస్తుందనటంలో సందేహం లేదు. -
యూనస్ కళ్లు తెరుస్తారా!
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బంగ్లాదేశ్‌లో హింస ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనబడటం లేదు. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో గతవారం దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మైనారిటీ హిందూ యువకుణ్ణి మతాన్ని కించపరిచాడన్న ఆరోపణతో కొట్టి చంపారు. ‘ప్రథమ్ ఆలో’, ‘ద డైలీ స్టార్’ అనే రెండు ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పంటించారు. ఈలోగా సోమవారం మరో విద్యార్థి నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) స్థానిక నేత మొతలబ్ షిక్దర్ను దుండగులు కాల్చి చంపారు. బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోవటం, ఎన్నికలను ప్రహసన ప్రాయంగా మార్చటం వగైరాలతో జనం ఆగ్రహించి నిరుడు జూలైలో ఉద్యమించారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో, హింసను రెచ్చగొట్టి మైనారిటీ హిందూ మతస్తులపై, మహిళలపై దాడులు చేయటంలో మతతత్వవాదులు విజయం సాధించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ వీటన్నిటినీ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఉద్యమకారులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని అడ్డుకోవటానికి ప్రభుత్వపరంగా ఆయన చేసిందేమీ లేదు. అది చేతగానితనమా, వ్యూహాత్మకమా అన్నది తేలాల్సి ఉంది. హసీనా నిష్క్రమించాక చోటుచేసుకుంటున్న వరస పరిణామాలు అరాచకానికి బీజాలు వేశాయి. నేరగాళ్లను జైళ్లనుంచి విడిచిపెట్టడం, జమాత్–ఎ–ఇస్లామీ(జేఐ) వంటి పాక్ అనుకూల మతతత్వ సంస్థలకు స్వేచ్ఛనీయటం వగైరాలు ఎడతెగని హింసకు దారితీశాయి. హసీనా సొంత పార్టీ అవామీ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోటీచేసే అవకాశం లేకపోవటం, మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత ఖలీదా జియా తీవ్ర అస్వస్థత వల్ల ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం వగైరా పరిణామాలతో జేఐ వంటి మతతత్వ సంస్థలు తామే విజేతలమన్న భ్రమలో బతుకుతున్నాయి. భారత్ వ్యతిరేకతను ఇదే స్థాయిలో రెచ్చగొడుతూపోతే తమకే అధికారం దక్కుతుందని తలపోస్తున్నాయి. హదీ చురుకైన విద్యార్థి నాయకుడే. కానీ జేఐకి బద్ధ వ్యతిరేకి. ‘ఇంక్విలాబ్ మంచా’(ఐఎం) అనే మరో మతతత్వ సంస్థకు అధికార ప్రతినిధి. ఇటీవలే ‘ప్రథమ్ ఆలో’ పత్రిక సర్వే నిర్వహించి ఐఎం కన్నా జేఐకే ప్రజాదరణ ఎక్కువుందని తెలిపింది. బంగ్లాలో వరసబెట్టి ఆలయాలపై, దర్గాలపై సాగుతున్న దాడులపై అమెరికాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న అసిఫ్ బిన్ అలీ రాసిన సవివరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా కంటగింపుగా మారి ఐఎం మూకలు ఆ పత్రిక కార్యాలయానికి నిప్పెట్టాయి. పాక్ పాలకులు తమ సంస్కృతినీ, భాషనూ అణగ దొక్కాలని చూసిన పర్యవసానంగానే బంగ్లా ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మూకలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయో అనూహ్యం.భారత్ వ్యతిరేకత ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య లేదా నిరుద్యోగాన్ని రూపుమాపటం, కనీసం అవినీతి అంతానికి ఏం చేస్తారో చెప్పటం వగైరాలు మరిచిన ఈ సంస్థలు భారత్ వ్యతిరేకత పైనే ఆశ పెట్టుకున్నట్టు కనబడుతోంది. హదీ భారత వ్యతిరేకి కావొచ్చుగానీ... అంతమాత్రాన ఆ హత్య వెనక భారత్ హస్తం ఉన్నదనీ, హదీ హంతకులకు అది ఆశ్రయమిచ్చిందనీ వదంతులు వ్యాపింపజేయటం, ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వైఖరే అరాచకానికి దారితీస్తోంది. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కుప్పకూలదు. దీర్ఘకాలం కొనసాగే అరాచకం, హింస అందుకు తోడ్పడతాయి. హదీ సంస్మరణ సభలో మాట్లాడిన వారు భారత్‌కు హెచ్చరికలు జారీచేయటం, హసీనానూ, హదీ హంతకులనూ అప్పగించాలంటూ తేదీ ఖరారు చేయటం... ఎన్నికలు ముంచుకొస్తుండగా ప్రభుత్వం దీన్ని మౌనంగా వీక్షించటం బాధ్యతా రాహిత్యం. సకాలంలో ఈ అరాచకాన్ని నివారించకపోతే మున్ముందు తనను కూడా ఈ శక్తులు లక్ష్యంగా మార్చుకుంటాయని యూనస్ తెలుసు కోవటం మంచిది. -
అసత్యాలు... అర్ధ సత్యాలు
సొంత శిబిరంలో విభేదాలూ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ, కానరాని ఉపాధి కల్పన, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణ వగైరాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఊపిరాడనీయటం లేదని వైట్‌హౌస్ వేదికగా ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తేటతెల్లం చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలుగా, అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం ఒకపక్క స్వోత్కర్షలతో, మరోపక్క సంజాయిషీలతో నిండిపోయింది. అసత్యాలు, అర్ధ సత్యాలు సరేసరి. తరచు వైట్‌హౌస్ వేదికగా జరిగే మీడియా సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలకూ, ఈ ప్రసంగానికీ కాస్తయినా తేడా లేదు. స్వీయ వైఫల్యాలను నిష్క్రమించిన అధ్యక్షుడు జో బైడెన్ ఖాతాకు మళ్లించి... జరగని యుద్ధాలనూ, జరిగినా తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఆపినా మళ్లీ మొదలైన యుద్ధాలనూ సైతం తన విజయంగా ప్రకటించుకున్నారు. అందులో భారత్–పాక్ సంఘర్షణ ఒకటి. వలసదారులను దేశం విడిచి వెళ్లేలా చేసి అలా ఆదా చేసిన సొమ్మంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా వైద్యం, విద్య రూపంలో అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొన్నారు. ఇళ్ల అద్దెలు తగ్గాయనీ, ఉద్యోగాలు వచ్చిపడ్డాయనీ, పెట్టుబడులు రప్పించాననీ ప్రకటించుకున్నారు.నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి వలసదారుల తోడ్పాటు ఎంతో ఉంది. దేశంలో అగ్ర సంస్థలుగా పేరొందిన వాటిలో 46 శాతం... అంటే 230 కంపెనీలు వలసదారులూ, వారి పిల్లలూ స్థాపించినవే. ఈ ఏడాది న్యూ అమెరికన్ ఫార్చ్యూన్–500లో చేరిన పది కంపెనీల్లో సగం వలసదారులవే. 2023 గణాంకాల ప్రకారమైతే ఆ ఏడాది వలసదారులు సృష్టించిన సంపద లక్షా 70 వేల కోట్ల డాలర్లు. వారు పన్ను రూపంలో చెల్లించిన మొత్తం 65,200 కోట్ల డాలర్లు. వాస్తవాలు ఇవి కాగా, చట్టవిరుద్ధంగా వచ్చినవారితోపాటు అమెరికా పౌరసత్వం పొందినవారిని సైతం ట్రంప్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోంది. వారిలో అనవసర భయాందోళనలను సృష్టిస్తూ, ప్రజల్లో అనైక్యత తీసుకురావటానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. ఆయన వచ్చాక వలస వ్యవహారాల న్యాయమూర్తులుగా వున్న 100 మందిని తొలగించారు. టానియా నెమెర్ అనే మహిళా న్యాయమూర్తిని ఒక కేసు విచారిస్తుండగానే కారణం చెప్పకుండా బెంచ్ నుంచి, ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. ప్రస్తుత వైఫల్యాలకు కారణం గతంలోని అస్తవ్యస్తతే కారణమని చెప్పడం ఇటీవల అన్ని దేశాల్లోనూ పాలకులకు అలవాటైన విద్య. ట్రంప్ సైతం ఆ పాటే పాడారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. వలసదారులను తరిమేయటం ద్వారా దాన్ని మరింత గొప్పగా మారుస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. కానీ జరిగిందంతా వేరు. ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచటం వల్ల దేశీయ వినియోగదారులు సగటున 16.8 శాతం అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నదనీ, 1935 నుంచి చూస్తే ఇదే అత్యధికమనీ యేల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది. దిగుమతైన సరుకులపై ప్రభుత్వం విధించే అదనపు సుంకాలను అంతిమంగా భరించేది అమెరికా వినియోగదారులే. ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్ సర్వేలో 72 శాతం మంది గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటు న్నామని చెప్పగా, 58 శాతం మంది ఆయన అనుచిత విషయాలపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో 41,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత 4.6 శాతానికి ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయికి పోవటం ఇదే ప్రథమం. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నిస్తూ మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నానని చెప్పుకోవటం ట్రంప్‌కే చెల్లింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో చర్చించి, వాటి పరిష్కారానికి తాను అనుసరిస్తున్న విధానాలేమిటో చెప్పి భవిష్యత్తు బాగుంటుందని చెప్పివుంటే కనీసం కొందరైనా నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఒప్పుకొంటే, దానికి జవసత్వా లిచ్చేందుకు ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆశయినా మిగిలేది. దానికి బదులు అంతా సవ్యంగా ఉందని చెప్పడం వల్ల ట్రంప్‌పై కొద్దో గొప్పో ఉన్న విశ్వాసం కూడా దెబ్బతింది. ఆయన రేటింగ్ పడిపోవటంలో ఆశ్చర్యమేముంది? -
వాయు కాలుష్యం ఎన్నాళ్లు?
మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాదీ అది తప్పడం లేదు. కాకపోతే శీతకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి.సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ, ప్రభుత్వాల నియమ నిబంధనలూ, విపక్షాల విమర్శలూ, సామాన్యుల అరణ్య రోదనలూ... అన్నీ అప్పుడే! బీసీసీఐ సైతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మరిచి ఇదే సీజన్లో ఢిల్లీలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో క్రికెట్ సంబరాల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది.ఈసారి కూడా రివాజు తప్పకుండా ఇవన్నీ ఒకదాని వెంబడి మరోటి సాగుతున్నాయి. పొగమంచు కమ్మేస్తున్న పర్యవసానంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక, ‘కార్ పూలింగ్’ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాజధాని వెలుపల రిజిస్టరై, బీఎస్–4 ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు పోయాయి. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 విధించారు.ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాలను అనుమతించబోరు. ఇవి 12 లక్షల వరకూ ఉంటాయని లెక్కేస్తున్నారు. మొత్తంగా ఉండే కోటిన్నర వాహనాల్లో ఇవి ఏపాటి? నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు ఆంక్షల కారణంగా పనులు కోల్పోతే రూ. 10,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా నమోదైన వారు కేవలం 2.57 లక్షలమంది మాత్రమే.ఇంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని అంచనా. ఇవన్నీ మెచ్చదగ్గ చర్యలే. కానీ అసలు ఢిల్లీ సవ్యంగా ఉన్నదెప్పుడు? ఇటీవలికాలంలో అది నిరంతరం కాలుష్యంలోనే మునిగి తేలుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాంశాలన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్రీకృత నగర వ్యవస్థల వల్లనే ఈ అవస్థలన్నీ దాపురిస్తున్నాయని తెలిసినా వాటిని మానుకోవడం లేదు.ఢిల్లీలో వాయునాణ్యత అతి తీవ్ర స్థాయిలో... అంటే సగటు వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) 400కు మించి ఉన్నదని తేలింది. ఇది వరుసగా మూడు రోజులుండగా, ఆ తర్వాత అది ‘దయనీయ స్థితి’(వెరీ పూర్)కి... అంటే ఏక్యూఐ 300–400 పరిధిలో కొచ్చింది. కాలుష్యం గురించి దీపావళి పండుగకు ముందో, పంజాబ్‌లో పంట కోతల సమయంలోనో గుర్తుకురావటం వల్లే ఈ సమస్యంతా!కొన్నాళ్లపాటు మొత్తంగా టపాసులు కాల్చటానికి వీల్లేదని నిషేధం విధిస్తే ‘మా పండుగకే ఇలాంటివి గుర్తొస్తాయా?’ అనే తర్కం తలెత్తదు. బ్యాంకుల ద్వారా వాయిదాల్లో వాహనాల కొనుగోలును కొన్నాళ్లు ఆపేస్తే ఇంత చేటు కాలుష్యం ఉండదు. అసలు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తే అత్యధికులు వాహనాల జోలికిపోరు. పరిశ్రమలు వెదజల్లుతున్న ఉద్గారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్య భూతం అదుపులో ఉంటుంది.ఇవన్నీ పట్టన ట్టు నవంబర్– జనవరి మధ్య క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ ఉత్తరాదిని ఎంచుకుని నగుబాటు పాలవుతోంది. లక్నోలో వాయునాణ్యత 400 మించటంతో శుక్ర వారం జరగాల్సిన మ్యాచ్‌ను రద్దుచేశారు. ఇప్పుడే కాదు... 2017లో ఢిల్లీలో భారత– శ్రీలంక మ్యాచ్ సమయంలో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లకు శ్వాసకోశ సమస్య లొచ్చాయి. కొందరైతే ఆడుతూ వాంతులు చేసుకున్నారు.2019లో భారత–బంగ్లా మ్యాచ్ సమయంలోనూ ఇంతే! రెండేళ్ల క్రితం బంగ్లా–శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. కనీసం ఈ సమయంలోనైనా దక్షిణాదిని ఎంచుకుందా మని బీసీసీఐకి తోచదు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించకుండా ప్రభుత్వ విభాగా లన్నీ సమన్వయంతో పనిచేస్తే, ఏడాది పొడవునా అమలయ్యే చర్యలుంటే ఢిల్లీ కాస్త యినా మెరుగుపడుతుంది. కాలుష్య భూతాన్ని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. -
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
ప్రశాంతంగా ఉన్నంతకాలమూ అంతా సవ్యంగా ఉందనుకోవటమే తప్ప ఉగ్రవాదం తీవ్రత ఎక్కడా తగ్గలేదని గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో చోటు చేసుకున్న ఉదంతం తెలియజేస్తోంది. హన్నూక సంబరాల్లో మునిగిన యూదు సమూహంపై తండ్రీకొడుకులిద్దరు తుపాకులతో దాడి చేసి 15 మందిని కాల్చిచంపటం, 40 మందిని గాయపర్చటం గమనిస్తే నిరంతర అప్రమత్తత ఎంత అవసరమో అర్థమవుతుంది. ప్రతిచోటా భద్రత కల్పించటం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. అందుకే వర్తమాన పరిస్థితుల్లో ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అనునిత్యం గమనించుకోవడం తప్పనిసరి. తుపాకీ చట్టాలు ఎంతో కఠినంగా ఉండే ఆస్ట్రేలియాలో ఈ మాదిరి ఘటన జరిగి మూడు దశాబ్దాలవుతోంది. 1996లో పోర్ట్ ఆర్తర్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. గత రెండేళ్లలో యూదులకు వ్యతిరేకంగా దాదాపు 2,000 ఘటనలు జరిగినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత ఉదంతం కూడా దానికి కొనసాగింపే! ఇలాంటి నేపథ్యంలో నిఘా మరింత పక డ్బందీగా ఉంటే బాగుండేది. ఉన్మాదులు హఠాత్తుగా ఎక్కడైనా దాడులకు తెగబడొచ్చని ఇది రుజువుచేస్తోంది. ఆస్ట్రేలియా భిన్న జాతుల నిలయం. చాలా దేశాలతో పోలిస్తే అది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెట్టింది పేరు. దేశ జనాభాలో యూదుల శాతం 0.4 శాతం. అంకెల్లో చెప్పు కోవాలంటే అది 1,17,000. అందులో చాలా కుటుంబాలు నాజీ జర్మనీలో హిట్లర్ ఉన్మాదాన్ని అధిగమించి అదృష్టవశాత్తూ బతికి బయటపడినవారివే. ఇజ్రాయెల్ పాల కులు గాజాపై రెండేళ్లపాటు ఎడతెగకుండా సాగించిన హంతకదాడుల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ దాడులు ఆగింది లేదు. దాన్ని ప్రపంచ దేశాల ప్రజలంతా నిరసించారు. అందులో యూదులు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా సైతం తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, మొన్న ఆగస్టులో పాలస్తీనాను గుర్తించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న యూదులంతా ఇజ్రాయెల్ దుండగాన్ని సమర్థించారని కూడా చెప్పలేం. ఉగ్రవాద సంస్థ హమాస్ సాగించిన హత్యాకాండకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవటం సబబేనని భావించేవారు ఉంటే ఉండొచ్చు. అలాంటి వారిని సైతం ఒప్పించేలా, మార్చ గలిగేలా ఉద్యమాలు నిర్మించాలి తప్ప సంబంధం లేని అమాయక పౌరుల్ని చంపి ఇలాంటి ఉన్మాదులు ఏం సాధిస్తారు? ఇప్పుడు దాడికి పాల్పడిన తండ్రీకొడుకులకు గాజా ఉదంతం సాకు మాత్రమే. హైదరాబాద్ పాతబస్తీ నుంచి 27 ఏళ్ల క్రితం సాజిద్ అక్రం వలసపోగా, ఆరేళ్లక్రితమే అతని కుమారుడు నవీద్ ఫిలిప్పీన్స్‌లోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు పెట్టుకున్నాడని, అప్పటినుంచి వారిద్దరికీ ఉన్మాదం తలకెక్కిందని అంటు న్నారు. గత నెలలో వారిద్దరూ ఫిలిప్పీన్స్ వెళ్లి సైనిక శిక్షణ తీసుకున్నారని పోలీసుల కథనం. ఆర్నెల్లక్రితం కొడుకుపై అనుమానం వచ్చి నిఘా సంస్థ అధికారులు ప్రశ్నించా రట కూడా! కొడుకు పేరుతో రిజిస్టరైన వాహనంలో పేలుడు పదార్థాలు, ఐఎస్ పతా కాలు ఉన్నట్టు పోలీసు సోదాలో బయటపడింది. ఉదంతం జరిగిన రోజే తండ్రిని పోలీసు బలగం కాల్చిచంపగా, కొడుకు సాజిద్‌ను సమీపంలోనే ఉన్న చిరువ్యాపారి అహ్మద్ అల్ –అహ్మద్ చాకచక్యంగా పట్టుకోగలిగాడు. మృత్యువుకు ఎదురొడ్డి అతను చేసిన సాహస కార్యం వల్ల అనేకమంది ప్రాణాలు నిలబడ్డాయి. కానీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ విచిత్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ విధానాలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహించే విగా ఉన్నందువల్లే ఈ ఉదంతం జరిగిందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాజ్యం ఏర్ప డాలని కాంక్షించటం యూదు వ్యతిరేక చర్య ఎలా అవుతుందో నెతన్యాహూకే తెలియాలి. హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి 1,195 మంది ఆ దేశ పౌరుల్ని, విదేశీయులు కొందరిని చంపేశారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ విషయంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చటానికి నెతన్యాహూ గాజాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడాయన ఆల్బనీస్ను తప్పుపట్టేందుకు సిద్ధపడ్డారు! ఏదేమైనా ఆస్ట్రేలియా ఉదంతం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే ఉగ్రవాద భూతం ఎక్కడైనా విరుచుకుపడొచ్చని తెలుసుకోవాలి. -
‘ఉపాధి’కి కొత్త రూపు!
గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు కావటానికి రంగం సిద్ధమైంది. దాని స్థానంలో తీసుకురాదల్చిన ‘వికసిత భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ–జీ రాం జీ) బిల్లు పార్లమెంటులో రంగప్రవేశం చేసింది. అమలులో ఉన్న పథకం కన్నా ఇది అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా వాటంగా రూపుదిద్దారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. ‘పల్లె కన్నీరు బెడుతుందో...’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట అప్పటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చూపింది. వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కరువై వలసపోవటాలు, చేతివృత్తులు దెబ్బతినటం రివాజయ్యాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. 2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని దయాధర్మ భిక్షంగా కాక, హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు, నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకమది. పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటిపారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయించటానికి వినియోగించారు.అయితే లోపాలు లేవని కాదు. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అన్నిచోట్లా ఒకేలా అమలు చేయకపోవటం, బయటి రేట్లతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం వగైరాలు సమస్యలు. వీటిని ‘జీ రాం జీ’ పరిష్కరిస్తుందా? వంద రోజులు కాదు... 125 రోజులు ఉపాధి గ్యారెంటీ అంటున్నది కొత్త పథకం. సాగు పనులు జోరుగా ఉండే రెండు నెలలూ దీన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వగైరాలు మినహా మెజారిటీ రాష్ట్రాలు ఈ పథకంలో 40 శాతాన్ని భరించాల్సి రావటం ఇందులోని ప్రధాన సమస్య. ఇంతవరకూ ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ. 50,000 కోట్లు వెచ్చించాలి. పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ అదనంగా ఇంత పెద్ద భారాన్ని మోపటం సరైందేనా? ఎన్డీయేను భుజాలకెత్తుకున్న జేడీ(యూ), టీడీపీ ఏమంటాయి? ఈ పథకం కూడా గతంలో మాదిరే హక్కు ప్రాతిపదికగా ఉంటుందంటున్నా నిధుల లేమితో ఆచరణలో ఆవిరి కాదా? గత అయిదేళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతున్నది. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతున్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగేదేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి. -
బీమాలో సంపూర్ణ ఎఫ్‌డీఐ
భారత బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రవేశించటానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో రెండు దశాబ్దాలుగా ఎడతెగకుండా సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చాయి. ‘సబ్కా బీమా సబ్కీ రక్షా’ పేరిట పార్లమెంటులో రంగప్రవేశం చేయబోతున్న బీమా చట్టాల సవరణ బిల్లు... 1938నాటి బీమా చట్టానికీ, 1956నాటి జీవితబీమా కార్పొరేషన్ చట్టానికీ, 1999 నాటి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) చట్టానికీ సమూలమైన మార్పుల్ని ప్రతిపాదిస్తోంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ప్రస్తుతం వున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచటానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. కేంద్రంలో పాలకులెవరైనా, వారి రాజకీయ విశ్వాసాలూ, నాయకత్వం వహిస్తున్న కూటములూ ఏవైనా ఎఫ్‌డీఐను పూర్తి స్థాయిలో అనుమతించాలన్న విషయంలో అందరిదీ ఒకటే స్వరం. బీమా రంగంలో విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరవాలని సంపన్న దేశాల నుంచి ఎప్పటినుంచో ఒత్తిళ్లు ఉన్నాయి. మన బీమా రంగంలో ప్రైవేటు సంస్థలున్నా సామాన్య పౌరులు పబ్లిక్ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను విశ్వసించిన స్థాయిలో వాటిని నమ్మరు. అందుకే మార్కెట్లో ఇప్పటికీ దాని భాగస్వామ్యం దాదాపు 65 శాతం. అలాగని చొరవగా దూసుకెళ్లటంలో అదింకా వెనకబడి వున్నదనీ ఆర్థిక రంగ నిపుణులంటారు. పోటీ పెరిగితే ఇది మారుతుందనీ, వినియోగదారులు లాభపడతారనీ వారి వాదన. మన జీవిత బీమా రంగం వాటా జీడీపీలో 3.2 శాతం. వాస్తవానికి ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరింత కిందకు పోయి 2.8 శాతం దగ్గర ఆగింది. విదేశాల్లో ఈ రంగం వాటా 6.5 శాతం.విదేశీ సంస్థలను అనుమతించటాన్ని వ్యతిరేకించేవారు అవి లాభార్జన దృష్టితో ఉంటాయని విమర్శిస్తారు. దేశీయ పొదుపు దేశాభివృద్ధికి కాక విదేశీ సంస్థలకు పోతుందని... పేదరికం ప్రబలంగా ఉన్న మనలాంటి దేశంలో సంక్షోభ కాలంలో ఆసరాగా నిలబడకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. అనుకున్నట్టు లాభాలు రాకపోతే సంస్థలు దివాలా తీసే, నిష్క్రమించే అవకాశం ఉండదా అనే సందేహాలున్నాయి. ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థ ఉండగా ఆ భయాలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం డేటా చౌర్యం కూడా సమస్యే! ప్రైవేటు సంస్థల్లో తగిన నియంత్రణ లేని కారణంగా ఖాతాదారుల డేటా బయటకు పోతోందని, అందువల్ల మోసగాళ్ల బెడద ఎక్కువైందని బీమా రంగాన్ని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకించే సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2047కల్లా పౌరుల్లో ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం చేరాలన్నది ఐఆర్డీఏఐ లక్ష్యం. అలాగే ఆరోగ్యం, ఆస్తి తదితరాలకు సైతం బీమా చేయించుకునేలా ప్రచారం చేయాలని ఆ సంస్థ కంకణం కట్టుకుంది. విదేశీ సంస్థల్ని అనుమతించటానికి చాన్నాళ్లుగా మన ప్రభుత్వాలు హైరానా పడుతున్నాయి. తొలిసారి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఐఆర్డీఏఐ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు తొలిసారి అనుమతించింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, 2004లో తన నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రాగానే దాన్ని 49 శాతానికి పెంచే ప్రయత్నం చేసింది. అప్పట్లో యూపీఏకు బాసటగా ఉన్న వామపక్షాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కారణం ఏమైతేనేం ఈ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. వారితోపాటు విపక్షంలోఉన్న బీజేపీ సైతం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకొచ్చిన వెంటనే పాత ప్రతిపాదన దుమ్ము దులిపింది. ఏడాదికల్లా దాన్ని 49 శాతానికి, మరో ఏడేళ్లకు 74 శాతానికి విస్తరించింది. బీమా సంస్థల్లో విదేశీ భాగస్వాముల వాటా పరిమితమే గనుక భయాందోళనలు అనవసరమని ఇన్నాళ్లూ ప్రభుత్వాలు చెబుతూవచ్చాయి. ఇప్పుడది 100 శాతానికి చేరింది గనుక తగిన జాగ్రత్తలూ, నియంత్రణలూ అవసరం. బిల్లు పార్లమెంటు పరిశీలనకొచ్చినప్పుడు, అందులోని లోటుపాట్లేమిటో, ఇంకా చేయాల్సిందేమిటో చెప్పగలిగే దిశగా ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. దేశీయ పొదుపు కాస్తా అన్యుల చేతుల్లోపడితే, వారు సక్రమంగా నిర్వహించటంలో విఫలమైతే సామాన్యులకు తీరని నష్టం కలుగుతుంది. -
పది నీతులు, పది బూతులు
కుందవరపు చౌడప్ప పేరు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమే. ‘నీతులకేం కానీ, బూతాడక పోతే దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అంటాడాయన. ‘సభలో పది నీతులూ, పది బూతులూ ఉన్న పద్యాలు చెప్పినవాడే అధికు’డంటూ నీతినీ, బూతునూ ఒకే గాటన కట్టిన తెంపరి ఆయన. అక్షరాన్ని సాక్షాత్తు ‘సరస్వతి’గా ఉపాసించారు కనుకనే పూర్వులు రచనను ‘సారస్వత’ మన్నారు. అలా అక్షరాన్ని పవిత్రంగా భావించేవారెవరైనా బూతు రాతలో రోతనే తప్ప నీతినీ, నవ్వునూ చూడలేరు. ఒకానొక విశ్వవిద్యాలయంలో తోటి ఆచార్యుని చర్మరోగాన్ని ఆక్షేపిస్తూ ఏకంగా పద్యాలే రాసి తనకు అబ్బిన పద్యవిద్యను బురదగుంటలో పొర్లించిన ఇటీవలి ఆచార్య పుంగవులూ లేకపోలేదు కానీ, తెలుగు సాహిత్యం అదృష్టం కొద్దీ బూతుకవిగా చౌడప్ప ఒక్కడే చరిత్ర కెక్కాడు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా బూతుల బుంగల్ని సృష్టించి సామాజిక మాధ్యమాలు ఆ హేయచరిత్రకు వేల సంఖ్యలో కొత్తపుటలు జోడిస్తున్నాయి. నిజానికి మాధ్యమాలు సామాజికీకరణ చెందడం ఎంతైనా స్వాగతించదగినదే; అందువల్ల తమ భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం కొత్తకొత్త వర్గాలకు అందు బాటులోకి వచ్చింది. దాంతోపాటే అవి అసభ్యతా, అశ్లీలం, బూతు, వ్యక్తిగతమైన వేధింపు వగైరాల రూపంలో చెప్పలేనంత మురికినీ తెప్పలుగా పారిస్తున్నాయి. డ్రైనేజీ స్కీములేక అది డేంజర్‌గా మారుతోంది. కాకపోతే, మనందరికీ తెలిసిన ‘బూతు’లాంటి మోటు మాటలతో కాకుండా ఎక్కువమందికి తెలియని ‘ట్రోలింగ్’ అనే నాజూకు పేరుతో ఇది చలామణీ అవుతోంది. స్కాండెనేవియా జానపద కథల్లోని రాక్షసులు, మరుగుజ్జు ల్లాంటి జగడాలమారి, అసాంఘిక శక్తులను సంకేతించడంతో ప్రారంభించి, చేపలకు వేసే ఎర వరకూ పదిహేనో శతాబ్ది నుంచి రకరకాల అర్థాల్లో వాడుతూ వచ్చిన ఈ ‘ట్రోల్’ అనే మాట ఇప్పుడు రకరకాల అసహ్యార్థాలలో అంతర్జాల సంస్కృతిలో స్థిరపడింది. భారతీయ సమాజంలో తిట్టుకూ, బూతుకూ స్త్రీలనే లక్ష్యం చేసుకోవడం మొదటి నుంచీ ఉన్నదే. సామాజిక మాధ్యమాలు ఇందుకు కొత్తగా అందివచ్చిన రొచ్చుబండ లయ్యాయి. అక్కడక్కడ స్వయంగా మహిళలూ ఇందులో భాగస్వాములవడం ఈ అధః పతనంలో కొత్త లోతు. సహజంగా స్త్రీల నుంచే దీనిపట్ల తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. బూతులకు, వేధింపులకు గురవుతున్న కొంతమంది మహిళా యూట్యూబర్లు ఈ మధ్య ఒక పోలీస్ ఉన్నతాధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయినా దీనికి అడ్డుకట్టపడే సూచన కానీ, పడుతుందన్న ఆశకు ఆస్కారం కానీ కనిపించడం లేదు. ఫేస్బుక్ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఒక గ్రూపు తన వంతుగా రంగంలోకి దిగి దీనిపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్ని సందేశాత్మక వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది. అయితే, సమస్య ఎన్నో శక్తుల భాగస్వామ్యంతో లోతుగా వేళ్లూనుకున్న స్థితిలో పై మెరుగుల చర్యల వల్ల ఫలితముంటుందా అన్న ప్రశ్నా ఎదురవుతుంది. ఉదాహరణకు, మహిళలు విద్యా, ఉద్యోగాల్లోనే కాక, ఆ యా సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలమవ డాన్ని కంటగించుకునే సాంప్రదాయిక శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అసహనాన్నీ, అక్కసునూ వెళ్ళగక్కుతున్నాయి. ఇంకోవైపు, వివిధ భావ జాలాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరుకున్న నేటి దేశీయ వాతావరణంలో వాటికి నాయకత్వం వహించే రాజకీయ పక్షాలు సాంప్రదాయిక మాధ్యమాలకు అదనంగా సామాజిక మాధ్యమాలనూ యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అధికార బలంతోపాటు అర్థబలం, అంగబలం దండిగా ఉన్న శక్తులు ఈ బూతులూ, తిట్ల పంచాంగాన్ని వ్యవస్థీకృతం చేసి తెర వెనుక నుంచి నడిపిస్తున్న సూచనలూ పొడగడుతున్నాయి. దేవుళ్ళూ, మతమూ, సంస్కృతీ, సభ్యతా, సంస్కారాలతో సహా మనవనుకునే అన్ని టినీ ఆకాశానికెత్తే నోళ్లే బూతులూ, అశ్లీలాల మురికిని పుక్కిలించడం ఈ మొత్తంలో ఒక అపహాస్యభరితమైన అతిపెద్ద వైరుద్ధ్యం. తమవైన వ్యవస్థలకూ, విలువలకూ తమ చేతులతోనే చెరుపుకోలేనంత మసీ, మకిలీ అంటించి చెరుపు చేస్తున్నామన్న స్పృహ కూడా లోపించిన పరిస్థితి. అన్ని తేడాలకూ అతీతంగా అందరూ ఒక్కటై కడతేర్చవలసిన సామాజిక రుగ్మతగా గుర్తించడమే దీనికి ఏకైక పరిష్కారం. -
అమరావతి చిక్కుముళ్ళకు బాధ్యులెవరు?
అమరావతిపై ఏపీ సర్కార్‌లో ఏదో గందరగోళం కనిపిస్తు న్నది. చేస్తున్న పనుల్లో ఇసుమంతైనా పారదర్శకత లేదు. న్యాయమైన సందేహాలను కూడా కూటమి సహించలేక పోతున్నది. ప్రతిపక్షాలూ, మీడియా వేసే ప్రశ్నలే కాదు... తటస్థులూ, సానుభూతిపరుల సందేహాల పైన కూడా అసహనం వ్యక్తమవుతున్నది. ఈ ధోరణి కేవలం ప్రభుత్వ పెద్దల్లోనే కాదు, అనుబంధ మీడియాలో కూడా కనిపిస్తున్నది. తమకు నచ్చకపోతే నిఖార్సయిన వార్తలపై కూడా ఎల్లో మీడియా వీరంగం వేస్తున్నది. ఇక సర్కారు వారి సోషల్ మీడియాలోని ఎల్లో మెర్సినరీలను పట్ట వశం కావడం లేదు. అమరావతిపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే బూతుబాంబులతో చెలరేగిపోతున్నారు.‘అమరావతి బిల్లు వెనక్కి’ అనే వార్త ఇటీవల ‘సాక్షి’లో వచ్చింది. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైన వార్త. అమ రావతికి సంబంధించిన పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన వార్తలే! ఆ వార్తలను అందించడం మీడియా బాధ్యత. ఎల్లో మీడియా కూడా ఆ వార్తను అందించి ఉండాల్సింది. కేంద్రం ఆమోదానికి రాష్ట్రం పంపించిన బిల్లులో సాంకే తిక లోపాలను గుర్తించినందువల్ల వాటిని సరిచేసి పంపాలని వెనక్కి పంపారు. ‘సాక్షి’ మీడియా అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసింది. అంతే తప్ప అమరావతి బిల్లుకు ఇక మోక్షమే ఉండ బోదనీ, అమరావతి రాజధాని ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిందనీ ఎక్కడా రాయలేదు. ఈమాత్రం దానికే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం నేతలకు పూనకాలు వచ్చాయి. అమరావతి ఏర్పాటును సహించలేకపోతున్నారంటూ శాప నార్థాలు పెట్టారు. అసలు అమరావతిని ఒక నిష్ఫల ప్రయోగంగా మార్చుతున్నది ఎవరో పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. నిజంగానే ఈ బిల్లును ఆమోదించడంలో కేంద్రానికి కొన్ని చిక్కులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం– 2014లో రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజు (జూన్ 2, 2014) నుంచి 10 ఏళ్ల వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.అందువల్ల 2014 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే, న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉంటుందనికేంద్రం భావించింది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించడమనేది ఒక ప్రత్యామ్నాయ మార్గం. అయితే 2014 నుంచి 2024 మధ్యకాలంలో రాజధాని కోసం కేంద్రం చేసిన సహాయం మాటేమిటి? ఈ చిక్కుముడులు తొలగించి, బిల్లును మళ్లీపంపాలని కేంద్రం సూచించింది. ఆ పని చేస్తే సరిపోతుంది. ఇటువంటి చిక్కుముళ్ళన్నీ చంద్రబాబు సర్కార్ స్వయంకృతం. 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే 34 వేల ఎకరాల భూ సమీకరణ ఏ పేరుతో చేసినట్టు? పైగా ఈ పదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ కొనసాగిందా? రాష్ట్రం రాజధాని లేని అనాథగా మారిందని జగన్ హయాంలో దుష్ప చ్రారం చేసిందెవరు? 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చంద్రబాబు తొలి ఐదేళ్ల పాలన కూడా రాజధాని లేని రాష్ట్రంగా భావించవలసిందేనా?అమరావతి చుట్టూ వరుసగా చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళిందే చంద్రబాబు సర్కార్. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. కేవలం అసెంబ్లీ, సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యా లయాలకు మాత్రమే ఈ ఉమ్మడి రాజధాని పరిమితం కాదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉమ్మడి రాజధాని ప్రాంతంగానే ఉంటుందని చట్టంలో పేర్కొ న్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని అంశాన్ని ఉపయోగించుకోకుండా, ఏదో చేయకూడని పనిచేస్తూ దొరికిపోయినందువల్ల బాబు సర్కార్ హైదరాబాదుపై హక్కుల్ని వదిలేసుకుని వెళ్లి పోయిందని విమర్శలు వచ్చాయి.పదేళ్ల తర్వాత ఏపీకి రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని సూచించడం కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనీ, ఆ కమిటీ ఆరు మాసాల్లోగా నివేదిక ఇవ్వాలనీ కేంద్రాన్ని చట్టం ఆదేశించింది. చట్ట ప్రకారం కేంద్రం ‘శివరామకృష్ణన్ కమిటీ’ని నియమించింది. ఆ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటించి, వివిధ రంగాల ప్రజలతో సంభాషించి, ఒక నివేదికను అందజేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచన లకు నూటికి నూరుపాళ్ళు వ్యతిరేకంగా చంద్రబాబు అమరా వతిని ఎంపిక చేశారు. రాజధాని ఏర్పాటు కారణంగా అక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలనీ, వాగులు, వంకలు, చెరువుల వంటి జల వనరులను కాపాడాలనీ, వరదలు – భూకంపాలు – తుఫాన్లు వచ్చే అవకాశం లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలనీ, పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాకుండా చూడాలనీ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని నిర్మాణ వ్యయం – భూ సేకరణ వగైరాలు వీలైనంత తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ఉండాలని కూడా కమిటీచెప్పింది. కొత్త రాజధాని హైదరాబాద్ వంటి ‘సూపర్ సిటీ’గా కాకుండా ప్రభుత్వ శాఖల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించివికేంద్రీకరణ సూత్రాన్ని పాటించాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది.నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పడేశారు. కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, పాలసీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల కంటే పిల్లల చదువుతో వ్యాపారం చేసే నారాయణ మెరుగైన నిపుణుడని మనసారా చంద్రబాబు నమ్మారు. అందుకే ఆ కమిటీ నివేదికను గిరాటేసి, ‘నారాయణ కమిటీ’ వేసుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా’ చట్టం పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించారు. విచిత్రం ఏమిటంటే ఈ చట్టంలో ఎక్కడా కూడా ‘క్యాపిటల్ రీజియన్’గా అమరావతి ప్రాంతం ఉంటుందనే ప్రస్తావన లేదు. ఈ దాపరికం వెనుక ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అనే ఆర్థిక కుతంత్రం దాగి ఉందని అప్పట్లోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అటువంటిదేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం ఈ పదేళ్ళలో చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు.నిపుణుల కమిటీ నివేదికను పక్కన పడేయటం, ప్రపంచంలో ఏ నిపుణుడూ అంగీకరించని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం, దాన్ని గోప్యంగా ఉంచి చట్టం చేసు కోవటం, చట్టపరంగా పదేళ్లపాటు హైదరాబాదుపై ఉన్న హక్కుల్ని వదిలేసుకోవడం, 34 వేల ఎకరాల సారవంతమైన భూముల్ని రైతుల నుంచి నయానో భయానో సమీకరించడం, వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవడంతో పాటు సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు వరుసగా ఇప్పుడు చిక్కుముళ్ళుగా మారాయి. సింగపూర్ తరఫున అమ రావతిలో ఉత్సాహం ప్రదర్శించిన మంత్రి ఈశ్వరన్ అవినీతి కథలు బయటపడటంతో సింగపూర్ కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. చిక్కుముళ్ళ పరంపర ఇంతటితో ఆగి పోలేదు. రైతుల దగ్గర సమీకరించిన భూమితో పాటు, ప్రభుత్వ భూమి కూడా కలిపితే 53 వేల ఎకరాలు అమరావతి కోసం సిద్ధంగా ఉన్నది.ఇప్పుడు ఈ భూమి చిన్న మునిసిపాలిటీకి మాత్రమే సరిపోతుందని బాబు చెబుతున్నారు. ఇంకో రెండు దశల్లో మరో 40 వేల పైచిలుకు ఎకరాలను సేకరిస్తే తప్ప కలల రాజధాని సాకారం కాదట. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబై మహానగరమే (కార్పొరేషన్ ఏరియా) లక్షా పదివేల ఎకరాల్లో ఉందట! ఇంచుమించు అంత స్థలం ఉంటే తప్ప అమరావతి వెంచర్ ప్రారంభం కాదని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడున్న 53 వేల ఎకరాల్లోనే ‘నవ నగరాల’ పేరుతో మాస్టర్ ప్లాన్ గతంలోనే రూపొందించారు. అందులో 4 వేల ఎకరాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ కూడా ఉన్నది. ఇప్పుడు అదనంగా స్టేడియాల కోసం, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం, రెండో విడత భూసేకరణ కావాలని అడగటానికి కారణం ఏమిటో తెలియదు.సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన అమరావతి భూముల లెక్కలు పరిశీలిస్తే అదనపు భూములు అవసరం ఏమిటన్న సందేహం మరింత పెరుగుతుంది. రైతులిచ్చిన భూములు ప్లస్ ప్రభుత్వ భూములు కలిసి సీఆర్డీఏ దగ్గర 53,747 ఎకరాల భూమి ఉన్నది. రోడ్లు, పార్కులు, చెరువులు వగైరాలు తీసేస్తే 29,220 ఎకరాలు మిగులుతాయి. ఇందులో 9,500 ఎకరాలు రైతులకు ఇవ్వాలి. 1,100 ఎకరాలు ఇప్పటికే వివిధ సంస్థలకు ఇచ్చారు. 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వసంస్థలకు కావాలి. ఇంకా 18 వేల పైచిలుకు ఎకరాల భూమి సీఆర్డీఏ దగ్గర ఉంటుంది. ఇవన్నీ దాని లెక్కలే! ఇంకా అదనపు భూమి దేనికోసం? అభిజ్ఞ వర్గాల నుంచి అందుతున్న సమా చారం ప్రకారం ఈ మొత్తం లేఅవుట్లో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమికి చెందిన సరిహద్దులు చెదిరిపోయాయి, రికార్డులు చిరిగిపోయాయి. కేటాయింపులకు గాని, అమ్మకాలకు గాని ఆ భూమి సీఆర్డీఏకి అందుబాటులో ఉంటుందో ఉండ దోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్ని పూడ్చేసి, చదును చేసి ఇస్తున్నారట! న్యాయ వివాదాలు తలెత్తితే ఇవి చెల్లుబాటు అవుతాయా? అసలు చెరువులను పూడ్చి, ప్లాట్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?రెండో దశ, మూడో దశ భూ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కొందరు భారీగా భూములు కొను గోలు చేశారట! ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు పేరుతో వారు భూములు అమ్ముకోవాలి. అందుకోసం కాగితాలు మీదనే నగర విస్తరణ అక్కడిదాకా పాకాలి. ఈ లోగుట్టు అర్థమైనందు వల్లనే ఎంతోమంది తటస్థులతో పాటు, తెలుగుదేశం మద్దతుదారులు సైతం అమరావతి వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు... ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఇప్పుడుఎందుకని ప్రశ్నిస్తున్నారు. పక్కనే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, మరో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికని నిలదీస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి దేనికీ సమా ధానం లేదు. సరిగ్గా గమనిస్తే ఇంకో కోణం కనిపిస్తున్నది. మొదటి దశ సమీకరణలో చురుగ్గా కనిపించిన దేవినేని, ప్రత్తిపాటి, యరపతినేని, ధూళిపాళ్ల, శ్రీధర్ వగైరాలు ఇప్పుడు ఛూమంతర్ అన్నట్టుగా మాయమయ్యారు. రెండో దశ కోసం యవనిక ముందుకు పెమ్మసాని, భాష్యం, చిన్న కేశినేని వంటి వారు రంగప్రవేశం చేశారు. మొదటి టీమ్‌కు సారాంశం బోధపడినందువల్లనే పక్కన పెట్టి ఉంటారా?పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి. పని చేస్తున్నది మాత్రం రాష్ట్రంలో అమరావతి శాఖ కోసం! త్రీ మెన్ కమిటీ ముసుగులో ఆయన పూర్తి సమయం అమరావతి వ్యవహారాలనే చూస్తున్నారని తెలుగుదేశం వారే చెబుతున్నారు. అందుకు ప్రధానమంత్రి కూడా అంగీకరించారేమో తెలియదు. అంతకు ముందు పూర్తి బాధ్యతగా అమరావతి సంగతులు సర్దుబాటు చేసిన నారాయణ ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే ఆయన పెమ్మసాని పక్కన జూనియర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నారు. అమరావతి చుట్టూ చిక్కుముళ్ళు చాలా పడ్డాయి. ప్రజల మదిలో చాలా సందేహాలు ఉన్నాయి. అవి లేవనెత్తిన వారిపై బీపీ పెంచుకొని విరుచుకుపడటం పరిష్కారం కాదు. భూముల సమీకరణతో సహా మొత్తం అమరావతి వివరాలను పబ్లిక్ఆడిట్ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. శ్వేత పత్రం కావాలని అడగాలి. ఇది బాధ్యతాయుతమైన మీడియా స్థానాల్లో, రాజకీయ పదవుల్లో ఉన్నవారు చేయవలసిన పని. ఎన్నికలకు ముందు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన బాబు, దానికోసం ఇప్పటికే 47 వేల కోట్లు అప్పుఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస బాధ్యత. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘శాంతి’కి గ్రహణం
ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు. ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్‌తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే. ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్‌లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్‌లాండ్‌తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది. కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది. నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్‌ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్‌లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్‌లాండ్‌లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
విద్వేష భాషపై పంజా!
దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్‌లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్ఎస్లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి. ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్‌ను పొట్టనబెట్టుకున్నారు. భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది. కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది. మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్‌కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి. హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ. వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం. -
తెగిపడుతున్న జీవితాలు
జన జీవితాల పెనుహననం యథేచ్ఛగా సాగిపోతున్నది. భద్రం అనుకున్న బతుకులకు సైతం భరోసా లేని పీడకాలం క్రీడిస్తున్నది. కంచే చేను మేస్తున్నది. కాపాడవలసిన వ్యవస్థలే కబళిస్తున్నాయి. విజయవాడలోని భవానీపురం బాధితుల ఆక్రోశం టీవీలో ప్రసారమైంది కనుక లోకం దృష్టికి వచ్చింది. అయినా న్యాయం జరగలేదు. జనారణ్యంలో ఇంకా వారు రోదిస్తూనే ఉన్నారు. అసలు లోకం దృష్టికే రాని సైలెంట్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో... ఎన్నెన్నో! భవానీ పురంలో 42 మధ్యతరగతి కుటుంబాలు వారి కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని చాలా కాలంగా నివసిస్తున్నారు. కొందరైతే పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతర గతి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అంటే తమ జీవిత కాలాన్ని ధార పోయడమే! కోరికలకు పగ్గాలు వేసి, కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెడితే దశాబ్దాల తర్వాత ఆ ఇల్లు సొంతమవుతుంది.అటువంటి 42 కుటుంబాల లైఫ్ టైం అఛీవ్‌మెంట్‌ను తెల్లారే సరికల్లా కూల్చి పడేశారు. ఈ రాక్షసకాండకు రక్షకభటులే రక్షణగా నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసైగలతోనే పిశాచ గణాలు నర్తించాయనడానికి ఇదే నిదర్శనం. ఇదేమీ రహస్యం కాదు, ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ ‘పై వాడి’కెవడికో ఈ భూమిపై మనసైందట! ఘోరంగా మరులు గొన్నాడట! ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడి ఆజ్ఞాపన మరి! సైరంధ్రి తన సరసకు రావాలని కీచకుడు వేసిన శాసనం. తప్పదు కదా! ఆ పైవాడి ఆదేశాన్ని భృత్యులు శిరసావహించారు. వారి ‘కర్తవ్య పరాయణత’ ఎంతటిదంటే, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని బాధితులు నెత్తీ నోరూ బాదుకున్నా అక్కడికి వచ్చిన అధికార ఖాకీ గులాములు ఖాతరు చేయలేదు.భవానీపురం బాధితులు ఇళ్ళు కట్టుకున్న స్థలం గత మూడు, నాలుగు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నదట! కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ వివాదం సంగతి బాధితులకు తెలియదు. భూ యజమానికి డబ్బులు చెల్లించి, ఈ 42 మంది ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. కార్పొరేషన్‌కు డబ్బులు కట్టారు. అనుమతులు వచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చాయి. కరెంటు, నీటి కనెక్షన్లు వచ్చాయి. బాధితులకు స్థలాలను అమ్మడానికి పూర్వం సుమారు 40 ఏళ్ల కింద భూ యజమాని ఒక హౌసింగ్ సొసైటీకి ఒప్పందం చేశారట! కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ, సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులో వివాదం నడిపిస్తూ, ప్రస్తుత బాధితులకు ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నాడు. ఈ మధ్యనే కోర్టు తీర్పు సొసైటీకి అను కూలంగా వచ్చింది. ఈ సొసైటీ వారు భూ యజమానికి చెల్లించిన మొత్తం ఒక లక్ష 70 వేల రూపాయలు. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లని చెబుతున్నారు.కోర్టు తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందలేదన్న మిషతో 200 మంది పోలీసుల సమక్షంలో గంటల వ్యవధిలోనే 42 గృహాలను నేలమట్టం చేశారు. ఆ బాధితులు ఎవరూ అక్రమంగా ఇళ్లను నిర్మించుకోలేదు. కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని, ఫీజులు చెల్లించి, అన్ని అనుమతులతో బ్యాంకులు ఇచ్చిన రుణాలతో ఇళ్లు నిర్మించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు వీధిన పడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ, పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేసి కూల్చివేతకు దన్నుగా నిలబడిందంటేనే ఈ కథలో ఇంకో మతలబు ఏదో ఉన్నదని అర్థం. స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్న ముఖ్యమంత్రి పాలనలో 42 సక్రమ నివాసాలను కూల్చివేయడాన్ని ఏమనుకోవాలి? విజయవాడ నగరంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి. వాటి జోలికి ఈ ప్రభుత్వం వెళ్లగలదా? వెళ్లలేదు! ఎందుకంటే, సంపన్నులు, వ్యాపారవేత్తల రక్షణ, పేదలూ–మధ్యతరగతి ప్రజల భక్షణ ఈ ప్రభుత్వ పాలసీ కనుక!విశాఖలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకొనే పదివేల బడ్డీ దుకాణాలను తొలగించారు. వీరిలో చాలామంది మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫీజు చెల్లించి, అనుమతి పత్రాలు తీసుకున్నవారే! ఎటువంటి హెచ్చరికలూ, నోటీసులూ లేకుండా ఎకాయెకిన పిడుగుపడ్డట్టుగా పదివేల బడ్డీలను తొలగించారు. పదివేల కుటుంబాల జీవనోపాధిని తెగనరికారు. అంటే 30 నుంచి 40 వేల మంది ప్రజలకు విశాఖ వీధుల్లో శిరచ్ఛేదన చేశారనుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 వేల మంది కార్మికుల జీవితాలపై ఇప్పటికే కత్తి వేలాడుతున్నది. విశాఖ ఉక్కును ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన ఎకసెక్కపు మాటలు గమనిస్తే – దాన్నేం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌కు వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో కోటి మందికి పైగా ఉన్న రైతులు, కూలీల బాధామయ గాథలు వర్ణనాతీతం. రైతుకు ప్రభుత్వం చేసే పెట్టుబడి, బీమా సాయాల సంగతి దేవుడెరుగు. పండించిన పంటను అమ్మబోతే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని దైన్య పరిస్థితులు వెక్కిరించాయి. ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు, క్వింటాల్‌కు కనీసం రెండున్నర వేలన్నా వస్తేనే పెట్టిన ఖర్చులు వస్తాయంటున్నారు. ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 1,200 చొప్పున ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అరటి రైతుల అవస్థలు, ఆక్వా రంగం ఆవేదన, మామిడి రైతు వెతలు, ధాన్యం రైతు కళ్ళల్లోదైన్యం.. వంటి కథనాలు ఇప్పటికే రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.జగన్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం వల్ల, ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకొని, ఈ స్థాయిలో ధరలు పతనం కాకుండా కాపాడగలిగింది. ఏడాదిన్నర కాలంలో రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన సర్కార్, ఐదారు వేల కోట్లను ధరల కంట్రోల్ కోసం వెచ్చించలేదా? వెచ్చించ లేకపోవడం అనేది సమస్య కాదు... వ్యవసాయ రంగం, రైతు క్షేమం బాబు సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో లేవు. అందువల్లనే ఈ సంక్షోభం! కోటి కుటుంబాల్లో ఆందోళన. జీవచ్ఛవాలుగా మారుతున్న పేద రైతు కూలీలు!! పేద సమూహాల జీవన విధ్వంసకాండ ఏ ఒక్క రంగానికో, రెండు రంగాలకో పరిమితం కాలేదు. ఇది సర్వవ్యాపితం. ఉపాధి హామీ పథకంలో ఊరట పొందుతున్న వారిలో 18 లక్షల మంది జాబ్ కార్డులను రాష్ట్ర సర్కారు తొలగించింది.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 1,500 చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు మూతపడి 20 వేల మంది ఉపాధి కోల్పోయారని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల సంక్షేమం, ఆ సమూహాల అభివృద్ధి అనే రాజ్యాంగ బాధ్యతలను గాలికొది లేసి, సంపన్న వర్గాలకు వనరులన్నీ ధారపోసే ప్రైవేటీకరణ క్రతువు నిరాటంకంగా సాగిపోతున్నది. పేదలు, మధ్యతరగతి సమూహాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యా విప్లవాన్ని కూటమి సర్కార్ నీరుగార్చింది. పట్టణ ధనిక సమూహాల పిల్లలు కొనుగోలు చేయగలిగే నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా అందజేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఉద్యమంగా ప్రారంభించింది.కూటమి సర్కార్ ఆ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరు గార్చింది. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ఎత్తివేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన తొలగించింది. సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తొలగించింది. స్కూళ్లను కుదించింది. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా మార్చింది. కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో అటు కాలేజీలు, ఇటు విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘వసతి దీవెన’ బకాయిలు పేరుకుపోతున్నాయి. ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మూడున్నర లక్షలు తగ్గింది. వారిలో కొందరిని ప్రైవేట్ స్కూళ్లకు పంపించి ఉండవచ్చు. అత్యధికులు డ్రాప్ అవుట్లుగా మిగిలి ఉంటారు.వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్ పాలనలో విద్యారంగంలో విధ్వంసం జరిగిందనీ, తాము ఇప్పుడు చక్కదిద్దుతున్నామనీ కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారు. జగన్ చేసిన విధ్వంసం ఏమిటో, తాము చేస్తున్న ఉద్ధరణ ఏమిటో మాత్రం ససేమిరా చెప్పరు. వ్యాఖ్యానాలు చేయడమే తప్ప వివరాలు, లెక్కలు చెప్పడం వారి నిఘంటువులోనే లేదు. ‘పేరెంట్–టీచర్’ మీటింగ్లనేవి జగన్ హయాంలో సలక్షణంగా జరిగాయి. ఇంత హడావిడి లేదు. తల్లితండ్రులకు బదులు వైసీపీ కార్యకర్తలు వచ్చి కుర్చీల్లో కూర్చోలేదు. ఇప్పుడు ఈ తరహా మీటింగ్‌ను తామే కనిపెట్టినట్లు కూటమి చేసుకుంటున్న ప్రచారం వెగటు పుట్టించే విధంగా ఉన్నది. కాకపోతే ‘పేరెంట్–టీచర్ మీటింగ్’లను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం మాత్రం ఇప్పుడే జరుగుతున్నది. ‘మోడల్ అసెంబ్లీ’లను ప్రతి ఏటా అన్ని పెద్ద స్కూళ్లలో కళాశాలలో నిర్వహించే అలవాటు అనాదిగా ఉన్నది. బహుశా చంద్రబాబు పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఉన్నది.వైద్యరంగం గురించి మాట్లాడకపోవడమే మేలు. జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేటీకరించడంతోపాటు, ప్రాంతీయ వైద్య సేవలను కూడా ప్రైవేట్ మార్గం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం కార్యక్రమాల్లో ఒక క్రమం తప్పని విధానం మాత్రం కనిపిస్తున్నది. అదే... కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానం! పెత్తందారీ అనుకూల పాలన. పేదల కోసం ఆయన చేసిన మహత్తర ఆలోచన ‘పీ–4’. ఒక్కో ధనవంతుడి దగ్గర పదిమంది పేదలని తాకట్టు పెట్టడం, అందుకోసం వనరులన్నీ ధనవంతులకు కట్టబెట్టడం. ఈ దుర్మార్గ విధానాన్ని కప్పిపుచ్చడానికి కోటలు దాటే మాటలతో అభివృద్ధి కబుర్లను అర్థం కాని భాషలో చెప్పడం. పరిగెత్తు కొస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చంద్రబాబు పోచికోలు ఉపన్యాసాలు చెప్పడం!చంద్రబాబును ఓ సూపర్ మ్యాన్‌గా, లోకేశ్ బాబును చిన్న సూపర్ మ్యాన్‌గా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఉండనే ఉన్నది. ఇప్పుడు ఈ బాధ్యతలను కూటమి అధికారిక ప్రతినిధులకు కూడా పంచినట్టున్నారు. ఓ జాతీయ మీడియాలో అధికార ప్రతినిధి ఒకరు చిన్న సూపర్ మ్యాన్‌ను ఆకాశానికి ఎత్తబోయి, బొక్క బోర్లా పడ్డారు. ఇండిగో విమానాల నిలిపివేత అంశంపై రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో – విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆర్ణబ్ గోస్వామి ప్రశ్నించారు.అందుకు టీడీపీ ప్రతినిధి బదులిస్తూ లోకేశ్ కూడా ఈ సమస్యను సమీక్షిస్తున్నారని చెప్పాడు. అసలు లోకేశ్ ఎవరు? ఆయనకేం పని?? అంటూ ఆర్ణబ్ గోస్వామి నిలదీయడంతో టీడీపీ ప్రతినిధి నీళ్లు నమలాల్సి వచ్చింది. పాపం ఆ ప్రతినిధి ఏం చేస్తాడు? చిన్నబాబు–పెద్దబాబుల భజన బాధ్యత ఆయనపై కూడా పార్టీ మోపినట్టుంది. మీడియా సామ్రాజ్యంలో అత్యధిక భాగాన్ని టీడీపీ కూటమి ఆక్రమించు కుంటున్న నేపథ్యంలో, అవి బాబుల భజనలకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘క్రెడిట్ చోరీ’ కితాబులకు దొంగ సాక్ష్యాలు చెప్పవచ్చు. కానీ, కూలిపోతున్న కోట్లాది జీవితాలను, దిగజారుతున్న జీవన ప్రమాణాలను దాచడం సాధ్యం కాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన జీవితాన్ని నానాటికీ కోల్పోతున్నారు. జీవచ్ఛవాల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
వెనక్కి తగ్గిన ‘సాథీ’!
ఉద్దేశాలు మంచివైనప్పుడు దాపరికాలు అవసరం లేదు. జనానికి మేలు చేయటమే ధ్యేయమైనప్పుడు చాటుమాటు చర్యలు సరికాదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ మూణ్ణెల్లలో ఫోన్లలో ఉండితీరాలంటూ కేంద్రం మొబైల్ ఉత్పత్తిదారులకు మొన్న శుక్రవారం చడీచప్పుడూ లేకుండా ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదం కావటం ఇందువల్లే. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలకు జడిసి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న, దిగుమతవుతున్న ఫోన్లకు వర్తించటంతోపాటు ఇప్పటికే వినియోగదారుల దగ్గరున్న ఫోన్లకు సాఫ్ట్వేర్ ద్వారా ఈ యాప్‌ను చేరేయాలని టెలికమ్యూనికేషన్ల విభాగం మూడు రోజుల క్రితం మొబైల్ ఉత్పత్తిదారుల్ని ఆదేశించింది. తాజాగా అది తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. పౌరుల శ్రేయస్సును ఆశించి, వారు మోసగాళ్ల బారిన పడకుండా చూసేందుకు ఇది రూపొందించామనీ, ఇందులో గూఢచర్యం లేదా ఫోన్ సంభాషణల పర్యవేక్షణ ఉద్దేశం లేనేలేవనీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంజాయిషీ ఇచ్చారు. దాదాపు కోటిన్నరమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారనీ, 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామనీ, అపహరించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడ కనిపెట్టి 7 లక్షల సెట్లను వాటి యజమానులకు అందించా మనీ సింధియా చెబుతున్నారు. ఈ గణాంకాలతో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ యాప్ ద్వారా ప్రయోజనాలు వెల్లువెత్తుతుంటే ఆ మాటే చెప్పి, మరింతమందిని ప్రోత్స హించవచ్చు. తదుపరి చర్యలు అవసరమనుకుంటే వెల్లడించవచ్చు. ఇదేం లేకుండా రహస్య చర్య ఆంతర్యమేమిటి? దాదాపు నలభయ్యేళ్ల క్రితం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పోస్టల్ బిల్లు’ తీసుకొచ్చి నప్పుడు జరిగిందేమిటో పాలకులు గ్రహించివుంటే వ్యక్తిగత గోప్యతను పౌరులు ఎంత ప్రాణప్రదంగా పరిగణిస్తారో అర్థమై ఉండేది. కనీవినీ ఎరుగని స్థాయిలో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని, తిరుగులేదనుకున్నవేళ పౌరులకు తెలియకుండా వారి ఉత్తరా లను చదివేందుకుద్దేశించిన బిల్లు తీసుకొచ్చి ఆయన అభాసుపాలయ్యారు. జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. జాతీయ భద్రత లేదా సముచిత ప్రజాప్రయోజనం ఉన్నదని ప్రభుత్వం భావిస్తే గోప్యత నియంత్రణకు తగిన చట్టం తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు ప్రజల్లో, పార్లమెంటులో విస్తృత చర్చ జరుగుతుంది. ఇవేమీ లేకుండా ఒక నోటీసు ద్వారా పనికానిచ్చేద్దామనుకోవటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా?అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన దగ్గర డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. క్రయవిక్రయాలు, చెల్లింపులు, వసూళ్లు, ఆన్లైన్ నమోదులు ముమ్మర మయ్యాయి. వాటితోపాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకోవటానికీ, పోగొట్టుకున్న ఫోన్లు పొందేందుకూ ‘సంచార్ సాథీ’ తోడ్పడటం నిజమే కావొచ్చు. కానీ గుప్పెడుమంది నేరగాళ్లను పట్టుకోవడానికి కోట్లాదిమందిని నిఘా నీడలోకి తెస్తామనటం ఏం తర్కం? ఉత్పత్తిదారులకు తప్పనిసరంటూ ఆదేశాలిచ్చి, ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చని చెప్పడంలో మర్మమేమిటి?వ్యక్తిగత గోప్యత విషయంలో పౌరులకు ఎంత పట్టింపు ఉంటుందో నిత్యజీవితంలో చూస్తుంటాం. తల్లిదండ్రులు తమ ఫోన్లు గమనిస్తున్నారంటే పిల్లలకు కోపం. ప్రాణ స్నేహితుడైనా చాటుగా ఫోన్ చూస్తే సహించరు. భార్యాభర్తలే ఒకరి ఫోన్లు మరొకరు చూశారని తెలిస్తే దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ నిఘాకు అవకాశమిచ్చే యాప్‌ను జనం అంగీకరించగలరా? కాల్స్ వినేందుకూ, ఎస్సెమ్మెస్‌లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు వగైరాలన్నిటినీ చూసేందుకూ... ఆఖరికి మనకు తెలియకుండా కెమెరా వినియోగానికి కూడా ఈ యాప్ అవకాశమిస్తుందన్నది నిపుణుల మాట. బహుశా ‘1984’ రచయిత జార్జి ఆర్వెల్ కూడా ఇంత చేటు నిఘా ఊహించలేదు. ఏదేమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది వివేకవంతమైన చర్య. -
ఒడిశా మేల్కొనాలి!
వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్‌గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు. అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించగా, చివరకు పశ్చిమబెంగాల్ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో బెంగాల్ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.ఏడేళ్ల క్రితం గుజరాత్లో ఒక పసిపాపపై బిహార్‌కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు. వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి. -
చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు
తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?ఉత్తుత్తి ప్రయత్నం...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్ మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్‌మంతర్’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్‌మంతర్’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.ఐక్యతే అసలు మంత్రం...కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.జస్టిస్ వి. ఈశ్వరయ్యఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ -
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్‌ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్‌పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్‌కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్‌కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్‌కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్‌లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్‌లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్‌లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
బేలగా మిగిలిన బెలేమ్!
నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని సదస్సులు చివరాఖరికి నిరర్థకంగా మిగులుతాయి. బ్రెజిల్‌లోని బెలేమ్‌లో శనివారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–30 ముచ్చటదే. ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏటా జరిగే కాప్ సదస్సులు ఎప్పుడూ పెద్దగా ఒరగబెట్టింది లేదు. 2015 నాటి ప్యారిస్ ఒడంబడికలో అంగీకరించిన లక్ష్యాలను ఏ దేశం ఏ మేరకు నెరవేర్చిందో చూసి, ఆ విషయంలో చేయాల్సిందేమిటో నిర్దేశించటం దీని ఉద్దేశం. బెలేమ్‌లో ఈసారి అన్ని దేశాల నుంచీ ఆ లక్ష్యాల సాధనకు అవలంబించ బోయే కార్యాచరణేమిటో తెలుసుకోవటమే ధ్యేయమన్నట్టు చెప్పారు. తీరా సాధించింది స్వల్పమే.వాతావరణ మార్పులు, పర్యావరణం అంటేనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కంపరం. ప్యారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ముందే ప్రకటించారు గనుక ఆ దేశం నుంచి ఆశించటానికేం లేదు. ప్రపంచ కాలుష్య కారక దేశాల్లో అగ్రభాగాన ఉన్న అమెరికా ఎగవేత ధోరణి సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాలకు ధైర్యాన్నిచ్చింది. ఇదే అదనని చైనా మందకొడిగా మిగిలిపోయింది. పాశ్చాత్య దేశాల పాత్ర అంతంత మాత్రం. శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంచెలంచెలుగా తగ్గించటానికుద్దేశించిన మార్గనిర్దేశనాన్ని కాప్ ప్రకటించాల్సి ఉండగా చమురు దేశాలు, రష్యా, భారత్ తదితర దేశాలు ఒత్తిళ్లు తెచ్చి దాన్ని వమ్ముచేశాయి.భూగోళం వేడెక్కడానికి దారితీసే కారణాల్లో ప్రధానమైన శిలాజ ఇంధన వాడకంపైనే ఏమీ సాధించలేని స్థితిలో ఐక్యరాజ్యసమితి పరిధి వెలుపల వాటి తగ్గింపు కృషి కొనసాగుతుందనీ, ఇందుకు కొలంబియా, మరో 90 దేశాలూ సమష్టిగా ప్రణాళిక రచనకు పూనుకుంటా యనీ బ్రెజిల్ ప్రతినిధి ప్రకటించారు. వచ్చే ఏప్రిల్‌లో జరిగే ‘సమ్మతి కూటమి’ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ విషయంలో ప్రగతి సాధిస్తుందంటున్నారు. బెలేమ్ సదస్సు గురించి చెప్పుకోదగ్గదల్లా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకు చేసే ఆర్థిక సాయాన్ని మూడు రెట్లు పెంచుతామని సంపన్న దేశాలిచ్చిన హామీ మాత్రమే!అందువల్ల ఏటా 12,000 కోట్ల డాలర్లు సమకూరుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 30,000 కోట్ల డాలర్లకు పెంచితే తప్ప ఏ మూలకూ చాలదని పర్యావరణ సంస్థలంటున్నాయి. అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో సంపన్న దేశాలు అనుసరించే విచ్చలవిడి పోకడల వల్ల కర్బన ఉద్గారాలు వ్యాపించి, వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. సముద్ర మట్టాలు పెరిగి, లేదా కార్చిచ్చులు వ్యాపించి జనావాసాలు నాశనమవుతున్నాయి.పునరావాసం కల్పించటానికి అవసరమైన నిధులు ఆ పేద దేశాల వద్ద లేవు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపడం మాట అటుంచి, తగ్గించటానికి కూడా సంపన్న దేశాలు ముందుకు రావటం లేదు. కాప్–30 సదస్సును బ్రెజిల్ అమెజాన్ అటవీప్రాంతం ముంగిట్లో నిర్వహించటంలో ఉద్దేశం అడవుల నిర్మూలన వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పటం కోసమే! 92 దేశాలు దీన్ని సమర్థించాయి. కానీ ఒక్క దేశం కూడా అడవుల నిర్మూలన నివారణకు తమ వంతు ఏం చేస్తామన్నది చెప్పింది లేదు.వాతావరణ క్షీణత వల్ల మన దేశం సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. సదస్సులో రెండు సంస్థలు సమర్పించిన నివేదికలే ఈ సంగతి చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏటా 0.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు వివరించాయి. నిరుడు ఈ పెరుగుదల 0.65 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని తేలింది. మన దేశంలో ఉత్తరాదిన ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశం తీవ్ర వాతావరణ పరిస్థితులు చవిచూసిందని మరో సంస్థ గణాంక సహితంగా తెల్పింది.వడగాడ్పులు, చలిగాలులు, పిడుగుపాట్లు, పెనుగాలులు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటాలు వగైరాల వల్ల 4,064 మంది మరణించగా, దాదాపు 95 లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది. 99,533 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా కాప్–30 సదస్సు మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయిందంటే అది మానవాళి దురదృష్టమనుకోవాలి. కాప్–30 విఫలం కానీయరాదన్న సంకల్పంతో ప్రకటించిన అరకొర చర్యలు తప్ప బెలేమ్ సాధించిందేమీ లేదు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్‌బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్‌కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్‌కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్‌ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్‌ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
పసిడి రేఖలు విసిరి....
బాఫూ గారికి భయభక్తులతో ఉత్తరం రాసి మనవి చేస్తే భక్త సులభుడైన దేవునికి మల్లే టకాలున బొమ్మ గీసి పంపించేవారు. ‘చంద్ర గారూ... బొమ్మ కావాలండీ’ అనంటే తన సిగ్నేచర్ మందహాసంతో ‘అలాగే’ అని, మనకు కావాల్సిన టైము లోపల కన్నా తాను ఇవ్వాల్సిన టైము లోపు ఇచ్చేసేవారు. హైదరాబాద్ పంజగుట్టలో ఆఫీసు పెట్టుకుని ఉండే కరుణాకర్ ధోరణి పూర్తిగా వేరే. కథో, నవలో, సీరియల్ భాగమో ఇప్పుడు ఇస్తే మధ్యాహ్నానికి బొమ్మ రెడీ. వెళ్లి తీసుకోవడమే.బాలీ గారు, గోపీ గారు, శీలా వీర్రాజు గారు పాత కాపులుగా ఉండి తమ రెగ్యులర్ పద్దుల్లో కొత్త బొమ్మలను జమ చేసుకుంటూ వెళ్లేవారు. ఇక ఆర్టిస్ట్ మోహన్ స్కూలు వేరే. ఈ క్షణమే కుంభవృష్టి కురవనూ వచ్చు... లేదా ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూసేలా చేయనూ వచ్చు. మోహన్ బొమ్మలు అనూహ్య కటాక్షానికి తార్కాణాలు. ఇడ్లీ కంటే చట్నీ బాగున్నట్టు ఈలోపు మోహన్‌తో కంపెనీయే ఎక్కువ మందికి ఇష్టంగా ఉండేది. కవులకు, రచయితలకు తెలుగునాట రెమ్యూనరేషన్ మీద ఏ కోశానా ఆశ లేదు.ఎందుకంటే అది ఇవ్వరు. ఇచ్చినా అల్లరి చేసే పిల్లాడికి బెల్లమ్ముక్క పెట్టినట్టే. కాని వారు ఆశించే, ఆనందించే సంగతొకటి ఉంది. తాము రాసిన కవితకో, కథకో మెరుగైన దృశ్యరూపం ఇచ్చే చిత్రాన్ని చూడగలగడం. ఒక ఉత్తమమైన కవి, రచయిత తాను రాసింది పాఠకులకు అర్థమై స్పందన పొందేలోపు తమ రచనలోని అంతరార్థాన్ని ఎక్సె›్టండ్ చేస్తూ చిత్రకారుడు బొమ్మ గీస్తే, ఆ బొమ్మతో రచన అచ్చయితే ఇక ఆ పూటకు భోజనం చేయరు.అదే వారి సంబరపు విందు. అద్దో అలాంటి చిత్రకారులు గత కాలంలో ఎక్కువ శాతం ఉండేవారు. సాహిత్యం తెలిసి, రేఖలు తెలిసి, సాహితీ రేఖలు గీయగలిగిన వారు. పత్రికలు తెరిచినా, పుస్తకాల ముఖచిత్రాలు చూసినా ఆయా రచనల వైపు పాఠకులను ఆకర్షించేలా ఎంతో మేలిమి చిత్రాలను తీర్చిదిద్దేవారు. సినిమాలకు పోస్టర్ మల్లే రచనలకు వీరి బొమ్మ.ఆర్థిక ఇబ్బందులుండి, ప్రచురణకు సాంకేతిక సహాయం అంతగా లేని రోజుల్లో కవులూ, రచయితలకు చిత్రకారుల బొమ్మలే పెద్ద ఊరట. ఫలానా చిత్రకారుడు నా కథకు బొమ్మ వేశాడు తెలుసా అని రచయిత గర్వంగా చెప్పుకుంటే, ఫలానా రచయిత కథకు నేను బొమ్మ వేశాను తెలుసా అని చిత్రకారుడు గొప్పగా చెప్పుకునే సందర్భాలు ఉండేవి. పరస్పర ప్రోత్సాహకరంగా తెలుగు సాహిత్యం వర్ధిల్లిన కాలం అది. ఇప్పుడు కవులకు, రచయితలకు పుస్తకాలు ప్రచురించడం అతి సులువు.పిండి కొద్ది రొట్టె అన్నట్టు డబ్బు కొద్ది కాపీలు ఇచ్చే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ వచ్చాక పూర్తి ఆటే మారిపోయింది. వారానికి పది పుస్తకాలు అచ్చేయ్యే చోట వంద పుస్తకాలు అచ్చవుతున్నాయి. ఒకటీ అరా పబ్లిషర్ల సంఖ్య నుంచి ప్రతి నవ కవీ, యువ రచయితా పబ్లిషర్‌గా మారే సన్నివేశం అరుదెంచింది. తెలుగు పబ్లికేషన్ రంగం ఇంత కళగా ఎప్పుడూ లేదు. కాకుంటే ఒకటే వెలితి. పసిడి రేఖలు విసిరి కనుమరుగైపోయిన ఆ చిత్రకారులు ఎక్కడా? ఉన్న కొద్దిమంది చాలా బిజీ.డిసెంబర్ నుంచి బుక్ ఫెయిర్ల సీజన్. ఎందరో సాహితీకారులు, పబ్లిషర్లు వందల కొలది పుస్తకాలను అచ్చెత్తించే పనిలో ఉన్నారు. అయితే తమ పుస్తకాల్లోని సారాన్ని అర్థం చేసుకుని అర్థవంతమైన బొమ్మ ఇచ్చే చిత్రకారుల కొరతతో బాధ పడుతున్నారు. తోట తరణి అంటారు– సెట్‌ను గీసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు, చేసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు అని. కేవలం బొమ్మ వేసే వారికి డిజైన్ పరిమితి... డిజైన్ చేయగలిగే వారికి బొమ్మ పరిమితి... ఈ రెండూ వచ్చిన వారికి సమయ పరిమితి విపరీతంగా ఉంది. దాంతో ఈ సీజన్ అంతా కృత్రిమమైన ఏఐ బొమ్మలతో తెలుగు పుస్తకాలు కిటకిటలాడబోతున్నాయి. మల్లెలూ, కాగడాపూలూ ఒకలాగే ఉన్నా రెండూ ఒకటి కాబోవు.మంచి రచనకు మేలిమి చిత్రకారుడి కుంచెపోటు తెచ్చే బలం కావాలి. సముద్రం ఉన్న చోట లైట్‌హౌస్ వెలగాలి. నేడు మన వద్ద లిటరేచర్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ బాగా జరుగుతున్నాయి. కాని జరగాల్సింది ‘ఇలస్ట్రేటర్స్ ఫెస్టివల్’. కొత్తతరం రేఖాచిత్రకారుల కోసం ఏం చేయవచ్చో ఆలోచించాలి. బాపూ రమణీయం వలే తెలుగు రాత, తెలుగు రేఖ జమిలిగా వర్ధిల్లాలి. -
అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!
చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృతరూపం దాలుస్తున్నది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను గమనించండి. ఎటు చూస్తే అటు చీకటి. వికసిత జీవితాల విధ్వంసం. రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలైన దృశ్యం కనిపిస్తుంది.అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు పది పన్నెండు వేలన్నా వస్తేనే... పెట్టిన ఖర్చు గిట్టుబాటవుతుంది. వెయ్యి రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురించింది. జగన్ హయాంలో ఇరవై నుంచి ముప్ఫై వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఢిల్లీ నగరం దాకా పరుగెత్తిన ప్రత్యేక అరటి రైళ్ల దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలార్జించిన నాటి వైభవం ఇంకా వారి మనోఫలకాల్లో మెరుస్తూనే ఉన్నది. ఇప్పుడెందుకీ దుర్గతి?పత్తి పంటనూ దున్నేస్తున్నారు. పలనాటి రైతు విలవిల్లాడు తున్నాడు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల జమిలి దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుపాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ కళ్లప్పగించి చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవి కెక్కడం లేదు. ఈ సీజన్లో అన్ని పంటల పరిస్థితీ అంతే. గిట్టుబాటు ధరల్లేక ఉల్లి పంటను దున్నేసిన వార్తలను చదవాల్సి వచ్చింది. గుండెజారిన ఉల్లి రైతుల ఆత్మహత్యలు కూడా రిపోర్టయ్యాయి.టమాటా రైతుల కన్నీటి పాట ఈ యేడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉన్నది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయరంగాన్ని వదిలేసింది. ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్లో సర్కార్ జోక్యం వంటి మాటలే ఇప్పుడు వినిపించడం లేదు. తుపానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరానికి అత్తెసరుతో సరిపెట్టారు.వ్యవసాయ రంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆయనేం ఖాళీగా లేరు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ తాను వ్యవసాయరంగం గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నానని కడప జిల్లాలో రైతులతో జరిపిన ముఖా ముఖిలో ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలులు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో, ఆ గాలుల క్వాలిటీ ఏమిటో, అందులో ఏమేమి తెగుళ్లున్నాయో, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో, ఏ పంటల మీద దాడి చేస్తాయో అనే విషయాన్ని తాను ఎనలైజ్ చేస్తున్నట్టు రైతులకు అభయమిచ్చారు.ఆ తెగుళ్ల సంగతి, పురుగుల సంగతి తెలిస్తే రైతుకు ఏ భయం ఉండదని చెప్పారు. అంతేగాక భూమిలో తేమ ఎంత ఉంది, ఎండ ఎంత తగులుతుంది అనే విషయాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ రకమైన టెక్నాలజీ డెవలప్మెంట్పై తాను దృష్టి పెట్టినందువల్ల పంటల బీమా గురించి, మార్కెట్ జోక్యం గురించి, పెట్టుబడి సాయం గురించి, ఇన్పుట్ సబ్సిడీ వంటి చర్యల గురించి అడగొద్దనేది ఆయన ఉద్దేశం కాబోలు! రాష్ట్ర రైతాంగంతోపాటు భూవసతి లేని వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం కష్టాల కొలిమిలోకి నెట్టింది.ఈ–కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దు చేసింది. ఇది ఆ పథకం నిబంధనలకు విరుద్ధం. గ్రామసభలో నిర్ధారణ చేసుకోకుండా జాబ్ కార్డులను రద్దు చేయడానికి వీల్లేదు. అయినా ఎడాపెడా రద్దు చేస్తున్నారు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా, ఇటు ఉపాధి హామీ ఆసరా లభించకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఒక విస్తారమైన చీప్ లేబర్ మార్కెట్‌ను రైతు–కూలీల్లో సృష్టించే కుతంత్రంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది.ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు పేదలకు అసైన్ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరా ఆర్డినెన్స్‌ను జారీచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన అసైనీలకు ఉపయోగపడే విధంగా ఇరవయ్యేళ్ల తర్వాత వారు ఆ భూముల్ని అవసరార్థం అమ్ము కునే విధంగా జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ఇచ్చింది. దీనివల్ల తొమ్మిదిన్నర లక్షలమంది అసైనీలకు లబ్ధి జరిగింది. పేద రైతులకు లబ్ధి జరిగితే పెత్తందారీ సర్కార్‌కు నిద్రపట్టదు కదా! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం దాని పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చీరావడంతోనే యెల్లో మీడియా బాకా ద్వారా ఫ్రీహోల్డ్ స్కీమ్‌పై దుష్ప్రచారాన్ని ఊదరగొట్టి, ఆ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు.ప్రభుత్వ రంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగేసి ప్రైవేటీకరించ డానికి ఇప్పటికే బాబు సర్కార్ తెగబడింది. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యాక మాట మార్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగించినా నియంత్రణ మాత్రం సర్కారుకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అదెలా సాధ్యమో తెలియదు. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీ కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సేవలు ఏవీ ఉచితం కాదని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు.ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్ అడియాసలు చేసింది. అక్కడా ప్రైవేటీకరణ మంత్రాన్నే జపిస్తున్నది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే! ఇదీ బాబు విధానం.విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేమిటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగుగా మారిందని ఆయనీ మధ్యనే ఈసడించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైన సొంత గనుల కేటాయింపు విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు మాత్రం మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేందుకు రాయ బారాలు నడుపుతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టును దెబ్బ తీసే విధంగా ఆ స్టీల్ ఫ్యాక్టరీ సొంత రేవును కూడా నిర్మించుకుంటోంది. మిట్టల్ స్టీల్ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటి మెంట్‌తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బ తీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తున్నది.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ‘పీ–4’ అనే పేరుతో ప్రైవేటీకరించే విపరీత చర్యకు కూటమి సర్కార్ తెగబడింది. ఈ దేశ సంపదలో పేద ప్రజలు హక్కుదారులు కాదు, కేవలం యాచకులు మాత్రమేననేది ఈ ‘పీ–4’ పథకంలో అంతర్లీనంగా ప్రవహించే ఫిలాసఫీ. ఇది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన. బలహీన వర్గాల మహిళల ఆత్మ గౌరవాన్ని నిల బెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయిం చింది జగన్ ప్రభుత్వం. అందులో తొమ్మిది లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి చంద్రబాబు సర్కార్ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకొని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఈ పదిహేడు మాసాల పాలనలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా మూడు లక్షల ఇళ్లను పూర్తిచేయడం నిజంగా ప్రపంచ వింతే! అంతటితో ఆగ లేదు. ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నామని, అందులో మూడు లక్షలు ఇప్పటికే అప్పగించామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? జగన్ సర్కార్ భూమిని సేకరించి ప్లాట్లు వేసి, పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కావా?రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పదిహేడు మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది జాతీయ రికార్డు. ఒకపక్క విద్యా, వైద్య రంగాలతో సహా సమస్తాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజల కిచ్చిన హామీలను ఎగవేస్తున్న సర్కార్ ఈ సొమ్మునంతా ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడమంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తున్నట్టు! ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు! పోలీసింగ్‌పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్ గవర్నెన్స్ మన పోలీసింగ్‌ను పక్కదారి పట్టించింది. ఉద్యోగాల కల్పనలో కూడా ఏపీ అధమ స్థానంలోనే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. ఇవేమీ యెల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతున్నది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉండి చేసిన అవినీతిపై విచారణ జరిపి పలు ఛార్జిషీట్లు వేశారు. స్కిల్ కుంభకోణంలో జైలుకు కూడా ఆయన వెళ్లి వచ్చారు.ఇప్పుడా కేసుల నుంచి బయటపడేందుకు బాబు సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వ్యవహారం నుంచి కూడా దృష్టి మళ్లించాలి. కనుక జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుతో, ‘సిట్’ చెప్పిందన్న సాకుతో యెల్లో మీడియా నిండా అవే వార్తలు. పెట్టుబడులు తరలివస్తున్నాయంటూ పోచికోలు ప్రచారం. అమరావతిలో అంతస్థులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్యస్థితిని దాచి పెట్టగలరు! విశాఖ సదస్సు ద్వారా పది లక్షల కోట్లు వస్తున్నా యని క్రితంసారి ప్రకటించుకున్నారు.కానీ పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్న నిజాన్ని దాచగలిగారా? ఇంకెంత కాలం జగన్ వ్యక్తిత్వ హననంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు! జగన్ హైదరాబాదు కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలాకాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు కనుక పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. యెల్లో మీడియాకు, కూటమి సర్కార్‌కు మింగుడుపడినా, పడక పోయినా జాతీయ స్థాయిలోనే జగన్ అతిపెద్ద పొలిటికల్ క్రౌడ్ పుల్లర్. కోర్టు హాజరుపై సైతం యెల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషాన్ని ఎగజిమ్మాయి.ఒక ఎల్లో విశ్లేషకు డైతే ఏకంగా హిడ్మా మాదిరిగా జగన్‌ను కూడా ఎన్కౌంటర్ చేయాలని ఊగిపోయాడు. కొత్తగా చేయడమేమిటి? పదహా రేళ్లుగా ఆయన వ్యక్తిత్వంపై ఎన్కౌంటర్లు చేస్తూనే ఉన్నారు కదా! హిడ్మా ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడట! రాజ్యాంగాన్ని వ్యతి రేకించాడట! జగన్ కూడా అదే పని చేశాడట. అదీ ఆ విశ్లేషకుని రీజనింగ్. సరే, హిడ్మా చనిపోతే వందలాది గిరిజన గూడేలు గుండె పగిలేలా ఎందుకు రోదించాయో, దండకారణ్యం కడుపు కోతతో ఎందుకు కుదేలైందో కాలమే సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని అడు గడుగునా అమలుచేసిన జగన్ రాజ్యాంగ వ్యతిరేకా? ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తా? తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మారిన విలువలు
కాస్త ఆలస్యం కావొచ్చు గానీ... పుష్కలంగా డబ్బూ, కండబలం ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా మర్యాదస్తుడిగా మారడం కష్టమేం కాదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు బుధవారం అమెరికాలో లభించిన స్వాగత సత్కారాలు చూస్తే తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం ఆయన అంతర్జాతీయంగా అంటరానివాడు. సల్మాన్‌ను ఆహ్వానించటానికి అమెరికా జంకింది. సౌదీలో జరిగే పెట్టుబడుల సదస్సును పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. కానీ ఇప్పుడంతా మారింది.సల్మాన్‌కు 21 శతఘ్నుల వందనం, అశ్వారూఢులైన నావికాదళ పటాలం మేళతాళాలు, యుద్ధ విమానాల పరేడ్... ఒకటేమిటి ఆయన రాకే పెద్ద వేడుకన్నట్టు అధికార వ్యవస్థ సమస్తం పులకించిపోయింది. అమెరికాలో సల్మాన్ షాపింగ్ తక్కువేం లేదు మరి. దొంగచాటుగా వెళ్లి శత్రు స్థావరంపై దాడిచేయగలిగిన ఎఫ్–35 యుద్ధ విమానాలు, అణుశక్తి సాంకేతికత, చిప్‌లు, అరుదైన ఖనిజాల వేటలో సహకారం వగైరాలన్నీ అందులో ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల డాలర్లు. అదిగాక ట్రంప్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో వందల కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అండదండలందించేందుకు సౌదీ ఇప్పటికే అంగీకరించింది.వీటన్నిటి పర్యవసానంగానే ఈ మర్యాదలు! నిజానికి ఆయనతో మళ్లీ సాన్నిహిత్యం కావాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రయత్నించకపోలేదు. జెడ్డాలో 2022లో పర్యటించినప్పుడు ఆయన్ను ‘భవిష్యత్తు రాజు’గా కీర్తించారు. కానీ ప్రజాభిప్రాయానికి జడిసి అమెరికా ఆహ్వానించటానికి సందేహించారు. బిన్ సల్మాన్ దుష్కృత్యం సాధారణమైనది కాదు. రాజ కుటుంబానికి సన్నిహితు డిగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టుగా ఉన్న జమాల్ ఖషోగ్గీ తనపై తరచు చేసే విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. సల్మాన్ బతకనీయడని తెలిసి ఖషోగ్గీ అమెరికా వెళ్లి పోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి అమెరికాలో దాఖలు చేయాల్సిన పత్రాల కోసం సౌదీ వెళ్లాల్సివున్నా, ముప్పు తప్పదన్న ఉద్దేశంతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లారు. తీరా సౌదీ నుంచి వచ్చిన 15 మంది హంతక ముఠా అంతకుముందే అక్కడ మాటువేసి ఆయన్ను మట్టుబెట్టింది.మామూలుగా కాదు... మనిషిని హతమార్చి, ముక్కలుగా కోసి ఎముకలన్నీ యాసిడ్‌లో కరిగిపోయేలా చేశారు. సల్మాన్ ఆదేశాలతోనే ఆ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లోనే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తేల్చింది. కాన్సులేట్ వద్దగల సీసీ కెమెరాల్లో ఖషోగ్గీకి ముందే 15 మంది సభ్యులు లోపలికెళ్లటం, కొన్ని గంటల తర్వాత వారంతా నిష్క్రమించటం రికార్డయింది. అంత ర్జాతీయ పాత్రికేయుల్లో ప్రతిష్ఠగల ఖషోగ్గీ హత్య అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. అందుకే తన తొలి ఏలుబడిలో సల్మాన్‌ను ట్రంప్ దూరం పెట్టారు. హత్యలో ఆయన ప్రమేయం రుజువైందని వ్యాఖ్యానించారు.కానీ ఇన్నేళ్లు గడిచాక ట్రంప్ తీరు మారింది. ‘మీపై సీఐఏ నివేదిక గురించి ఏమంటార’ని ఏబీసీ చానెల్ మహిళా ప్రతినిధి ఒకరు సల్మాన్‌ను అడిగేసరికి ట్రంప్ మండి పడ్డారు. ‘అదంతా ఏం లేదు... ఖషోగ్గీ వివాదాస్పదుడు. ఈ ప్రశ్న వేసి అతిథిని అవమానిస్తావా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏబీసీ ‘ఫేక్ న్యూస్’ అంటూ దూషించారు. ఆయనతో పోలిస్తే సల్మాన్ నాగరికంగా మాట్లాడారు. తన ప్రమేయం లేదని వివరించారు. నిజానికి సౌదీ పెట్టుబడుల రాక అంత సులభం కాదు. ఇప్పటికే ఎఫ్–35లను వినియోగిస్తున్న ఇజ్రాయెల్ అభ్యంతరాలను కాదని సౌదీకి ఇవ్వటం అసాధ్యం. పైగా ఆ విమానాల కోసం 20 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా అమెరికన్ కాంగ్రెస్ వాటిని ఖరారు చేయలేదు. అణుశక్తి సాంకేతికత కూడా అంతే. సౌదీకి ఎఫ్–35లిస్తే వాటి సాంకేతికత చైనాకు చేరే ప్రమాదం ఉన్నదని ఇటీవలే అమెరికా రక్షణ గూఢచార సంస్థ హెచ్చరించింది.ఇన్ని అవరోధాలున్న ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చిపడతాయని ట్రంప్ జనాన్ని మభ్యపెడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా ట్రంప్ తాను ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాననుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, లోపాయికారీ ప్రయోజనాలే తప్ప విలువలు ఎవరికీ అక్కర్లేదని వర్తమాన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. సల్మాన్ అమెరికా పర్యటన దాన్నే మరోసారి రుజువు చేసింది. -
మళ్లీ మొదటికి!
రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ తలెత్తే వివాదాల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అయింది. శాసనసభలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుకోవటాన్ని తప్పుబడుతూ మొన్న ఏప్రిల్‌లో తమ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును గురువారం సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రపతికీ, గవర్నర్లకూ గడువు విధించటం చెల్లదని అభిప్రాయపడింది.ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల రూపంలో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన మీదట రాజ్యాంగ ధర్మాసనం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే సందర్భంగా ఆచరణలో తలెత్తే సమస్యల విషయంలో ఏ పక్షానికీ గెలుపోట ములుండవు. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఆచరణ కనబరచకపోయినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అలా చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం కొంత నిరాశ కలిగిస్తుంది.గవర్నర్లకూ, ప్రభుత్వాలకూ తలెత్తే వివాదాలు జటిలమైనవి. ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన పక్షం తన వాగ్దానాలు నెరవేర్చటం కోసం లేదా ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులు తెస్తాయి. చట్టసభల్లో అవి ఆమోదం పొందు తాయి. తీరా గవర్నర్ల దగ్గర నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. మరి ప్రజలిచ్చిన రాజకీయాధికారం ఏమై పోవాలి? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ లేదా కూటమి పాలిస్తుంటే ఇలాంటి సమస్య తలెత్తదు. భిన్నమైన పరిస్థితులున్నప్పుడే ఇబ్బందులేర్పడుతున్నాయి.కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీయే ఉన్నా ఇదే ధోరణి. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ సంగతిని గమనించింది. బిల్లుల్ని పరిశీలించటంలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే వ్యవధికి ఒక స్థాయి ‘స్థితిస్థాపకత’ ఉంటుందని అంగీకరి స్తూనే దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పడం కొంతవరకూ రాష్ట్రాలకు ఊరట.రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ద్విసభ్య ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పుతో దీనికి సంబంధం లేదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం గమనార్హం. గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టి ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభల్ని నిరర్థకంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్లకు హితవు చెప్పింది. కానీ మారిందేమీ లేదు.అందుకే కావొచ్చు... ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుంటూ బిల్లు ఆమోదానికి గవర్నర్లకూ, రాష్ట్రపతికీ మూడు నెలల గడువు విధించి, ఆ తర్వాత ఆమోదం పొందినట్టే భావించాలన్నది. ఇది సరి కాదని, ఇలా చేయటమంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలను చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.అదే సమయంలో గవర్నర్లు బిల్లులపై ఏదో ఒకటి చెప్పటానికి ‘హేతుబద్ధమైన వ్యవధి’కి మించి తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం చెప్పటం రాష్ట్రాలకు కొంత వరకూ ఉపశమనం. రాష్ట్రపతికిచ్చిన ప్రత్యుత్తరంలో ‘హేతుబద్ధమైన వ్యవధి’ అనడం తప్ప, దాన్ని ఎలా నిర్ధారించాలన్నది చెప్పలేదు. అదే జరిగుంటే గవర్నర్ల పెత్తనానికి కాస్తయినా అడ్డుకట్ట పడేది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో మౌనంగా ఉండి పోవటం వల్ల ఎప్పటిలాగే బిల్లు ఆగిపోయినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదు.రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం తన ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. ఆమోదించటం, రాష్ట్రపతి పరిశీలనకు పంపటం, వెనక్కి తిప్పిపంపటం. ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలన్నది గవర్నర్‌కుండే విచక్షణాధికారం. కానీ ఇదంతా సవ్యంగా సాగకపోవటమే సమస్య. గవర్నర్ల నియామకాలు రాజకీయపరమైనవి అయినప్పుడు వారి నిర్ణయాలపైనా ఆ ప్రభావం పడుతుంది. చట్టం చేయటమే ఇందుకు పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం అన్నది. కానీ అది జరిగే పనేనా?! -
నియామకాల వైకుంఠపాళీ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) గ్రూప్–2 పోస్టులకు 2015–16లో చేసిన ఎంపికలు రద్దయ్యాయి. తప్పుడు మూల్యాంకనంతో చేసిన ఎంపికలు చెల్లవని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జీవితంలో నిరుద్యోగ పర్వం సంక్లిష్టమైనది. ఎవరో కొందరు అదృష్టవంతులకు తప్ప దాన్నుంచి తప్పించుకోవటం సులభమేం కాదు. ఎలాగోలా దాటామనుకున్నంతలోనే, ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోగానే అవకతవకలో, అవినీతో బయటపడి నియామకాలు రద్దుకావటం ఇటీవలి ధోరణి.పశ్చిమ బెంగాల్లో 2016లో పాఠశాల సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో దాదాపు 26,000 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. తొమ్మిదేళ్లపాటు ఉపాధ్యాయులుగా పనిచేసినవారు తిరిగి నిరుద్యోగులు కావటం ఎంత వైపరీత్యం! తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తమనెలా ఇళ్లకు పంపుతారని కొందరు చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సక్రమంగా ఎంపికైనవారు కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని వెసులుబాటిచ్చింది.అంటే అందరికందరూ నిరుద్యో గులై మళ్లీ తమ సత్తా చాటుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు కొంతమేర నయం. గ్రూప్–2 పరీక్ష రద్దు కాలేదు. పునర్మూల్యాంకనం మాత్రమే జరుపుతారు. అయితే ఇన్నాళ్లూ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి మళ్లీ ఫలితాలు వెలువడేవరకూ ఏం జరుగు తుందోనన్న గుబులు వెన్నాడుతుంది. అటు అప్పట్లో అవకాశాలు చేజారిన వారిలో ఆశలు చిగురిస్తాయి. నియామక బాధ్యతలు చూసే సంస్థలు అత్యంత జాగరూకతతో మెలగకపోతే, నిబంధనలను పాటించకపోతే యువతకు ఇలాంటి కష్టాలు తప్పవు.1,032 పోస్టులకు 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో సిఫార్సులు చేసింది. వాటిని శ్రద్ధగా అమలు చేస్తే వివాదమే తలెత్తేది కాదు. ఆ విషయంలో మొదట సింగిల్ జడ్జి బెంచ్, అటుతర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా జరగటం వల్లే పునర్మూల్యాంకనం చేయాలని జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది.శ్రద్ధగా చదువుకుని పట్టభద్రులైనా ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో సైతం కృతార్థులైతే తప్ప నిరుద్యోగ పర్వాన్ని దాటడం అసాధ్యం. ఇందుకోసం అమ్మానాన్నల్ని వదిలి, నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. స్థోమతకు మించి వేలాది రూపాయలు వెచ్చించి, తినీ తినకా రాత్రింబగళ్లు కష్టపడతారు. తీరా ఆ పరీక్షలు లాటరీ లాంటివి. శ్రద్ధపెట్టి చదివిన అంశాలు రాకపోవచ్చు. అంత ముఖ్యం కాదనుకున్నవి పరీక్ష పత్రంలో ప్రత్యక్షమై సవాలు చేస్తాయి. వీటికి నియామక సంస్థల నిర్లక్ష్యం తోడైతే చెప్పేదేముంది? ఇస్తున్న ప్రశ్నపత్రం, దానికి జోడించాల్సిన ఓఎంఆర్ షీట్లపై నిర్వాహకులకే అవగాహన కొరవడితే అభ్యర్థులకూ, ఇన్విజిలేటర్లకూ ఏం చెబుతారు?అప్పటికప్పుడు పరీక్ష హాల్లో ఏదో ఒకటి నిర్ణయించి అమలు చేయించటం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? అభ్యర్థి వ్యక్తిగత వివరాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చని, పార్ట్ట్–బిలోని ప్రశ్నలకు సంబంధించి జవాబులకు వైట్నర్ వాడినా, తుడిచే ప్రయత్నంచేసినా మూల్యాంకనం చేయొద్దని కమిటీ చేసిన సిఫార్సునే పాటించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పినా బేఖాతరు చేయటం సరైందేనా? తమ ఇష్టానుసారం మూల్యాంకనం కానిచ్చి, నియామకాలు పూర్తి చేయటం సమస్యాత్మకమవుతుందని, అర్హులైనవారికి అన్యాయం జరుగుతుందని కమిషన్‌కు తెలియదా? నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కమిషన్ నిర్వాకం వల్ల నియా మకాలు రద్దయి, అయోమయంలో పడ్డారు. దిద్దుబాట్లకూ, వైట్నర్ వినియోగానికీ, డబుల్ బబ్లింగ్కూ పాల్పడినవారూ మళ్లీ పరీక్షల సాగరంలో ఈదక తప్పదు. మొదటే అన్నీ సక్రమంగా పాటించి మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలు ప్రకటించివుంటే ఇంతమంది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేవారు కాదు. కమిషన్‌లో జవాబుదారీ తనం కొరవడటం వేలాది మందికి శాపం. -
విశ్వసనీయత లేని విచారణ!
అందరూ అనుకున్నట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్’ సోమవారం మరణశిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం ఇదే శిక్ష పడింది. నిరుడు ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డాక ఆమె బంగ్లా వదిలి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడామెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది. అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో హసీనా అనేక అవకతవకలకు పాల్పడటం, వ్యతిరేకుల్ని జైలుపాలు చేయటం, న్యాయమైన ఉద్యమాలను సైతం ఉక్కుపాదంతో అణిచేయటం వాస్తవం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి తీరుతెన్నులు కూడా ఏమంత మెరుగ్గా లేవు. ‘పేదవాళ్ల బ్యాంకర్’గా పేరు తెచ్చుకుని 2006లో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్న దాఖలా కనబడదు. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో మతతత్వ వాదుల ప్రాబల్యం పెరిగింది. మైనారిటీ హిందువులకూ, మహిళలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులేర్ప డ్డాయి. ఆఖరికి న్యాయమూర్తులుగా పనిచేసినవారిని సైతం వేధించి, రాజీనామాలు చేయించారు. ఆరోపణలొచ్చినప్పుడల్లా అవి అవాస్తమని ప్రకటించటం తప్ప యూనస్ చేసిందేమీ లేదు. బహుశా ఇలాంటి పరిణామాల వల్ల కావొచ్చు... యూనస్‌కు హోంశాఖ ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదాబక్ష్ చౌధురి సెలవు పేరిట ఇటీవల దేశం వదిలిపోయారు. హసీనాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంపై జరిగిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,400 మంది మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. కానీ వాటిపై విచా రణ జరిపి శిక్షించటానికి తాత్కాలిక ప్రభుత్వానికి హక్కూ, అధికారం ఉన్నాయా? బంగ్లా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వం అనే ఏర్పాటే లేదు. పోనీ హఠాత్తుగా ప్రధాని దేశం విడిచిపోయారు గనుక ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోయారు? అసలు హసీనాపై తీర్పు సందర్భమే కక్షపూరిత మైనది. ఈ నెల 14న తీర్పు ఇవ్వబోతున్నట్టు పక్షం రోజుల క్రితం ‘ట్రైబ్యునల్’ ప్రకటించింది. తర్వాత దాన్ని 17కు మార్చారు. ఆ తేదీ ఆమె పెళ్లి రోజు కావటం తప్ప మరేమీ కారణం లేదు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో సాధించదల్చుకున్నదేమిటో?!తూర్పు పాకిస్తాన్... బంగ్లాదేశ్‌గా ఏర్పడి 54 ఏళ్లవుతోంది. ఆ సందర్భంగా పాక్ పాలకులపై సాగిన పోరాటంలో పాలుపంచుకుని, బంగ్లాదేశ్ ఆవిర్భావ అనంతరం తొలి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్‌తో సన్నిహితంగా పనిచేసిన యూనస్ ఇప్పుడు పాక్ అను కూల శక్తులతో చేతులు కలిపారు. పాక్ నేతలకూ, సైనికాధికారులకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అచ్చం వారిలానే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి హసీనా, యూనస్ 2007 వరకూ కలిసి పనిచేశారు. ఆ సంవత్సరం అప్పటి అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ ఆత్యయిక స్థితి ప్రకటించినప్పుడు సైన్యం తిరగబడి ఆయన్ను తొలగించింది. ఆ తర్వాత అవినీతిపై పోరాటం చేస్తామన్న సైనిక పాలకులకు యూనస్ మద్దతు పలకటంతో ఇద్దరి మధ్యా చెడింది. అటు తర్వాత ఏర్పడిన హసీనా ప్రభుత్వం యూనస్‌ను ఇబ్బందుల పాలు చేసింది. 172 కేసుల్లో విచారణను ఎదుర్కొనటం, ఒక కేసులో శిక్ష కూడా పడి బెయిల్‌పై ఉండటం వగైరాలు సాగాయి. పదవీ భ్రష్టత్వం ప్రాప్తించింది గనుక హసీనా ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ ఆమెకు చుట్టుకున్నాయి. ఆ ఉద్యమం విఫలమైతే ఇవాళ విద్యార్థి నాయకులు, కొందరు రాజకీయ నాయకులు దోషులుగా నిలబడవలసి వచ్చేది. బంగ్లాలో అవామీ లీగ్ ప్రాబల్యం తగ్గి నట్టు లేదు. తీర్పు వెలువడటానికి ముందే అక్కడక్కడ హింస చోటుచేసుకుంది. సోమవారం ఢాకా పూర్తిగా స్తంభించింది. హసీనాపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరగాల్సిందే. కానీ ఆ పని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ద్వారా జరగాలి. దేశంలో ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడాలి. ఇవేమీ లేని విచారణలు, శిక్షలు ప్రజల్లో విశ్వసనీయత కలిగించలేవు. -
మాయమైపోతున్న మనిషి
మనిషి నడక చిత్రంగా ఉంటుంది. అతను ముందుకు వెడుతున్నాననుకుంటాడు, కానీ అతనికి తెలియకుండానే అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. అది తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకే చూడండి: మనిషి పుడుతూనే మనిషి కాలేదు. ఇతర జంతుజాలంలానే తనూ పుట్టాడు; తనలాంటివాళ్ళతో గుంపు కట్టాకే మనిషయ్యాడు, పదిమందిలో ఒకడిగా ఉంటేనే తనకూ, పదిమందికీ కూడా భద్రత అని తెలుసుకున్నాడు. గణంగా మారాడు, సమాజంగా ఎదిగాడు, రాజ్యంగా అవతరించాడు, సామ్రాజ్యంగా విస్తరించాడు. మళ్ళీ తనే దేశంగా మారే క్రమంలో సరిహద్దులు గీసుకుని సాటి మనుషుల్ని దూరం పెట్టే తిరోగమనమూ చిత్తగించాడు. మనిషి హోమోసేపియన్స్ పేరిట ఆధునిక మానవుడిగా అవతరించే నాటికే ఈ భూగోళం సువిశాలం. భూమ్మీద మానవ జనాభా లక్షల సంఖ్యకు చేరడానికి కూడా చాలా కాలం పట్టిందని శాస్త్రవేత్తలు అంటారు. మనుషుల గుంపుల మధ్య అనంతమైన దూరం ఉండేది. ఆ దూరాన్ని తరించడానికి కాలాన్ని జయించవలసివచ్చేది. ఆయుర్దాయం ముప్పై, నలభయ్యేళ్ళను మించేది కాదు కనుక, అందుకొక జీవితకాలం కూడా చాలేది కాదు. గణాల మధ్య అల్లుకున్న బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు దూరాల్ని చెరిపి మనుషులను మానసికంగా దగ్గర చేసేవి. పసిఫిక్ మహాసముద్రంలోని టోబ్రియాండ్ దీవిజనం నౌకల మీద వెళ్ళి వెయ్యి మైళ్ళదూరంలో ఉన్న గణబంధువుల్ని కలిసి వాళ్ళకు కానుకలు ఇచ్చి రావడాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలా ఎలా జరిపేవారో ప్రముఖ మానవ శాస్త్రవేత్త బోనిస్లా మలినోవ్స్కీ రాస్తాడు. విచిత్రంగా, వాటికి ‘కులయాత్ర’లని పేరు. తరగని దూరాలు ఉన్నప్పుడు మానసికంగా మమతలు పెంచుకుంటూ దగ్గరగా ఉన్న మనుషులు, దూరాలు మాయమై భౌతికంగా దగ్గరగా ఉన్నా కూడా దూరమయ్యే స్థితికి చేరుకున్నారు. మహానగరాలు, పట్టణాలలో బహుళ అంతస్తుల గృహ సము దాయాల్లో ఏళ్ల తరబడిగా కలసి ఉంటున్నా ఒకరికొకరు తెలియని పరిస్థితికి వచ్చారు. తమ ఉమ్మడి భద్రత కోసం, తమను కలిపి ఉంచడం కోసం తమే సృష్టించుకున్న వ్యవస్థలే తమను విడదీసేవయ్యాయి. బ్రిటిష్ ఏలుబడిలో న్యాయస్థానాల ఏర్పాటు జరిగిన తర్వాత చిన్నాచితకా వివాదాలపై కూడా కోర్టుకు వెళ్ళడం ఎలా వేలంవెర్రిగా మారిందో, చివరికది కుటుంబ సభ్యుల్లోకి కూడా పాకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎలా ఛిద్రం చేసిందో ఆ కాలపు ఉదంతాలు కళ్ళకు కట్టిస్తాయి. ఓ కుటుంబంలో ఆస్తి తగాదా పుట్టి ఏకంగా తల్లీ, కొడుకులే కోర్టు కెక్కారట. వాయిదాకు పొరుగూరు వెళ్లవలసి వచ్చి నప్పుడు ఇద్దరూ కలిసే వెళ్ళేవారట. ఒకే సత్రంలో దిగేవారట. కొడుకు బయట ఎక్కడా భోజనం చేయడు కనుక తల్లే వండిపెట్టేదట! రాను రాను, శాస్త్రసాంకేతిక విజ్ఞానాల చేతిలో మనుషులు మరబొమ్మలయ్యారు. బంధుత్వాలూ, స్నేహాలూ ముఖాముఖీ అభివ్యక్తికి దూరమై మొబైల్ తెరకు పరిమితయ్యే పలకరింపులవుతున్నాయి. సాహిత్య రంగానికే వస్తే, ‘పాట’ దశను దాటి ‘రాత’ దశకు చేరడాన్ని పురోగమనంగా చెప్పుకోవడం పరిపాటి అయింది. కానీ నిజానికి పాటే కాదు, ఆట కూడా సమూహ చింతన నుంచి, సమష్టి చైతన్యం నుంచి పుడితే; రాత వైయక్తిక స్పందన నుంచి పుట్టింది. సమూహం నుంచి విడివడి మనిషి ఒంటరి అయ్యే ఆ పరిణామాన్ని పురోగమనమనాలో, తిరోగమనమనాలో తేల్చుకోలేక పోవడమే మానవ జీవనంలోని మహా వైచిత్రులలో ఒకానొకటి. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ/మచ్చుకైనా లేడు చూడూ’ అనే పాట కొద్ది రోజులుగా తెలుగునాట వాడవాడలా వినిపిస్తూ, గుండె గుండెనూ తట్టిలేపడం చూశాం. తనే నిలువెత్తు పాటగా మారి, జనంలోకి వెళ్ళి, మనిషి మనిషిలో మోగి హఠాత్తుగా మన మధ్య నుంచి మాయమైన మనకాలపు పాటల గంధర్వుడు అందెశ్రీ కట్టిన పాట అది. ‘ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా... అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా... కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా, కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోన’ మనిషి మాయమై పోతున్నడమ్మా అని హెచ్చరిస్తున్న ఆ పాట నిజానికి సందేశ పరంగా మానవ జాతీయ గీతాలలో ఒకటి కాదగినదీ, విశ్వవేదిక మీద వినిపించవలసినదీ. -
మరి హంతకులెవరు?
తమ కంటి దీపాలు హఠాత్తుగా కనుమరుగైనప్పుడు తల్లితండ్రులకు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలినట్టవుతుంది. తమ పంచప్రాణాలనూ ఎవరో పిండేసినట్టు విలవిల్లాడిపోతారు. ఢిల్లీ శివారులో ఉన్న నోయిడా సమీపంలోని నిఠారి గ్రామంలో 19 ఏళ్ల క్రితం జరిగింది ఇదే. తప్పిపోయిన పిల్లలు ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో కడతేరి పోయారని దర్యాప్తు అనంతరం సీబీఐ తేల్చి, న్యాయస్థానం ఉరిశిక్షలు కూడా విధించాక... దాదాపు రెండు దశాబ్దాలు గడిచాక కేసు వీగిపోతే? ఈ కేసులో ఒక దోషి వ్యాపారవేత్త మణిందర్ సింగ్ పంథేర్ లోగడే నిర్దోషిగా బయటపడగా... పదమూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని 12 కేసుల్లో నిర్దోషిగా తేలి, ఒక కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో దోషి సురేందర్ కోలీ సైతం నిరపరాధేనని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. శిక్షలు పడినప్పుడు, మరీ ముఖ్యంగా ఉరిశిక్ష పడిన తీవ్రమైన కేసుల్లో కేవలం ఊహల ఆధారంగా దోషాన్ని నిర్ధారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కేవలం కోలీ ఒప్పుకోలు ప్రకటన, కూరగాయలకు ఉపయోగించే చాకు తప్ప సాక్ష్యాధారాలెక్కడని ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో పతాకశీర్షికలకెక్కిన ఈ కీలక కేసు విషయంలో పేలవమైన దర్యాప్తు సాగిందంటే ఎవరిని నిందించాలి? 2006 చివరిలో వెల్లడైన ఈ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. మొదట 8 మంది ఆడపిల్లలకు సంబంధించినవిగా భావించిన మానవ కంకాళాలు మురికి కాల్వలో లభ్యమైనప్పుడు అంతకు రెండు మూడేళ్ల ముందు మాయమైన తమ పిల్లలకు సంబంధించినవే కావొచ్చని పేద కుటుంబాలు తల్లడిల్లాయి. ఛానెళ్లు అంతంత మాత్రంగానే ఉన్న ఆ కాలంలో కూడా మీడియాలో వెలువడే కథనాలు చదివి, విని దేశం దిగ్భ్రాంతి చెందింది. పిల్లల్ని ప్రలోభపెట్టి తీసుకెళ్లి అత్యాచారాలు చేసి హతమార్చారని, అందులో ఒక టీనేజ్ యువతి కూడా ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా 22 మంది కంకాళాలు దొరికాయని అప్పట్లో చెప్పారు. తాను ఆరుగురు పిల్లలపై, ఒక యువతిపై అత్యాచారాలు జరిపి హతమార్చానని కోలీ తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఇంటి సమీపంలో తవ్వినప్పుడు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ఈ వ్యవహారంలో అపహరణ, అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం మాత్రమే కాక నరమాంస భక్షణ, శరీరాంగాల కోత, శవసంభోగం వగైరాలున్నాయి.ఇందుకు ఒక డాక్టర్ సహకరించాడని అరెస్టు చేయగా, అతనిపై మొదట్లోనే కేసు వీగి పోయింది. హతమార్చటానికి ముందు ఈ పసిపిల్లలతో నీలిచిత్రాలు తీశారన్న కథనా లొచ్చాయి. పంథేర్ ఇల్లు ‘భయంకరమైన కొంప’గా ముద్రపడింది. 12 కేసుల్లో కోలీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు. వాటన్నిటినీ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో కేసులో సైతం ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు. పదిహేనేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పంథేర్ 2009లో విడుదలయ్యాడు.న్యాయస్థానాలు ఒక రకంగా నిస్సహాయమైనవి. దర్యాప్తు తీరును కూలంకషంగా పరిశీలించి, నిందితులపై ఉన్న సాక్ష్యాధారాలేమిటో చూసి తీర్పునిస్తాయి తప్ప మీడియా కథనాలనుబట్టో, దర్యాప్తు సంస్థల లీకుల ఆధారంగానో వ్యవహరించవు. ఈ కేసులో ప్రశ్నార్థక ఒప్పుకోళ్లు, వాటి ఆధారంగా మీడియా సంచలన కథనాలే తప్ప దర్యాప్తు సక్రమంగా జరగలేదని ధర్మాసనం వెలువరించిన తీర్పే చెబుతోంది. ఏమాత్రం పసలేని ఆరోపణల ఆధారంగా కోలీకి శిక్ష విధిస్తే న్యాయవిఘాతం చేసినవారమవుతామనీ, న్యాయప్రమాణాలకు ఈ ఆధారాలు ఏమాత్రం నిలబడలేవనీ న్యాయమూర్తులు అనటం గమనార్హం. నేర నిర్ధారణలో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా దేశం మొత్తాన్ని కుదిపేసిన కేసులో వైఫల్యం చెందటం దురదృష్టకరం. పంథేర్, కోలీలిద్దరూ నిర్దోషులు సరే... మరి అసలు హంతకులెవరు? వారు ఇప్పటికీ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారనుకోవాలా? కనీసం దేశవ్యాప్తంగా దర్యాప్తు విభాగాలన్నీ ఈ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి మున్ముందు మరింత జాగరూకతతో మెలగటం అవసరమని గుర్తిస్తే మంచిది. -
మళ్లీ ఉగ్రవాద పంజా!
సరిగ్గా పదమూడేళ్ల తర్వాత దేశ రాజధాని నగరంపై ఉగ్రవాదం పంజా విసిరిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన సోమవారం నాటి ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉన్నా, దాని తీరుతెన్నులు గమనిస్తే అది ఆత్మాహుతి దాడే కావొచ్చనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీని వెనక కుట్రఉండొచ్చని చెప్పడం గమనించదగ్గది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి, 2,913 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం... ఆ సంగతిని ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ పేలుడు ఘటన సంభవించటం గమనిస్తే వీటిమధ్య పరస్పర సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అరెస్టయిన ఉగ్రవాదుల్లో తమ సహచర వైద్యులు ముగ్గురున్న సంగతి తెలిశాక పోలీసుల చక్రబంధం నుంచి తప్పించుకుని పరారవుతూ కావాలని ఆత్మాహుతి దాడికి దిగారా, లేక మరో లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వెళ్తుండగా అనుకోకుండా పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం పేలుడు తీవ్రతను చాటుతోంది. తమ చర్యల ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించటం, అందుకోసం జన సమ్మర్దం గల ప్రాంతాలను ఎంచుకోవటం ఉగ్రవాదుల అలవాటు. తమ మతిమాలిన చర్య వల్ల ఏ వర్గాలవారు బలవుతారు, ఎన్ని కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతామన్న విచక్షణ ఉగ్రవాదుల కుండదు. వీరి ఉన్మాదానికి తోపుడు బళ్లు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని సొంతగూటికి చేరటం కోసం వెళ్తున్న సామాన్య పౌరులు, దగ్గర్లోని దుకాణదారులు బలయిపోయారు. పేలుడు తర్వాత ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలూ, తెగిపడిన కాళ్లూ చేతులూ కనబడ్డాయి. కొన్ని సెకన్ల క్రితం జీవంతో తొణికిసలాడిన మనుషులు ఛిద్రమైన శరీరాలతో ఆర్తనాదాలు చేస్తూ శోకించటం... కొందరు భయంతో పరుగులు పెట్టడం, అయినవారి జాడ కోసం మరికొందరు వెదుకులాడటం తలుచుకుంటేనే గగుర్పాటు కలిగించే భీతావహ దృశ్యం.ఏదైనా ఘటన జరిగినప్పుడు అది తమ పనేనని చెప్పుకోవటం అలవాటున్న ఉగ్రవాదులు 24 గంటలు గడిచినా కిమ్మనకపోవటం అయోమయాన్ని సృష్టించటానికే కావొచ్చనిపిస్తోంది. సాధారణంగా పేలుడు జరిగిన మూడు నాలుగు గంటల్లో ఘటన స్థలిలో లభ్యమయ్యేవాటి ఆధారంగా కారకుల విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకొస్తారు. కానీ ప్రస్తుత ఘటనలో కొంత సమయం తీసుకోకతప్పదని ఎన్ఐఏ భావించి ఉండొచ్చు. వాస్తవానికి మొదట్లో వాహనంలోని సీఎన్జీ ట్యాంక్ పేలివుండొచ్చనుకున్నా, ఆ వాహనం యజమాని పుల్వామా వాసిగా అర్ధరాత్రికి ధ్రువపడటం, క్రయవిక్రయాల సమయంలో తప్పుడు పత్రాలు దాఖలు చేశాడని తేలడం ఉగ్రవాద ప్రమేయాన్ని సూచిస్తోంది. కేంద్రం తీసుకున్న అనేక చర్యల పర్యవసానంగా ఉగ్రదాడులు దేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2012లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడు ఘటన తర్వాత మరేదీ చోటుచేసుకోలేదు. 2008 నాటి ముంబై పేలుళ్ల ఘటన తర్వాత ఎన్ఐఏను ఏర్పర్చటం, నిఘా వ్యవస్థను పటిష్ఠపరచటం, అందుకోసం ప్రత్యేకంగా జాతీయ నిఘా గ్రిడ్(నేట్గ్రిడ్) రూపకల్పన, అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టాన్నీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్నీ మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావటం ఉగ్రవాదం నియంత్రణకు గణనీయంగా తోడ్పడ్డాయి. అయితే ఎక్కడో ఒకచోట ఏర్పడే చిన్నపాటి ఉదాసీనత అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదుల్ని ప్రశ్నించాక పాకిస్తాన్ ప్రమేయం కనబడటాన్ని బట్టి ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా అది తన వెనకటి గుణాన్ని విడనాడలేదని అర్థమవుతోంది. అన్ని స్థాయుల్లోనూ మరింత అప్రమత్తత అవసరమని ఢిల్లీ పేలుడు ఘటనైనా, ఉగ్రవాదుల అరెస్టులైనా వెల్లడిస్తున్నాయి. -
బాలోత్సవం
కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్ కథలు, జంగిల్ బుక్, కాంచన ద్వీపం, గలివర్ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్ రండెల్ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.లండన్‌లోని థేమ్స్ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్ కరోల్. అందులో అలీస్ లిడ్డెల్ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్. అట్లా ‘అలీస్(స్) అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్ లిటరేచర్’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్ బుకర్ ప్రైజ్’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. -
ట్రంప్‌కు ‘బ్యాలెట్’ షాక్!
తొమ్మిది నెలల క్రితం అధికారంలోకొచ్చింది మొదలు ఇంటా బయటా విపరీత పోకడలతో, వింత నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ఓటర్లు షాకిచ్చారు. ఆయన సోషలిస్టు, కమ్యూనిస్టు అంటూ ఈసడించుకున్న 34 ఏళ్ల యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మరోపక్క నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీకి మొహం చాటేసిన వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాలు గవర్నర్ ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గాయి. ఆ రెండు చోట్లా డెమాక్రాట్ల తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థులు మికీ షెరిల్, అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఘనవిజయం సాధించారు. క్యాలిఫోర్నియాలో ప్రతినిధుల సభకూ, సెనేట్ సీట్లకూ జిల్లాల హద్దులు నిర్ణయించే పోలింగ్‌లో సైతం డెమాక్రాట్లదే పైచేయి. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రతినిధుల సభకూ, సెనేట్‌లోని కొన్ని స్థానాలకూ జరగబోయే ఎన్నికలపై రిపబ్లికన్లు ఆశ వదులుకోవాల్సి రావొచ్చు. ట్రంప్ దూకుడుతో చేష్టలుడిగిన డెమాక్రటిక్ పార్టీకి ఓటర్లే ఊపిరి పోశారని ఫలితాల సరళి చెబుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 20 లక్షల మందిపైగా ఓటు హక్కు వినియోగించుకోవటమైనా, వారిలో సగంమందికి పైగా మమ్దానీ పక్షాన నిలవటం అయినా అసాధారణం. న్యూయార్క్ వందేళ్ల చరిత్రలో ఆయనది ప్రత్యేకమైన రికార్డు. ముస్లిం కావటం, భారతీయ మూలాలున్న వ్యక్తి అయివుండటం, చిన్న వయసులో కీలక పదవికి చేరుకోవటం రికార్డు. విజేతలు ముగ్గురూ కావడానికి డెమాక్రాట్లే అయినా భిన్న దృక్పథాలున్నవారు. గవర్నర్లుగా ఎన్నికైన షెరిల్, స్పాన్‌బెర్గర్ మధ్యేవాదులు కాగా, మమ్దానీ వామపక్ష భావాలున్నవారు. నమ్ముకున్న మధ్యేవాదాన్ని విడనాడితే తప్ప ఉనికి ఉండబోదన్న ఆందోళనలో డెమాక్రాట్లున్న తరుణంలో మొన్న ఫిబ్రవరిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో జరిగిన పోటీలో మమ్దానీ నిలిచారు. అప్పటికి ఆయనకు నిండా ఒక శాతం ఓట్లు కూడా లేవు. పైగా పోటీపడింది పార్టీలో సంవత్సరాలుగా పాతుకుపోయి, గవర్నర్‌గా ఎంతో అనుభవం గడించిన ఆండ్రూ కూమోతో. కూమోకు ఐశ్వర్యవంతుల దన్నుంది. పైగా రిపబ్లికన్లకూ, డెమాక్రాట్లకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నా యూదుల ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌నే సమర్థిస్తారు. అలాంటి పార్టీలో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను వ్యతిరేకించటం, మానవ హక్కుల హననాన్ని నిరసించటం సామాన్యం కాదు. ఆ పని మమ్దానీ చేయగలిగారు. దీంతోపాటు వలసదారులపై ట్రంప్ కత్తిగట్టడాన్ని బాహాటంగా ఖండించారు. ఇదంతా పార్టీకి చేటు తెస్తుందని స్వపక్షంలోనే అనేకులు లబలబలాడారు. కానీ మమ్దానీ దృఢంగా నిలబడ్డారు. కనీస అవసరాలైన తిండిగింజలు, గూడు, ఆరోగ్యం అందుబాటు ధరల్లో ఉండాలన్న నినాదంతో ముందు కెళ్లారు. పార్టీలో తన రేటింగ్‌ను డబుల్ డిజిట్‌కు తీసుకెళ్లారు. సర్వేల్లో సైతం ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. న్యూయార్క్‌కు ఫెడరల్ నిధులు ఆపేస్తాననీ, నగరం సర్వనాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ జనం బేఖాతరు చేశారు. వలసలపై యుద్ధం చేస్తున్న ‘మాగా’ ఉద్యమకారులు, రిపబ్లికన్లకు వారిదైన ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ఉంది. దాని సాయంతో విశ్వవిద్యాలయాల్లోనూ, రోడ్లపైనా చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వారిది చిత్రమైన అవస్థ. ట్రంప్ నేరుగా స్పందించాలా లేదా అన్నది వారు తేల్చుకోలేకపోయారు. సంప్రదాయ ఓట్లు రాలాలంటే ట్రంప్ స్పందించి తీరాలి. తీరా ఓటమి పాలైతే ట్రంప్‌పై రిఫరెండమ్ అవుతుంది. చివరకు ఆయన మమ్దానీపై నిప్పులు చెరిగారు. సొంత పార్టీ అభ్యర్థి సిల్వాను కాదని కూమో వైపు మొగ్గారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. అందుకే ఈ ఓటమి పాపం ట్రంప్‌కి చుట్టుకుంది. అధికారం శాశ్వతమని విర్రవీగే దేశ దేశాల పాలకులకూ ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. మందబలంతో చెలరేగితే చివరకు అధోగతేనని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు రిపబ్లికన్లకు నీరాజనం పట్టి ఏడాది కాలేదు. ట్రంప్ తన నియంత పోకడలతో దాన్నంతటినీ కాలదన్నుకున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
సభాహక్కుల పేరుతో ఎలాపడితే అలా చేయడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్‌లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్‌రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం ‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
పాఠాలు నేర్వని ప్రభుత్వం
ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ సందర్శనకొచ్చేవారికి కనీస రక్షణ చర్యలు తీసుకో వటం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వానికి చేతగాదని మరోసారి నిరూపణయింది. భక్తులందరూ పవిత్రంగా భావించే కార్తిక ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెయిలింగ్ ఊడిపడి తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన తీరు ఆయన ఏలుబడికి అద్దం పడుతోంది. ఈ విషాద ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. వెనువెంటనే ఘటనాస్థలికొచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొన ఊపిరితో ఉన్న కొందరికి సీపీఆర్ చేయటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన చొరవ కారణంగానే అంబులెన్స్‌లు వచ్చి గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించాయి. లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకొచ్చాక ఇలాంటి దుర్ఘటన జరగటం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంలో చూపిన నిర్లక్ష్యం పర్యవసానంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. మరో 43 మంది గాయ పడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతిలో ఇటువంటి దారుణం జరగటం అదే ప్రథమం. అటు తర్వాత మార్చిలో సింహాచల క్షేత్రంలో అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు చనిపోయారు. 2015లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కారణంగా, ఆయన సమక్షంలో రాజమహేంద్రవరంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది బలయిపోయారు. అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పుడు వెనువెంటనే బాధ్యులెవరో గుర్తించి చర్య తీసుకోవటానికి పాలకులు ఉద్యుక్తులవుతారు. బాబు ఒక్కరు మాత్రం కబురు తెలిసిన వెంటనే సాకుల కోసం వెదుకుతారు. ఇలాంటివి సర్వసాధారణమేనన్న తర్కానికి దిగుతారు. పుష్కరాలు మొదలుకొని తిరుపతి, సింహాచలం తొక్కిసలాటల వరకూ ఆయన బాణీ అదే. ఇప్పుడు కూడా దాన్నే తు.చ. తప్పకుండా పాటించారు. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తిదట. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసులకు సమాచారం లేదట. ఇంకా నయం... కార్తిక ఏకాదశి రోజున ఆలయాలకు భక్తులొస్తారను కోలేదని అనలేదు! ఇంతకూ తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు చోటుచేసుకున్న ప్రాంగణాలు ఎవరి అధీనం లోనివి? చాలాముందుగా తెలిసినా అక్కడ బాబు సర్కారు ఒరగబెట్టిందేమిటి? పోలీసుల సంగతలా ఉంచి అనుకోనిది జరిగితే ముందుకు రికేందుకు అంబులెన్స్‌లూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలనైనా అందుబాటులో ఉంచగలిగారా? మరి ఎవరిని వంచించటానికి ఈ మాటలు? టీడీపీ వందిమాగధ మీడియా ఆయన్ను మించిపోయింది. ఫలానా రోజొచ్చే పర్వదినం మళ్లీ జన్మలో రాదని సోషల్ మీడియాలో ఊదరగొట్టేవారు పెరిగి పోవటం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందట! పర్వదినాలేవో పంచాంగాలే చెబుతాయి. దేవదాయ శాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు క్యూ కడతారు. చెప్పినా చెప్పకున్నా ఏర్పాట్లు చేయటం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు గుర్తించారో లేదోగానీ, తెలియదు... చెప్పలేదు అనే రోగానికి మూలం మరోచోట ఉంది. ‘నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు’ అని గద్దర్ ఒక పాటలో అన్నట్టు పదిమంది జమయితే పోలీసులు అనుమానంగా చూస్తారు. అది నిరసనైనా, ఉత్సవమైనా, ఊరేగింపైనా వారి స్పందన ఒకేలా ఉంటుంది. అంతమంది గుమిగూడటానికి ముందస్తు అనుమతులున్నాయా అని ఆరా తీస్తారు. తగిన చర్యలు తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ విభాగం నిమగ్నమయ్యేది అలాంటి సమాచార సేకరణ లోనే. మరి బాబు రక్షకభటులేం చేశారు? డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు సహాయచర్యల్లో పాల్గొంటుండగా ప్రత్యక్షమయ్యారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేచోట, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలయ్యేచోట ఇంతకన్నా మెరుగ్గా పోలీసులు వ్యవహరిస్తారని ఆశించలేం. ఇప్పటికైనా బాబు తెలివి తెచ్చుకుని సవ్యంగా పాలించటం మొదలెట్టాలి. జనం ప్రాణాలు అరచేత బట్టుకుని ఉత్సవాలకెళ్లే్ల దురవస్థ నుంచి తప్పించాలి. -
రహదారుల మృత్యువేగం
మళ్లీ నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల తెలవారుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ 19 మంది బస్సు ప్రయాణికుల నిండు జీవితాలను కబళించింది. చదువుల కోసం వస్తున్నవారూ, ఉద్యోగాల నిమిత్తం బస్సెక్కినవారూ, ఉపాధి ఆశించి బయల్దేరినవారూ, వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారూ... అందరికందరూ మృత్యుదాహంతో దూసుకొచ్చిన టిప్పర్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలవారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అది పేరుకు జాతీయ రహదారే కానీ, అడుగడుగునా గుంతలు. స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు మచ్చుకైనా లేక జిల్లా రోడ్డు కన్నా ఘోరంగా ఉంటుంది. పర్యవసానంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా జడత్వం వదుల్చుకోని అధికార యంత్రాంగం తీరువల్ల ప్రమాదాలు నిత్యకృత్య మయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన ఈ పదకొండేళ్ల చరిత్ర చూసినా ఈ రహదారిపైనే 300 మంది జీవితాలు ముగిసిపోయాయంటే ఎవరిని నిందించాలి? వేగాన్ని అదుపు చేయలేని స్థితిలో టిప్పర్లోని కంకర లోడంతా బస్సు ప్రయాణికులను కమ్మేసింది.అందుకే మృతుల సంఖ్య భారీగా ఉంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ కేసు వల్ల రహదారి విస్తరణ పనుల ప్రారంభంలో జాప్యం చోటుచేసుకున్నదని అధికారులు చెబుతున్న మాట పాక్షిక సత్యం. పదేళ్ల క్రితం రహదారిని విస్తరించాలనుకున్నప్పుడే అక్కడ వందలాది ఊడలు దిగిన మర్రి చెట్లున్నా యనీ, వాటి తొలగింపు వివాదమవుతుందనీ అంచనా ఉండాలి. ఆ వృక్షాలకు ఇబ్బంది కలగని రీతిలో రహదారి కోసం ప్రత్యామ్నాయ స్థలమైనా చూడాలి లేదా వాటిని వేరే చోటుకు తరలించి విశాలమైన రహదారి నిర్మాణానికి పూనుకోవాలి. అది వారి బాధ్యత. ఆ విషయంలో ముందస్తు కసరత్తేమీ జరగలేదని జరిగిన పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. అనాలోచితంగా విస్తరణ పనులకు పూనుకోవటం, సమస్యాత్మకం అయ్యేసరికి నిస్సహాయత ప్రదర్శించటం దారుణం.పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవరకూ చెట్ల తొలగింపును అధికారులు నిజంగానే సమస్యగా పరిగణించలేదా? ఈ విషయంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పాలకవర్గం ఇప్పటికే ఎంతో అనుభవం గడించివుండాలి. రహదారి డిజైన్ సమయంలో అదంతా మంట గలిసిందా? పర్యావరణంపై చైతన్యం పెరిగిన వర్తమానంలో చెట్ల తొలగింపును ఎవరూ అడ్డుకోరన్న భరోసా ఎక్కడిది? ఈ విషయంలో సంజాయిషీ చెప్పాలి. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, పనులకు ఆటంకం కలిగాక తీరిగ్గా హామీలిచ్చి ట్రైబ్యునల్‌లో స్టే తొలగింప జేసుకునే ప్రయత్నం చేయటం కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారు గమనించుకున్నారా?ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాలకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరి హారం కూడా ప్రకటిస్తున్నారు. మంచిదే. కానీ దేశవ్యాప్తంగా వందలాది మంది ఉసురు తీస్తున్న ఈ వాహనాల అదుపు కోసం ఏం యోచిస్తున్నారు? ఇప్పుడొస్తున్న వాహనాల డిజైన్లన్నీ పాశ్చాత్య దేశాల రోడ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. మన దేశంలో అసలే రోడ్లు అంతంత మాత్రం. జాతీయ రహదారులు కూడా ఇలా అక్కడక్కడ సమస్యా త్మకంగానే ఉంటున్నాయి. అటువంటి రోడ్లపై రాకెట్ వేగంతో దూసుకెళ్లే వాహనాలను అనుమతించటం సబబేనా? కనీసం పెద్ద పెద్ద బండరాళ్లు, కంకర వగైరా లోడ్ మోసుకెళ్లే టిప్పర్ల వేగాన్నయినా పరిమితం చేయాల్సిన అవసరం లేదా?సరిగ్గా చేవెళ్ల వద్ద ప్రమాదం చోటుచేసుకున్న రోజే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక టిప్పర్ పెనువేగంతో పోయి పలు వాహనాలను ఢీకొన్న ఉదంతంలో 14 మంది మరణించారు. మొన్న సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ట్రక్కు రాంగ్రూట్లో పోయి కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇసుక, గ్రానైట్, కంకర, నాపరాళ్లు వగైరా వ్యాపారాల్లో టిప్పర్లు అవసరాన్ని మించి లోడ్ మోసుకెళ్లటం, పెనువేగంతో పోవటం తరచూ కనబడుతోంది. వీటి నియంత్రణకు నిబంధనలు రూపొందించకపోతే, ఈ అరాచకాన్ని నిలువరించకపోతే జనం క్షమించరు. -
కూసింత కళాపోషణ
కళలు మానవానుభూతుల అభివ్యక్తి సాధనాలు. కళలు మానవ నాగరిక ప్రస్థానానికి సాక్షీభూతాలు. కళలు మానవుల సౌందర్య పిపాసకు నిదర్శనాలు. కళలు మానవుల సృజన సామర్థ్యానికి తార్కాణాలు. కళలు సామాజిక సంస్కృతికి ప్రతిబింబాలు. కళలకు చోటు లేని సమాజం మరుభూమితో సమానం. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటే కళలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాజ్యాలు ఏర్పడ్డాక కళలకు ప్రోత్సాహం పెరిగింది. రాజాదరణ పొందిన కవులు, కళాకారులు లోటు లేని భద్రజీవితాలను గడుపుతూ, కళాసృజన చేసేవారు. కళల పట్ల అభిరుచి గల రాజులు కవులకు, కళాకారులకు కనకాభిషేకాలు సహా ఘన సత్కారాలు చేసేవారు. రాజులే కాక సమాజంలోని సంపన్న కులీనులు కూడా కళాకారులను ఆదరించేవారు. కళాపోషణ సమాజంలో ఒక హోదా చిహ్నంగా ఉండేది. తెలుగునాట కళాపోషణకు అనేక ఉదాహరణలు మన చరిత్రలో కనిపిస్తాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాజాస్థానాలలో అనేక ఘనసత్కారాలను పొందాడు. ‘దీనార టంకాల తీర్థమాడించితి/ దక్షినాధీశు ముత్యాల శాల’ అని శ్రీనాథుడు స్వయంగా చెప్పు కున్నాడు. శ్రీనాథుడికి దీనార టంకాలతో కనకాభిషేకం చేసిన రాజు ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడి తర్వాత కనకాభిషేకం పొందిన మరో కవి అడిదం సూరకవి. శ్రీనాథుడికి శతాబ్దాల తర్వాతి వాడు అడిదం సూరకవి.విజయనగరం ఆస్థానానికి వెళ్లిన అడిదం సూరకవి ఆ రాజ్యానికి రాజైన పూసపాటి విజయరామరాజును పొగుడుతూ, ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తి వి/ భ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్’ అని పద్యం చెప్పాడు. విజయరామరాజు సూరకవి పొగడ్తకు మురిసి ముక్కలై, కనకా భిషేకం జరిపాడు. అయితే, ఈ కవిరాజుది మరీ విడ్డూరమైన కథ. ‘స్నానము చేసిన ఉదకమును పానము చేయలేను’ అని చెప్పి, కనకాభిషేకంలో వాడిన బంగారు నాణేలను తీసుకోవడానికి నిరాకరించాడు. అడిదం కవి ఆత్మాతిశయానికి మెచ్చిన విజయరామ రాజు తగురీతిలో ఘనసత్కారం జరిపి, ఆయనను సాగనంపాడట! తెలుగునాట కనకా భిషేకాల కాలం బహుశా అడిదం కవితోనే అంతరించింది.ఎందరో రాజులు రాజ్యాలను ఏలారు. వారిలో చాలామంది చరిత్రలో కలిసి పోయారు. ఆ రాజులలో కొద్దిమంది మాత్రమే ఇంకా జనాలకు గుర్తున్నారు. కారణం ఒక్కటే! వారి ఏలుబడిలో జరిగిన కళాపోషణ. కళాపోషణ బాగా ఉన్న రాజ్యాలలో ప్రశాంతత ఉండేది. నిత్యం అంతర్బహిర్ కలహాలతో అట్టుడికిపోయే రాజ్యాలలో కళలు ఉన్నా; వాటి ఆదరణకు, పోషణకు ఆస్కారం అతి తక్కువ. రాచరికాల కాలంలో కూడా రాజాదరణ పొందిన కళాకారులే సుభిక్షంగా జీవించగలిగేవారు. అయితే, రాజాశ్రయం పొందడం అంత తేలికగా ఉండేది కాదు. అప్పట్లోనూ అనేక రాజకీయాలు ఉండేవి.కృష్ణదేవరాయల ఆస్థానంలో చోటు పొందడానికి తెనాలి రామకృష్ణుడు అష్టకష్టాలు పడిన కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. యోగ్యులైన కవులు, కళాకారులకు ఇవ్వాలనే ఉద్దేశం రాజుకు ఉన్నా, అతడి ఈవిని సాగనివ్వని వారు చుట్టూ ఉండేవారు. వారు తమకు పోటీ రాగల ఇతరులను రానివ్వకుండా నిరోధించేవారు. ఇలాంటి వారి గురించే ‘ఇయ్యగ నిప్పించగల/ యయ్యలకే గాని మీసమందఱకేలా?/ రొయ్యకు లేదా బారెడు...’ అని చౌడప్ప నిరసించాడు.కళాపోషణ అంటే చాలామందికి ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని రావు గోపాలరావు డైలాగు గుర్తుకొస్తుంది. ఆ మాదిరిగా కానీ ఖర్చులేని కళాపోషణ ఎవరైనా చేయగలరు గాని, ఖర్చుకు వెనుకాడకుండా కళాపోషణ చేయాలంటేనే కళాహృదయం ఉండాలి. వర్తమాన కాలంలో ఐర్లండ్ ప్రభుత్వానికి అలాంటి కళాహృదయమే ఉంది. అందుకే కవులు, రచయితలు, కళాకారుల ఆర్థిక సుస్థిరత కోసం నెలకు 1500 యూరోలు చెల్లించే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన మన దేశంలో ఇలాంటి పథకాన్ని కనీసం కలలోనైనా ఊహించగలమా! -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అన్యాయానికి పరిహారం
ఒక పెత్తందారు కన్నెర్ర చేయటం వల్లనో, ఒక ఉన్నతాధికారి కక్షబూనటం వల్లనో, లేదా వ్యవస్థలు ఏకమై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడం వల్లనో జైళ్లలో మగ్గి చివరకు నిర్దోషులుగా విముక్తులవుతున్నవారికి ఊరటనిచ్చే అంశమిది. అలాంటివారికి నష్టపరిహారం చెల్లించేందుకు అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించటం, ఏళ్ల తరబడి వారు జైలు పాలవటం మన దేశంలో ఎప్పటి నుంచో రొటీన్‌గా సాగిపోతోంది. నిందితులు నిర్దోషులని తేలినప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తు చేసినవారినీ, ప్రాసిక్యూషన్‌నూ తప్పుబట్టడం తరచూ కనబడుతుంది. కానీ అందువల్ల ఒరిగేదేమిటి? సమాజం వారిని అమాయకులుగా, సాధారణ పౌరులుగా పరిగణించి ఆదరిస్తుందా? అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో అలాంటివారు నష్టపరిహారం పొందేందుకు నిబంధనలున్నాయి. అమెరికాలో జైల్లో మగ్గిన కాలానికి ఏడాదికి 50,000 డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తారు. బ్రిటన్‌లో దీర్ఘకాలం జైల్లో ఉన్న నిర్దోషులకు 10 లక్షల పౌండ్లు ఇస్తారు. జర్మనీలో ఇది రోజుకు 75 యూరోలు. మన దేశంలో అభాగ్యులు కేసుల నుంచి విముక్తి పొందటమే అదృష్టమన్నట్టు సరిపెట్టుకుంటున్నారు. పరిహారం సంగతలా ఉంచి వారికి ప్రభుత్వం నుంచి క్షమాపణైనా దక్కటం లేదు. శిక్ష పడుతున్న కేసులు మన దేశంలో ఏటా సగటున 54 శాతం మించటం లేదన్న గణాంకాల్ని గమనిస్తే ఇలాంటి అభాగ్యులెందరో అర్థమవుతుంది. పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు భావించిన కేసు పూర్వాపరాలు చూస్తే ఈ నిర్ణయం ఎంత సరైందో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2013లో ఒక మైనర్‌పై అత్యా చారం చేసి హతమార్చాడన్న కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతూ, 2019లో ఉరిశిక్ష పడిన నిరుపేద పౌరుడి కథ ఇది. ఆయన పన్నెండేళ్ల కారాగారవాసంలో ఆరేళ్లు ఉరికంబం నీడన బతుకీడ్చాడు. అతణ్ణి అన్యాయంగా ఇరికించారనీ, దర్యాప్తు మొత్తం తప్పులతడకనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది ఇంతవరకూ ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. నిజానికి 2014లోనే ఒక కేసులో తీర్పునిస్తూ క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలితే దర్యాప్తు అధికారుల్ని బాధ్యులుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అది ఏ మేరకు అమలవుతున్నదో అనుమానమే. అమాయకులపై తప్పుడు కేసులు బనాయించటం వల్ల అనేక విధాల నష్టం. నిజమైన దోషులు తప్పించుకు తిరుగుతూ అవే నేరాల్ని పదే పదే చేస్తుంటారు. అమాయక పౌరులు నిస్సహాయంగా జైల్లో మగ్గుతారు. దోషులు తప్పించుకు తిరుగుతున్నా, చేయని నేరానికి నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నా ప్రజలకు చట్టబద్ధ పాలనపై విశ్వాసం పోతుంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కుకూ, వ్యక్తి స్వేచ్ఛకూ పూచీ పడుతున్నా దానికి అనుగుణంగా అక్రమ కేసుల వల్ల జైలు పాలైనవారికీ, ఆలస్యంగా న్యాయం దక్కినవారికీ పరిహారం చెల్లించే చట్టాలు లేవు. జీవితంలో విలువైన కాలాన్నీ, స్వేచ్ఛనూ, పరువు మర్యాదలనూ కోల్పోయి మానసికంగా కుంగిపోయినవారికి పరిహారం పొందే హక్కుండి తీరాలి. మానవీయ దృక్పథంతో న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో పరిహారానికి ఆదేశిస్తున్నాయి. బాధితులందరికీ న్యాయం జరగాలంటే తగిన చట్టం అవసరం.తొంభై శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరికొందరు తప్పుడు కేసుల పర్యవసానంగా పదేళ్లు కారాగారంలో మగ్గటం, చివరకు నిర్దోషులుగా విడుదల కావటం ఇటీవలి వైనం. విడుదలైన కొన్నాళ్లకే ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపిస్తూ 17 మందిపై దేశద్రోహ నేరంతో సహా పలు కేసులు పెట్టగా ఆరేళ్ల తర్వాత నిర్దోషులుగా బయటపడ్డారు. గూఢచర్యం, దేశద్రోహం కేసుల్లో ఇరుక్కున్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ రూ. 50 లక్షల పరిహారం పొందటానికి రెండు దశాబ్దాలు పట్టింది. ఇలాంటి పోకడలు ఆగాలంటే, తప్పుడు కేసుల పర్వానికి తెరపడాలంటే పరిహారం చెల్లించే విధానం రావాల్సిందే!


