సాక్షి, నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్‌లో నీళ్లు రంగు మారడంతో కలకలం రేగుతోంది. కెమికల్స్ కలిసిన ఆనవాళ్లు కనిపిస్తున్నా కానీ.. ఇంతవరకు అధికార యంత్రాంగం కదలలేదు. గాఢమైన ఆకుపచ్చ రంగులోకి నీరు మారడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కెమికల్స్ కలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లది మందికి తాగునీటి అవసరాలు తీరుస్తోన్న సాగర్.. హైదరాబాద్ మహా నగరంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఏపీలోని పలు ప్రాంతాలకు సాగర్ నుంచే తాగు నీరు అందుతోంది.
అలాంటి సాగర్ నీళ్లు కలుషితం అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. బ్యాక్ వాటర్‌లో ఎక్కడ చూసినా కలుషిత నీటి ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. నీటి అంచుల్లో ఉన్న గడ్డి సైతం మాడిపోయింది. శ్రీశైలం నుంచి సాగర్ వచ్చే ప్రాంతంలో మధ్యలో కెమెకల్స్ పడేయడటంతోనే ఇలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ ఫ్లో వస్తుండటంతో ఆ కెమికల్స్ అంతా డ్యామ్ లోకి కొట్టుకొచ్చి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.
గత ఇరవై ఏళ్లలో ఏనాడు ఇలాంటి పరిస్థితి, కలుషిత నీరు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ కెమికల్స్‌తో కలుషితం అయితే మాత్రం ప్రాణాంతక వ్యాధుల బారిన జనాలు పడే అవకాశముంది. ఇప్పటికే చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో ఫార్మా విషాలు భూగర్భంలోకి చేరాయి. సాగర్‌లో అలాంటి ఆనవాళ్లే కనిపించడంతో ఇస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.


