కొండా సురేఖ పేరిట పోస్టు.. ఒక్కసారిగా కలకలం
‘ది వెయిట్ ఈజ్ ఆల్ మోస్ట్ ఓవర్’తో సంచలనం
కాసేపటికే ‘అది మా పోస్ట్ కాదు’ అంటూ అధికారిక ఖాతాల నుంచి ప్రకటన
చర్చనీయాంశంగా మారిన కొండా దంపతుల రాజకీయ భవిష్యత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ది వెయిట్ ఈజ్ ఆల్ మోస్ట్ ఓవర్.. బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్.. తెలంగాణ స్టే ట్యూన్డ్’అంటూ కొండా సురేఖ పేరుతో శుక్రవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టు.. మంత్రివర్గం నుంచి ఆమె ఉద్వాసన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కథ మొదలైన వెంటనే ట్విస్ట్.. కాసేపటికే ‘అది మా పోస్టు కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల నుంచి ప్రకటన వచ్చింది.
అసలేం జరుగుతోంది.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చ
ఫేక్ పోస్టు అయితే.. ఇంతకీ ‘బిగ్ అప్‌డేట్’ఏమిటి? కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగు ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ‘నిరీక్షణ దాదాపు ముగిసింది.. త్వరలోనే బిగ్ అప్‌డేట్.. తెలంగాణ వేచిచూడండి’ కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ మూడు వాక్యాలు.. కాసేపట్లోనే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. మంత్రివర్గం నుంచి సురేఖను తొలగించిన నేపథ్యంలో ఈ పోస్టు రావడంతో.. ఇక కీలక రాజకీయ నిర్ణయం ప్రకటించబోతున్నారా? కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారా? కొత్త రాజకీయ అడుగు వేయబోతున్నారా? అంటూ చర్చ మొదలైంది. ఆ ఉత్కంఠకు తెరపడకముందే మరో ట్విస్ట్! ‘అది మా పోస్ట్ కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల ద్వారా ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
మరి బిగ్ అప్‌డేట్?: అసలు సురేఖ రాజకీయ నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సురేఖ పేరుతో వచ్చిన పోస్టు ఫేక్ అని స్పష్టమైనా, ఆమె రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి మాత్రం తగ్గలేదు. కొండా సురేఖ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పినా, తాజా పరిణామాల నేపథ్యంలో బయట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? పార్టీ నాయకత్వంపై మరింత ఒత్తిడి తెస్తారా? లేక రాజకీయంగా మరో మార్గాన్ని ఎంచుకుంటారా? తనపై చర్యల విషయంలో న్యాయ పోరాటం చేస్తారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.


