వైఎస్‌ జగన్‌ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Ysrcp Mps Complain To Amit Shah About Ys Jagan Security | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Aug 6 2026 7:49 PM | Updated on Aug 6 2026 8:07 PM

Ysrcp Mps Complain To Amit Shah About Ys Jagan Security

ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్‌ షాకు వివరించారు.

ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసిన  వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. గత రెండేళ్లుగా వైఎస్‌ జగన్‌ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్‌ జగన్‌ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు
అమిత్‌ షాను కలిసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం.. వైఎస్‌ జగన్‌ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్‌ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్‌ షాకు వివరించారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్‌ మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఎంపీలు.. ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement