యూరప్‌ పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ప్రకృతి హెచ్చరిక ఇదేనా? | Europe Heatwave Record Temperatures Climate Change | Sakshi
Sakshi News home page

యూరప్‌ పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ప్రకృతి హెచ్చరిక ఇదేనా?

Sep 5 2026 8:46 AM | Updated on Sep 5 2026 8:59 AM

Europe Heatwave Record Temperatures Climate Change

లైఫ్‌

నదేశంలో యూరప్‌కి ఉన్న క్రేజే వేరు. సమ్మర్‌ వస్తే యూరప్‌ ట్రిప్, సినిమా షూటింగులకి యూరప్‌ ట్రిప్, అంతెందుకు? కూల్‌డ్రింక్‌ తాగండి యూరప్‌ ట్రిప్‌ గెలవండి అంటూ ప్రకటనలను కూడా మనం చూశాం.. కాని ఇప్పుడు అదే యూరప్‌ కాలుతున్న పెనుములా కనిపిస్తోంది. అక్కడ కూడా రికార్డ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతూ మన తెలంగాణాలోని రామగుండం, కొత్తగూడెం, ఆంధ్రాలోని నెల్లూరు, వైజాగ్‌ లాంటి ప్రాంతాలను తలపిస్తున్నాయంటే నమ్ముతారా? కాని ముమ్మాటికి ఇది నిజం..

గ్రీస్‌ తీరం, పారిస్‌ నగరం, రోమ్‌ వీధులు, స్పానిష్‌ రుచులు ఒక్కసారిగా వేడెక్కాయి.. 2026 మే నెలలో పశ్చిమం నుంచి మొదలైన హీట్‌ వేవ్‌ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగి జనజీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎండతాపానికి రోడ్లు సైతం కరిగిపోయాయి. రైలు పట్టాలు వంకర్లు తిరిగాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే హడలెత్తిపోయారు. యూరప్‌ ఖండంలో దాదాపు సగభాగం హీట్‌ వేవ్‌ కారణంగా ప్రజలు దారుణమైన పరిస్థితులను చవిచూశారు. అనధికార లెక్కల ప్రకారం ఎండ దెబ్బకి దాదాపు 35 వేల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

పెరిగిన మరణాల రేటు
అత్యధికంగా జర్మనీలో ఏప్రిల్‌ 6 నుంచి ఆగస్టు 9 వరకు సుమారు 14 వేల మంది మరణించినట్టు జర్మనీ రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా వేసింది. సాధారణంగా వేసవి కాలంలో నమోదయ్యే మరణాల కంటే రెండు వేల కంటే తక్కువగా ఉంటాయి. అక్కడ ఈ స్థాయిలో మరణాల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. తర్వాత స్థానంలో ఫ్రాన్స్‌ ఉంది.

అక్కడ సాధారణం కంటే 7,300 మరణాలు అధికంగా నమోదయ్యాయి. మే చివరి నుంచి జూలై 22 వరకు ఇంకా పూర్తి స్థాయిలో మరణాలను లెక్కించాల్సి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత స్పెయిన్‌లో 4,947 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో 2,877, బెల్జియంలో 1,222, పోలాండ్‌లో 1,070, నెదర్లాండ్స్‌లో సుమారు 900 వరకు మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి.

తగ్గిన పర్యాటకం
మన భారతీయులకు యూరప్‌ ట్రిప్‌ అంటే యమ క్రేజ్‌. ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం ప్రయాణించే వారి కంటే విహారం కోసం వెళ్లే వారే ఎక్కువ. 2024లో భారతదేశం నుంచి దాదాపు 38 లక్షల మంది యూరప్‌కి వెళ్లగా, 2025లో ఆ సంఖ్య 40 లక్షలకు చేరుకుంది. కాని యూరప్‌లో మారిన వాతావరణం దృష్ట్యా ఈ ఏడాది మాత్రం ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకో ఏఐ టూల్‌ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. దినదినాభివృద్ధి చెందుతున్న మానవ మేధస్సు ప్రకృతి ప్రకోపానికి మాత్రం సరైన జవాబు ఇవ్వలేకపోతోందనడానికి ఇదో ఉదాహరణ.

మునుపెన్నడూ లేనంతగా..
జూన్‌ 23న ఫ్రాన్స్‌లోని పిప్సోస్‌లో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. 1947 తర్వాత ఇదే ఆ దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. ఇక జర్మనీలో అయితే జూన్‌ చివరలో 46 ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణ వేసవితో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపు. పారిస్, బెర్లిన్‌ నగరాలలో సాధారణం 23 డిగ్రీలు కాగా, ఈ ఏడాది 40కి చేరుకుంది. అలాగే ప్రాగ్, వియన్నా, మాడ్రిడ్, డబ్లిన్, బుకారెస్ట్‌ నగరాలలో సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

కారణమేంటి?
భూతాపం పెరగడం, వాతావరణంలోని మార్పులు, పశ్చిమం నుంచి వచ్చిన వడగాల్పులు, కర్బన ఉద్గారాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మేలో వచ్చిన వడగాల్పులు అధిక పీడన ప్రభావంతో ఎండ తీవ్రత ఒక్కచోట కేంద్రీకృతం కావడం వల్ల యూరప్‌ ఉక్కపోతతో అల్లాడింది.

ఇవీ చదవండి: మీ మెదడుకు బాస్‌ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement