ఒకట్రెండు హిట్లు రాగానే స్టార్‌డమ్ వచ్చేసిందంటూ హడావుడి చేసే హీరోయిన్లు చాలామందే. కానీ.. వరుసగా మూడు భారీ విజయాలతో తన స్థాయినే మార్చేసుకుంటే? ఇప్పుడు మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు చేస్తున్నది అదే. ఈ ఏడాదిలో విజయ్, సూర్య, నివిన్ పౌలీ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె.. వరుస విజయాలతో సౌత్ ఇండియాలో తన మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచుకుంది. తెరపై కనిపించే ఆ పక్కింటి అమ్మాయి ఇమేజ్ వెనుక.. కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ కూడా తయారవుతోంది.
మమితా బైజు కెరీర్‌లో 2026 ఓ ప్రత్యేక అధ్యాయం. జూలై 23న విజయ్ నటించిన జన నాయగన్ విడుదలైంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి తర్వాత.. ఆగస్టు 21న నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో.. ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ జస్ట్.. 11 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా.. ఈ మూడు చిత్రాల విడుదల మధ్య వ్యవధి కేవలం 29 రోజులు. దీంతో ఒకే ఏడాదిలో(ఇప్పటివరకు..) మూడు రూ.200 కోట్ల సినిమాల్లో నటించిన భారతీయ నటిగా మమితా రికార్డు సృష్టించినట్లైంది. ఈ మధ్యకాలంలో మరేయితర హీరోయిన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డు నమోదు కాలేదు.

‘ప్రేమలు’తో మారిపోయిన కెరీర్
అయితే ఈ స్థాయికి ఆమె ప్రయాణం ఒక్కరోజులో మొదలైనదేమీ కాదు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మమితా.. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో కనిపించింది. కానీ 2024లో వచ్చిన ప్రేమలు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందులో రీనూ పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, ఎక్స్‌ప్రెషన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రసీమల్లోనూ అవకాశాలు వరుసకట్టాయి. అక్కడి నుంచి మమితా ఎంచుకున్న సినిమాలూ ఆమె మార్కెట్‌ను పెంచాయి. డ్యూడ్, కరా వంటి తమిళ చిత్రాలతో పాటు విజయ్ జన నాయగన్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో నటించడం ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు సొంత భాషలో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్‌తో ఆ జాబితాలో మరో భారీ హిట్ చేరింది.
డాక్టర్ కావాలనుకుని.. హీరోయిన్‌గా
మమితా జీవితంలో ఆసక్తికరమైన మలుపు స్కూల్‌లో ఉండగానే జరిగింది. ఆమె స్వస్థలం కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్. మె తండ్రి డాక్టర్ బైజు కృష్ణన్.. తల్లి మినీ బైజు. అన్నయ్య మిథున్ కెనడాలో చదువు పూర్తి చేశారు. చిన్నతనంలో ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదట. అయితే తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఆడిషన్‌కు వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చింది. ఆ తర్వాత చదువుతో పాటు నటనపైనా దృష్టి పెట్టింది. చివరకు వైద్య వృత్తికి బదులు సినీ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంది.

ఫ్యాన్స్ ముద్దుగా ‘SSMB’..
మమితకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. ఆమె షార్ట్ వీడియోలు, డ్యాన్సింగ్ క్లిప్పులు వైరల్ అవుతుంటాయి. సాదాసీదాగా ఉంటూ అభిమానులతోనూ ఆమె అంతే హుందాగా వ్యవహరిస్తుంటారు. ఫ్యాన్స్ సరదాగా ‘SSMB’ సూపర్‌స్టార్ మమితా బైజు అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. ‘సూపర్‌స్టార్’ అనే అర్థంలో ఈ పేరును వాడుతూ.. మలయాళ సినీ పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్‌లాల్ తర్వాత మరో ఎం(M) దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకున్న క్రేజ్, వరుస అవకాశాలను చూసి సోషల్ మీడియాలో ఈ సరదా పోలికలు వైరల్‌గా మారుతున్నాయి.
రెమ్యునరేషన్ విషయంలో..
ఇక సంపాదన విషయానికొస్తే.. ఆరేళ్ల వయసులో పాల్గొన్న ఫ్యాషన్ షోలో తొలిసారి రూ.500 సంపాదించిన విషయాన్ని ఆమె తరచూ చెబుతుంటారు. అలాగే తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’కు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, రెండో సినిమాకు మాత్రం రూ.6,000 అందుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయితే చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్ల శ్రమకు ఆమెకు అవకాశాలు, సక్సెస్‌లు దక్కుతున్నాయి. వరుస విజయాలతో మమితా బైజు పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె సుమారు రూ.2–3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్‌కేర్, జ్యువెలరీ తదితర బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తోంది. దీంతో నటనతో వచ్చే ఆదాయానికి అదనంగా ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడులు కూడా ఆమె సంపాదనలో భాగమవుతున్నాయి.
కోచిలో కోట్ల విలువైన ఇల్లు.. కార్లు కూడా
మమితా బైజు ఆస్తుల గురించి కూడా మాలీవుడ్ వెబ్‌సైట్లు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తుంటాయి. కోచిలో ఆమెకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో కోచినే ఆమెకు ప్రధాన నివాసంగా మారినట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇల్లు కూడా ఉంది.
కార్ల విషయానికొస్తే.. మమితా బైజు గ్యారేజీలో వోక్స్‌వాగెన్ టైగన్, మారుతి సుజుకీ జిమ్నీ ఉన్నాయి. అయితే ఆమె మొత్తం ఆస్తుల విలువపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. మాలీవుడ్ మూవీ సర్కిల్స్ వెబ్‌సైట్లు మాత్రం.. ఆమె నికర ఆస్తుల విలువను సుమారు రూ.20–30 కోట్లుగా అంచనా వేస్తున్నాయి.

ఇష్టాలు
ఫేవరెట్ యాక్టర్: ధనుష్
ఇష్టమైన హాబీస్: డ్యాన్స్, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెలింగ్.
ఇష్టమైన ఆహారం: చైనీస్ ఫుడ్
ఇష్టమైన రంగు: బ్లాక్
ఇష్టమైన సింగర్: ఆంథోనీ దాసన్
ఇష్టమైన పెర్ఫ్యూమ్: చానెల్
ఇష్టమైన హాలిడే డెస్టినేషన్: దుబాయ్
ఇష్టమైన ఆట: క్రికెట్
ఇకపై మమితా రేంజ్ మరింత పెరిగేనా?
ప్రేమలుతో వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాలు.. ఇప్పుడు మూడు రూ.200 కోట్ల చిత్రాలతో వచ్చిన రికార్డు. మమితా బైజు కెరీర్ గ్రాఫ్ చూస్తే.. తక్కువ సమయంలోనే ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుంది. పాతికేళ్ల వయసులోనే ఇలాంటి మార్కెట్ రావడం ఆమెకు కలిసొచ్చిన మరో అంశం. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగితే.. మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో మరో బలమైన హీరోయిన్‌గా ఎదగడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.
ఇదీ చదవండి: ఆమె దోసె వేస్తే లక్షలు కురవాల్సిందే!


