నడకదారి ఇక పౌరుల హక్కు | Sakshi Editorial On Pedestrian walkways are now citizens rights | Sakshi
Sakshi News home page

నడకదారి ఇక పౌరుల హక్కు

Jun 23 2026 12:59 AM | Updated on Jun 23 2026 12:59 AM

Sakshi Editorial On Pedestrian walkways are now citizens rights

నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లన్న తేడా లేకుండా ఇకపై ప్రతి రహదారికీ పాదచారులు నడవటానికి వీలుగా ఫుట్‌పాత్‌లు ఉండి తీరాలనీ, ఇందుకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన ఆదేశం పౌరులకు ఉపశ మనం కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రాముఖ్యతేమంటే... జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, దాంతోపాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లే, స్థిరపడే, కలుసుకునే స్వేచ్ఛను వాగ్దానంచేసే అధికరణం 19(1) (ఎ), (బి), (సి), (డి)లను మరింత విస్తృతీకరించటం. దీని పర్యవసానంగా రోడ్లపక్కన ఫుట్‌పాత్‌లుండటం ఇకపై పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటవుతుంది. అయితే ఈ ఆదేశాలిచ్చే ముందు అసలు ఎన్ని నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఫుట్‌పాత్‌లున్నాయో... వాటిల్లో ఎన్ని పనికొచ్చే విధంగా ఉన్నాయో గణాంకాలివ్వాలని ధర్మాసనం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతా లను ఆదేశించాల్సింది. బహుశా అలాంటి ఆదేశం ఇస్తే దీర్ఘకాలం ఎదురుచూపులు చూడటం తప్ప ఫలితం ఉండబోదని న్యాయమూర్తులు భావించి ఉంటారు. న్యాయ స్థానాలు అడిగినప్పుడు ప్రభుత్వాలు తగిన సమాచారం ఇవ్వకపోవటం, వాయిదాలు కోరటం పర్యవసానంగా దేశంలో చాలా కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. 

వాస్తవానికి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌పాత్‌ల సంఖ్యను క్రోడీకరించినట్టు లేదు. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ సాధారణంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఉంటాయి. కేంద్రం తల్చుకుంటే ఈ వివరాలు సేకరించి జాతీయ స్థాయి డేటా రూపొందించగలదు. కానీ ఆ అవసరం ఉందని భావించాలి గదా! ఫుట్‌పాత్‌లు అనేవి మన దేశంలో బ్రహ్మపదార్థం లాంటివి. రోడ్డుపక్కన ఎక్కడో ఒకచోట ఇటుక, సిమెంట్, టైల్స్‌ శిథిలాలుంటే ఒకప్పుడు ఇక్కడ ఫుట్‌పాత్‌ ఉండేదని అను కోవటం తప్ప చాలాచోట్ల వాటి జాడ కనబడదు. నగరాలూ, పట్టణాల్లో రోడ్డెక్కిన పాదచారి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లటం కోసం దారిలో గోతులు, రాళ్లురప్పలూ ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ నడవక తప్పని స్థితి. వీటి సంగతలావుంచి ట్రాఫిక్‌ రద్దీ సమయాల్లో ద్విచక్రవాహనదారులు అసహనంతో ఆ నడకదారులను సైతం కాజేస్తారు. 

ఇక చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునేవారు సరేసరి. హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ వచ్చాక స్టేషన్లకు అటూ ఇటూ ఫుట్‌పాత్‌లపై రెస్టారెంట్లు వెలిసి పాదచారుల్ని సవాలు చేస్తున్నాయి. తోపుడు బండి లేదా సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునేవారిని అప్పుడప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు అదిలించటం కనబడుతుంది. కానీ మెట్రో స్టేషన్ల దగ్గరుండే రెస్టారెంట్ల జోలికి ఎవరూ వెళ్లిన దాఖలా లేదు. ఇక దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఫుట్‌పాత్‌ల సదుపాయంగల ఊళ్లు కనీసం వందల సంఖ్యలోనైనా ఉంటాయా అన్నది సందేహమే. వాటి సంగతలావుంచి దేశ రాజధాని నగరంలో 44 శాతం రోడ్లకు ఫుట్‌పాత్‌లు లేవని ఆమధ్య ఢిల్లీ ఐఐటీ నివేదిక తెలిపింది. ఉన్నచోటైనా దాదాపు 28 శాతం మాత్రమే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌(ఐఆర్‌సీ) నిబంధనలకు అనుగుణమైనవని ఆ నివేదిక తేల్చిచెప్పింది. 

ఈ తీర్పు వెలువరించటానికి దారితీసిన కేసు విషాదకరమైనది. అయిదేళ్ల బాలుడిని అతని తండ్రి పాఠశాల సమీపంలో దించి వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిన ట్యాంకర్‌ ఆ బాలుడిపైకి దూసుకెళ్లి ప్రాణాలు తీసింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలితే ఇలాంటి విషాదాలను నివారించవచ్చు. అయితే బాధాకరమైన విషయమేమంటే... ఈ హక్కు అమల్లోకి రావాలంటే పౌరులు నెరవేర్చాల్సిన విధులు చాలా ఉంటాయి. ఫలానాచోట ఫుట్‌పాత్‌ లేదని సంబంధిత అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, ఈ తీర్పును ఉటంకించాలి. అటు తర్వాత దాని సంగతేమైందో కనుక్కోవాలి. అవసరమైతే ఆర్టీఐని ఆశ్రయించాలి. అటు తర్వాత ఫుట్‌పాత్‌ లేనిచోట పరిస్థితిని తెలిపే ఫొటోతో హైకోర్టులో పిల్‌ దాఖలు చేయాలి. అందులో తీర్పు వెలువడటానికి దీర్ఘకాలం వేచిచూడాలి. విద్యాహక్కు చట్టం, పనిచేసే హక్కు చట్టంవంటివి ఆచరణలో ఎలా నీరుగారుతున్నాయో కనబడుతూనే ఉంది. ఏ హక్కు అమలు కావాలన్నా పౌరులంతా ఒక్కటై ఉద్యమించటమే, ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావటమే మార్గం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement