ప్రతీకాత్మక చిత్రం
ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు, వారికి బాకీ ఉన్న డీఏలు చెల్లించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కష్టపడాల్సి వస్తోంది. ఫీజ్ రియింబర్స్‌మెంట్ చెల్లింపుల సమస్యపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదాయానికి సంబంధించి అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల, మంత్రుల హోదా కలిగిన వారి ఆదాయ పన్నును చెల్లించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుండి ఈ విధానం అమలులో ఉంది. వేతనాల చెల్లింపు చట్టం 1953లోని సెక్షన్ 3 (4) ప్రకారం క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల ఆదాయం పన్నును ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరితోపాటు క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారుల, కార్పొరేషన్ చైర్మన్‌ల ఆదాయం పన్నును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మంత్రులు వారి సేవలకు గాను ఆదాయం పొందుతున్నారు. ఇది వ్యక్తిగత ఆదాయం కిందకు వస్తున్నందునమంత్రులు వారి ఆదాయం పన్నును వారే చెల్లించాలి.
వీరి ఆదాయ పన్నును ప్రభుత్వం చెల్లించడం చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ మూల సూత్రం ఆర్టికల్ 14కు వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆదాయ పన్నును వారే చెల్లి స్తారు. ఈ కారణంగా ప్రభుత్వం వారి ఆదాయం పన్నును చెల్లించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇప్పటికే ఈ విధానాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హరియాణా వంటి రాష్ట్రాలు రద్దు చేశాయి. తెలంగాణ కూడా వారి బాటలో పయనించడం మంచిది.
ఇదీ చదవండి: వరదలకు జనాభా కారణమా?
ప్రభుత్వం చెల్లిస్తున్న మంత్రుల ఆదాయం పన్ను చెల్లింపుదారులది. అంటే ప్రజలది. ప్రజాధనాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తున్నదో తెలుసుకునే అధి కారం 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలకు ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తేవడం జరిగింది. మంత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలి. ఈ అంశం దేశభద్రతకు లేదా విచారణలో ఉన్న నేరాలకు, విదేశీ సంబంధాలకు సంబంధించినది కాదు.
– డాక్టర్ పి. మోహన్ రావు
మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్


