రైతు బీమా బంద్‌! | Rythu Bima Scheme Cancelled: Telangana | Sakshi
Sakshi News home page

రైతు బీమా బంద్‌!

Sep 5 2026 5:16 AM | Updated on Sep 5 2026 5:17 AM

Rythu Bima Scheme Cancelled: Telangana

ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా రూ.5 లక్షల భరోసా 

1.86 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.9,107.80 కోట్ల పరిహారం 

ఏటా రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం 

2026–27లో పునరుద్ధరణకు చెల్లించని ప్రీమియం  

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్‌ గత నెల 29న గుండెపోటుతో చనిపోయాడు. ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్‌ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలిశారు. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచి పోయిందని, బీమా క్లెయిమ్‌ కాదని చెప్పడంతో రాంచందర్‌ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. అసలే పేద కుటుంబం..ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది.  

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబానికి ఆసరాగా నిలిచిన ‘రైతు బీమా’పథకానికి బ్రేక్‌ పడింది. రైతు సహజంగా మరణించినా.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షలు అందేలా అమలు చేసిన ఈ పథకం గత నెల 14వ తేదీ నుంచి నిలిచిపోయింది. రైతులపై ఒక్క రూపాయి భారం లేకుండా మొత్తం ప్రీమియం చెల్లించి, అమలు చేసిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడంతో బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివిగా మారాయి. 2025–26 బీమా కాలపరిమితి ఆగస్టు 14తో ముగియగా, 2026–27 సంవత్సరానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. దీంతో రైతు బీమా పథకం పునరుద్ధరణ నిలిచిపోయింది.  

2018లో శ్రీకారం చుట్టిన కేసీఆర్‌ 
రాష్ట్రంలో 2018 ఆగస్టు 15న రైతు బీమా పథకం ప్రారంభమైంది. రైతు పేరిట గుంట వ్యవసాయ భూమి ఉన్నా, ఈ పథకం వర్తింపజేసేలా రైతుబీమాను రూపొందించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న పట్టాదారు రైతులను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. రైతు మరణానికి కారణంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం దీని ప్రత్యేకత. ప్రభుత్వమే బీమా సంస్థకు ప్రీమియం చెల్లించడంతో రైతు కుటుంబాలపై ఎలాంటి ఆర్థిక భారం పడలేదు. సాధారణంగా బీమా క్లెయిమ్‌ పరిష్కార ప్రక్రియ కూడా వేగంగా జరిగేలా వ్యవస్థను రూపొందించారు.

దీంతో రైతు మరణించిన వారం నుంచి పది రోజుల్లోనే రూ. 5లక్షల బీమా సొమ్ము నామినీ పేరిట ఉన్న బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ అయ్యేది. రాష్ట్ర వ్యాప్తంగా 2018–19 నుంచి 2025–26 వరకు 1,86,363 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు మొత్తం రూ.9,107.80 కోట్లు పరిహారంగా అందింది. ప్రతి మరణానికి రూ.5 లక్షల చొప్పున చెల్లింపులు జరిగాయి. 

రూ.9,653.74 కోట్ల ప్రీమియం చెల్లింపు 
రైతుబీమా పథకానికి ప్రభుత్వం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించింది. 2018–19 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.9,653.74 కోట్ల ప్రీమియం చెల్లించినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. పథకం ఆగిపోయే నాటికి రైతు బీమా పథకం పరిధిలో సుమారు 42.16 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి కోసం ఏటా సగటున రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేది. కాగా ఈ సంవత్సరం బడ్జెట్‌లో రైతుబీమాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ఆగస్టు 14 నాటికి 2026–27 సంవత్సరానికి గాను ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించక పోవడంతో రైతుబీమా పథకం అధికారికంగానే ఆగిపోయింది.  

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కోసమే రద్దు..? 
రాష్ట్రంలో రైతులకు మాత్రమే అమలవుతున్న రైతుబీమా పథకం బదులు ఆహార భద్రత కార్డు (రేషన్‌కార్డు) కలిగిన 1.15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు గత మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’పేరుతో అమలయ్యే ఈ పథకానికి రూ.4వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్టు చెప్పారు. కుటుంబంలోని ప్రధాన సంపాదనదారు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము అందేలా పథకాన్ని రూపొందిస్తోంది. జూన్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ఆగస్టు 14–నవంబర్‌ 19 మధ్య మరణిస్తే?
రైతు బీమా గడువు ఆగస్టు 14న ముగియగా, కొత్త బీమా పథకం ఇంకా అమల్లోకి రాలేదు. నవంబర్‌ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అమలు చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా, ఈ మధ్యలో మరణించే రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఉంటుందా? లేదా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement