యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్‌.. అఖిలేష్‌-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం! | Akhilesh Yadav and Ashutosh Ranka Meet CJP Alliance Speculation | Sakshi
Sakshi News home page

యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్‌.. అఖిలేష్‌-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!

Sep 5 2026 8:03 AM | Updated on Sep 5 2026 8:09 AM

Akhilesh Yadav and Ashutosh Ranka Meet CJP Alliance Speculation

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. ఓ కీలక భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, విద్యార్థి ఉద్యమ సంస్థ సీజేపీ ప్రతినిధి ఆశుతోష్‌ రంకా భేటీ కావడంతో యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక ఎన్నికల ముందు యువతను కేంద్రంగా చేసుకుని అఖిలేష్‌ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇక, అఖిలేష్‌తో సీజేపీ ప్రతినిధి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య లక్నోలో జరిగిన భేటీ దాదాపు 90 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సమావేశం తర్వాత ఇరువైపుల నుంచి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో.. అసలు ఏం చర్చించారు? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికల ముందు అఖిలేష్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? సీజేపీ ద్వారా యూపీలో విద్యార్థి శక్తిని ఏకం చేయబోతున్నారా? ఈ భేటీ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఎస్పీ-సీజేపీ మధ్య ఎలాంటి అధికారిక రాజకీయ పొత్తు లేదా అవగాహన ప్రకటించలేదు.

టార్గెట్‌ యూపీనా?
సీజేపీ ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పరీక్షల వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించే ‘School Thik Karo’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో అఖిలేష్‌తో రంకా భేటీ కావడంతో.. సీజేపీ తన విద్యార్థి ఉద్యమాన్ని యూపీలో విస్తరించేందుకు సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

యువ ఓటర్లపై అఖిలేష్‌ కన్ను?
యూపీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలను అఖిలేష్‌ యాదవ్‌ కూడా తరచూ ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువతలో ప్రభావం పెంచుకుంటున్న ఓ ఉద్యమ సంస్థతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి: ‘విజయ్‌ ఫర్‌ పీఎం’.. కాంగ్రెస్‌కు టీవీకే మరో షాక్‌!

అయితే, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? సమాజ్‌వాదీపార్టీతో కలిసి పనిచేస్తుందా? లేక కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే సహకారం ఉంటుందా? అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు.. వీరి భేటీపై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత రాకేశ్‌ త్రిపాఠి ఈ పరిణామాన్ని విమర్శిస్తూ సీజేపీ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఈ రకమైన సంప్రదింపులను స్వాగతించింది. దీంతో ఈ భేటీ కేవలం విద్యార్థి సమస్యలపై చర్చకే పరిమితమా.. లేక యూపీలో కొత్త రాజకీయ కూటమికి తొలి సంకేతమా? అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement