సాక్షి,ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. అమిత్‌షా కనపడడం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. "అమిత్ షా జవాబ్ దేవ్" అని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. అయితే ఎంపీల నిరసన సమయంలో భారీగా వర్షం పడుతున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన చేపట్టారు.
కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. జూలై 20న ఢిల్లీలో 'నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంశాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి.
అయితే అమిత్ షా పార్లమెంట్‌కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని ప్రతిపక్షాలు నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి ఖచ్చితంగా సమాధానం ఇస్తారని తెలిపారు.


