నాజూకు ఫోన్లతో పెరుగుతున్న రోగాలు! | sangireddy hanumantha reddy: how smartphones causes for new diseases | Sakshi
Sakshi News home page

'నాజూకు ఫోన్లు.. అదనపు రాచపుండ్లు'

Sep 17 2026 4:54 PM | Updated on Sep 17 2026 5:38 PM

sangireddy hanumantha reddy: how smartphones causes for new diseases

ప్రతీకాత్మక చిత్రం

అభిప్రాయం

మన దేశంలో రోగాలు ఎక్కువ. ప్రపంచ జనాభాలో 17 శాతం గల మనం 20 శాతం ప్రపంచ రోగాల భారాన్ని మోస్తున్నాం. 60 శాతం రోగాలు జీవనశైలితో కొనుక్కున్నవే. మన శారీరక రోగాలకు, మానసిక రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు, పాలకవర్గ విధాన లోపాలు, ప్రజల ఆలోచనా దారిద్య్రం ఎప్పుడో తోడయ్యాయి. సాంకేతిక పరికరాల, ఉపకరణాల అతిక్రియాశీలతలు మన ఆరోగ్య వ్యవస్థలో మనకు తెలియకుండానే చొర బడ్డాయి. మొన్నటి టెలివిజన్లకు, సంగణిక యంత్రాల (కంప్యూటర్ల)కు నేటి నాజూకు (స్మార్టు) ఫోన్లు అదనపు రాచపుండ్లు (క్యాన్సర్లు).

నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో, శిశువుల నుండి వృద్ధుల దాకా, సెల్‌ ఫోన్లలో దూరే ఉంటారు. సెల్‌ఫోన్ల అతివినియోగం అనేక ప్రధాన శారీరక, మానసిక, సామాజిక నష్టాలు కలిగిస్తుంది. సాంఘిక నైపుణ్యతలు, ఆలోచనశక్తి, సృజనాత్మకత మాయమవుతాయి. సెల్‌ఫోన్ల అతివాడకం వల్ల ఒంటరి తనంతో ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేము. చిరాకు, అసహనం, అసంతృప్తి, కోపం పెరుగుతాయి. మొత్తంగా మనుష్య సంబంధాలు దెబ్బతింటాయి. మన దేశంలో మానసిక రుగ్మతలు ఎక్కువ. 92 శాతం మంది మానసిక రోగులు సమయానికి చికిత్స తీసుకోరు. గ్రామాల కంటే పట్టణాలలో మానసిక రోగాలు ఎక్కువ. సిగ్గు, అజ్ఞానం, స్వీయ విశ్వాసాలతో, దీన్ని రోగంగా పరిగణించక ఈ మానసిక రోగానికి చికిత్స చేయించుకోరు.

ప్రత్యేక వైద్యశాస్త్రం
నేటి నాజూకు ఫోన్ల నేపథ్యంలో మానసిక విభాగ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం పెరుగుతోంది. ఇందులో సెల్‌ఫోన్‌ వినియోగ బాధితులకు ప్రత్యేక చికిత్సా విభాగం ఉండాల్సివచ్చేలా ఉంది. అందులో సెల్‌ఫోన్‌ ఉపయోగ దుష్పరిణామాల వైద్యం అతిప్రత్యేక అధ్యయన వైద్యశాస్త్రం కాగలదు. అలాగే ఇవాళ ప్రపంచంలో మితవాద పాలన పెరుగుతోంది. ప్రత్యేకించి మన దేశంలో నేటి పాలకులు కార్పొరేట్‌ మతవాదపు కొత్త సామాజిక రోగాన్ని రాజకీయంగా ప్రారంభించారు.

ఇదీ చదవండి: సోషల్‌ మీడియా ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే..?

ఆంధ్రప్రదేశ్‌ కూటమి పాలనలో ఈ మత కుల వివక్షలతో సమాజ విభజన, ప్రజల చీలిక కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కుల, మతపిచ్చి చికిత్సకు కూడా అతిప్రత్యేకతల రాజకీయ సామాజిక ఆస్పత్రుల అవసరం పెరిగింది. పాలకుల రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను రాజకీయంగా, సామాజికంగా చైతన్యపరచడం, నిరసనలు, పోరాటాలు నిర్వహించడం, అదునుచూసి ప్రభుత్వాలను దింపడం మాత్రమే పరిష్కారం.

- సంగిరెడ్డి హనుమంతరెడ్డి 
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి, ప్రొద్దుటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement