పాత్ర ఏదైనా, అందులో పూర్తిగా ఒదిగిపోవడమే ఆమెకు తెలుసు! సినిమాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఆస్వాదించే నటి నివేతా థామస్. ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకోసం...
చిన్నప్పుడే కెమెరా ముందుకు!
చిన్నప్పుడే టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. ‘మై డియర్ భూతం’తో ఎన్నో ఏళ్లు టీవీలో పనిచేశాను. కాని, సినిమాల్లోకి వచ్చాకే నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నాను.
బిల్డింగ్స్ కూడా డిజైన్ చేస్తా!
నేను ఆర్కిటెక్చర్ చదివింది సినిమాలకు బ్యాకప్‌గా కాదు. నిజంగానే ఆర్కిటెక్ట్‌గా పనిచేయగలిగేలా చదివాను. కాలేజీ, షూటింగ్స్... రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మా అమ్మానాన్న నటనతో పాటు చదువుకూ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజులు తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది.
పాత్ర కోసమే బరువు పెరిగాను?
ఒక పాత్ర కోసం నా రూపాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడను. ‘35– చిన్న కథ కాదు’లో సరస్వతి పాత్ర కోసం బరువు పెరిగాను. ఆ పాత్రకు అది అవసరమనిపించింది. ఇప్పుడు కొత్త పాత్రల కోసం మళ్లీ ఫిట్‌గా మారుతున్నాను. అది లుక్ మార్చుకోవడం కాదు, పాత్రలోకి వెళ్లే ప్రయాణం.
భాషలు నా బలం!
కొత్త భాష నేర్చుకోవడం ఆసక్తి ఎక్కువ. ఒక్కో భాషలోని యాస, పదాల వెనకున్న భావాన్ని తెలుసుకోవడం నటిగా చాలా ముఖ్యం. ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడగలను. వీలైనంత వరకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అదే నా బలం. ప్రేక్షకులతో నా స్వరం ద్వారా కనెక్ట్ అవ్వడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.
కెమెరా వెనుక!
ఖాళీ సమయం దొరికితే ఫొటోగ్రఫీ చేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి చిన్న చిన్న క్షణాలను కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం కూడా నా ఫేవరెట్ టైమ్‌పాస్.
శుక్రవారం అంటే నాకు పండగే!
అందరికీ ఆదివారం సెలవు. కానీ శుక్రవారం నాకు చాలా స్పెషల్! సినిమా విడుదలైతే థియేటర్‌లో ప్రేక్షకుల రియాక్షన్ చూడాలనే టెన్షన్ , ఎగై్జట్‌మెంట్ రెండూ ఉంటాయి. షూటింగ్ లేకపోతే మాత్రం ఫోన్ పక్కనపెట్టి, ప్రపంచాన్ని కాస్త మర్చిపోయి ప్రశాంతంగా ఆలస్యంగా నిద్రలేవొచ్చు. అందుకే... రిలీజ్ ఉన్నా, రిలాక్స్ అయినా... శుక్రవారం అంటే నాకు పండగే!
డైట్ నా వల్ల కాదు!
నేను డైట్ ఫాలో అయ్యే రకం కాదు. ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బిర్యానీ కనిపిస్తే, దాన్ని వదిలేసి సలాడ్ తినడం నా వల్ల కాదు. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నీ వ్యాయామాలైనా చేస్తా కాని, ఇష్టమైన ఆహారాన్ని తినడాన్ని మర్చిపోవడం మాత్రం చేయలేను.
అమ్మ చీరల్లోనే అసలైన స్టయిల్!
ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల కంటే అమ్మ దగ్గరున్న పాత చీరలు నాకు చాలా ప్రత్యేకం. వాటిలో ఒక జ్ఞాపకం ఉంటుంది; ఒక కథ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అమ్మ పాత చీరలను వేసుకుంటూ ఉంటాను.


