ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా? | Donald Trump threat to annihilate Iran to UN general assembly | Sakshi
Sakshi News home page

ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా?

Sep 26 2026 4:06 AM | Updated on Sep 26 2026 4:12 AM

Donald Trump threat to annihilate Iran to UN general assembly

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శిఆంటోనియా గుటెరెస్‌

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వ ప్రతి నిధి సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సెప్టెంబర్‌ 22న ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ వేదికపై సాగే ప్రసంగాల ప్రమాణాల ప్రకారం చూసినా కూడా అది అసాధారణమైనదే. 
ఇరాన్‌తో ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం గురించి అందరూ అనుకున్నట్లు గానే ఆయన ప్రస్తావించారు. ఒప్పందం కుదుర్చుకుంటే పునర్నిర్మాణానికి తెహ్రాన్‌కు అవకాశం చిక్కుతుంది; లేకపోతే ‘నన్ను ఇరాన్‌ను సర్వనాశనం చేయమంటారా? ప్రజల ప్రాణాలు హరించే, దేశాలను ధ్వంసం చేసే అవకాశం దానికి ఎన్న టికీ ఇవ్వకుండా వేగంగా ఆ పనిని పూర్తి చేసేయమంటారా?’ అని ట్రంప్‌ ప్రశ్నించారు. ‘బతికి బట్ట కట్టనివ్వకుండా దాన్ని నరకంలోని నెట్టేయమంటారా?’ అని కూడా హూంకరించారు. ‘అణ్వస్త్రం’ అనే మాటను ట్రంప్‌ నేరుగా చెప్పకపోయి ఉండవచ్చుకానీ, ఇరాన్‌ను రూపుమాపుతామని ఆయన చేసిన హెచ్చరిక అసాధారణమైంది. ఇరాన్‌ తప్పించి, మరి ఏ ఇతర దేశమూ ఇవెక్కడి అనాగరికపు మాటలని ప్రశ్నించకపోవడం మరింత నిర్ఘాంతపరచేదిగా ఉంది. 

ఆఫ్రికాకు ఇప్పటికీ స్థానం లేదా?
ట్రంప్‌ హెచ్చరిక శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్‌ తన ప్రసంగంలో ఈ చర్చకు తెర లేపారు. దీన్ని ఆయన కడపటి ఉన్నత స్థాయి ప్రసంగంగా చెప్పుకోవచ్చు. ఆయన రెండవ విడత పదవీ కాలం ఈ డిసెంబర్‌ 31తో ముగుస్తోంది. ఆయన వాషింగ్టన్‌ పేరును నేరుగా ప్రస్తా వించలేదుకానీ, ‘మన ప్రపంచంలో అభిప్రాయభేదాలు తీవ్రతర మవుతున్నాయి. బీటలు అగాథంగా పరిణమిస్తున్నాయి’ అని అన్నారు. 

ప్రపంచం పాలనా వ్యవస్థలు ఇప్పటికీ  ‘బలాధిక్య వాస్తవి తకతలను, చాలావరకు గతించిన శకానికి చెందిన ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరిగా తేవాలనీ, అది ఏ ప్రపంచాన్ని శాసించాలనుకుంటోందో, దానికి తగ్గ రూపంలో ఎంతమాత్రం లేదనీ కూడా కుండ బద్దలుకొట్టారు. ఆయన సునిశితమైన రీతిలో లేవ నెత్తిని సంస్థాగత అంశానికి కరతాళ ధ్వనులతో ప్రతిస్పందన లభించింది. ‘ఆఫ్రికాయే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఐరాస ఏర్పడి నపుడు, ఆఫ్రికాలో చాలాభాగం వలస పాలనలో ఉంది. ఆఫ్రికాకు నేటికీ మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేదు. ఆఫ్రికాకు శాశ్వత స్థానాలు లేకుండా 21వ శతాబ్దపు భద్రతా మండలి కొనసాగడం అసమంజసం, నిర్హేతుకం’ అని ఆయన అన్నారు. 

ఐరాసను ‘గొప్ప, గొప్ప సామర్థ్యం’ ఉన్న సంస్థగా  ట్రంప్‌ అభివర్ణించారు. ‘గ్లోబలిస్టు బ్యురోక్రాట్ల తీవ్ర వామపక్ష అజెండాను రుద్దే పనిని’ అది మానుకోవాలని అన్నారు. గాజా ప్రణాళిక–శాంతి బోర్డునకు ఆమోదం తెలిపినందుకు భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతవరకు ఆయన ఐరాస స్థానంలో ఈ బోర్డు ‘పనిచేస్తే చేయవచ్చనే’ ధోరణిని ప్రధర్శించారు.

ఫ్రాన్స్‌ సముచిత వైఖరి
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ పదవీకాలం 2027తో ముగుస్తుంది కనుక, ఈ తడవ మాక్రాన్‌ చేసిన ప్రసంగాన్ని ఆయన చివరి ఐరాస సర్వ ప్రతినిధి సభ ప్రసంగంగా భావించాలి. ఆయన హార్మూజ్‌ పైకన్నా గాజాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ‘ఏదో శాంతి కుదిర్చినట్లుగా కొందరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, ఆ శాంతి ఒక్క క్షణం కూడా మానవతావాద సాయం అందేందుకు తలుపులు తెరిచింది లేదు’ అని ట్రంప్‌ పేరును నేరుగా ప్రస్తావించ కుండానే చురకలంటించారు. దేశాలు ‘ఆటవిక న్యాయానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాయా లేక నాగరిక అంతర్జాతీయ సమాజం దిశగానా?’ అని అడిగారు. ఇజ్రాయెల్‌ భద్రతను ఒక సాకుగా చేసు కుని, పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు దాన్ని ఒక ‘లైసెన్సు’గా మలచుకోవడం ‘వినాశకర’ తప్పిదమవు తుందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ బహుళపక్షీయతకు, మానవతా కారిడార్లకుఎంతో అవసరమైన మద్దతును అలా వ్యక్తపరచిందని చెప్పవచ్చు. 

శాశ్వత సభ్యత్వం ఉన్న మిగిలిన దేశాల నుంచి స్పందన ఒకే రీతిగాకన్నా అసంపూర్ణంగా ఉందనే భావించాలి. ఇజ్రాయెల్‌– పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలనే పరిష్కారానికి మద్దతును బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ పునరుద్ఘాటించారు. చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌ 24న శ్వేత సౌధంలో శిఖరాగ్ర సమా వేశం ఉన్న దృష్ట్యా సర్వ ప్రతినిధి సభకు హాజరు కాలేదు. జిన్‌పింగ్‌ బదులు చైనా ఉపాధ్యక్షుడు హ్యాన్‌ జెంగ్‌ హాజరయ్యారు.  ఇరాన్‌ లేదా గాజాల పేరును నేరుగా ప్రస్తావించకుండా, నిర్నిరోధ బల ప్రయోగాన్ని చైనా వ్యతిరేకించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్‌ ఆ దేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విరామం ఇవ్వదలచు కోలేదని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమేనంటూ, ఇతర మార్గాల ద్వారా యుద్ధం కొనసాగుతుందని తేల్చేశారు.

ఇండియా ఆచితూచి...
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు(పీ5) ఒకే వైఖరితో లేవని తేటతెల్లమైంది. భారతదేశానికి భద్రతా మండ లిలో శాశ్వత సభ్యత్వం లేదు. వీటో చేయగలిగిన అధికారం చలా యించగలిగినదిగా మండలిలో సభ్యత్వం చేజిక్కించుకోవాలని భారత్‌ ఉబలాటపడుతోంది. జిన్‌పింగ్, పుతిన్‌ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ‘సంస్కరణాయుత బహుళ పక్ష వాదానికి’ జై శంకర్‌ పిలుపునిచ్చారు. బడుగు దేశాలు వాటి ప్రమేయం లేని, అవి ఏ పాపం ఎరుగని సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ఆయన వాదించారు. పశ్చిమాసియాలో సాగర మార్గాలకు భద్రత కల్పించా లనీ, అంతర్జాతీయ చట్టాలను పాటించాలనీ కోరారు. 

ఇరాన్‌ను ‘రూపుమాపుతా’మని వచ్చిన హెచ్చరికపై భారత్‌ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అమెరికా, రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కాపాడుకుంటోంది. అమెరికావి అనాగరికపు మాటలని అన లేదు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలని కోరింది. సభ్యత్వం పొందేందుకు భారత్‌కు ఉన్న హక్కును చాటుకుంది. పాలస్తీనా ఓట్లు, ఇంధన భద్రత, శక్తిమంతమైన దేశాల నుంచి దెబ్బ తినకుండా కంచె ఏర్పరుచుకోవడం అనే అంశాలను భారత్‌ ఏనాటి నుంచో మిళితం చేసుకుంటూ వస్తోంది. ఇపుడు అమెరికా నుంచిరెండవ విడత సుంకాల విధింపు బెడద నేపథ్యంలో, ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లోనూ అదే వైఖరిని కొనసాగించింది. 

విభేదాల బదులు పరస్పరం ఆధారపడటం నేర్చుకోండని గుటెరస్‌ కోరారు. లొంగదీసుకునేందుకు ఒక మార్గంగా విధ్వంసాన్ని ట్రంప్‌ ఎంచుకున్నారు. తుది గడువును ఆయనే విధిస్తు న్నారు. ఓ మోస్తరు శక్తి కలిగిన దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్నాయికానీ, నియమ నిబంధనలను పాటించి తీరాలనీ, అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలనీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి. హాజరు పట్టీలకు పరిమితమైతే ప్రయోజనం ఏముంది? ఈ సమస్య భారతదేశానిది మాత్రమే కాదు. ఐరాస ఎదుర్కొంటున్న, ఇంకా జవాబు దొరకని ప్రశ్న.

-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌’ డైరెక్టర్, న్యూఢిల్లీ
- సి. ఉదయ్‌ భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement