సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన రాహుల్‌ను సవాల్ చేశారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇదివరకే కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని దాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెడుతున్నారని రాహుల్ కౌంటరిచ్చారు.
అసలే ఏమైందంటే
కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో మహిళలకు మరింత భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది “ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన సానుకూల సందేశంలా కనిపిస్తోంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది” అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.
రాహుల్ గాంధీ కౌంటర్
కిరణ్ రిజిజు చేసిన ఈ పోస్ట్‌కు రెండు గంటలు కూడా గడవకముందే రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చింది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ మద్దతుతో పార్లమెంట్‌లో ఆమోదం పొందింది అనే విషయం కేంద్రమంత్రికి గుర్తు చేశారు.
“ఈ బిల్లు ఇప్పటికే ఏకగ్రీవంగా, కాంగ్రెస్ పూర్తి మద్దతుతో ఆమోదించబడింది. అయితే మూడు సంవత్సరాలు గడిచినా ఇది ఎందుకు అమలు కాలేదు? ఇప్పుడు దీన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెట్టాలని మీరు కోరుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.2023లో ఆమోదమైన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
మహిళా కోటా, డీలిమిటేషన్ అంశం
మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించబడింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడం ఈ చట్టం లక్ష్యం. అయితే 2023లో ఆమోదించిన చట్టం అమలును భవిష్యత్తులో నిర్వహించే జనగణనతో ముడిపెట్టింది.
దీంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే అవకాశం ఉంది. అందులో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి.
గొడవ ఎందుకు?
2011 జనగణన ఆధారంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది.
కాగా ఈ అంశమై కిరణ్ రిజిజు ఆగస్టు 5న రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రిజిజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 6న కూడా రిజిజు ఫోన్ ద్వారా రాహుల్ గాంధీని సంప్రదించినట్లు సమాచారం.
ఈసారి కాంగ్రెస్ ఈ అంశంపై అంతర్గతంగా చర్చించడంతో పాటు, తన ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో సైతం చర్చించి, అనంతరం తమ వైఖరిని తెలియజేస్తుందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.


