‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్‌ తాజా హెచ్చరిక | Trump Vows to Hit Iran Hard as US Iran Tensions Escalate | Sakshi
Sakshi News home page

‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్‌ తాజా హెచ్చరిక

Sep 1 2026 6:48 AM | Updated on Sep 1 2026 6:54 AM

Trump Vows to Hit Iran Hard as US Iran Tensions Escalate

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేసింది. అయితే దీనికి దీటుగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా హెచ్చరించారు. ‘‘మేం వారిని గట్టిగా కొడతాం. ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. 

ఫాక్స్‌ న్యూస్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి గట్టిగానే కొడతాం. అది వాళ్లు కోలుకోలేని స్థాయిలోనే ఉంటుందని అని అన్నారు. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్‌ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

ఇప్పటికే ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, దేశాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో హర్ముజ్‌ జలసంధి సురక్షితంగానే ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. 

అమెరికా బలగాలపై ఇరాన్‌ దాడులు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జోర్డాన్‌ సైన్యం అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్‌ ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత.. లారక్‌ ద్వీపంపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో సాధారణ పౌరులు సైతం మరణించారని ఆరోపిస్తూ ఇరాన్‌ ఈ దాడులకు పాల్పడింది.

మరోవైపు ఇరాన్‌ సాయుధ దళాలు, అమెరికా మధ్య ఉద్రిక్తతలు గల్ఫ్‌ ప్రాంతానికీ విస్తరించాయి. తూర్పు హర్ముజ్‌ జలసంధిపై అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్‌ను తమ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది.

‘ఖర్గ్‌’పై ట్రంప్‌ పోస్టు.. ఇరాన్‌కు సందేశమే
ఇరాన్‌లోని ఖర్గ్‌ ద్వీపంపై ట్రంప్‌ ఆదివారం చేసిన సోషల్‌ మీడియా పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ద్వీపాన్ని పేల్చేస్తూ అమెరికా సైనిక దాడులకు సంబంధించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన వీడియోను ఆ పోస్టుతో జత చేశారు. అయితే ఖర్గ్‌ ద్వీపంపై అమెరికా సైన్యం రాత్రి దాడులు చేయలేదని ఓ అమెరికా అధికారి స్పష్టం చేశారు. ట్రంప్‌ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని, ఇరాన్‌కు ఆయన ఓ సందేశం పంపుతున్నారని చెప్పారు.

ఐరాసను ఆశ్రయించిన ఇరాన్‌
అమెరికా దాడులపై ఇరాన్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. లారక్‌ ద్వీపంపై అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఇరాన్‌ ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ‘‘ఆత్మరక్షణ చర్యల్లో భాగమే’’ అని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.

ఆంక్షలతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
ఇరాన్‌పై అమెరికా తాజాగా ప్రకటించిన ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ అన్నారు. తాజా ఆంక్షలతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ‘‘వారాలు లేదా నెలల్లో కుప్పకూలే అవకాశం ఉందని’’ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అసలు లక్ష్యం ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం కాదని.. చర్చలకు ఇరాన్‌ను రప్పించే ప్రయత్నమేనని బెసెంట్‌ స్పష్టం చేశారు. 

యూఏఈకి ఇరాన్‌ డ్రోన్‌.. తీవ్ర ఆగ్రహం
ఇరాన్‌ తమపై డ్రోన్‌ దాడికి ప్రయత్నించిందని యూఏఈ ఆరోపించింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్‌ను అడ్డుకున్నాయని తెలిపింది. ఈ ఘటనను ‘‘ప్రమాదకరమైన ఉద్రిక్తత’’గా అభివర్ణిస్తూ ఇరాన్‌ చర్యను తీవ్రంగా ఖండించింది.

హర్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి జరిగిందా?
హర్ముజ్‌ జలసంధిలో ఓ సూపర్‌ ట్యాంకర్‌ రెండు సముద్ర గనులను ఢీకొని నిలిచిపోయిందన్న ఇరాన్‌ ప్రభుత్వ మీడియా, రెవల్యూషనరీ గార్డ్స్‌ వాదనలను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. అక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇరాన్‌కు అండగా ఈయూ ఒత్తిడి
ఇరాన్‌ తన అస్థిరత సృష్టించే చర్యలను నిలిపివేసి శాంతి చర్చలకు రావాల్సిందేనని యూరోపియన్‌ యూనియన్‌ పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్‌ పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌.. ఈ ప్రాంతంలో అమెరికాను చుట్టుముట్టేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చమురు ఎగుమతి చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా అమెరికాపై ఆర్థిక ప్రభావం చూపాలని సూచించారు.

ఇదీ చదవండి: H4 వీసాదారులకు ట్రంప్‌ ఝలక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement