పరుగు అందుకున్న జీవితం | 47-year-old Ramabai Ranveer started the race wearing slippers | Sakshi
Sakshi News home page

పరుగు అందుకున్న జీవితం

Sep 6 2026 3:15 AM | Updated on Sep 6 2026 3:15 AM

47-year-old Ramabai Ranveer started the race wearing slippers

బిడ్డ పుస్తకాలకి డబ్బుల్లేవ్‌... చేస్తున్న పనికి వచ్చే జీతం చాలదు.. ఇద్దరు కూతుర్లున్నారు.. ఆస్తుల్లేవ్‌ కాని బాగా బతకాలన్న ఆశ ఉంది. అప్పుడొచ్చిందో అవకాశం.. పరుగెడితే పైసలొస్తాయని ఎవరో అంటే... ఒంట్లో ఓపిక లేకపోయినా, శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని, జారిన జోళ్లని చేత పట్టుకుని లంఘించిందో మహిళ.. ఆమే రమాబాయి రణ్‌వీర్‌.

చెప్పులు చేతపట్టుకుని పరుగులు తీసిన రమాబాయిని వీడియో తీసి ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆమె ప్రయత్నానికి ముచ్చటపడి షూ కొనిస్తానని వెల్లడించారు. నటుడు మాధవన్‌ రమాబాయ్‌ పట్టుదలను ప్రశంసించారు. బీడ్‌ జిల్లా కలెక్టర్‌ వివేక్‌ జాన్సన్‌ ఆమెను సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా రమాబాయికి ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు లక్షన్నర వరకు నగదు సాయం కూడా అందింది. ప్రభుత్వం ఆమె కుమార్తెల చదువుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రమాబాయి పెద్ద కూతురు పూజ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. చిన్న కూతురు బ్యాంకింగ్‌ పరీక్షలకు సిద్ధపడుతోంది.

ఎవరీ రమాబాయి?
మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగైకి చెందిన రమాబాయి రణవీర్‌కు 47 ఏళ్లు. భర్త మరణించిన తర్వాత ఇద్దరి కుమార్తెల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న రమాబాయి వారి చదువుకోసం ఇళ్లలో వంట చేస్తూ జీవించేది. ఆమె కుమార్తె చదువు కోసం పుస్తకాలు కొనాల్సి వచ్చింది కాని రమా దగ్గర డబ్బుల్లేవు. అంబాజోగైలోని భారతీయ శిక్షణ ప్రసారక సంస్థకు చెందిన ఖోలేశ్వర్‌ ఎడ్యుకేషనల్‌ కాంప్లెక్స్‌ ఆధ్వర్యంలో ‘అమృత్‌ దౌడ్‌’ పేరుతో పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ పోటీలో పాల్గొని, అందులో గెలుపొందితే పరుగెడితే డబ్బులొస్తాయని తెలిసి రమాబాయి కూడా ఆ పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

చెప్పులు చేత పట్టుకుని...
సాధారణంగా రన్నింగ్‌ రేస్‌ అంటే ట్రాక్స్‌ వేసుకుని షూ వేసుకుని స్టైల్‌గా గాగుల్స్‌ పెట్టుకుని సిద్ధమవుతారు. కాని అవేవి రమాబాయికి తెలీదు. మామూలు చీర కట్టుకుని, ఆకు చెప్పులు వేసుకుని పందేనికి సిద్ధపడింది. రేసు మొదలైంది. రమాబాయి చెప్పులు జారిపోయాయి. కంగారు మొదలైంది. వెంటనే చెప్పులు చేతపట్టుకుని ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని పరుగులు తీసింది. వర్షంతో తడిసిన రోడ్డుపై చిన్నచిన్న రాళ్లు, పెంకులు లాంటివి గుచ్చుకుంటున్నా ఆమె బెదరలేదు.. పరుగు ఆపలేదు. ఎలాగైనా సరే, బిడ్డకు పుస్తకాలు కొనాలన్న పట్టుదల, బిడ్డ చదువు ఆగిపోకూడదన్న అమ్మతనం గెలిచాయి. అందరు రన్నరప్‌లను దాటుకుంటూ ఆమె విన్నర్‌గా నిలిచింది మూడు వేల రూపాయల బహుమతిని అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పెద్ద కుమార్తె పూజా కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంది. మూడు వేల కోసం మొదలైన పరుగుతో రమాబాయి కూతుళ్ల జీవితాలకు కొండంత భరోసా వచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement