భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి! | 2000 Pairs of Underwear Buried in Switzerland Reveal Startling Facts About Soil Health | Sakshi
Sakshi News home page

భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!

Sep 1 2026 8:26 AM | Updated on Sep 1 2026 8:31 AM

2000 Pairs of Underwear Buried in Switzerland Reveal Startling Facts About Soil Health

జ్యూరిచ్: నేలలో పోషకాల క్షీణతను, జీవ వైవిధ్యాన్ని అంచనా వేసేందుకు స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు చేపట్టిన వినూత్న ప్రయోగం ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లలో దాదాపు 2,000 కాటన్ లోదుస్తులను (అండర్‌వేర్లను) భూమిలో పాతిపెట్టి, రెండు నెలల తర్వాత వాటిని వెలికితీశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ప్లాంట్స్, పీపుల్, ప్లానెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ పరిశోధకుల నేతృత్వంలో సుమారు వెయ్యి మంది వాలంటీర్లు 2,000 లోదుస్తులతో పాటు 12,000 టీ బ్యాగులను వివిధ రకాల నేలల్లో పాతిపెట్టారు. రెండు నెలల అనంతరం వాటిని పరిశీలించగా కొన్ని దుస్తులు దాదాపు పూర్తిగా క్షీణించగా, మరికొన్నింటిపై కేవలం ఒకట్రెండు రంధ్రాలు మాత్రమే కనిపించాయి. కాటన్ దుస్తులు త్వరగా చిధ్రం కాకపోవడం లేదా రంధ్రాలు పడకపోవడం అనేది ఆయా నేలల్లో జీవక్రియలు, పోషకాలు లోపించాయనడానికి నిదర్శనమని పరిశోధకులు గుర్తించారు.

భవనాలు, ఇళ్ల చుట్టూ ఉండే సాధారణ పచ్చిక బయళ్లు (లాన్స్), వ్యవసాయ భూముల్లో జీవ సంబంధిత కార్యకలాపాలు అత్యంత తక్కువగా ఉన్నట్లు తేలింది. వీటిలో లోదుస్తులు కేవలం 40 శాతం మాత్రమే క్షీణించాయి. మరోవైపు, సేంద్రియ ఎరువులతో సంరక్షించే ప్రైవేట్ తోటల్లో వానపాములు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అధికంగా ఉండటంతో 58 శాతం వరకు కాటన్ వేగంగా కుళ్లిపోయింది. మానవాళికి లభించే ఆహారంలో 95 శాతం పైపొర నేల (టాప్‌సాయిల్) నుంచే వస్తుంది. అయితే నేలల్లో సారవంతం కనిపించినప్పటికీ, ఎరువుల అధిక వినియోగం వల్ల చేరే ఫాస్ఫరస్ స్థానిక జలవనరులకు, జీవవైవిధ్యానికి ముప్పుగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూ వినియోగ పద్ధతులను మెరుగుపరుచుకోవడం ద్వారానే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని అధ్యయన సహ-రచయిత మార్సెల్ వాన్ డెర్ హెజ్డెన్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: నేపాల్‌: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement