ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదానికి ‘న్యాయమైన, సముచిత పరిష్కారం’ అవసరమని పేర్కొన్న ఆయన.. సింధు నది జలాల విషయంలోనూ భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్‌కు దక్కాల్సిన నీటిని నిలిపివేయడం, అడ్డుకోవడం లేదా మళ్లించే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలు ఎనిమిది దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి హామీ కోసం ఎదురుచూస్తున్నారని షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎదురుచూస్తున్నారు. కశ్మీర్‌లో తరతరాలుగా ప్రజలు అక్రమ ఆక్రమణ, ఏకపక్ష నిర్బంధాలు, న్యాయబద్ధత లేని హత్యలు, బలవంతపు అదృశ్యాలు, లైంగిక హింస, సామూహిక శిక్షలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కశ్మీర్ వివాదానికి న్యాయమైన, సముచిత పరిష్కారం అవసరం అంటూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో సింధు జలాల ఒప్పందం అంశాన్ని కూడా షెహబాజ్ ప్రస్తావించారు. 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడం చట్టబద్ధత లేనిదని ఆయన ఆరోపించారు. సింధు నదీ వ్యవస్థకు చెందిన జలాలు పాకిస్తాన్‌తో పాటు మొత్తం ప్రాంతానికి జీవనాధారమని అన్నారు. ‘నీటిని ఆయుధంగా మార్చకూడదు. నదులు దేశాలను పోషించాలి.. విభజించకూడదు. పాకిస్తాన్‌కు దక్కాల్సిన నీటిని ఆపడం, అడ్డుకోవడం లేదా మళ్లించే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తాం. భారత్ ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు’ అని షెహబాజ్ హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ వ్యాఖ్యలు
2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్న సమయంలో ట్రంప్ జోక్యం కీలకంగా మారిందని అన్నారు. ఆ సమయంలో ట్రంప్ జోక్యం చేసుకోకపోయి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ తమపై దాడికి దిగిందని షరీఫ్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ హక్కును పాకిస్తాన్ వినియోగించుకుందని చెప్పారు. పాక్ సైన్యం ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ నాయకత్వంలో భారత్ దాడిని తిప్పికొట్టిందని పేర్కొన్నారు. అయితే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను భారత్ గతంలోనే ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ద్వారానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది.
#WATCH | New York | Addressing the 81st United Nations General Assembly (UNGA), Pakistan PM Shehbaz Sharif says, "...Any attempt to stop, impede, or divert Pakistan's share of the waters will be treated as an act of war. India must make no mistake about it"
(Video Source: United… pic.twitter.com/l7dIO7SxnH— ANI (@ANI) September 26, 2026
ఇదిలా ఉండగా.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే, కశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న వాదనలను భారత్ గతంలో పలుమార్లు తిరస్కరించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని న్యూఢిల్లీ స్పష్టం చేస్తూ వచ్చింది. సింధు జలాల అంశంలోనూ భారత్ తన నిర్ణయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యల్లో భాగంగా సమర్థించింది.
ఇదీ చదవండి: షరతులకు అంగీకరిస్తేనే.. హార్ముజ్ ఓపెన్


