హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా కూడా వేగంగా పెరుగుతోంది. ఉపాధి, విద్య, వైద్యం, రవాణా వంటి అవకాశాల కోసం ప్రజలు హైదరాబాద్ ప్రాంతానికి చేరుతున్నారు. ఈ మార్పులు నగర రూపంపై మాత్రమే కాకుండా సహజ జల మార్గాలు, చెరువులు, నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వరద మైదా నాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాదుకు ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లలో పట్టణ వరద ముప్పు ప్రధానమైనది.
గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదులో ఐటీ రంగం, ఉపాధి అవకాశాలు, రియల్ ఎస్టేట్, రవాణా సదుపాయాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు నగర విస్తరణకు ఊతమిచ్చాయి. ఈ విస్తరణ సహజ జల వ్యవస్థల సామర్థ్యాన్ని తగ్గించే విధంగా సాగితే... అదే అభివృద్ధి భవిష్యత్తులో కొత్త ప్రమాదాలకు కారణమవుతుంది. మూసీని కేవలం ఒక నదిగా చూడటం సరికాదు; అది హైదరాబాదు నగరంలోని విస్తృత జల పారుదల వ్యవస్థలో కీలక భాగం. మూసీకి అనుసంధానమైన నాలాలు, చెరువులు, కాలువలు, వరద మైదానాలు కలిసి ఒక పెద్ద సహజ జల వ్యవస్థగా పనిచేస్తాయి. అందువల్ల మూసీ వరద ముప్పును అర్థం చేసుకోవాలంటే కేవలం నది ఒడ్డున ఉన్న ప్రాంతాలను మాత్రమే కాకుండా మొత్తం నగరంలోని నీటి ప్రవాహ వ్యవస్థను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
వేసుకోవాల్సిన అసలు ప్రశ్నలు
హైదరాబాదు వరద చరిత్రలో 1908 సెప్టెంబర్ 28 ఒక విషాదకరమైన రోజు. మూసీ నదికి వచ్చిన భారీ వరద నగరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే వరద ముప్పు అక్కడితో ముగియ లేదు; 2020 అక్టోబర్‌లో హైదరాబాద్ మరో తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొన్నది. 1908తో పోలిస్తే నేటి నగరంలో జనాభా, నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు విస్తృతంగా పెరిగాయి. అందుకే నేటి పట్టణ వరద ముప్పును కేవలం ‘ఎంత వర్షం పడింది?’ అనే ప్రశ్నతో మాత్రమే అర్థం చేసుకోలేం.
జనాభా పెరుగుదల నేరుగా వరదలకు కారణం కాదు. ఈ క్రమంలో సహజ నీటి మార్గాలు, వరద మైదానాలు, చెరువుల పరిసరాలు నిర్మాణాల పరిధిలోకి వస్తే సమస్య తీవ్రమవుతుంది. కాంక్రీట్, తారు వంటి నీరు చొరబడని ఉపరితలాలు పెరగడంతో వర్షపు నీరు నేలలోకి ఇంకే సామర్థ్యం తగ్గి, ఫలితంగా నీరు వేగంగా ఉపరితలంపై ప్రవహిస్తుంది. జనాభా ఎక్కడ నివసిస్తుంది, సహజ నీటి మార్గాలు ఎక్కడ ఉన్నాయి, వర్షపు నీరు ఎక్కడికి వెళ్తుంది అనేవి ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు. నిజానికి సమస్య జనాభా పెరుగుదలలో లేదు. జనాభా పెరుగుదలను నగర భౌగోళిక వ్యవస్థతో ఎలా సమన్వయం చేస్తున్నా మన్నదే ఇక్కడ కీలకమైన అంశం.
ఇదీ చదవండి: 'నాజూకు ఫోన్లతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు'
1908 మూసీ వరద మనకు చరిత్రను గుర్తుచేస్తే... 2020 వరద వర్తమాన ప్రమాదాన్ని గుర్తుచేసింది. భవిష్యత్తులో ఎంత భారీ వర్షం పడుతుందో మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ జనాభా ఎక్కడ పెరగాలి, సహజ నీటి మార్గాలను ఎలా రక్షించాలి, భూ వినియోగాన్ని ఎలా ప్రణాళికాబద్ధం చేయాలి అనే నిర్ణయాలు మాత్రం మన చేతుల్లోనే ఉన్నాయి. నగరం పెరగడం అనివార్యం, కానీ అది పెరిగే విధానం మాత్రం మన ఎంపిక. ఆ ఎంపికే రేపటి హైదరాబాదును వరదలను ఎదుర్కొనే సురక్షిత నగరంగా నిలబెడుతుందా లేక వరదలకు మరింతగా గురయ్యే నగరంగా మారుస్తుందా అని నిర్ణయిస్తుంది.
– డాక్టర్ రామకృష్ణ మనిమద్దె
ఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు


