న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను కాక్రోజ్ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తప్పుబట్టారు. మహువా మొయిత్రాపై సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఆమెకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఇదే న్యాయమూర్తులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గుడ్లు విసురుతారని భయపడితే ఎలా?
వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్టుల కేసులో పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సొంత నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సమయంలో తనపై గుడ్లు విసిరే అవకాశం ఉందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం.. శుక్రవారం తిరస్కరించింది. దర్యాప్తు అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరించాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.
“మీరు పార్లమెంట్ సభ్యురాలు కదా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోడిగుడ్ల దాడులకు భయపడుతున్నారా? మన స్వాతంత్ర్య సమరయోధులు తూటాలకు ఛాతీలను ఎదురొడ్డారు. ఇలాంటి దరఖాస్తులు ఈ కోర్టు ముందుకు రావాల్సిన అవసరమే లేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, మహువా మొయిత్రాపై నమోదైన కేసులో ఆమెకు ఎలాంటి వేధింపులు జరగకుండా భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఇప్పటికే ఆదేశించింది.
న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆందోళనకరం
మహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌లో సౌరవ్ దాస్ స్పందించారు. “అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహువా మొయిత్రా బుల్లెట్లను ఎదుర్కొవాలని కోరుకుంటున్నారా? న్యాయమూర్తులుగా ఇలా బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులను నియమించుకున్నాం? న్యాయమూర్తుల నుంచి మనం ఆశించే న్యాయపరమైన ఔన్నత్యం ఇదేనా?, ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న దుస్థితి గురించి తెలిసిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళనకరం. తన ప్రవర్తనకు న్యాయమూర్తి సిగ్గుపడాలి. భవిష్యత్తులో మహువా మొయిత్రాకు ఏదైనా హాని జరిగితే అందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసే వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాల్సి వచ్చేది లేదా అభిశంసనను ఎదుర్కోవాల్సి వచ్చేద''ని వ్యాఖ్యానించారు.
So does this Supreme Court judge want @MahuaMoitra to take bullets? What kind of motormouth persons have we appointed as judges? Is this the judicial temperament we expect of constitutional court judges? This is why we need to fix judicial accountability.
The statement is… pic.twitter.com/O2w8KQoGQL— Saurav Das (@SauravDassss) August 7, 2026
చదవండి: పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
మొయిత్రాపై కేసు ఏమిటి?
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా హోగల్‌బరియా పోలీస్ స్టేషన్‌లో జూన్‌లో బీజేపీ నేత హీరక్ భట్టాచార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహువా మొయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా, సామాజిక- మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా, మత విశ్వాసాలను అవమానించేలా, ప్రజల్లో అశాంతికి దారితీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
కృష్ణనగర్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు గుమిగూడిన ఘటన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. గతంలో నమోదైన మరో కేసులో మహువా మొయిత్రా కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆమెపై గుడ్లు, టమాటాలు విసురుతామని వారు హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన అనంతరం మొయిత్రా ఫేస్‌బుక్‌లో రెండు వీడియోలు పోస్టు చేశారు. మొదటి వీడియోలో కోర్టు వెలుపల గుడ్లతో కనిపించిన మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టులను, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నారు.
మరుసటి రోజు పోస్టు చేసిన మరో వీడియోలో ఆ మహిళలందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేస్తానని ఆమె చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుడ్లు బహిరంగంగా విసరకుండా బుర్ఖా ధరించి గుర్తుపట్టకుండా విసరాలని ఆమె సూచించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉన్నాయని బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


