మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌? | Jubilee Hills MLA Naveen Yadav Cabinet Post In Congress Party? | Sakshi
Sakshi News home page

మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌?

Sep 5 2026 7:43 AM | Updated on Sep 5 2026 8:16 AM

Jubilee Hills MLA Naveen Yadav Cabinet Post In Congress Party?

సీఎం రేవంత్‌ రెడ్డితో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ (ఫైల్‌ ఫోటో)

గాంధీ భవన్‌ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే ఉత్కంఠ! కొండా సురేఖ బర్తరఫ్‌తో ఖాళీ అయిన మంత్రి స్థానం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే  జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకవర్గాల సమరానికి సిద్ధమవుతున్న వేళ..రాజధాని ప్రాంతం సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యత కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో కలిపి భర్తీ చేయాల్సిన బెర్త్‌ల సంఖ్య మూడుకు చేరింది.

సాక్షి, హైదరాబాద్‌: నగర పాలక సంస్థల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్‌ పారీ్టకి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. కొండా సురేఖ బర్తరఫ్‌ నేపథ్యంలో కేబినెట్‌ బెర్తులపై చర్చ తీవ్రమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఆశించిన స్థానాలు దక్కకపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అయితే, రాబోయే గ్రేటర్‌ పోరులో గులాబీ, కాషాయ దళాల హోరాహోరీని తట్టుకుని జెండా పాతాలంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం తప్పనిసరైంది. ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి క్యాడర్‌ను మెప్పించే బలమైన నేతలకు పీఠం దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ..ఇప్పుడు గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కేబినెట్‌ విస్తరణను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. కేబినెట్‌æలో రాజధాని బెల్ట్‌కు చోటు దక్కితేనే పార్టీకి మైలేజ్‌ వస్తుందనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.

జెన్‌–జీ ప్లస్‌ బీసీ ఫార్ములాలో... 
జెన్‌–జీ ప్లస్‌ బీసీ ఫార్ములాలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, యువ నేత నవీన్‌ యాదవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి బీసీ వర్గంతోనే భర్తీ చేసేవిధంగా ఒత్తిడి అధిష్టానంపై వచ్చే అవకాశం లేకపోలేదు. జెన్‌–జీ  కోటాలో యువకుడైన నవీన్‌ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఒకవైపు బీసీ కోటా, జెన్‌జీ రాజకీయ ప్రాధాన్యతపై సముచిత నిర్ణయమవుతుందని కొందరు వాదిస్తున్నారు.  

కాగా బీఆర్‌ఎస్‌ నుంచి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో అధిష్టానం ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదా కల్పించడంపై సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతో పాటు పాత కాంగ్రెస్‌ నేతల నుండి వస్తున్న నిరసనలను అధిష్టానం ఎలా సమన్వయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

శివారులో అసంతృప్తి జ్వాలలు 
రాష్ట్ర రాజధానికి ఆనుకుని, అత్యధిక జనాభా, నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్‌లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి స్థానిక నాయకత్వంలో నెలకొని ఉంది.. రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే కేబినెట్‌ చోటు దక్కలేదనే ఆసంతృప్తి వ్యక్తం చేస్తూనే..సాక్షాత్తు ఏఐసీసీ పెద్దల వద్ద సైతం మొరపెట్టుకున్నారు. మరొకవైపు శాసనసభ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే గ్రేటర్‌ చుట్టుపక్కల  అర్బన్‌–రూరల్‌ నియోజకవర్గాల్లో పారీ్టకి ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.

హైకమాండ్‌ కోర్టులో బంతి  
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌ విస్తరణ అంశం పూర్తిగా పార్టీ అధిష్టానం వద్దే తేలాల్సి ఉంది. ఒకవైపు పార్టీలోని సీనియర్‌ నేతల ఆశలు, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల అంచనాలు, వీటితో పాటు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం సీఎం రేవంత్‌ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ విస్తరణ ఉండవచ్చనే ప్రచారంతో గాంధీ భవన్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలపరచే దిశగా సీఎం రేవంత్‌ అడుగులు వేస్తారా? లేక జిల్లా సీనియర్లు, బీసీ వర్గాలు నగర కీలక నేతల మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.   

చదవండి: మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్‌ షాక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement