అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి
మా చమురు అమ్మకాలపై ఆంక్షలను రద్దు చేయాలి
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రతిపాదన
దుబాయ్: తమ షరతులకు అమెరికా ఒప్పుకుంటే హార్మూజ్ జలసంధిని తెరవడానికి అభ్యంతరం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, తమ చమురు అమ్మకాలపై ఆంక్షలను రద్దు చేయాలని, లెబనాన్‌లో సైతం కాల్పుల విరమణ పాటించాలని తేల్చిచెప్పింది. అలా చేస్తే ఏడు రోజుల్లో హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది. అలాగే తమ అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడానికి ముందుకొచి్చంది.
న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి హాజరైన క్విన్సీ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రిటా పార్సీ మాట్లాడుతూ.. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌తో త్వరితగతిన ఒప్పందం కుదరడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సహాయపడుతుందని అరాగ్చీ అభిప్రాయపడినట్లు తెలిపారు.
అరాగ్చీ తాజా ప్రతిపాదనపై ఇరాన్ ఐరాస మిషన్ గానీ, ఇతర ఇరాన్ అధికారులు గానీ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ రాజీ మార్గాలను ఇరాన్ భద్రతా దళాలపై పట్టు కలిగిన పిడివాదులు అంగీకరిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖతార్ ప్రధానమంత్రికి ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన పరోక్ష చర్చల సమయంలో ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిస్తుండడం గమనార్హం.


