పదే.. పదే..చేసిందే..? ఆ వ్యాధి తీరు అలానే ఉంటుందా? | OCD Explained, How Intrusive Thoughts Lead To Repetitive Behaviours And Anxiety, Read Story Inside | Sakshi
Sakshi News home page

పదే.. పదే..చేసిందే..? ఆ వ్యాధి తీరు అలానే ఉంటుందా?

Sep 1 2026 10:27 AM | Updated on Sep 1 2026 11:25 AM

Health Tips: Obsessive-compulsive disorder Symptoms and Health Issues

ఓ ఆలోచన వచ్చేసి డిస్టర్బ్‌ చేస్తుంది. ‘అబ్బా... ఆ ఆలోచన ఎందుకొచ్చిందో... రాకపోతే బాగుండు’ అని మనసు చెబుతుంది. కానీ ఎంత సముదాయించినప్పటికీ అదే అదే ఆలోచన పదే పదే వస్తుంటుంది. ‘రాకూడదని ఆలోచన కదా ఇదీ, మళ్లీ మళ్లీ ఎందుకొస్తోంది?’ అనే ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళనతో... ఆలోచనా... అలాగే ఆ ఆలోచనతో ఆందోళన... ఇదో విష వలయంలా వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనసుపై మరింత ఒత్తిడి కలుగుతుంది. మరింత పర్‌ఫెక్ట్‌గా చేస్తే దాంతో ఆ ఆందోళన తప్పుతుందేమో అని చేసిందే చేస్తుంటారు. 

ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ, చేస్తున్న పనే మళ్లీ మళ్లీ చేస్తూ చేస్తూ విసిగిపోతుంటారు. అలసిపోతుంటారు. అయినా ఆ పరంపర ఆగదు. అలాంటి మానసిక రుగ్మత పేరే ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌’. ఈ పేరుకంటే ‘ఓసీడీ’ అనే మాట చాలామందికి అర్థమవుతుంది. అసలీ జబ్బు తీరుతెన్నులేమిటో, అలా పదే పదే చేస్తున్న పనులూ, ఆలోచనలూ ఎన్ని రకాలుగా వస్తుంటాయో, వాటిని అధిగమించడమెలాగో తెలిపేదే ఈ కథనం.

గతంతో పోలిస్తే ఇటీవల మానసిక వ్యాధులపై అవగాహన పెరిగి ఓసీడీ చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మహిళలూ, పురుషులూ ఇద్దరిలో కనిపించే ఈ వ్యాధి వ్యాప్తినీ, విస్తృతిని చూస్తే... సాధారణంగా 0.6 నుంచి 1 శాతం మందిలో కనిపించే ఈ మానసిక రుగ్మత విద్యార్థి వర్గాల్లో (స్టూడెంట్స్‌ గ్రూప్‌)లో అత్యధికంగా 3.3 శాతం కనిపిస్తుండటం ఆందోళనకరం. అందుకే దీని గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరం కూడా.

కుటుంబ సభ్యులకూ వేదనే... 
ఒక ఓసీడీ బాధితుడి వల్ల కేవలం అతడు మాత్రమే కాదు... వాళ్ల కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడుతుంటారు. తాము ఎంత సముదాయించినప్పటికీ వినకుండా... బాధితుడు పదే పదే అదే పని చేస్తుండటంతో వాళ్లు కూడా ఎంతో వేదనకు గురవుతుంటారు. 

తాము చేస్తున్న పని కుటుంబ సభ్యులనూ, బంధువులనూ, మిత్రుల్నీ ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెడుతోందని గ్రహించాక  వాళ్లలో తమ మీద తమకే కోపం పెరుగుతుంది. నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. అయినప్పటికీ ఈ పనుల పరంపరం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా తామూ, కుటుంబసభ్యులూ, మిత్రులూ వేదనకు గురవుతుంటారు.

ఓసీడీతో మూఢ నమ్మకాలూ పెరిగే అవకాశం... 
మామూలుగానే మన సమాజంలో మూఢ నమ్మకాలు చాలా ఎక్కువ. మనం ఒక పని లేదా పూజ లేదా ప్రార్థన లేదా ఇంకేదైనా రిట్యువలిస్టిక్‌ క్రతువు చేయడం వల్ల మనకు లాభం జరుగుతుందనే సెంటిమెంట్‌ ఉందనుకుందాం. ఇక ఆ పని/ పూజ  / రిట్యువల్‌ను చేయడం మొదలు పెడతారు. ముందు చేసిన పని సక్రమంగా చేయలేదేమో అంటూ మళ్లీ మళ్లీ  కొనసాగిస్తారు. ఇలా ఓసీడీతో ఉన్నవారిలో రిట్యువలిస్టివ్‌ బిహేవియర్‌ పెరుగుతుంది. దానివల్ల చాదస్తం ఎక్కువైనట్లు కనిపిస్తుంది.

అవగాహన ఉన్నవారికీ... లేనివారికీ ఇబ్బందే... 
ఓసీడీ ఉన్నవారిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొందరికి తాము చేస్తున్న పని అంత సరికాదనీ, దాని కారణంగా ఎంతో సమయం వృథా అవుతోందని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాంతో తమ ఇబ్బందిని అధిగమించడానికి నిపుణుల సహాయం తీసుకుంటారు. అయితే మన సమాజంలోనే చాలామందికి ఇది ఒక తీవ్రమైన జబ్బనీ, దీనికి చికిత్స ఉందనే అవగాహన చాలా తక్కువ. 

ఇలాంటి ఓ జబ్బు ఉందన్న విషయం కొంతమందికి తెలియనే తెలియదు. అలా తెలియక΄ోవడంతో చేసిన పనే చేస్తూ, తమకు ఇబ్బంది కలిగించే ఆ ఆలోచనలను అదేపనిగా కొనసాగిస్తూ తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ జబ్బు తీవ్రతను పెంచుకుంటారు. సాధారణంగా ఇది అవగాహన లేనివారిలో కనిపించే పరిస్థితి.

లక్షణాలు... 
మన సమాజంలో సాధారణంగా కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో కనిపించే ఓసీడీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం కడగడానికీ, పరిసరాలనూ, వస్తువులనూ శుభ్రంగా ఉంచడానికి మాత్రమే కాకుండా అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. వాటిలో కొన్ని చాలా ఆసక్తికరంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం. 

తీవ్రమైన అబ్సెషన్‌ : కొందరిలో కొన్ని అంశాల పట్ల తీవ్రమైన భయం ఉంటుంది. ఎవరైనా మనకు హాని చేస్తారేమోననే ఆలోచన వస్తుంటుంది. అది అర్థం లేని ఆలోచన అని తెలిసినప్పటికీ ఆ తరహా ఆలోచనలు అదేపనిగా వస్తూ ఒత్తిడిని పెంచేస్తాయి. దాంతో ఆందోళనా పెరుగుతుంది. 

మనం మన సంస్కారం కారణంగా ఒక పని  ఎప్పటికీ చేయబోమని తెలిసినప్పటికీ అది చేసేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదురుగా ఉండనివ్వదు. ఉదాహరణకు మనం ఎప్పటికీ దొంగతనం చేయం. లేదా అసభ్యంగా ప్రవర్తించబోం. కానీ ఆ పని చేస్తామేమో అనే ఆలోచన వచ్చి అది మనలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. 

కంటామినేషన్‌ అబ్సెషన్‌ : దేనినైనా తాకడం వల్ల మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని కుదిపేస్తుంది. ఉదాహరణకు మనం మూత్రవిసర్జన, మలవిసర్జనలు శుభ్రమైన చోటనే చేసినప్పటికీ.. అక్కడ అపరిశుభ్రత ఉందేమో... ఆ అపరిశుభ్రమైన ప్రదేశంలో విసర్జన చేసినందుకు ఏవైనా వ్యాధులు వచ్చేస్తాయేమోననే ఆందోళన కలుగుతుంది.

సెక్స్‌పరమైన అబ్సెషన్‌ : మనలోని అంతర్గత సెక్స్‌ ఆలోచనలు, మనం రాకూడదని కోరుకుంటున్న సెక్స్‌ ఆలోచనలు రావడమే కాకుండా... మనమెంతో గౌరవంగా, పూజనీయంగా చూసేవాళ్ల పట్ల చెడు ఆలోచనలు వస్తూ... అవి ఎంత  నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా కొనసాగుతూ మనసును ఒత్తిడికీ, తీవ్రమైన అపరాధభావనకూ గురిచేస్తుంటాయి. 

దేవుళ్లు, దేవతల గురించి ఆవాంఛిత ఆలోచనలు :  కొందరిలో దేవుళ్లు, దేవతల గురించి రాకూడని ఆలోచనలు వస్తుంటాయి. దాంతో తాము ఏదైనా తీవ్రమైన పనికి ఒడిగడుతున్నామేమో అన్న ఆందోళన పెరిగిపోయి వారు మరింత ఉద్విగ్నతకూ, భయానికీ, అపరాధభావనకూ గురవుతుంటారు. 

పనికిరాని వస్తువులను సేకరించి దాచడం : కొందరు తమకు ఏమాత్రం ఉపయోగపడని వస్తువులను దాచుకుంటూ ఉంటారు. దాంతో తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని తెలిసినా వాటిని వదిలేయలేరు. పారేయలేరు. 

సిమెట్రీ / ఎగ్జాక్ట్‌నెస్‌ : కొందరు తాము ఆఫీస్‌లో చేసే పనుల్లో గానీ లేదా ఇతర పనుల్లో గానీ పూర్తి స్థాయి పర్‌ఫెక్షన్‌ ఇంకా సాధించలేదనే అభిప్రాయంతో మరింత పర్‌ఫెక్షన్‌ కోసం చేసిందే చేస్తూ, మెరుగులు దిద్దుతూ సమయం వృథా చేస్తుంటారు. 

సొమాటిక్‌ అబ్సెషన్‌ : ఈ సమస్య ఉన్నవాళ్లలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ దేహంలోనో, అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, డాక్టర్లు సమస్య ఏదీ లేదని చెప్పాక కూడా చేయించిన పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తూ... డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు.

కంపల్షన్‌ పనుల జాబితాలో ఇవి కొన్ని... 

కడిగిందే మళ్లీ మళ్లీ కడగడం 

తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మాటిమాటికీ చూడటం, 

స్టవ్‌ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ వెళ్లి చూస్తుండటం, 

తాము చేసే పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకోడానికి మళ్లీ మళ్లీ చేసిన పనే చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పడేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం), 

రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం, లెక్కపెట్టిన డబ్బుల్ని మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి.

ఓసీడీ కారణంగా దుష్ప్రభావాలివి.. 
ఓసీడీ వల్ల చాలామందిలో ఒత్తిడీ, ఆందోళనా పెరుగుతాయి. నిరాశ, నిస్పృహలు  ఫ్రస్ట్రేషన్‌ రూపంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. తమపై తమకు నమ్మకమూ, ఆత్మవిశ్వాసం తగ్గి΄ోతాయి. రోజువారీ పనుల్లో సమయం ఎంతగానో వృథాకావడంతో సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలో, 
జీవితంలోని నాణ్యతనూ, డబ్బునూ, కుటుంబసభ్యులూ, బంధువులూ, స్నేహితులతో తమ మానవ సంబంధాలనూ తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ఓసీడీకి కారణమిది... 
మెదడులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మెదడు అనేది ఒక కంప్యూటర్‌ అనుకుంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు... ఆ ఆలోచనను ఆపేయడానికి  ఒక స్విచ్‌ / సర్క్యూట్‌ ఉంటుంది. అది పనిచేయనప్పుడు అదే ఆలోచన పదే పదే వస్తూ ఆ ఆలోచన వల్ల వచ్చే పనిని కొనసాగిస్తుంటారు. కొన్ని జన్యుపరమైన మార్పులతో ఇది కుటుంబంలోనూ, వంశపారంపర్యంగా కొందరిలో మెదడులోని సర్క్యూట్స్‌లో లోపాలు కనిపిస్తుంటాయి.

నిర్ధారణ... 
ఓసీడీ జబ్బును వారిలో కనిపించే లక్షణాల ద్వారానూ, బాధితుల పరిస్థితిని బంధువులు, స్నేహితులు చెప్పడం ద్వారా తెలుసుకోవచ్చు.

చివరిగా... ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే... ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇటీవల ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన మెరుగుదల కనిపించడమన్నది చాలా సానుకూల అంశం.  

అసలు ఓసీడీ అంటే ఏమిటంటే...
‘ఓసీడీ’ సంక్షిప్త రూపంలోని అక్షరాల్లో... ‘ఓ’ అంటే అబ్సెషన్‌ అనీ, ‘సీ’ అంటే కంపల్షన్‌ అనీ, ‘డీ’ అంటే డిజార్డర్‌ అనే పదాలను సూచిస్తాయి. ఇందులో ‘అబ్సెషన్‌’  అంటే... ఓ ఆలోచన మనసులోకి వచ్చాక అది... పదే పదే వస్తుండటం. ఆ ఆలోచనను ఎంతగా వదిలించుకోవాలని చూసినా ఆగకుండా మళ్లీ మళ్లీ అదే ఆలోచన రావడం. ఈ ఆలోచన అన్నది ఒక చిత్రం (ఇమేజ్‌) కావచ్చు లేదా మనం కోరుకోని అంశం కావచ్చు. దాంతో మనసులో తీవ్రమైన అసౌకర్యం, ఇబ్బంది, మనసు మీద  ఒత్తిడి పెరుగుతాయి. 

ఇక కంపల్షన్‌ (సీ) అంటే... ఆ ఆలోచనను వల్ల వచ్చే ఆందోళనను తగ్గించడానికి తప్పనిసరిగా పదే పదే చేసే పనిని ‘కంపల్షన్‌’ అంటారు. దాంతో ఒక పనిని మళ్లీ మళ్లీ చేయాల్సి రావడంతో సమయం వృథా అవుతుంది. విసుగు పడుతుంది. అలసిపోయినప్పటికీ ఏదో లోపముందనే ఆలోచనతో... మళ్లీ మళ్లీ పనిచేసేలా ఆ కంపల్షన్‌ను పురిగొల్పుతుంది. 

ఇందుకు పాపులర్‌ ఉదాహరణ ఏమిటంటే.., ఎవరికైనా తమ చేతులు శుభ్రంగా లేవని అనిపించే ఓ ఆలోచన మనసులోకి వస్తే... ఇక వాటిని శుభ్రపరిచేందుకు అతడు పదే పదే చేతుల్ని కడుగుతుంటాడు. ఎంత కడిగినా ఇంకా శుభ్రం కాలేదనే ఆలోచనతో కడిగిన చేతుల్నే మళ్లీ మళ్లీ కడిగిస్తూ ఉంటుంది. 

ఆ విధమైన ఆలోచనలు... 
డిప్రెషన్‌లో కనిపించే ఆత్మహత్యాధోరణులు ఓసీడీలోనూ కనిపిస్తాయి. కొన్ని రకాల ఆలోచనలు అదేపనిగా వస్తుండటంతో అపరాధ భావన (గిల్ట్‌), ఆందోళనతో వీళ్లలో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు (సూసైడల్‌ టెండెన్సీస్‌) పెరుగుతాయి.

చికిత్స...
ఓసీడీ చికిత్సలో బిహేవియర్‌ థెరపీ లేదా కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీతో పాటు రెస్పాన్స్‌ ప్రివెన్షన్‌ అనే ప్రక్రియలతో బాధితుల్లో గణనీయమైన మెరుగుదల  కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకే... బాధితుడిని నెమ్మది నెమ్మదిగా గురిచేస్తూ... వాటి వల్ల అతడికి ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడమనేది ఈ చికిత్సల్లో అవలంబించే ఒక పద్ధతి. ఈ సమస్యకు కొన్ని మందులూ అందుబాటులో ఉన్నాయి. 

ఈ మందులతో దుష్ప్రభావాలు ఉంటాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. వాస్తవానికి అవి ఇతర మందుల్లాగానే చాలా సేఫ్‌. కానీ అవగాహన లోపం వల్ల చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ఐస్, ట్రైస్లైక్లిక్స్‌ వంటి మందుల్ని ఓసీడీ తగ్గించడానికి వాడుతుంటారు. అయితే ఇతర ఔషధాల్లాగే.. ఈ మందుల్ని డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి.  

డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌
నిర్వహణ యాసీన్‌ 

(చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement