డ్రైనేజీలో ఆయుధాలు! | Army Magazine Bullet Found in Drainage Canal in Telangana | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో ఆయుధాలు!

Sep 5 2026 4:24 AM | Updated on Sep 5 2026 4:24 AM

Army Magazine Bullet Found in Drainage Canal in Telangana

మురుగు కాలువలో ఆర్మీ మేగజైన్‌ తూటా లభ్యం

తుపాకులు, మిగిలిన తూటాల కోసం జల్లెడ 

పై అధికారుల టార్చర్‌ తట్టుకోలేకనే బొల్లారం ఆర్మీ క్యాంపస్‌ శిక్షణ అభ్యర్థుల దుశ్చర్య?

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ బొల్లారం సైనిక స్థావరంలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గత నెల 30న సాయంత్రం 6 గంటలకు అత్యున్నత రక్షణ వలయంలో ఉండే మిలిటరీ ఏరియాలోని 20 మద్రాస్‌ బెటాలియన్‌ ఆయుధాగారం (కోట్‌) తాళాలు పగులగొట్టి నాలుగు ఏకే–203 అసాల్ట్‌ రైఫిళ్లు, ఇన్సాస్‌ రైఫిల్, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, సివిల్‌ 6.35 బోర్‌ పిస్టల్, ప్యాసివ్‌ నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌తోపాటు మందుగుండు సామగ్రిని అపహరించిన సంగతి తెలిసిందే. 

చోరీకి గురైన 1,876 తూటాల మందుగుండు సామగ్రిలో ఒక మేగజైన్‌ తూటా ఆర్మీ క్యాంపస్‌లోని డ్రైనేజీలో పోలీసులకు లభ్యమైనట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో ఇంత భారీస్థాయిలో ఆయుధాలు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే జరిగే ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీకి గురైన 12 ఆయుధాలు, మిగిలిన తూటాల కోసం ఆర్మీ క్యాంపస్‌లోని ప్రతీ అంగుళం పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ జల్లెడ పడుతున్నాయి. సైనిక స్థావరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ వాటర్‌ ట్యాంకర్లు, తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. 

ఎలాంటి క్లూ దొరకకపోవడంతోనే... 
చోరీ జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఎలాంటి వేలి, పాదముద్రలు లభ్యం కాలేదు. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, టవర్‌ డంప్స్‌ లొకేషన్స్‌ను పరిశీలించిన పోలీసులకు ఏ ఆధారమూ లభ్యం కాలేదు. దీంతో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు. ఆర్మీ క్యాంపస్, పరిసర ప్రాంతాల్లోని వందలాది సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

వాటిల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గానీ, వాహనాల రాకపోకలు గానీ నమోదు కాలేదు. దీంతో చోరీకి గురైన ఆయుధాలు సైనిక స్థావరం దాటి బయటకు పోలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ చోరీలో బయటి వ్యక్తులు కాకుండా, సైనిక స్థావరంలోని లోపలి వ్యక్తుల ప్రమేయం ఉంటుందని భావించారు. దీంతో బొల్లారం ఆర్మీ క్యాంపస్‌లోని ఉద్యోగులు, శిక్షణ అభ్యర్థులు, స్వీపర్లను ఒక్కొక్కరికీ విచారిస్తున్నారు. క్యాంపస్‌లోని ప్రతీ అంగుళం అడుగడుగునా జల్లెడ పడుతున్న క్రమంలో ఆర్మీ ప్రాంగణంలోని మురుగు నీటి కాలువ అడుగు భాగంలో ఒక మేగజైన్‌ తూటా లభ్యమైంది. 

పైఅధికారుల టార్చర్‌ తట్టుకోలేకనే.. 
దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద సైనిక కేంద్రాల్లో బొల్లారం ఆర్మీ సైనిక స్థావరం ఒకటి. ఇందులో మద్రాస్‌ రెజిమెంట్, ఆర్మీ ఆర్డినెన్స్‌ కోర్, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్, ఇతర సపోరి్టంగ్‌ యూనిట్లున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో ఉండే కంటోన్మెంట్‌ బోర్డులో.. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆర్మీ క్యాంపస్‌ ఉంటుంది. ఇక్కడ ఆర్మీలో కొత్తగా చేరే అగ్నివీర్, సాంకేతిక నిపుణులు, యుద్ధ వస్తువులు, ఆయుధ సామగ్రి రవాణా, సైనిక సరుకుల లాజిస్టిక్స్‌పై శిక్షణ ఇస్తుంటారు. శిక్షణకు వచ్చే ఆర్మీ సిబ్బందికి సెలవులు ఉండకపోవడం, కుటుంబ సభ్యులను కలవడం గానీ, కనీసం ఫోన్‌లో మాట్లాడటం గానీ ఉండవు. 

అత్యంత కఠోర శిక్షణ ఉంటుంది. పైఅధికారుల టార్చర్‌ తట్టుకోలేని కొందరు శిక్షణా అభ్యర్థులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చోరీ ఘటన రోజున ఈ బెటాలియన్‌కు చెందిన ప్రధాన సైనిక విభాగాలు, కమాండింగ్‌ ఆఫీసర్, ఇతర సీనియర్‌ అధికారులు ఫీల్డ్‌ ఫైరింగ్‌ కోసం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు వెళ్లారు. క్యాంప్‌లో ప్రధాన సైన్యం లేని తరుణాన్ని అవకాశంగా భావించిన పలువురు శిక్షణ అభ్యర్థులే ఈ చోరీ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement